హోం మంత్రిత్వ శాఖ
అహ్మదాబాద్‌లో తిరంగా యాత్రకు కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా శ్రీకారం
‘‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం దేశభక్తిని చాటడంతోపాటు 2047 నాటికి
అభివృద్ధి చెందిన భారతదేశం సృష్టి సంకల్పానికి చిహ్నంగా మారింది’’;
‘‘వికసిత భారత్ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని
సాకారం చేసేందుకు యువతరం ముందడుగు వేయాలి’’;
‘‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం దేశమంతటా కొత్త శక్తిని నింపుతోంది’’;
‘‘గత పదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వాన ప్రపంచాన్ని
ఆశ్చర్యపరిచే ఎన్నో విజయాలను భారత్ సాధించింది’’;
‘‘ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశం కోసం ఖాదీ.. ఫ్యాషన్ కోసం ఖాదీ..
ఇంటింటా త్రివర్ణ పతాకం.. ఇంటింటా ఖాదీ’ ఆదర్శాన్ని సాకారం చేద్దాం’’;
‘‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో భాగంగా మన ఇళ్లు.. కార్యాలయాలు..
కర్మాగారాలపై త్రివర్ణం ఎగురవేద్దాం; జాతీయ పతాకంతో సెల్ఫీలు దిగుదాం’’
Posted On:
13 AUG 2024 8:20PM by PIB Hyderabad
అహ్మదాబాద్‌లో నగరపాలక సంస్థ (ఎఎంసి) ప్రారంభించిన ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రను కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం దేశభక్తి వ్యక్తీకరణకు ప్రతీకగా మారిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దేశాన్ని 2047నాటికి ‘వికసిత్ భారత్’గా రూపుదిద్దాలన్నది ప్రధాని శ్రీ మోదీ సంకల్పమని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ‘ఇంటింటా త్రివర్ణం’ కార్యక్రమం గుజరాత్‌లోనే కాకుండా యావద్భారతంలో కొత్త శక్తి నింపుతోందని అమిత్ షా అన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 15న మనం 78వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో గుజరాత్‌లో త్రివర్ణ పతాకం లేని ఇల్లు, కార్యాలయం ఒక్కటి కూడా ఉండదరాదని కేంద్ర హోంమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రమంతటా త్రివర్ణ పతాక రెపరెపలు కనువిందుగా కనిపించేలా చూడటమే ధ్యేయంగా ‘తిరంగా యాత్ర’ను ప్రారంభించామని తెలిపారు. తద్వారా రాష్ట్రంలోనేగాక యావద్దేశంలో ప్రతి పౌరుడి హృదయంలోనూ దేశభక్తి భావన మేల్కొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య అమృత మహోత్సవాలకు నిర్ణయించడంలో మూడు లక్ష్యాలు ఉన్నాయని అమిత్ షా గుర్తుచేశారు. అందులో ‘దేశంలో ప్రతి చిన్నారికి, యువతకు, పౌరుడికి స్వాతంత్య్రోద్యమ చరిత్ర గుర్తు చేయడం మొదటిది’గా పేర్కొన్నారు. అలాగే స్వాతంత్య్రం తర్వాత 75 ఏళ్లలో దేశం సాధించిన విజయాలను పౌరులందరికీ... ముఖ్యంగా యువతరానికి తెలపడం రెండో లక్ష్యం. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల తోడ్పాటుతో ప్రపంచంలోని ప్రతి రంగంలోనూ భారత్‌ను విజేతగా నిలిపేలా స్వాతంత్ర్యం శతాబ్ది వేడుకల నాటికి 25 ఏళ్ల ‘అమృత్ కాలం’లో దేశాభివృద్ధికి పాటుపడాలన్నది మూడో లక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు.
స్వాతంత్ర్య అమృత మహోత్సవాల తర్వాత ‘అమృత కాలం’లో దేశాన్ని ప్రథమ స్థానంలో నిలిపే మహా సంకల్పాన్ని గుర్తు చేసేందుకే ఏటా ‘హర్ ఘర్ తిరంగా యాత్ర’ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం సర్వం త్యాగం చేసిన అసంఖ్యాక అమరవీరులకు నివాళి అర్పిస్తున్నామని తెలిపారు.
గడచిన పదేళ్లుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన భారత్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విజయాలు సాధించిందని అమిత్ షా పేర్కొన్నారు. అలాగే త్రివర్ణ పతాకం చంద్రుడి దక్షిణ ధ్రువంపై వెలసిందని గుర్తుచేశారు. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదం, నక్సలిజంతో దేశం సతమతం అవుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో మెరుపు దాడులు, వైమానిక దాడుల ద్వారా శత్రువులకు మోదీ దీటైన సమాధానం ఇచ్చారన్నారు. ఇక సాంకేతిక పరిజ్ఞాన సద్వినియోగం ద్వారా రెండు డోసుల ఉచిత టీకాలతో 130 కోట్ల మంది ప్రజలను కోవిడ్-19 నుంచి రక్షించారని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత మేరకు 2047 నాటికి దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలన్న సంకల్ప సాధనకు దేశ యువత ముందుకు రావాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. అందరి చేతుల్లోనూ త్రివర్ణ పతాకం చూస్తుంటే యావత్ గుజరాత్ ఈ సంకల్పంతో ముడిపడి, దేశభక్తి స్ఫూర్తితో ఉప్పొంగుతున్న భావన కలుగుతుదన్నదని ఆయన అభివర్ణించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 9 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటా త్రివర్ణం) కార్యక్రమానికి పిలుపునిచ్చారని అమిత్ షా అన్నారు. ఆ మేరకు మనమంతా ఇళ్లు, కార్యాలయాలు, కర్మాగారాలు తదితరాలపై జాతీయ పతాకం ఎగురవేసి, సెల్ఫీలు తీసుకోవడం ద్వారా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల్లో దేశభక్తిని మేల్కొల్పడంతోపాటు దేశాన్ని ‘వికసిత భారత్’గా మార్చే సంకల్ప సాధనలో మనమంతా భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే దేశంలో ప్రతి ఒక్కరూ ఖాదీ ఉత్పత్తుల వినియోగంతో వాణిజ్యాన్ని పెంచాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసినట్లు గుర్తుచేశారు. ‘‘దేశం కోసం ఖాదీ.. ఫ్యాషన్ కోసం ఖాదీ.. ఇంటింటా త్రివర్ణ పతాకం.. ఇంటింటా ఖాదీ’’ నినాదాన్ని ప్రతిఒక్కరికీ చేరువ చేయాలని కోరారు.
****
(Release ID: 2045162)
Visitor Counter : 78
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada