ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్ష సమావేశం
డిపాజిట్ల సేకరణ, డిజిటల్ చెల్లింపులు, సైబర్ సెక్యూరిటీ, కొత్త రుణ కార్యక్రమాలు, పథకాల అమలుపై చర్చ.
‘ఆర్థిక పరిధిలోకి సకల జనులూ’ కింద రుణ సౌలభ్యంపై పూర్తి స్థాయిలో సమీక్ష
డిపాజిట్లు పెంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక మంత్రి ఆదేశం
సమర్థవంతంగా సేవలు అందించేలా వినియోగదారుల చెంతకు వెళ్లాలని పిలుపు;
ముఖ్యంగా గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచన
మోసాలు, సైబర్ సెక్యూరిటీ సవాళ్ళను ఎదుర్కోవడానికి బ్యాంకులు, రెగ్యులేటర్లు,
సెక్యూరిటీ ఏజెన్సీలు కలిసి పని చేయాలని స్పష్టం చేసిన శ్రీమతి నిర్మలా సీతారామన్
డిజిటల్ లావాదేవీలు, నగదు లావాదేవీల ఆధారంగా ఎంఎస్ఎంఈల కోసం కొత్త క్రెడిట్ అసెస్‌మెంట్ మోడల్‌తో సహా బ్యాంకులు ఇటీవలి బడ్జెట్ ప్రతిపాదనలను త్వరితగతిన అమలు చేయాలన్న శ్రీమతి సీతారామన్
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, పీఎం విశ్వకర్మ యోజన వంటి కార్యక్రమాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలు, వాటి పెంపుదలపై దృష్టి సారించాలని బ్యాంకులను ఆదేశించిన శ్రీమతి సీతారామన్
Posted On:
19 AUG 2024 5:05PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీలు) ఆర్థిక ప్రమాణాలు, డిపాజిట్ సమీకరణ, డిజిటల్ చెల్లింపులు, సైబర్ సెక్యూరిటీ విధివిధానాలుమొదలైన అంశాల పనితీరుపై సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. పీఎస్బీలకు సంబంధించి ఆర్థిక పరిధిలోకి సకల జనులూ, రుణ సదుపాయాన్ని పొందడంలో ఎదురవుతున్న సవాళ్ళను కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ వివేక్ జోషి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్)కి కార్యదర్శిగా నియుక్తులవుతున్న శ్రీ ఎం. నాగరాజు, సీనియర్ అధికారులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2023 ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీలు అన్ని ఆర్థిక మార్గదర్శకాల విషయంలో మెరుగైన పనితీరు కనబరిచాయని సమావేశంలో అధికారులు వెల్లడించారు. నికర నిరర్ధక ఆస్తులు (ఎన్ఎన్పిఏ)లు 0.76 శాతానికి తగ్గడం, మెరుగైన ఆస్తుల నాణ్యత, బ్యాంకుల మూలధన సమృద్ధి15.55 శాతంగా నమోదు కావడం సానుకూల అంశాలుగా సమావేశం అభిప్రాయపడింది. బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.22 శాతం కాగా అత్యధిక నికర మొత్తం లాభం రూ.1.45 లక్షల కోట్లు ఉండగా వాటాదారులకు రూ.27,830 కోట్ల డివిడెండ్ ఇవ్వగలిగారు. వివిధ ప్రమాణాల మెరుగుదల, మార్కెట్ల నుండి మూలధనాన్ని సేకరించేలా పీఎస్బీల సామర్థ్యాన్ని కూడా పెంచాయి.
డిపాజిట్ సమీకరణపై చర్చల సందర్భంగా, కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, క్రెడిట్ వృద్ధి పుంజుకున్నప్పుడు, అందుకు తగ్గట్టు నిలకడగా నిధులు సమకూర్చడానికి డిపాజిట్ల సమీకరణను మరింత మెరుగుపరచవచ్చని అన్నారు. మరింత దృష్టిసారించడం ద్వారా డిపాజిట్లను సేకరించేందుకు బ్యాంకులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. సమర్థవంతమైన సేవల్ని అందించేందుకు పీఎస్బీలు తమ వినియోగదారులతో మెరుగైన సంబంధాలను కలిగి ఉండాలని సీతారామన్ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణశివారు ప్రాంతాలలో ఉద్యోగులు... తమ ఖాతాదారులను చేరుకునేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి బ్యాంకులను కోరారు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉండే అనుభవాలను పంచుకోవడం ద్వారా- ఇప్పటికే ఉన్న శక్తిసామర్ధ్యాలను ఉపయోగించుకోవాలన్నారు. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమను తాము సన్నద్ధం చేసుకోవాలని పీఎస్బీలను శ్రీమతి సీతారామన్ కోరారు.
ఆస్తుల నాణ్యతను మెరుగుపరచడానికి బ్యాంకులు చేసిన ప్రయత్నాలను అంగీకరిస్తూ, ఎన్ సి ఎల్ టి, ఎన్ ఏ ఆర్ సి ఎల్ అందించే పరిష్కారాలు, యాధాస్థితిని పొందే మొత్తం ప్రక్రియను పూర్తిగా వినియోగించుకోవాలని శ్రీమతి సీతారామన్ వారికి సూచించారు.
డిజిటల్ చెల్లింపులు, సైబర్ సెక్యూరిటీ విధివిధానాలకు సంబంధించిన అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. సైబర్ భద్రతకు సంబంధించిన సమస్యలను వ్యవస్థాగత కోణం నుండి చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి సలహా ఇచ్చారు. సైబర్-రిస్కులను తగ్గించే దిశగా తీసుకోవాల్సిన పరిష్కారాల కోసం బ్యాంకులు, ప్రభుత్వం, రెగ్యులేటర్లు, భద్రతా ఏజెన్సీల మధ్య సహకారం అవసరమని స్పష్టం చేశారు. బ్యాంకు వ్యవస్థల భద్రతకు భంగం కలగకుండా లేదా రాజీ పడకుండా చూసేందుకు ఐటీ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని కాలానుగుణంగా, సైబర్ సెక్యూరిటీ కోణం నుండి పూర్తిగా సమీక్షించాలని కేంద్ర ఆర్థిక మంత్రి కోరారు.
అట్టడుగున ఉన్న పౌరుల జీవనోపాధికి మద్దతుగా, జీవితాలను మెరుగుపరిచేందుకు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం ఎల్లప్పుడూ రుణ విధానాలను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తుందని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు, నగదు లావాదేవీల ఆధారంగా ఎంఎస్ఎంఈలకు కొత్త క్రెడిట్ అసెస్‌మెంట్ మోడల్‌తో సహా ఇటీవలి బడ్జెట్ ప్రకటనలను త్వరితగతిన అమలు చేయాలని ఆమె బ్యాంకులను కోరారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, పీఎం విశ్వకర్మ యోజన వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణ జారీని మరింత పెంచడంపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక మంత్రి బ్యాంకులను ఆదేశించారు.
రుణాలు మూసివేసిన తర్వాత హామీ పత్రాలను తిరిగి అందజేయడం భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి బ్యాంకులకు సూచించారు. వినియోగదారుల హామీ పత్రాలను అందజేయడంలో ఎటువంటి ఆలస్యం చేయరాదని ఆదేశించారు.
***
(Release ID: 2046833)
Visitor Counter : 91
Read this release in:
Odia
,
Khasi
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada