హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అభివృద్ధి చెందిన, సమృద్ధమైన లద్దాఖ్ ను ఆవిష్కరించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, ఆ ప్రాంతంలో కొత్తగా అయిదు జిల్లాల ఏర్పాటు :హోం శాఖ

అయిదు కొత్త జిల్లాలు.. జాంస్కర్, ద్రాస్, శామ్, నుబ్రా, చాంగ్‌థాంగ్.. లలో పాలనను పటిష్ట పరచాలన్న చరిత్రాత్మక నిర్ణయం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను స్థానికులకు వారి ఇంటి ముంగిట్లోనే పొందేటట్లు చేస్తుందన్న హోం-సహకార శాఖల కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా


లద్దాఖ్ ప్రజలకు విస్తృత అవకాశాలను అందించడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది


నూతన జిల్లాల ఏర్పాటుతో, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలూ ప్రజల వద్దకు సులభంగా చేరుకోవడమే కాకుండా ఆ యా పథకాల ద్వారా అధిక శాతం లాభపడతారు


ఈ ప్రధాన నిర్ణయం లద్దాఖ్ సర్వతోముఖ అభివృద్ధికి అత్యంత ఉపయోగకారిగా నిరూపణ కానుంది

Posted On: 26 AUG 2024 1:15PM by PIB Hyderabad

అభివృద్ధి చెందిన, సమృద్ధమైన లద్దాఖ్ ను ఆవిష్కరించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, ఆ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తగా అయిదు జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్ఎ) నిర్ణయించింది.
హోం-సహకార శాఖల కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని ‘ఎక్స్’ వేదికలో తెలిపారు.  ఈ నిర్ణయంతో ఏర్పాటయ్యే అయిదు జిల్లాలు.. జాంస్కర్, ద్రాస్, శామ్, నుబ్రా,  చాంగ్‌థాంగ్ లు..  నలుమూలలా పరిపాలనను పరిపుష్టం చేయడం ద్వారా ప్రజలకు ఉద్దేశించిన ప్రయోజనాలను వారి ముంగిళ్లకు తీసుకు పోతాయని కేంద్ర మంత్రి అన్నారు.  ఈ అయిదు జిల్లాల ఏర్పాటుతో లద్దాఖ్ లో లేహ్, కార్గిల్ సహా  మొత్తం ఏడు జిల్లాలు ఉనికిలోకి వస్తాయి.

విస్తీర్ణం పరంగా చూసినప్పుడు లద్దాఖ్ చాలా విశాలమైన కేంద్రపాలిత ప్రాంతం.  ప్రస్తుతం లద్దాఖ్ లో రెండు జిల్లాలు ఉన్నాయి. వాటి పేర్లు లేహ్, కార్గిల్ లు.  ఈ ప్రాంతం దేశంలో జన సంఖ్య చాలా తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఒకటి.  అత్యంత కఠినమై, చేరుకోవడానికి దుర్గమ ప్రాంతం కావడంతో ప్రస్తుతం జిల్లా పాలన యంత్రాంగం క్షేత్రస్థాయికి చేరుకోవాలంటే అనేక కష్టాలను ఎదుర్కొంటోంది.  ఈ జిల్లాలను ఏర్పాటు చేసిన తరువాత, ఇక కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ పాలన యంత్రాంగాల ప్రజా సంక్షేమ పథకాలు అన్నీ ప్రజల చెంతకు ఇట్టే చేరుకోవడం సాధ్యపడడంతో పాటు ఆ పథకాల తో మరింత ఎక్కువ మంది లాభపడడానికి మార్గం సుగమం అవుతుంది.  హోం వ్యవహారాల శాఖ  (ఎమ్‌హెచ్ఎ) తీసుకున్న ఈ  నిర్ణయం లద్దాఖ్ సర్వతోముఖ అభివృద్ధికి చాలా ఉపయోగకరం కానుంది.
కొత్తగా అయిదు జిల్లాలను ఏర్పాటు చేయడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘‘సూత్ర రీత్యా ఆమోదాన్ని’’ ఇవ్వడంతో పాటు, నూతన జిల్లాల ఏర్పాటుకు  సంబంధించిన వివిధ దశలను.. ఉదాహరణకు జిల్లా ప్రధాన కేంద్రం, సరిహద్దులు, స్వరూపం, పదవులతో పాటు, జిల్లా ఏర్పాటుకు సంబంధించిన మరే ఇతర అంశాలు అయినా గాని.. అంచనా వేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయవలసిందంటూ లద్దాఖ్ పాలన యంత్రాంగానికి సూచించింది.  ఈ అంశాలతో కమిటీ తన నివేదికను మూడు నెలల లోపల సమర్పించాలని హోం మంత్రిత్వ శాఖ కోరింది.  ఆ కమిటీ నివేదికను అందుకొన్న తరువాత నివేదికలోని అంశాల ఆధారంగా నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది ప్రతిపాదనను తదుపరి చర్యల కోసం హోం మంత్రిత్వ శాఖకు  కేంద్రపాలిత లద్దాఖ్ ప్రాంతం పంపనుంది.

లద్దాఖ్ ప్రజలకు విస్తృత అవకాశాలను అందించడానికి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయి నిబద్ధతతో పనిచేస్తోంది.

*****

RK/VV/PR/PS


(Release ID: 2048916) Visitor Counter : 85