రాష్ట్రప‌తి స‌చివాల‌యం

78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశిస్తూ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం

Posted On: 14 AUG 2024 7:37PM by PIB Hyderabad

నా ప్రియమైన సహ పౌరులారా

 

మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

రేపు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు మన దేశం సంసిద్ధం కావడం చూస్తుంటే నాకెంతో ఆనందం కలుగుతోంది. ఎర్రకోట బురుజులపై కానివ్వండి రాష్ట్ర రాజధానుల్లో కానివ్వండి స్థానిక ప్రాంతాల్లో కానివ్వండి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం అనే దృశ్యం మనసుకి ఎంతో అద్భుతమైన భావన కలిగిస్తుంది. నూట నలభై కోట్ల మంది సహ భారతీయులతో కలిసి ఈ గొప్ప జాతిలో మనం ఒక భాగమన్న ఆనందానికి పతాకావిష్కరణ ఒక అభివ్యక్తి. మన కుటుంబాలతో కలిసి వివిధ పండుగలు జరుపుకున్నట్లే మనం సహ పౌరులతో కలిసి ఒక పెద్ద కుటుంబంగా స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం లాంటి వేడుకలు జరుపుకుంటాం.

 

ఆగస్టు 15వ తేదీ నాడు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ విదేశాలలోనూ భారతీయులు పతాకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపించి మిఠాయిలు పంచుకుంటారు. చిన్నపిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనది ఎంత గొప్ప జాతి, భారతీయ పౌరులు కావడం అనేది ఎంత గొప్ప గౌరవం అనే విషయం వారు మాట్లాడుతున్నప్పుడు వింటుంటే మన స్వాతంత్ర సమరయోధుల మాటలు వారి పదాల్లో మారుమోగుతాయి. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వారి కలలకు రానున్న సంవత్సరాల్లో మన దేశం పూర్తి వైభవం సాధిస్తుంటే వీక్షించాలన్న ఆకాంక్ష ఉన్న వారి మధ్య ఉన్న ఒక నిరంతర భావనా స్రవంతిలో మనము కూడా ఒక భాగమే అన్న విషయం ఆ సమయంలో విధితం అవుతుంది.

 

ఈ గొప్ప చారిత్రాత్మక ప్రవాహంఅనే  గొలుసులో మనం కూడా ఒక భాగం అని గుర్తించడం ఎంతగానో సంభ్రమాశ్చార్యాలు కలిగించే విషయం. దేశం పరాయి పాలనలో ఉన్న నాటి రోజులు మనకి గుర్తుకు వస్తాయి. దేశభక్తులు, సాహసికులు గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొని ఉత్క్రష్ట త్యాగాలు చేశారు. వారి స్మృతికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. వారి అవిశ్రాంతమై కృషి కారణంగా శతాబ్దాల సుషుప్తి నుంచి భారతీయ ఆత్మ జాగృతమైంది. వివిధ సంప్రదాయాలు ఆదర్శాలు అనేక తరాల గొప్ప నాయకుల ద్వారా కొత్త అభివ్యక్తిని సాధించాయి. ఆ సంప్రదాయాల ప్రకటనలో ఉన్న వైవిధ్యాన్ని ఏకీకృతం చేసిన వారు మన జాతిపిత, మన ధ్రువ తార మహాత్మా గాంధీ.

 

ఆయన వెంబడి సర్దార్ పటేల్నే, తాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇంకా ఎంతోమంది మహనీయులు ఉన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమంలో అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. గిరిజన యోధుల్లో తిల్కా మాంజి, బిర్స ముండా, లక్ష్మణ్ నాయక్, పూలో జానో లాంటి అనేకమంది త్యాగాలను ఈనాడు మనం గుర్తిస్తున్నాం. భగవాన్ బిర్సా ముండా జయంతిని మనం జనజాతీయ గౌరవ దినోత్సవంగా ఇప్పుడు పాటిస్తున్నాము. వచ్చే ఏడాది ఆయన 150 వ జయంతిని జాతి జాగృతానికి ఆయన చేసిన కృషిని తలుచుకునేందుకు, మరింతగా గౌరవించుకునేందుకు మరొక అవకాశంగా అందిపుచ్చుకోవాలి.

 

 

నా ప్రియమైన సహ పౌరులారా

 

 

ఈరోజు ఆగస్టు 14వ తేదీని మనదేశంలో విభజన విభీషిక స్మృతి దినంగా పాటిస్తున్నాము. మన దేశ విభజన నాటి భయంకరమైన అనుభవాలను స్మరించుకునేందుకు ఈరోజు జరుపుకుంటున్నాం. మన జాతి విభజన చెందిన నాడు లక్షలాదిమంది బలవంతపు వలసలు పోవలసి వచ్చింది. అనేక లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే ఒక రోజుకు ముందు అసమానమైన ఈ మానవ విషాదాన్ని మనం తలుచుకొని ఆ సమయంలో విభజన వల్ల విచిన్నమైన కుటుంబాలకు సంఘీభావం ప్రకటించాలి.

 

రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 వ సంవత్సరాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం. కొత్తగా స్వతంత్రం సాధించిన జాతి ప్రస్థానం ఆటంకాలు లేకుండా జరగలేదు. రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం అనే ఆదర్శాల ప్రాతిపదికన అచంచలంగా నిలిచి మనం భారత్ ప్రపంచ వేదిక పైన తనకు హక్కుగా ఉన్న సముచిత స్థానాన్ని తిరిగి సంపాదించుకునేందుకు అవసరమైన కృషి చేస్తోంది.

 

ఈ ఏడాది మనదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినపుడు ఓటు హక్కున్న వారి సంఖ్య దాదాపు 97 కోట్లుగా ఉంది. ఇది ఒక చారిత్రాత్మకమైన రికార్డ్. మానవాళి ఇంతవరకు తిలకించిన అతి పెద్ద ఎన్నికల ప్రక్రియగా ఇది ఘనత సాధించింది. ఇంత బృహత్కార్యాన్ని సజావుగా ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించినందుకు భారత ఎన్నికల కమిషన్కు మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. తీవ్రమైన వేసవి వేడిని తట్టుకొని ఓటర్లకు సహాయపడ్డ అధికారులు సిబ్బంది భద్రత సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ప్రజాస్వామ్యం అనే భావనకు తిరుగులేని ఓటు పడ్డట్లుగా భావించాలి. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ప్రపంచంలో ప్రజాస్వామ్య శక్తులను మరింత బలోపేతం చేసేందుకు భారత్ దోహదం చేసింది.

 

ప్రియమైన సహ పౌరులారా,

 

2021 నుంచి 2024 సంవత్సరం వరకు మన దేశం ఏటా ఎనిమిది శాతం పెరుగుదల సాధిస్తూ ప్రపంచంలోనే అతి వేగంగా పెరుగుతున్న ప్రధాన అర్థ వ్యవస్థల్లో ఒకటిగా ఆవిర్భవించింది..దీనివల్ల ప్రజల చేతుల్లో మరింత డబ్బు ఉండడమే కాక దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది ఇంకా పేదరికం లోనే మగ్గుతున్న వారికి చేయూతనిచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయడమే కాక వారిని కూడా పేదరికం నుంచి వెలికి తెచ్చేందుకు కృషి జరుగుతోంది. ఉదాహరణకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను కోవిడ్ 19 ప్రారంభ దశలో ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటికీ 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలు అందుతున్నాయి. దీనివల్ల, ఇటీవలే పేదరికం నుంచి బయటకు వచ్చిన వారు మళ్లీ పేదరికంలోకి వెళ్లకుండా చూసేందుకు వీలు కలుగుతోంది.

 

మన దేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద అర్థ వ్యవస్థ కావడం అందరికీ గర్వకారణం త్వరలోనే మనము మూడు ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి కానున్నాము. రైతులు, కార్మికులు అవిశ్రాంతంగా చేసిన కృషి, ప్రణాళిక నిర్ణేతలు, సంపత్తిని సృష్టించే వారి వల్ల, ఇంకా దార్శనికత కల నాయకత్వం వల్లే ఇది సాధ్యపడింది.

 

వ్యవసాయ ఉత్పత్తి అన్ని అంచనాలకు మించి జరిగేలాగా మన అన్నదాతలైన రైతులు కృషి చేస్తున్నారు దీనివల్ల వ్యవసాయ రంగంలో భారత్కు ఆత్మ నిర్భరత కలిపించడంతోపాటు మన ప్రజలందరికీ ఆహారం ఉండేలాగా వారు తోడ్పడ్డారు. ఇటీవల సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకూ ఎంతగానో ఊపు లభించింది వ్యూహాత్మకంగా జరిపిన ప్రణాళికల వల్ల సమర్థవంతమైన వ్యవస్థల వల్ల రోడ్లు, హైవేలు, రైల్వేలు రేవుల ద్వారా నెట్వర్క్ ను మనం ఎంతగానో విస్తరించగలిగాము భవిష్యదభిముఖంగా ఉండే సాంకేతిక పరిజ్ఞాన శక్తితో ప్రభుత్వం సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి అనేక రంగాలను ప్రోత్సహించడంతో పాటు అంకుర పరిశ్రమలు వేగంగా పెరిగేందుకు అవసరమైన ఒక ఆదర్శవంతమైన, అనుకూలమైన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేయగలిగింది. దీనివల్ల భారత్ మరింత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యంగా ఆవిర్భవించింది. మరింత పారదర్శకతతో బ్యాంకింగ్ ఆర్థిక రంగాలు మరింత సమర్థత సాధించాయి ఈ అన్ని కారణాలవల్ల రానున్న తరం ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక పెరుగుదలకు రంగం సిద్ధమైంది దీనివల్ల భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచేందుకు మార్గం సుగమం అయ్యింది.

 

సమ్మిళితంగా ఉంటూనే వేగంగా సాధించిన ఈ ప్రగతి వల్ల అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్కు అత్యున్నత స్థానం లభించింది. జి-20 అధ్యక్ష బాధ్యతను విజయవంతంగా ముగించిన అనంతరం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల గళంగా తన పాత్రను మరింత పటిష్టం చేసుకుంది. ప్రపంచ శాంతి, సౌభాగ్యం పరిధిని మరింత విస్తృతం చేసేందుకు తన ప్రభావశీలమైన ఈ స్థానాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తుంది.

 

 

నా ప్రియమైన సహ పౌరులారా

 

మన రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్న మాటలను గుర్తుంచుకోవాలి. 'మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా కూడా చేయాలి. సామాజిక ప్రజాస్వామ్య మూలాలు లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం మనలేదు' అని బాబాసాహెబ్ అన్నారు. రాజకీయ ప్రజాస్వామ్యంలో నిరంతరాయంగా సాధించిన ప్రగతి మనం సామాజిక ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే దిశగా ముందుకు సాగామన్న విషయాన్ని రుజువుచేస్తుంది. సమ్మిళిత స్ఫూర్తి మన సామాజిక జీవనంలో ప్రతి అంశంలోనూ వ్యాప్తి చెందింది. వైవిద్యం బహుళ సంస్కృతులలో కూడా మనం ఒక సమైక్యమైన దేశంగా ముందుకు సాగుతున్నాము. నిర్ణయాత్మకమైన ఖచ్చితమైన చర్యలను ఒక ఉపకారణంగా మార్చుకోవాలి. మన దేశం వంటి సువిశాల దేశంలో సామాజిక అసమానతల పేరిట అసమ్మతిని అశాంతిని ప్రేరేపించే శక్తులను తిరస్కరించాలి.

 

సామాజిక న్యాయం ప్రభుత్వానికి అతి పెద్ద ప్రాధాన్యత. షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు సమాజంలో అణచివేత ఎదుర్కొంటున్న ఇతర వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనిన్ని చర్యలు తీసుకుంది. ఉదాహరణకు, ప్రధానమంత్రి సామాజిక ఉత్తాన్ ఎవం రోజగర్ ఆధారిత్ జన కళ్యాణ్, పీఎం సూరజ్ లాంటి పథకాలు అణగారిన వర్గాల ప్నారజలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్పీ, ఎం జన్ మన్ పథకం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకొని, ప్రత్యేకంగా అణగారిన గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు కీలకమైన పథకాలను అందిఅ్తోంది. నేషనల్ యాక్షన్ ఫర్ మేకనైజ్డ్ సానిటేషన్ ఇకో సిస్టం- నమస్తే పథకం ద్వారా పారిశుద్ధ్య కార్మికులు తమ చేతులతో మురుగు శుభ్రం చేయడం, సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడం లాంటి ప్రమాదకరమైన పనులు చేయనవసరం లేకుండా వీలు కలిగిస్తుంది.

 

న్యాయం అనే పదానికి అత్యంత విస్తృతమైన నిర్వచనాన్ని పరిగణలోకి తీసుకుంటే అనేక సామాజిక అంశాలు అందులో అంతర్భాగంగా ఉంటాయి. నేను ముఖ్యంగా అందులో రెండు అంశాలను ప్రస్తావిస్తాను. అవి స్త్రీపురుష న్యాయం, వాతావరణ న్యాయం.

 

మన సమాజంలో స్త్రీలను సమానంగానే కాక సమానుల కంటే ఎక్కువగానే పరిగణిస్తారు అయితే సాంప్రదాయంగా వస్తున్న అనే రకాల వివక్షకు కూడా వారు గురయ్యారు. భారత ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మహిళా సాధికారతకు ఇస్తున్న సమాన ప్రాముఖ్యత గురించి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇందుకు కేటాయించిన బడ్జెట్ లు గత దశాబ్ద కాలంలో మూడు రెట్లు పెరిగాయి. కార్మిక శక్తిలో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది ఈ రంగంలో అత్యంత సంతోషకరమైన పరిణామం. జనన లింగ నిష్పత్తిలో గణనీయమైన మెరుగుదల ఉండడంతో పాటూ, అనేక ప్రత్యేక ప్రభుత్వ పథకాలను మహిళలే కేంద్ర బిందువుగా రూపొందించారు. మహిళల నిజమైన సాధికారత కోసం నారీ శక్తి వందన్ అధినియం రూపొందించారు.

 

వాతావరణంలో మార్పులు వాస్తవరూపం దాల్చాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ ఆర్థిక వనరుల సమీకరణాన్ని మార్పు చేయడం మరింత పెద్ద సవాలుగా పరిణమించింది. అయితే అంచనా వేసిన దానికంటే ఆ దిశలో మనం మరింత ఎక్కువగానే ప్రగతి సాధించాము. భూగోళం వేడెక్కడం వల్ల వచ్చే అత్యంత తీవ్రమైన పరిణామాల నుంచి ధరిత్రిని కాపాడేందుకు మానవాళి చేస్తున్న పోరాటంలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. మీరందరూ కూడా మీ జీవనశైలిలో స్వల్పమైన, కానీ సమర్థవంతమైన మార్పులు చేసుకోవడం ద్వారా వాతావరణ మార్పులపై జరుగుతున్న పోరాటానికి మీ వంతు కృషి అందించాలని నేను కోరుతున్నాను.

 

 

న్యాయం గురించి ప్రస్తావించిన సందర్భంలో ఈ ఏడాది జులైలో మనం భారతీయ న్యాయ సంహిత అమలులోకి తెచ్చిన విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. వలస పాలన నాటి మరొక అవశేషాన్ని ఈ విధంగా మనం తొలగించాము. కొత్త నియమావళి కేవలం శిక్షలు విధించడం పైనే కాకుండా నేరాల బాధితులకు న్యాయం చేకూర్చడం పై దృష్టి సారిస్తుంది. ఈ మార్పును నేను స్వాతంత్ర సమరయోధులకు నివాళిగా భావిస్తాను.

 

 

నా ప్రియమైన సహ పౌరులారా,

 

మన స్వాతంత్ర శతాబ్ది దిశగా ముందుకు సాగుతున్న ఈ పాతికేళ్ల అమృతకాలాన్ని మన దేశ యువత తీర్చి దిద్దనుంది. వారి శక్తి, ఉత్తేజం మన జాతి కొత్త శిఖరాలను అధిరోహించేలాగా చేస్తాయి. యువ మస్తిష్కాల అభివృద్ధిని ప్రోత్సహించి, మన సంప్రదాయాల్లో అత్యుత్తమమైన అంశాలను సమకాలీన విజ్ఞానంతో కలబోసేలాగా వారికి ఒక కొత్త దృక్పథాన్ని అందించడం ఇప్పుడు మన ప్రాధాన్యత. 2020లో అమలులోకి వచ్చిన జాతీయ విద్యా విధానం ఇప్పటికే ఈ విషయంలో సత్ఫలితాలను ఇస్తోంది.

 

 

యువజనుల నైపుణ్యాలను ప్రతిభను కూడగట్టేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి ఉపాధి ఇతర అవకాశాలకు పథకాలను ప్రవేశపెట్టింది. నైపుణ్యాలు ఉపాధికి సంబంధించిన ఐదు పథకాల ప్రధానమంత్రి కార్యక్రమం వల్ల ఐదేళ్లలో నాలుగు కోట్ల పదిలక్షల మంది యువజనులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరొక కొత్త పథకం ద్వారా కోటి మంది యువజనులు రానున్న ఐదేళ్లలో పెద్ద కంపెనీల్లో ఇంటర్న్ షిప్ చేయగలుగుతారు. వికసిత్ భారత్ నిర్మాణం దిశగా ఇది ఒక పునాదిగా ఏర్పాటు కానుంది.

 

 

మన దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్వేషణలో భాగంగా పరిగణించడంతో పాటు మానవ ప్రగతికి ఒక ఉపకరణంగా కూడా చూస్తాము.

ఉదాహరణకు, డిజిటల్ అప్లికేషన్స్ రంగంలో మనం సాధించిన విజయాలను ఇతర దేశాల్లో నమూనాలుగా ఉపయోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో అంతరిక్ష అన్వేషణ పరిశోధనలో కూడా భారత్ మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రగతి సాధించింది. వచ్చే ఏడాది భారత్ తొలి మానవ అంతరిక్ష నౌకలో భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే గగన్ యాన్ మిషన్ కోసం మీ అందరితో పాటు నేను కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను.

 

 

మన దేశం గత దశాబ్ద కాలంలో గొప్ప అభివృద్ధి సాధించిన మరొక రంగం క్రీడలు. ప్రభుత్వం క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు ఫలితాలను చూపుతోంది. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్ క్రీడల్లో భారత క్రీడాకారుల జట్టు అత్యుత్తమంగా కృషి చేసింది. ఉత్తమ ప్రదర్శన కనపరిచింది. క్రీడాకారుల అంకిత భావాన్ని వారి శ్రమను నేను ఎంతగానో ప్రశంసిస్తున్నాను. వారు దేశంలో యువజనలకు స్ఫూర్తి కలిగించారు. భారత్ T-20 ప్రపంచ కప్ గెలుచుకోవడం కూడా అసంఖ్యాకమైన అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. చెస్ లో కూడా మనదేశంలో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులు దేశానికి గౌరవం తెచ్చిపెట్టారు. చదరంగంలో ఇది భారత శకానికి ప్రారంభమని అంటున్నారు బ్యాడ్మింటన్, టెన్నిస్ క్రీడల్లో కూడా మన యువజనలు అంతర్జాతీయ వేదికల పైన తమదైన ముద్ర వేస్తున్నారు. ఈ విజయాలన్నీ భావి తరానికి ప్రేరణ అందిస్తున్నాయి. .

 

నా ప్రియమైన సహ పౌరులారా

 

దేశం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి సంసిద్ధం అవుతుంటే మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలకు తెగించి కావలి కాస్తున్న సాయుధళాల వీర జవానులకు నా శుభాకాంక్షలు. దేశం అంతటా నిఘా వేసి ఉంచే పోలీస్, భద్రతా సిబ్బందికి కూడా నా శుభాభినందనలు. న్యాయ పౌర సేవల సభ్యులకు విదేశాల్లో ఉన్న మన దౌత్య కార్యాలయాల అధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ సంతతికి చెందినవారు ప్రవాస భారతీయులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు. మీరు మన కుటుంబంలో భాగం. మీ విజయాలు మాకెంతో గర్వకారణం. భారత సంస్కృతికీ వారసత్వానికి మీరు గొప్ప ప్రతినిధులు.

 

మరోసారి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

జైహింద్.

 

***



(Release ID: 2045479) Visitor Counter : 508