ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బలమైన వృద్ధిఫలితం మద్దతుగల ప్రభుత్వ వివేకవంతమైన ద్రవ్య మరియు వాణిజ్య విధానం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2024 ఆర్థిక సంవత్సరంలో నాలుగు సంవత్సరాల కనిష్టానికి 5.4 శాతానికి తగ్గించింది


2024 ఆర్థిక సంవత్సరంలో తొమ్మిదేళ్ల కనిష్టానికి పడిపోయిన కోర్ సర్వీసెస్ ద్రవ్యోల్బణం

ప్రధాన ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం, 2026 ఆర్థిక సంవత్సరంలో 4.1 శాతం ఉండవచ్చని ఆర్బీఐ అంచనా

తాజా ప్రమాణాలు మరియు ఉత్పత్తులతో (ఐటమ్ బాస్కెట్ లతో) వినియోగదారు ధరల సూచికను సవరించాలని ఆర్థిక సర్వే సిఫార్సు

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడానికి ఆధునిక నిల్వ మరియు ప్రాసెసింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేస్తూ పప్పుధాన్యాలు మరియు నూనె గింజల సాగును విస్తరించాలని ఆర్థిక సర్వే సూచన

Posted On: 22 JUL 2024 3:05PM by PIB Hyderabad

నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వే ధరలు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి సారించింది, ఎందుకంటే 'తక్కువ మరియు స్థిరమైన ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి కీలకం'. ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించే క్రమంలో ద్రవ్యోల్బణాన్ని ఒక మోస్తరు స్థాయిలో ఉంచే సవాలును ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఈ సున్నితమైన సమతుల్యతను సాధించడానికి ఆర్థిక సూచీలను జాగ్రత్తగా పర్యవేక్షించడం, తగిన మరియు సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అవసరం. ధరల స్థిరత్వం మరియు కేంద్ర ప్రభుత్వ విధాన చర్యల లక్ష్యానికి కట్టుబడిన  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిబద్ధతతో, భారతదేశం 2024 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.4 శాతం వద్ద విజయవంతంగా ఉంచగలిగింది, ఇది కోవిడ్ -19 మహమ్మారి కాలం నుండి 4 సంవత్సరాలలో కనిష్టం.

ఐఎంఎఫ్ డేటా ప్రకారం 2022 మరియు 2023 లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం వర్ధమాన మార్కెట్లు మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు (ఇఎండిఇఎస్) మరియు ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉందన్న  వాస్తవాన్ని ఆర్థిక సర్వే హైలైట్ చేస్తుంది. వ్యవస్థీకృతమైన  ద్రవ్య విధానాలు, ఆర్థిక స్థిరత్వం, సరఫరా మరియు డిమాండ్ పరిస్థితులను సమతుల్యం చేయగల బాగా అభివృద్ధి చెందిన మరియు సమర్థవంతమైన మార్కెట్లు మరియు స్థిరమైన కరెన్సీలు వంటి అంశాలు ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదం చేసాయని సర్వే పేర్కొంది. చరిత్రపరంగా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణం సాధారణంగా ఇఎండిఇల కంటే తక్కువగా ఉంది.

 

ద్రవ్యోల్బణ నిర్వహణ

ధరల స్థిరత్వాన్ని కాపాడే లక్ష్యంతో, అనేక దేశాలు తమ ఆర్థిక లక్ష్యాలను ఉత్తమంగా నెరవేర్చే వివిధ అంశాల ఆధారంగా తమ స్వంత ద్రవ్యోల్బణ లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాయి. భారత ద్రవ్యోల్బణ నిర్వహణను ప్రశంసిస్తూ, ద్రవ్యోల్బణ లక్ష్యానికి సంబంధించి వివిధ అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కంటే భారతదేశం, ఆసక్తికరంగా  మెరుగైన పనితీరును కనబరుస్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2023లో భారత ద్రవ్యోల్బణం రేటు తమ లక్ష్యం పరిధిలో  2 నుంచి 6 శాతం మధ్యే ఉంది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, 2021-2023 మధ్య త్రైవార్షిక  సగటు ద్రవ్యోల్బణంలో భారతదేశం తన ద్రవ్యోల్బణ లక్ష్యానికి అతి తక్కువ వ్యత్యాసాన్ని  కలిగి ఉంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ డిమాండ్- సరఫరా అసమతుల్యత సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశ ద్రవ్యోల్బణం రేటు 2023 లో ప్రపంచ సగటు కంటే 1.4 శాతం పాయింట్లు తక్కువగా ఉంది.

2020 నుంచి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశం తన వివేకవంతమైన పరిపాలనా చర్యలు మరియు ద్రవ్య విధానం ద్వారా హెడ్ లైన్ మరియు కోర్ ద్రవ్యోల్బణంలో క్షీణిస్తున్న ధోరణిని తీసుకురాగలిగింది. ఆర్థిక సర్వే ప్రకారం, మే 2022 నుండి పాలసి రెపో రేటును 2022 మేలో 4 శాతం నుండి 2023 ఫిబ్రవరిలో 6.5 శాతానికి 250 బేసిస్ పాయింట్లు పెంచడం ద్వారా వ్యవస్థలో అదనపు లిక్విడిటీని స్వీకరించడంపై మానిటరీ పాలసీ ప్రధానంగా దృష్టి సారించింది. ఆ తర్వాత ద్రవ్యోల్బణాన్ని లక్ష్యానికి క్రమానుగుణంగా మార్చడం, అదే సమయంలో వృద్ధికి ఊతమివ్వడం లక్ష్యంగా క్రమంగా రాయితీల ఉపసంహరణపై దృష్టి సారించడం ద్వారా పాలసీ రేటును యథాతథంగా ఉంచారు. పర్యవసానంగా, 2023 ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా నిరంతరంగా నిలిచిన ప్రధాన ద్రవ్యోల్బణం 2024 జూన్లో 3.1 శాతానికి తగ్గింది.

ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వంటి పరిపాలనా చర్యలు ఎల్పిజి మరియు పెట్రోలియం ఉత్పత్తుల ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి దారితీశాయని సర్వే పేర్కొంది. ఎల్పిజి ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్ 2023 నుండి తగ్గుముఖం పట్టే(ద్రవ్యోల్బణ వ్యతిరేక) జోన్లో ఉంది, పెట్రోల్ మరియు డీజిల్ రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి 2024 లో ద్రవ్యోల్బణ వ్యతిరేక  జోన్ కు మారింది. అంతే కాకుండా, 2023 లో ప్రపంచ కమోడిటీ ధరలు క్షీణించడం మూలంగా, దిగుమతి ద్రవ్యోల్బణ మార్గం ద్వారా శక్తి, లోహాలు, ఖనిజాలు మరియు వ్యవసాయ వస్తువుల ధరల ఒత్తిడి తగ్గింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధరలలో అస్థిరత ఉన్నప్పటికీ  ఇంధనం మరియు కోర్ ద్రవ్యోల్బణం తక్కువ ఉండడం  ప్రధాన ద్రవ్యోల్బణానికి తరుగుదల మార్గాన్ని  నిర్ధారించాయి. 2024 జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.1 శాతంగా ఉందని గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ (MoSPI) శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

ప్రధాన ద్రవ్యోల్బణపు వినియోగదారుల ధరల సూచిక ( సిపిఐ) నుండి ఆహార మరియు ఇంధన వస్తువులను మినహాయించడం ద్వారా కొలవబడే ప్రధాన ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక సంవత్సరంలో నాలుగు సంవత్సరాల కనిష్టానికి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంవల్ల, మహమ్మారి ప్రేరిత గరిష్టాల నుండి, భారతదేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు 2022 ఆర్థిక సంవత్సరంలో తగ్గాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా నిర్మాణాలకు అంతరాయం కలిగి 2023 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మళ్లీ పెరిగాయి, ఇది ఆహార మరియు ఇంధన ధరల పెరుగుదలకు దారితీసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ధరల పరిస్థితి మెరుగుపడింది. వస్తుసేవల ప్రధాన ద్రవ్యోల్బణం క్షీణించిన కారణంగా సిపిఐ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన సేవల ద్రవ్యోల్బణం తొమ్మిదేళ్ల కనిష్టానికి తగ్గింది; అదే సమయంలో ప్రధాన వస్తువుల ద్రవ్యోల్బణం కూడా నాలుగేళ్ల కనిష్టానికి తగ్గింది.

ద్రవ్య విధానం రూపురేఖలను నిర్ణయించడంలో ప్రధాన ద్రవ్యోల్బణం ధోరణులు ముఖ్యమైనవి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి క్రమంగా రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది, ఇది ఏప్రిల్ 2022 మరియు జూన్ 2024 మధ్య ప్రధాన ద్రవ్యోల్బణంలో సుమారు 4 శాతం పాయింట్లు తగ్గడానికి దారితీసింది. గృహ అద్దె ద్రవ్యోల్బణం తగ్గడం, 2023లో కొత్త ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడింది.

వినియోగదారుల వస్తు (కన్జ్యూమర్ డ్యూరబుల్స్) ద్రవ్యోల్బణం 2020-23 ఆర్థిక సంవత్సరాల మధ్య 5 శాతానికి పైగా పెరిగింది, ప్రధానంగా 2021 ఆర్థిక సంవత్సరంలో బంగారం ధరలు, 2022, 2023 ఆర్థిక సంవత్సరంలో దుస్తుల ధరలు పెరగడమే దీనికి కారణం. కీలక ముడిపదార్థాల సరఫరా మెరుగుపడటంతో 2024 ఆర్థిక సంవత్సరంలో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ద్రవ్యోల్బణం రేటు తగ్గింది. అయితే ఫెడ్ రేట్ల కోత, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు మొత్తం డ్యూరబుల్స్  ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచాయి. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ (సిఎన్డి) ద్రవ్యోల్బణం 2020 ఆర్థిక సంవత్సరంలో పడిపోయింది, ఇది 2021 ఆర్థిక సంవత్సరంలో పెరగడం ప్రారంభించింది, 2022 ఆర్థిక సంవత్సరంలో అత్యంత గరిష్టానికి  చేరుకుంది మరియు 2023 మరియు 24 ఆర్థిక సంవత్సరంలో తీవ్రంగా క్షీణించింది.

ఆహార ద్రవ్యోల్బణం గత రెండేళ్లలో ప్రపంచ ప్రధానాంశంగా ఉంది. వాతావరణ మార్పుల ప్రభావంతో ఆహార ధరలు పెరుగుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం23 మరియు ఆర్థిక సంవత్సరం24లో, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, అడుగంటిన రిజర్వాయర్ నిల్వలు మరియు దెబ్బతిన్న పంటల వల్ల వ్యవసాయ రంగం ప్రభావితమైంది, ఇది వ్యవసాయ ఉత్పత్తిని, ఆహార ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (సిఎఫ్ పిఐ) ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం 2022 ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతానికి, 2024 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి పెరిగింది. అయితే, నిత్యావసర ఆహార పదార్థాలను తగినంతగా సరఫరా అవడానికి ప్రభుత్వం బహిరంగ మార్కెట్ అమ్మకాలు, నిర్దిష్ట అవుట్లెట్లలో రిటైలింగ్ మరియు సకాలంలో దిగుమతులతో సహా అనేక సత్వర చర్యలు తీసుకుంది. అదనంగా, పేదలకు ఆహార భద్రతను కల్పించడానికి, 81 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే “ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను” 2024 జనవరి నుండి మరో ఐదేళ్ల కాలానికి పొడిగించారు.

