ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ లో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రధాని ప్యాకేజీని ప్రకటన. ఐదేళ్ల కాలంలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలు
కేంద్ర బడ్జెట్ 2024-25 లో ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతిపై ప్రధాన దృష్టి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Posted On:
23 JUL 2024 1:16PM by PIB Hyderabad
బడ్జెట్ 2024-25 లో ప్రధానంగా ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతిపై దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ లో 2024-25 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతూ వెల్లడించారు.
కొత్తగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వ తొలి పూర్తి సంవత్సర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ఐదు పథకాలు, కార్యక్రమాలతో కూడిన 'ప్రధాన మంత్రి ప్యాకేజీ' ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 4.1 కోట్ల మంది యువతకు రానున్న ఐదేళ్ల కాలంలో ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలను కల్పించడం కోసం రూ.2 లక్షల కోట్ల కేంద్ర వ్యయంతో ప్యాకేజీని ప్రకటించారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ప్రధాన మంత్రి ప్యాకేజీలో భాగంగా 'ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల' కోసం ప్రభుత్వం ఈ క్రింది మూడు పథకాలను అమలు చేస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇవి ఈపీఎఫ్ఓలో నమోదైన ఆధారంగాఉంటాయని, మొదటిసారి ఉద్యోగార్థులను గుర్తించడం, ఉద్యోగులు, ఉద్యోగ కల్పన చేసే యజమానులకు ప్రోత్సాహంపై దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
పథకం (స్కీమ్) ఎ: మొదటిసారి ఉద్యోగార్థులు
రెండేళ్లలో 2.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. కొత్తగా వివిధ రంగాల్లోకి ఉద్యోగులుగా చేరే వారందరికీ ఒక నెల వేతనం లభిస్తుంది. అర్హత వేతన పరిమితి నెలకు రూ.లక్ష ఉంటుంది. ఈపీఎఫ్ఓలో నమోదైన విధంగా మొదటిసారి పనిచేసే ఉద్యోగులకు ఒక నెల వేతనాన్ని 3 వాయిదాల్లో రూ.15,000 వరకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ రూపంలో అందించనున్నారు. మొదటిసారి ఉద్యోగార్థుల విషయంలో ఉద్యోగులకు అదేవిధంగా యజమానులకు ఈ రాయితీ చాలా ముఖ్యమైనది. వారు పూర్తి స్థాయి ఉద్యోగ బాధ్యతలు చేపట్టే నాటికి అన్ని నేర్చుకుని ఉత్పాదకంగా మారేందుకు ఇది తోడ్పాటును అందిస్తుంది. రెండో విడత క్లెయిమ్ పొందేందుకు ఉద్యోగి తప్పనిసరిగా ఆన్ లైన్ ఆర్థిక అక్షరాస్యత కోర్సును పూర్తి చేయాలి. నియామకం జరిగిన ఏడాదిలోగా మొదటి ఉద్యోగార్థులకు ఉద్యోగం మానేస్తే రాయితీని యాజమాన్యం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
పథకం (స్కీమ్) బి: తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన
తయారీ రంగంలో తొలిసారి ఉద్యోగులను గణనీయంగా నియమించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ పథకం ఈ రంగంలో అదనపు ఉపాధిని ప్రోత్సహిస్తుందని, తద్వారా ఉపాధిలోకి ప్రవేశించే 30 లక్షల మంది యువతకు, వారి యజమానులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన మొదటి నాలుగేళ్లలో ఈపీఎఫ్ఓ చందాకు సంబంధించి ఉద్యోగికి, యజమానికి నేరుగా నిర్ణీత స్థాయిలో ప్రోత్సాహకాన్ని అందిస్తారు. నియామకం జరిగిన ఏడాదిలోగా మొదటి ఉద్యోగార్థులకు ఉద్యోగం మానేస్తే రాయితీని యాజమాన్యం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
పథకం (స్కీమ్) సి : యజమానులకు సహాయం
యజమాని-కేంద్రీకృత పథకం ద్వారా అన్ని రంగాల్లో అదనపు ఉపాధి లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. నెలకు రూ.లక్ష వేతనం లోపు ఉన్న అదనపు ఉద్యోగాలన్నింటినీ లెక్కిస్తారు. ప్రతి అదనపు ఉద్యోగికి ఈపీఎఫ్ఓ చందా (కంట్రిబ్యూషన్) కింద నెలకు రూ.3,000 చొప్పున రెండేళ్ల పాటు యజమానులకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఈ పథకం ద్వారా అదనంగా 50 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రధాన మంత్రి ప్యాకేజీ కింద బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న 4వ పథకం రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పరిశ్రమల సహకారంతో నైపుణ్యాన్ని పెంపొందించడానికి రూపొందించిన ఒక కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం. మొత్తం రూ.60,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకంలో ఐదేళ్ల కాలంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యసాధనకు హబ్ లో 1,000 పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్-ఐటీఐ)లను ఆధునికీకరించి, ఫలితాల ఆధారిత విధానంతో తగిన ఏర్పాట్లలో నవీకరిస్తామని చెప్పారు. పరిశ్రమ నైపుణ్య అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల విషయాలు, డిజైన్ ను రూపొందిస్తామని, కొత్తగా అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు.
ప్రధాన మంత్రి ప్యాకేజీ కింద 5 వ పథకం గురించి కేంద్రమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. "ప్రభుత్వం ఐదేళ్లలో కోటి మంది యువతకు 500 అగ్రశ్రేణి సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడానికి ఒక సమగ్ర పథకాన్ని ప్రారంభిస్తుంది (కంపెనీల భాగస్వామ్యం స్వచ్ఛందం). దీని వల్ల 12 నెలల పాటు నిజజీవిత వ్యాపార వాతావరణం, వివిధ వృత్తులు, ఉపాధి అవకాశాలపై అవగాహన లభిస్తుంది" అని మంత్రి పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్ లో భాగంగా నెలకు రూ.5,000 అలవెన్సు, రూ.6,000 సహాయం ఒక్కసారి అందిస్తారు. ఇంటర్న్‌షిప్ ఖర్చులో 10 శాతాన్ని కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల నుంచి భరిస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఉద్యోగం లేని, పూర్తి స్థాయి విద్యలో నిమగ్నం కాని 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
(బడ్జెట్ ప్రసంగంలోని పార్ట్-ఎ అనుబంధంలో ఇచ్చిన వివరణాత్మక అర్హత షరతులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
***
(Release ID: 2036177)
Visitor Counter : 184
Read this release in:
Kannada
,
Bengali
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam