మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వైమానిక దళం.. అంతకుమించి అన్ని రంగాలలో మహిళల అసమాన నైపుణ్యం


మహిళల విజయాలు మహిళా శక్తి బలానికి, స్ఫూర్తికి నిదర్శనం: ప్రధాని


'వికసిత్ భారత్' ప్రయత్నంలో మన భవిత రూపకల్పనలో, సమాజ అభివృద్ధిలో మహిళల కీలక పాత్రను గుర్తిస్తూ, వారి సాధికారతను, అభివృద్ధిని కొనసాగించుదాం: డబ్ల్యూసిడి మంత్రి



మహిళలకు సాధికారత కల్పించడం, వికసిత్ భారత్‌ నిర్మాణం – స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక అతిథులుగా 161 మంది ఫీల్డ్ హీరోలను సత్కరించిన మంత్రిత్వ శాఖ

Posted On: 15 AUG 2024 12:35PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా నిర్వహించిన 78వ స్వాతంత్ర్య వేడుకల ద్వారా దేశవ్యాప్త స్వాతంత్య్ర వేడుకలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. ఈ చారిత్రక ప్రదేశంలో జరిగిన వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

వైమానిక దళం నుంచి.. అంతకు మించి ప్రతి రంగంలోనూ మహిళలు అసమాన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రధాని తన ప్రసంగంలో కొనియాడారు. వారి విజయాలు నారీ శక్తి బలానికి, స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. మనం ముందుకు సాగుతూ, మన జాతి పురోగతికి విశేషమైన తోడ్పాటునందిస్తున్న మహిళలకు మద్దతు కొనసాగిస్తూ వారి విశేషమైన సహకారాన్ని గౌరవించుకుందామని పిలుపునిచ్చారు.

ఉద్యోగం చేసే మహిళలకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. మేము మహిళలను గౌరవించడమే కాకుండా వారి కోసం సున్నితమైన అంశాలపై ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నామన్నారు. తన బిడ్డను ఒక మంచి పౌరుడిగా పెంచే తల్లి సామర్థ్యానికి ఆటంకాలు లేకుండా చూసుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి, ఆర్థిక స్వాతంత్య్రం సాధించారని అన్నారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించినప్పుడు, వారు ఇంటికి సంబంధించిన నిర్ణయాలలో క్రియాశీల పాత్రను పోషిస్తూ, సామాజిక మార్పు దిశగా తోడ్పాటునందిస్తారన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు 9 లక్షల కోట్లు కేటాయించినట్లు మోదీ తెలిపారు.

 

ఈ మహత్తర స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మన దేశ స్వాతంత్య్రాన్ని మాత్రమే కాకుండా మన ప్రగతి సారధులైన మహిళల అపురూప సహకారాన్ని గౌరవించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి అన్నారు. వారి అచంచలమైన అంకితభావం, సహనం నారీ శక్తి గొప్పతనానికి నిదర్శనమన్నారు. 'వికసిత్ భారత్' దిశగా మన ప్రయత్నంలో, మన భవిష్యత్తు రూపకల్పనతో పాటు, మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి కీలక పాత్రను గుర్తిస్తూ, మహిళలందరి సాధికారతను, అభివృద్ధిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

 

ఈ సంవత్సరం ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా 161 మంది లబ్ధిదారులు, వారి సహచరులను మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండబ్ల్యూసిడి) ఆహ్వానించి, విశేష ఆతిధ్యం ఇచ్చింది. ఈ విశిష్ట అతిథులలో డబ్ల్యూసిడి మంత్రిత్వ శాఖ అమలు చేసిన వివిధ సాధికారత, సంక్షేమ పథకాల కోసం అంకితభావంతో పనిచేసిన మహిళా కార్మికులు ఉన్నారు. అలాగే ఈ బృందంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, వన్-స్టాప్ సెంటర్స్ (ఓఎస్‌సి), మహిళా సాధికారత కోసం సంకల్ప్ హబ్‌లు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల (డిసిపియు) సిబ్బంది ఉన్నారు.

 

వారు న్యూ ఢిల్లీ పర్యటనలో భాగంగా సమగ్రమైన వారి షెడ్యూల్‌లో ప్రతిష్టాత్మక పార్లమెంట్, ప్రధాన మంత్రి సంగ్రహాలయ వంటి ప్రదేశాలను సందర్శించారు. అలాగే ఈ అతిథులు విజ్ఞాన్ భవన్‌లో తేనేటి విందులో పాల్గొనడంతో పాటు, కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ అలాగే ఎండబ్ల్యూసిడి సీనియర్ అధికారులతో 2024, ఆగస్టు 14న ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలపై సంభాషణలు జరిపారు.

 

ఈ ప్రత్యేక అతిథులు, వారి సహచరులు ఆగస్ట్ 13 -౧౬ వరకు న్యూ ఢిల్లీలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భారతదేశ స్వాతంత్ర్య వేడుకలుగా మాత్రమే కాకుండా, దేశ ప్రగతికి అవిశ్రాంతంగా తోడ్పాటునందిస్తున్న వ్యక్తులను గౌరవించుకునే వేడుకలు. ఇది సమష్టి విజయాలను గౌరవిస్తూ, ఆశ, శ్రేయస్సులతో నిండిన భవిష్యత్తు కోసం ఎదురుచూడాలని సందేశమిచ్చిన రోజు.

***


(Release ID: 2045758) Visitor Counter : 82