మంత్రిమండలి
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ఆవాస్ యోజన- పట్టణ (అర్బన్) 2.0 (పిఎంఎవై- యు ) పథకానికి మంత్రివర్గం ఆమోదం


పథకం కింద పట్టణాల లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు కోటి ఇళ్ల నిర్మాణం
పిఎంఎవై- యు 2.0 కింద రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, రూ.2.30 లక్షల కోట్ల ప్రభుత్వ సబ్సిడీ

Posted On: 09 AUG 2024 10:21PM by PIB Hyderabad


గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పిఎమ్ఎవై-యు) 2.0 పథకానికి ఆమోదం తెలిపింది, దీని కింద రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు (యుటిలు) / పిఎల్ఐల ద్వారా పట్టణ ప్రాంతాల్లో  కోటి పట్టణ పేద,  మధ్యతరగతి కుటుంబాలకు రానున్న ఐదు సంవత్సరాలలో ఆందుబాటు ధరలో ఇల్లు కట్టు కోవడానికి, కొనడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కింద రూ.2.30 లక్షల కోట్ల  సాయాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది.

పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన లబ్దిదారులందరికీ అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకునే పక్కా గృహాలను అందించడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన ప్రాధాన్యతా (ఫ్లాగ్ షిప్) కార్యక్రమాలలో పిఎమ్ఎవై-యు ఒకటి. పిఎమ్ఎవై-యు కింద 1.18 కోట్ల ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 85.5 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు.

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 15న చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో,  బలహీన, మధ్యతరగతి కుటుంబాలకు సొంతిల్లు అందించేందుకు భారత ప్రభుత్వం రాబోయే సంవత్సరాల్లో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు.

అర్హులైన కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల ఆ మేరకు పెరిగిన గృహ అవసరాలను తీర్చడానికి మూడు కోట్ల అదనపు గ్రామీణ, పట్టణ కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సహాయం అందించాలని జూన్ 10 న కేంద్ర మంత్రివర్గం తీర్మానించింది. ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణంగా, పిఎమ్ఎవై-యు 2.0, పథకం రూ .10 లక్షల కోట్ల పెట్టుబడితో కోటి కుటుంబాల గృహ అవసరాలను తీరుస్తుంది. తద్వారా ప్రతి పౌరుడు మెరుగైన జీవన నాణ్యతను పొందేలా  చేస్తుంది.

ఇంకా, బ్యాంకులు/హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ ఎఫ్ సి లు) ప్రాధమిక రుణ సంస్థల (పి ఎల్ ఐ లు) నుండి ఆర్థికంగా బలహీనవర్గాలు (ఇ డబ్ల్యు ఎస్)/ తక్కువ ఆదాయ వర్గాల  (ఎల్ ఐ జి) వారు మొదటి ఇల్లు నిర్మాణం/కొనుగోలు చేయడానికి ఇచ్చే రుణాలపై క్రెడిట్ రిస్క్ గ్యారంటీ ప్రయోజనం అందించేందుకు క్రెడిట్ రిస్క్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (సి ఆర్ జి ఎఫ్ టి ) కార్పస్ నిధి ని ₹1,000 కోట్ల నుండి ₹3,000 కోట్లకు పెంచారు. క్రెడిట్ రిస్క్ గ్యారంటీ ఫండ్ నిర్వహణను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్ హెచ్ బి ) నుండి నేషనల్ క్రెడిట్ గ్యారంటీ కంపెనీ (ఎన్ సి జి టి సి) కు బదిలీ చేయనున్నారు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం ఒ హెచ్ యు ఎ )  క్రెడిట్ రిస్క్ గ్యారంటీ ఫండ్ పథకాన్ని  పునర్వ్యవస్థీకరించి, సవరించిన మార్గదర్శకాలను జారీ చేయనుంది.

పిఎంఎవై - యు 2.0 అర్హత ప్రమాణాలు

దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు లేని ఆర్థికంగా బలహీనవర్గాలు (ఇ డబ్ల్యు ఎస్)/ తక్కువ ఆదాయ వర్గాలు (ఎల్ ఐ జి) మధ్య తరగతి ఆదాయ   (ఎంఐజీ) తరగతులకు కు చెందిన కుటుంబాలు పిఎంఎవై - యు 2.0   కింద ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి  అర్హులు.


ఇ డబ్ల్యు ఎస్  కుటుంబాలు అంటే రూ.3 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న కుటుంబాలు.

రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న కుటుంబాలను ఎల్ఐ జి కుటుంబాలు గా పరిగణిస్తారు.

ఎంఐజీ కుటుంబాలు అంటే రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న కుటుంబాలు.

పథకం వర్తింపు (కవరేజ్)

2011 జనాభా లెక్కల ప్రకారం అన్ని చట్టబద్ధమైన పట్టణాలు , తరువాత నోటిఫై చేసిన  పట్టణాలు, నోటిఫైడ్ ప్లానింగ్ ప్రాంతాలు, పారిశ్రామిక అభివృద్ధి (ఇండస్ట్రియల్ డెవలప్మెంట్) అథారిటీ / ప్రత్యేక ప్రాంత అభివృద్ధి (స్పెషల్ ఏరియా డెవలప్మెంట్) అథారిటీ / పట్టణాభివృద్ధి సంస్థ (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)  లేదా పట్టణ ప్రణాళిక , నిబంధనల విధులను అప్పగించిన రాష్ట్ర చట్టం కింద నోటిఫై చేసిన ప్లానింగ్ / డెవలప్మెంట్ ఏరియా పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు  పిఎమ్ఎవై-యు 2.0   పధకాన్ని వర్తింప చేస్తారు.

పిఎమ్ఎవై-యు 2.0 భాగాలు

ఈ పథకం పట్టణ ప్రాంతాల్లో సరసమైన గృహాల అవసరాన్ని ఈకింది  విభాగాల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది:


లబ్ధిదారు ద్వారా నిర్మాణం (బి ఎల్ సి) : దీని కింద, ఇ డబ్ల్యు ఎస్  వర్గాలలో వ్యక్తిగత అర్హతగల కుటుంబాలకు వారి స్వంత ఖాళీ స్థలంలో కొత్త ఇళ్లను నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తారు. భూమి లేని లబ్ధిదారుల విషయంలో, రాష్ట్రాలు/ యుటి లు భూమి హక్కులు (పట్టాలు) అందించవచ్చు.

భాగస్వామ్యంతో సరసమైన ధరలో ఇళ్ళ నిర్మాణం (అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్ షిప్ -ఎ హెచ్ పి) : ఎహెచ్ పికింద ఇడబ్ల్యూఎస్ లబ్ధిదారులు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు/ నగరాలు/ పబ్లిక్ / ప్రైవేట్ ఏజెన్సీలు వివిధ భాగస్వామ్యాలతో నిర్మిస్తున్న ఇళ్లను సొంతం చేసుకునేందుకు వారికి ఆర్థిక సహాయం అందిస్తారు.

ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి ఇల్లు కొనుగోలు చేసే లబ్ధిదారులకు రీడీమబుల్ హౌసింగ్  ఓచర్లు ఇవ్వనున్నారు. అవసరమైన అన్ని ప్రమాణాలను పాటించే ప్రైవేట్ రంగ ప్రాజెక్టులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/పట్టణ స్థానిక సంస్థలు అనుమతించిన ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలి.

సృజనాత్మక నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఎ హెచ్ పి  ప్రాజెక్ట్ లకు టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్ (టి ఐ జి) రూపం లో ప్రతి చదరపు మీటరు/ యూనిట్ కు  రూ.1000 చొప్పున అదనపు గ్రాంట్ అందిస్తారు.  

అందుబాటు ధరల్లో అద్దె గృహాలు (అఫర్డబుల్ రెంటల్ హౌసింగ్ - ఎ ఆర్ హెచ్)): పనిచేసే మహిళలు/ పారిశ్రామిక కార్మికులు/ పట్టణ వలసదారులు/ నిరాశ్రయులు/ విద్యార్థులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు సరిపడా అద్దె గృహాలు నిర్మిస్తారు.  సొంతిల్లు కాకుండా స్వల్పకాలిక ప్రాతిపదికన ఇళ్లు అవసరమయ్యే  వారికి, లేదా ఇల్లు నిర్మించుకునే/ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని పట్టణవాసులకు అందుబాటు  ధరలో,  పరిశుభ్రమైన నివాస స్థలాలను ఎ ఆర్ హెచ్  కల్పిస్తుంది.

