ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్ పారాలింపిక్ క్రీడాబృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించిన ప్రధాని శ్రీ మోదీ.
పారా క్రీడాకారులు దేశానికి గర్వకారణం, భారత పతాకధారులు.
“ఇంతవరూ పారా క్రీడాకారులు సాగించిన ప్రయాణమనేది వారు అంతర్గతంగా ఎంత బలమైనవారో చెబుతోంది. దేహానికి సంబంధించి సమాజంలో ఎప్పటినుంచో వున్న నమ్మకాలు, సవాళ్లపై వారు విజయం సాధించారు”
పారాలింపిక్స్ చరిత్రలో భారతదేశం సాధించిన 31 పతకాల్లో 19 పతకాలను ఒక్క టోక్యో ఒలింపిక్స్ లోనే సాధించాం. గత పదేళ్లలో క్రీడల్లో, పారా క్రీడల్లో భారతదేశ ప్రయాణం ఏ స్థాయికి చేరుకుందో ఎవరైనా సరే ఊహించవచ్చు.
టాప్స్, ఖేలో ఇండియా కార్యక్రమాలకింద మన పారా క్రీడాకారులు సదుపాయాల లబ్ధి పొందుతున్నారు. ఈ క్రీడాబృందంలో 50 మంది క్రీడాకారులు టాప్స్ కార్యక్రమంనుంచి, 16 మంది ఖేలో ఇండియానుంచి వచ్చినవారు
“భారతదేశ క్రీడాసామర్థ్యం పెరిగింది. చాలా ఆటల్లో మన ప్రాతినిధ్యం పెరిగింది”
Posted On:
19 AUG 2024 9:27PM by PIB Hyderabad
త్వరలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నిర్వహించబోతున్న పారాలింపిక్ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి సిద్దమైన భారత క్రీడాబృందంతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ సంభాషించారు. భారత క్రీడాబృందంలో అత్యంత పిన్న వయస్సురాలైన విలువిద్య క్రీడాకారిణి శీతల్ దేవితో మొదటగా మాట్లాడిన ఆయన పారాలింపిక్ పోటీల్లో పాల్గొనడం ఇది మొదటిసారి కదా, మీ మనసులో ఏముంది? అని అడిగారు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదిక మీద భారతదేశానికి ప్రాతినిధ్యంవహించడమనేది ఉద్వేగభరితంగా వుందని 17 సంవత్సరాల శీతల్ దేవి అన్నారు. ష్రైన్ బోర్డ్ కు, తనకు సహకరించినవారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టకాలంలో మద్దతుగా నిలిచి తాను ఈ స్థాయికి రావడానికి కృషి చేసిందని ష్రైన్ బోర్డ్ గురించి వివరించారు. శిక్షణ ఎలా సాగుతోంది అని ప్రధాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ శిక్షణ గొప్పగా సాగుతోందని, పారిస్ లో పతకం సాధించి దేశ పతాకాన్ని ఎగరేసి, జాతీయ గీతాన్ని ఆలపించడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఆమెకు అభినందనలు తెలియజేసిన ప్రధాని గెలుపు ఓటములపై ఎలాంటి వత్తిడికి లోనుకావద్దని, అత్యుత్తమ ప్రదర్శనపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు.
షూటర్ అవని లెఖారాతో మాట్లాడిన ప్రధాని గత టోక్యో పారాలింపిక్స్ లో బంగారు, కాంస్య పతకాలను తెచ్చినందుకు ప్రశంసిస్తూ ఈ సారి ఆమె లక్ష్యం ఎలా వుంది అని అడిగారు. గత పారాలింపిక్ క్రీడల్లో అనుభవాన్ని సాధించడంపైన దృష్టి పెట్టానని, అవి తనకు మొదటి అంతర్జాతీయ క్రీడలని రాజస్థాన్ కు చెందిన క్రీడాకారిణి అవని అన్నారు. ఆ తర్వాత తన క్రీడకు సంబంధించి చాలా నేర్చుకోవడం జరిగిందని, తన అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించడమే లక్ష్యంగా వున్నానని ఆమె తెలిపారు. ఆమె ప్రధాని అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అది తనలో బాధ్యతను కలిగిస్తోందని తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి దోహదం చేస్తోందని అన్నారు. టోక్యో పారాలింపిక్స్ తర్వాత లెఖారా జీవితం ఎలా మారిపోయింది, భవిష్యత్ పోటీలకు సంబందించి ఆమె ఎలా శిక్షణ పొందారు తదితర విషయాలను ఆమెను అడిగి ప్రధాని తెలుసుకున్నారు. 2020 పారాలింపిక్స్ లో పాల్గొనడానికి ముందు తన ముందున్న అడ్డంకిని ఆ క్రీడల్లో విజయంతో అధిగమంచానని పారా షూటర్ లెఖారా అన్నారు. ఆ విజయం తనలో ఆశల్ని, నమ్మకాన్ని కలిగిచింది అని ఒకసారి విజయం సాధిస్తే కష్టపడే తత్వంతో ఆ విజయాన్ని తిరిగి సాధించవచ్చనే నమ్మకం వచ్చిందని ఆమె అన్నారు. లెఖారాకు అభినందనలు తెలిపిన ప్రధాని ఆమె మీద దేశం చాలా ఆశలు పెట్టుకుందని, అయితే వాటిని బరువుగా భావించవద్దని, వాటిని శక్తిగా మార్చుకోవాలని సలహా ఇచ్చారు.
టోక్యో పారాలింపిక్ క్రీడాల్లో రజిత పతకాన్ని సాధించిన హై జంపింగ్ క్రీడాకారుడు మరియప్పన్ తంగవేలుతో మాట్లాడిన ప్రధాని అతని ప్రతిభను ప్రశంసించారు. ఈ సారి పోటీల్లో రజిత పతకాన్ని బంగారు పతకంగా మార్చడానికి కృషి చేస్తున్నారా? అని అడిగారు. గత పారాలింపిక్స్ నుంచి నేర్చుకున్న పాఠాలగురించి 29 సంవత్సరాల తంగవేలును అడిగి తెలుసుకున్నారు. తాను ప్రస్తుతం జర్మనీలో శిక్షణ పొందుతున్నానని, బంగారు పతకాన్ని సాధించాలనే లక్ష్యంతో వున్నానని ఆయన ప్రధానికి తెలియజేశారు. 2016నుంచి పారా క్రీడాకారుల సంఖ్య పెరిగిన విషయాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దానిపై తన అభిప్రాయాన్ని చెప్పాలని క్రీడాకారులు, శిక్షణ ఇచ్చేవారి దృష్టికోణంనుంచి చెప్పాలని శ్రీ తంగవేలును అడిగారు. చాలా మంది స్ఫూర్తి పొందుతూ క్రీడలను కెరీర్ గా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని పారా క్రీడాకారుడు తంగవేలు బదులిచ్చారు. భారతీయ క్రీడాకారులు ఎలాంటి లోటుపాట్లు ఎదుర్కొనకుండా తన ప్రభుత్వం చూస్తుందంటూ తమిళనాడుకు చెందిన హై జంపర్ తంగవేలుకు ప్రధాని శ్రీ మోదీ భరోసానిచ్చారు.
టోక్యా పారాలింపిక్స్ , ఆసియాన్ పారా క్రీడల్లోను అత్యుత్తమ ప్రతిభ చూపిన జావెలిన్ త్రో క్రీడాకారుడు శ్రీ సుమిత్ అంతిల్ పై ప్రధాని ప్రశంసలు గుప్పించారు. అతను రెండు క్రీడాపోటీల్లోను పసిడి పతకాలను సాధించి రికార్డ్ మీద రికార్డ్ సృష్టించారని అన్నారు. 26 సంవత్సరాల శ్రీ సుమిత్ తో మాట్లాడిన ప్రధాని అతను ఎలా స్ఫూర్తి పొందుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. దేవేంద్ర ఝఝారియా, నీరజ్ చోప్రాలద్వారా తాను స్ఫూర్తిని పొందుతున్నానని అదే సమయంలో స్వీయ క్రమశిక్షణ, స్వీయ ప్రేరణ కారణంగా తాను నూతన రికార్డులను సృష్టించగలుగుతున్నానని అన్నారు. భారతదేశ క్రీడా సంస్కృతిలో హర్యానా కృషిని ప్రస్తావించిన ప్రధాని, అనేక రికార్డులను నెలకొల్పిన పలువురు క్రీడాకారులను తయారు చేసిన సోనిపత్ లో ఏదో ప్రత్యేకత వుందని అన్నారు. శ్రీ అంతిల్ విజయంలో హర్యానా క్రీడా సంస్కృతి పోషించిన పాత్ర గురించి తెలుసుకున్నారు. తన ప్రయాణంలో సహకరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రీ సుమిత్ కృతజ్ఞతలు తెలియజేశారు. అంతిల్ ను అబినందించిన ప్రధాని అతను అందరికీ స్ఫూర్తినిస్తున్నారని, ఫ్రాన్స్ లో అతనికి శుభం కలగాలంటూ ఆకాంక్షించారు.
పారా క్రీడాకారిణి అరుణా తన్వర్ తో మాట్లాడిన ప్రధాని ఆమె క్రీడా ప్రయాణం గురించి ఆమె తండ్రి అందిస్తున్న సహకార పాత్ర గురించి అడిగారు. తైక్వాండో క్రీడాకారిణి అరుణా తన్వర్ స్పందిస్తూ “కుటుంబ మద్దతు లేకుండా ఎవరూ టోర్నమెంట్ గెలవలేరని, తాను పారాలింపిక్స్‌లో రెండోసారి పోటీ పడుతున్నాని అన్నారు. దివ్యాంగులు ఏమీ చేయలేరని తరచుగా అందరూ అనుకుంటూ వుంటారు. కానీ నా తల్లిదండ్రులు నాలో ఆత్మవిశ్వాసం నెలకొల్పి నేను ఏమైనా చేయగలననే నమ్మకాన్ని కలిగించారు” అని ఆమె ప్రధానితో అన్నారు. గత పారాలింపిక్స్‌లో కీలకమైన పోటీకంటే కొన్ని క్షణాల ముందు గాయపడినప్పుడు ఆమె ఎలా స్పందించినదీ, ఆ అడ్డంకిని ఆమె ఎలా అధిగమించిందీ చెప్పాలని ప్రధాని అడిగారు. దానికి స్పందించిన ఆమె గాయం తన ఆటను ఆపలేకపోయిందని నా లక్ష్యం దానికంటే పెద్దగా వుండడమే దానికి కారణమని ఆమె వివరించారు. క్రీడల్లో గాయాన్ని ఆభరణంగా భావించానని ఒక పారాలింపిక్ లో ఓటమి భవిష్యత్తును నిర్ణయించవని కోచ్, తల్లిదండ్రులు చెప్పారని, తనను బలోపేతం చేశారని వారికి ఆమె తన కృతజ్ఞతలు తెలియజేశారు. మరిన్ని పోటీలున్నాయని వారు తనను ప్రోత్సహించారని ఆమె ప్రధానితో అన్నారు. ఆమెను పోరాటయోధురాలిగా అభివర్ణించిన ప్రధాని తన్వార్ లోని సానుకూల దృక్పథాన్ని ప్రశంసించారు. పారిస్ పారాలింపిక్స్ లో ఆమెకు అంతా శుభం జరగాలని ఆకాంక్షించారు.
అంతవరకూ మాట్లాడని వారిని మాట్లాడాలంటూ ప్రధాని వారిని ప్రోత్సహించారు. పారాలింపిక్స్ లాంటి అంతర్జాతీయ పోటీల్లో మొదటిసారి పాల్గొంటున్నవారి అభిప్రాయాలను, ఆలోచనల్ని తెలియజేయాలని కోరారు. ప్రధాని ప్రశ్నకు బదులిస్తూ హర్యానాకు చెందిన పారా క్రీడాకారుడు పవర్ లిప్టర్ శ్రీ అశోక్ మాలిక్ మాట్లాడారు. అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యంవహించడం ప్రతి క్రీడాకారుని కల అని అన్నారు. పారాలింపిక్స్‌లో రెండుసార్లు, మూడుసార్లు పాల్గొన్న క్రీడాకారులను మాట్లాడాలని కోరిన ప్రధాని వారి మొదటి పోటీకి సంబంధించిన అనుభవాలను, పాఠాలను పంచుకోవాలని కోరారు. 2012లో మొదటిసారి పారాలింపిక్స్ లో పాల్గొన్నానని చెప్పిన పారా క్రీడాకారుడు అమిత్ సరోహా అప్పటినుంచీ తన టీమ్ పతకాల సంఖ్య, సామర్థ్యం పెరుగుతూ వచ్చాయని అన్నారు. ఈ సారి పారిస్ పోటీల్లో 84 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని క్రమం తప్పకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అందిస్తున్న మద్దతుకు, సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. తాము అందుకుంటున్న ఆర్థిక సహాయం గణనీయంగా పెరిగిందని సరోహా ప్రత్యేకంగా వివరించారు. టాప్స్ పేరు మీద రూపొందిన టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకాన్ని ఆయన ప్రశంసించారు. దాని ద్వారా తాము ప్రపంచంలో ఎక్కడినుంచైనా సరే శిక్షణ పొందుతున్నామని అన్నారు. తమ వ్యక్తిగత శిక్షకులకు, ఫిజియోలకు, సహాయ సిబ్బందికి ప్రభుత్వం అండగావుందని ఈ సారి మరిన్ని పతకాలను సాధించబోతున్నామంటూ ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఇంకా చదువుకుంటున్న పారా క్రీడాకారులతో మాట్లాడుతూ వారు తమ చదువులను క్రీడలను ఎలా సమన్వయం చేసుకుంటున్నారని ప్రధాని ఆసక్తిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పందించిన రాజస్థాన్ క్రీడాకారుడు రుద్రాంశ్ ఖండేల్వాల్ తన అనుభవాలను పంచుకున్నారు. తాను రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ కప్ టోర్నమెంట్ లో పాల్గొన్నానని, 12వ తరగతి పరీక్షల్లో 83 శాతం మార్కులు సాధించానని అన్నారు. జీవితంలో క్రీడలు, చదువులు రెండూ కీలక పాత్ర పోషిస్తాయని క్రీడలద్వారా శీలనిర్మాణం జరుగుతుందని, చదువులద్వారా మనిషికి తన హక్కులపై చైతన్యం వస్తుందని రెండింటీనీ ఒకేసారి మేనేజ్ చేయడం అంతకష్టం కాదని అన్నారు.
ఖేలో ఇండియా పారా క్రీడలపై ప్రధాని ఫీడ్‌బ్యాక్ కోరారు. పలువురు క్రీడాకారుల సూచన మేరకు గత ఏడాది డిసెంబర్‌లో ఈ పోటీలను నిర్వహించామని ప్రధాని చెప్పారు. "ఇటువంటి పోటీలు క్రీడా పర్యావరణ వ్యవస్థకు ఎలా దోహదం చేస్తున్నాయో చెప్పాలి అని ప్రధాని పారాలింపిక్ క్రీడాకారులను అడిగారు. గుజరాత్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ బదులిస్తూ, “ఖేలో ఇండియా కార్యక్రమమనేది అనేక మంది అట్టడుగు ప్రతిభావంతులను తెరపైకి తెచ్చింది. ఇది పారా క్రీడాకారులకు మంచి వేదికను అందించింది, వారికి దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమానికి ఉత్తమ ఉదాహరణ ఏమిటంటే, ఈసారి ఖేలో ఇండియా నుండి 16 మంది పారా క్రీడాకారులు పారిస్ పారాలింపిక్ క్రీడలకు అర్హత సాధించడమే అని అన్నారు.
పారాలింపిక్స్ లో గాయాలపాలైనవారు ఎలా ఆ సమస్యనుంచి బైటపడుతున్నారో చెప్పాలని పారా క్రీడాకారులను ప్రధాని ఆరా తీశారు. టాప్స్ కార్యక్రమం కింద శిక్షణ పొదిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు తరుణ్ థిల్లాన్ మాట్లాడుతూ 2022లో నిర్వహించిన కెనడా అంతర్జాతీయ టోర్నమెంట్ సందర్భంగా తాను ఎలా గాయపడిందీ ప్రధానికి వివరించారు. ఏడునెలల్లోనే గాయాన్నించి వేగంగా కోలుకోవడానికిగాను ఎస్ ఏ ఐ అధికారులు తనకు ఎలా సాయం చేసిందీ ప్రధానికి తెలియజేశారు. ఆ తర్వాత నెలలోనే బంగారు పతకాన్ని సాధించానని అన్నారు. గాయపడిన తర్వాత తనను అధికారులు విమానంలో బిజినెస్ క్లాస్ లో వుంచి భారతదేశానికి తీసుకువచ్చారని తాను మానసికంగా, భౌతికంగా ఆరోగ్యకరంగా వుండేలా నిష్ణాతులైన వైద్యులు సేవలందించారని తరుణ్ థిల్లాన్ ప్రధానికి వివరించారు. టాప్స్ లాంటి పథకాలకారణంగా మద్యతరగతికి చెందిన క్రీడాకారులు తమ లక్ష్యాలను అందుకుంటున్నారని, తీవ్ర గాయాలైనా సరే తట్టుకొని బైటపడుతున్నారని అన్నారు.
