ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రూనై సుల్తానుతో విందు సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠానికి ఆంగ్లానువాదం

Posted On: 04 SEP 2024 12:32PM by PIB Hyderabad

గౌరవనీయులు బ్రూనై రాజుగారూ,

గౌరవనీయ రాజ కుటుంబ సభ్యులు,  

ప్రముఖులు,

సోదర సోదరీమణులారా,
 

సాదరంగా స్వాగతించి, ఘనంగా ఆతిథ్యమిచ్చిన గౌరవనీయులైన రాజుగారికీ, రాజ కుటుంబానికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక్కడ నాకు లభించిన ఆప్యాయత, మీరు చూపిన ఆదరణ మన దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి అనుబంధాన్ని నాకు గుర్తు చేసింది.

రాజు గారూ,
ఈ ఏడాదితో బ్రూనై స్వాతంత్ర్యం పొంది 40 ఏళ్లు పూర్తవుతున్నాయి. సంప్రదాయం, అవిచ్ఛిన్నతల మేళవింపుగా మీ నాయకత్వంలో బ్రూనై గణనీయ పురోగతిని సాధించింది. ‘వావాసన్ 2035’ ద్వారా మీరు ప్రదర్శించిన దార్శనికత ప్రశంసనీయమైనది. 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీకు, బ్రూనై ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 
 


మిత్రులారా,
భారత్, బ్రూనై మధ్య బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. మన దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 40 ఏళ్లు నిండిన సందర్భంగా మెరుగైన భాగస్వామ్యంతో మన సంబంధాలను విస్తరించుకోవాలని నిర్ణయించాం.

మన భాగస్వామ్యాన్ని వ్యూహాత్మకంగా నిర్దేశించుకునేలా వివిధ అంశాలపై సమగ్రంగా చర్చలు జరిపాం. ఆర్థిక, శాస్త్రీయ, వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాం. వ్యవసాయంతో ముడిపడిన పరిశ్రమలు, ఔషధ, ఆరోగ్య రంగాలతో పాటు ఆర్థిక సాంకేతికత, సైబర్ భద్రతల్లో మన సహకారాన్ని శక్తిమంతం చేసుకోవాలని నిర్ణయించాం.


ఇంధన రంగం ద్వారా, ఎల్ఎన్ జీలో దీర్ఘకాలిక సహకారం దిశగా అవకాశాలను మనం చర్చించాం. రక్షణ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి రక్షణ పరిశ్రమ, శిక్షణ, సామర్థ్యాభివృద్ధి అవకాశాలపై నిర్మాణాత్మకంగా చర్చించుకున్నాం. ఉపగ్రహ అభివృద్ధి, సుదూర గ్రాహక వ్యవస్థ, శిక్షణ వంటి అంశాల ద్వారా అంతరిక్ష రంగంలో సహకారాన్ని మరింత దృఢపరచుకున్నాం. రెండు దేశాల మధ్య అనుసంధానతను మెరుగుపరిచేలా త్వరలోనే నేరుగా విమానాల రాకపోకలను ప్రారంభిస్తాం.


మిత్రులారా,
ప్రజా సంబంధాలే మన సంబంధాలకు పునాది. ఇక్కడి భారతీయులు బ్రూనై ఆర్థిక వ్యవస్థ, సమజానికి సానుకూల సహకారం అందిస్తుండడం సంతోషాన్నిస్తోంది. నిన్న ప్రారంభించిన భారత హై కమిషన్ రాయబార కార్యాలయం బ్రూనైలోని భారతీయులకు శాశ్వత చిరునామా అవుతుంది. బ్రూనైలోని భారతీయుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న గౌరవనీయులైన మీకు, మీ ప్రభుత్వానికి
 కృతజ్ఞతలు.  


మిత్రులారా,
భారత యాక్ట్ ఈస్ట్ విధానం, ఇండో-పసిఫిక్ దార్శనికతలో బ్రూనై ముఖ్య భాగస్వామి. భారత్ ప్రాధాన్యం ఎప్పుడూ ఆసియాన్ కేంద్రంగానే ఉంది. అది ఇక ముందు కూడా కొనసాగుతుంది. సముద్ర, గగనయానం వంటివి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చట్టం-యుఎన్ సీఎల్ఓఎస్ కు అనుగుణంగానే ఉంటాయి,

ఈ ప్రాంతంలో ప్రవర్తనా నియమావళికి తుదిరూపం ఇవ్వాల్సి ఉందని మేం అంగీకరిస్తున్నాం. మాది వికాస విధానమే కానీ, విస్తరణ వాదం కాదు.

రాజుగారూ,
భారతదేశంతో మెరుగైన సంబంధాల దిశగా మీరు చూపిస్తున్న నిబద్ధతకు 
కృతజ్ఞతలు. మన చారిత్రక సంబంధాల్లో నేడు ఓ కొత్త అధ్యాయం మొదలైంది. నాపై చూపిన అపారమైన ఆదరణకు మరోసారి ధన్యవాదాలు. మీరు, రాజ కుటుంబం, బ్రూనై ప్రజల శ్రేయస్సు కోసం, ఆరోగ్యాల కోసం ప్రార్థిస్తున్నాను.

 

***


(Release ID: 2051879) Visitor Counter : 47