 ఈ భాగం  కింది  విధంగా రెండు నమూనాల ద్వారా అమలుచేస్తారు.

మోడల్ -1: నగరాల్లో ప్రస్తుతం  ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఇళ్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో లేదా ప్రభుత్వ సంస్థల ద్వారా  ఎ ఆర్ హెచ్ గా మార్చడం.

మోడల్-2: ప్రైవేటు/ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అద్దె గృహాలను నిర్మించడం, నిర్వహించడం

సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చదరపు మీటరుకు రూ.3,000 చొప్పున టీఐజీని విడుదల చేస్తుంది.  రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలు తమ వాటాగా చదరపు మీటరుకు రూ.2000 చొప్పున అందిస్తాయి.

iv.వడ్డీ రాయితీ పథకం (ఐఎస్ఎస్): ఇది ఇడబ్ల్యూఎస్/ఎల్ఐజీ, ఎంఐజీ కుటుంబాలకు గృహ రుణాలపై సబ్సిడీ ప్రయోజనాలను అందిస్తుంది. 35 లక్షల వరకు ఇంటి విలువతో రూ .25 లక్షల వరకు రుణం తీసుకునే లబ్ధిదారులు 12 సంవత్సరాల కాలపరిమితి వరకు మొదటి రూ .8 లక్షల రుణంపై 4 శాతం వడ్డీ రాయితీకి అర్హులు. అర్హులైన లబ్ధిదారులకు గరిష్టంగా ₹1.80 లక్షల సబ్సిడీ 5 సంవత్సరాల వాయిదాల్లో పుష్ బటన్ ద్వారా అందించబడుతుంది. లబ్ధిదారులు తమ ఖాతాలను వెబ్‌సైట్, వన్ టైం పాస్ వర్డ్ (ఒ టి పి ) లేదా స్మార్ట్ కార్డుల ద్వారా నిర్వహించుకోవచ్చు.

పిఎంఎవై-యు 2.0 ను వడ్డీ సబ్సిడీ భాగం మినహా కేంద్ర ప్రాయోజిత పథకం (సి ఎస్ ఎస్) గా అమలు చేస్తారు. ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ (ఐఎస్ఎస్) ను కేంద్ర రంగ పథకంగా అమలు చేయనున్నారు.

నిధుల యంత్రాంగం

పథకం లోని ఐఎస్ఎస్ మినహా వివిధ భాగాల్లో ఇంటి నిర్మాణ వ్యయాన్ని మంత్రిత్వ శాఖ, రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం/ యు ఎల్ బి పంచుకుంటాయి. అవి అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తాయి. పిఎంఎవై-యు -2.0 లోని ఎ హెచ్ పి /బి ఎల్ సి విభాగాల్లో ప్రభుత్వ సాయం యూనిట్ కు రూ.2.50 లక్షలుగా ఉంటుంది.  ఈ పథకం కింద రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల వాటా తప్పనిసరి. శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర : రాష్ట్ర వాటా నిష్పత్తి  100:0, శాసనసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు (ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ , పుదుచ్చేరి యుటి), ఈశాన్య రాష్ట్రాలు , హిమాలయ రాష్ట్రాల (హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్) వాటా నిష్పత్తి 90:10 , ఇతర రాష్ట్రాల నిష్పత్తి 60:40 గా ఉంటుంది.

గృహాలను పటిష్టంగా కట్టుకునేందుకు, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు , యు ఎల్ బి లు లబ్ధిదారులకు అదనపు సహాయాన్ని అందించవచ్చు.

ఐఎస్ఎస్ కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.1.80 లక్షల వరకు కేంద్ర సాయం 5 వార్షిక వాయిదాల్లో అందిస్తారు.

నిధుల వాటా  భాగస్వామ్యం ఈ కింది  విధంగా ఉంది.



 నోట్స్

 ఎ.పీఎంఏవై-యూ 2.0 కింద రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వాటా తప్పనిసరి.  కనీస రాష్ట్ర వాటాతో పాటు, స్థోమతను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు టాప్-అప్ వాటాను కూడా అందించవచ్చు.

 బి. కేంద్ర సహాయానికి అదనంగా , మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ( ఎం ఒ హెచ్ యు ఎ ) నూతన నిర్మాణ సామగ్రి, సాంకేతికతలు ,  ప్రక్రియలను ఉపయోగించే ఎ హెచ్ పి  ప్రాజెక్టులకు మాత్రమే టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్ ( టి ఐ జి ) అందిస్తుంది. ఇది ప్రతి నివాస యూనిట్‌కు చదరపు మీటర్‌కు ₹1,000 చొప్పున గరిష్టంగా 30 చదరపు మీటర్ల వరకు అమలు సంస్థలకు అదనపు ఖర్చు ప్రభావాన్ని తగ్గించడానికి అందిస్తారు.

 

టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సబ్ మిషన్ (టిఐఎస్ఎం)

పిఎంఏవై- యు 2.0 కింద రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర భాగస్వాములకు ఆధునిక, సృజనాత్మక, హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతంగా, నాణ్యతతో నిర్మించడానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని అందిపుచ్చుకునేందుకు టీఐఎస్ఎంను ఏర్పాటు చేయనున్నారు. వాతావరణ పరిస్థితులను తట్టుకునే స్మార్ట్ భవనాలు,  పటిష్టం గా ఉండే ఇళ్ళ నిర్మాణం కోసం విపత్తు నిరోధక , పర్యావరణ స్నేహపూర్వక సాంకేతికతల ప్రాధాన్యం ఇస్తూ, lవినూత్న పద్ధతులు , ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు / నగరాలకు సహాయం అందిస్తారు.  

అందుబాటు ధరల్లో గృహనిర్మాణ విధానం

పిఎమ్ఎవై-యు 2.0 కింద ప్రయోజనం పొందడానికి,l రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు అందుబాటు ధరల్లో గృహనిర్మాణ విధానం రూపొందించాల్సి ఉంటుంది. ఇందులో ప్రభుత్వ / ప్రైవేట్ సంస్థల క్రియాశీల భాగస్వామ్యాన్ని , తక్కువ ఖర్చు తో కూడిన గృహ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి వివిధ సంస్కరణలు , ప్రోత్సాహకాలు ఉండాలి. అందుబాటు గృహ నిర్మాణ విధానంలో ఇటువంటి సంస్కరణలు ఆ గృహాల సామర్ధ్యాన్ని మెరుపరుస్తాయి.  

ప్రభావం:

పిఎంఎవై- యు 2.0 ఇడబ్ల్యూఎస్/ఎల్ఐజీ, ఎంఐజీ వర్గాల సొంత ఇంటి కలను సాకారం చేయడం ద్వారా 'అందరికీ ఇళ్లు' లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. మురికివాడల్లో నివసించేవారు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, వితంతువులు, వికలాంగులు, సమాజంలోని ఇతర అణగారిన వర్గాల అవసరాలను తీర్చడం ద్వారా జనాభాలోని వివిధ విభాగాల్లో సమానత్వానికి ఈ పథకం దోహదపడుతుంది. నిర్ధారిస్తుంది. పారిశుధ్య కార్మికులు, , పి ఎం స్వనిధి పథకం కింద గుర్తించిన వీధి వ్యాపారులు, ప్రధాన మంత్రి-విశ్వకర్మ పథకం కింద కు వచ్చే వివిధ చేతివృత్తులవారు, అంగన్వాడీ కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు, మురికివాడలు/ చౌరస్తాల నివాసితులు, ఇంకా పి ఎం ఎ వై - యు 2.0 అమలు సమయం లో గుర్తించిన ఇతర సమూహాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

 

***


(Release ID: 2044201) Visitor Counter : 150