పారా క్రీడలకు సామాజిక మాధ్యమాలు ఎలా ఉపయోగపడతాయో సూచనలు ఇవ్వాలని పారా క్రీడాకారులను ప్రధాని అడిగారు. డిస్కస్ త్రో క్రీడాకారుడైన పారా క్రీడాకారుడు యోగేష్ కథునియా మాట్లాడుతూ పారా క్రీడలపై సామాజిక మాధ్యమాలు కలిగిస్తున్న చైతన్యం తనకు ఉపయోగపడిందని అన్నారు. గతంలో దివ్యాంగులకు చదువులు తప్ప మరొక అవకాశం లేదని అనుకునేవారని, కానీ నేడు దేశంలో పారా క్రీడాకారుల సంఖ్య పెరుగుతోందని అతను అన్నారు. నేడు మారుమూల ప్రాంతాలకు చెందినవారు సైతం మా వీడియోలను చూసి స్ఫూర్తి పొందుతున్నారని అన్నారు. వారు తమ నిత్యజీవితంలో చేయాల్సిన వ్యాయామాల గురించి తెలుసుకుంటున్నారని వివరించారు. మొత్తం మీద సామాజిక మాధ్యమాలు చాలా ప్రభావం చూపుతున్నాయని, దాంతో ఫలితాలు వస్తున్నాయని అతను ప్రధానితో చెప్పారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని కేంద్ర క్రీడాశాఖ మంత్రి శ్రీ మాన్‌సుఖ్ మాండవీయాజీకి, కేంద్ర క్రీడల సహాయ మంత్రి శ్రీ రక్షా ఖాడ్సేజీకి, పారాలింపిక్ క్రీడాకారులకు, శిక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా వున్న సహాయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మారుమూల ప్రాంతాలనుంచి సైతం శిక్షణ ఇచ్చే స్థాయికి భారతదేశం చేరుకుందని ప్రధాని అన్నారు. పారిస్ పారాలింపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులను ప్రస్తావిస్తూ వారిని దేశానికి గర్వకారణంగా, భారత పతాకధారులుగా అభివర్ణించారు. ఈ ప్రయాణం వారి జీవితాలకు, కెరీర్లకు చాలా ముఖ్యమని అన్నారు. అదే సమయంలో అది దేశానికి కూడా చాలా ముఖ్యమని అన్నారు. పారిస్ క్రీడల్లో మీరు పాల్గొనడమనేది దేశానికి గర్వకారణమని, 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదాలు వారికి వున్నాయని, విజయీ భవ అంటూ ప్రధాని పారా క్రీడాకారులకు ఆశీర్వాదాలు అందించారు. పారా క్రీడాకారుల్లో కనిపిస్తున్న ఉత్సాహం ఉల్లాసం నూతన రికార్డులను సాధించాలనే వారి ఆకాంక్షకు అద్దం పడుతోందని అన్నారు. ఇది టోక్యో పారాలింపిక్స్, ఆసియాన్ పారా క్రీడాపోటీలను తలపిస్తోందని అన్నారు.
క్రీడాకారుల్లోని ధైర్యం, అంకితభావం, త్యాగాలనేవి వారికి పునాదిగా వుంటాయని ప్రశంసించిన ప్రధాని క్రీడాకారులు క్రమశిక్షణాశక్తితో ముందడుగు వేస్తారని వారు సాధించే విజయాలు వారిలోని ఆత్మవిశ్వాసానికి, స్వీయ నియంత్రణకు సాక్ష్యంగా నిలుస్తాయని అన్నారు. దీనికి సంబంధించి పారా క్రీడాకారులనే తీసుకుంటే వాస్తవంగా అనేక సవాళ్లు వారికి మరింత ఎక్కువగా వుంటాయని అన్నారు. పారా క్రీడాకారుల్లోని స్ఫూర్తిని ప్రశంసించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వారు ఇంతవరకూ చేసిన ప్రయాణం వారు అంతర్గతంగా ఎంత శక్తివంతులో తెలియజేస్తోందని అన్నారు. వారు సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలను, దేహానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కొన్నారని విజయం సాధించారని విజయానికి అంతిమ మంత్రాలుగా వారిని తీర్చిదిద్దుకున్నారని ప్రధాని అన్నారు. విజయానికి మీరు ఉదాహరణగా, సాక్ష్యంగా నిలుస్తున్నారని, ఒకసారి మైదానంలోకి అడుగుపెడితే మిమ్మల్ని ఓడించేవారు ఎవరూ లేరంటూ ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా పారాలింపిక్స్‌లో భారతదేశ ఆధిక్యత పెరుగుతోందని 2012 లండన్ పారాలింపిక్స్ లో దేశానికి ఒక్క పసిడి పతకం రాలేదని, కేవలం ఒకే ఒక పతకం వచ్చిందని అన్నారు. 2016 నాటికి రియోలో జరిగిన పారాలింపిక్స్ లో భారతదేశం 2 బంగారు పతకాలతోపాటు మొత్తం 4 పతకాలను సాధించిందని అన్నారు. టోక్యో పారాలింపిక్స్ లో 5 పసిడి, 8 రజిత, 6 కాంస్యాలతో మొత్తం 19 పతకాలను సాధించడం జరిగిందని ప్రధాని అన్నారు. పారాలింపిక్స్ చరిత్రలో భారతదేశం సాధించిన 31 పతకాల్లో 19 పతకాలను కేవలం టోక్కో పోటీల్లోనే గెలవడం జరిగిందని అన్నారు. మీలో చాలా మంది టోక్యో క్రీడాబృందంలో వున్నారు, పతకాలను తెచ్చారు అంటూ ప్రధాని గుర్తు చేశారు. ఈ విజయాలను చూసిన తర్వాత గత పదేళ్లలలో క్రీడల్లోను, పారాలింపిక్స్ లోను భారతదేశం ఏ స్థాయికి చేరుకుందో ఎవరైనా ఊహించవచ్చని ప్రధాని అన్నారు.
క్రీడలపట్ల ప్రజల్లో వున్న భావాల గురించి ప్రధాని తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రీడలపట్ల సమాజంలో వస్తున్న మార్పు భారతదేశం సాధిస్తున్న విజయాలను ప్రతిఫలిస్తోందని వివరించారు. ఒకప్పుడు క్రీడలను సేదదీరే కార్యక్రమంగా భావించేవారు. క్రీడలను ఆశాజనకమైన కెరీర్‌గా భావించేవారు కాదు. క్రీడల్లో అతి తక్కువ అవకాశాలుంటాయని తమ కెరీర్ కు అవి అడ్డంకి అని అనుకునేవారు. మన దివ్యాంగులైన సోదర సోదరీమణులను బలహీనులుగా భావించేవారు. అలాంటి భావాలకు ఇప్పుడు చోటు లేదు. అలాంటి ఆలోచనలను మార్చి మరిన్ని అవకాశాలకు వారికి కల్పిస్తున్నాం. ఇతర ఏ క్రీడలకు తీసిపోకుండా పారా క్రీడలకు ప్రాధాన్యత లభిస్తోంది..అని ప్రధాని అన్నారు. పారాక్రీడారులకోసం ఖేలో ఇండియా పారా క్రీడాపోటీలను ప్రారంభించామని, వారికి ఉపయోగకరంగా వుండేలా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో పారా క్రీడా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రధాని అన్నారు. టాప్ప్ , ఖేలో ఇండియా కార్యక్రమాల కింద మన పారా క్రీడాకారులు ఆఆ సదుపాయాల లబ్ధిని పొందుతున్నారని ప్రధాని వివరించారు. ఈ క్రీడా బృందంలో టాప్స్ పథకాలతో సంబంధమున్నవారు 50 మంది, ఖేలో ఇండియా క్రీడాకారులు 16 మంది వుండడం సంతోషదాయకంగా వుందని ప్రధాని అన్నారు.
పారిస్ పారాలింపిక్స్ ప్రాధాన్యతను పునరుద్ఘాటించిన ప్రధాని ఈ పోటీలు పలు విధాలుగా దేశానికి ప్రత్యేకమని అన్నారు. పలు క్రీడల్లో మన స్లాట్లు పెరిగాయని, మన ప్రాతినిధ్యం పెరిగిందని అన్నారు. భారతదేశ పసిడి ప్రయాణంలో పారిస్ పారాలింపిక్స్ ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. పారా క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని వారు ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మరోసారి వారితో సమావేశమవుతానని అన్నారు.
***
MJPS/VJ/RT
(Release ID: 2047601)
Visitor Counter : 41