ప్రపంచ ఆహార ధరలు మరియు దేశీయ ద్రవ్యోల్బణం

అంతర్జాతీయ ఆహార ధరలు కూడా దేశీయ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయి. భారతదేశంలో, వంట నూనె మార్కెట్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడి ఉంది, మొత్తం వంట నూనె అవసరాలలో 50 శాతానికి పైగా దిగుమతి అవడం మూలంగా, ఇది ప్రపంచ ధరలకు అనుగుణంగా ఉంటుంది. వినియోగదారులకు అందుబాటు ధరలో వంటనూనెల లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం ప్రపంచ మార్కెట్ ధోరణులను నిశితంగా పరిశీలిస్తుంది. అంతర్జాతీయ ధరల అస్థిరతతో ముడిపడి ఉన్న ప్రమాదాలను తగ్గించడానికి, దిగుమతులను దేశీయ ఉత్పత్తితో సమతుల్యం చేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగుమతి భారాన్ని తగ్గించేందుకు దేశీయంగా ముడి పామాయిల్ ఉత్పత్తిని పెంచాలని ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఆయిల్ పామ్’ లక్ష్యంగా పెట్టుకుంది. చక్కెర విషయంలో, తగినంత స్థానిక సరఫరాలను నిర్ధారించడానికి మరియు తద్వారా చక్కెర ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం జూన్ 2022 లో ఎగుమతిపై ఆంక్షలను ప్రకటించింది. ఈ ఎగుమతి ఆంక్షలు నిజంగానే దేశీయ చక్కెర ధరలను స్థిరీకరించడంలో పాత్ర పోషించాయి. ఫలితంగా, ప్రపంచ చక్కర ధరల సూచి ( గ్లోబల్ షుగర్ ప్రైస్ ఇండెక్స్) పెరిగినప్పటికీ, ఫిబ్రవరి నుంచి అస్థిరతను ప్రదర్శిస్తున్నప్పటికీ.. దేశీయ చక్కెర ధరలు చాలా తక్కువ అస్థిరంగా ఉన్నాయి.

రిటైల్ ద్రవ్యోల్బణంలో అంతర్రాష్ట్ర వ్యత్యాసాలను వివరిస్తూ, 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 29 రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం రేటు 6 శాతం కంటే తక్కువగా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణంలో ఈ అంతర్రాష్ట్ర వ్యత్యాసాలు గ్రామీణ ప్రాంతాలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి, ఎందుకంటే ఆహారపదార్థాల వినియోగంలో నగరవాసుల (29.6%) కంటే  గ్రామీణవాసుల(47.3%)  వినియోగం చాలా ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. అందువల్ల గత రెండేళ్లలో, పెరిగిన ఆహార ధరలను చూసిన రాష్ట్రాలు అధిక గ్రామీణ ద్రవ్యోల్బణాన్ని కూడా చవిచూశాయి.

భవిష్యత్తు ద్రవ్యోల్బణ అంచనాలు

భారతదేశ వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 2026 ఆర్థిక సంవత్సరంలో క్రమంగా ద్రవ్యోల్బణ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని ఆర్బిఐ మరియు ఐఎంఎఫ్ అంచనా వేశాయి. సాధారణ రుతుపవనాలు, విదేశీ లేదా విధానపరమైన కుదుపులు లేని స్థితిలో ప్రధాన ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం, 2026 ఆర్థిక సంవత్సరంలో 4.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.భారత దేశానికి 2024లో 4.6 శాతం, 2025లో 4.2 శాతం ద్రవ్యోల్బణ రేటును ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా సరుకుల సరఫరా పెరుగుతుందని, మెరుగైన పారిశ్రామిక కార్యకలాపాలు, వాణిజ్య వృద్ధి కారణంగా వాటి డిమాండ్ కూడా పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. ప్రధానంగా ఇంధనం, ఆహరం, ఎరువుల ధరలు తగ్గడం వల్ల 2024లో కమోడిటీ ధరల సూచీలో 3 శాతం, 2025లో 4 శాతం క్షీణత ఉంటుందని అంచనా వేసింది. ఈ ఏడాది బొగ్గు, సహజవాయువు ధరలు గణనీయంగా తగ్గడంతో ఇంధన ధరల సూచీ తగ్గుతుందని భావిస్తున్నారు. బలమైన డిమాండ్, ఎగుమతి ఆంక్షల కారణంగా ఎరువుల ధరలు బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ 2015-2019 స్థాయిల కంటే ఎక్కువగానే ఉన్నాయి. పెరిగిన ప్రపంచ పారిశ్రామిక కార్యకలాపాలు మరియు క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రతిబింబిస్తూ, బేస్ మెటల్ ధరలు పెరుగుతాయని అంచనా వేయబడింది. ఇది సాధారణంగా, భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలలో ప్రస్తుత తగ్గుదల దేశీయ ద్రవ్యోల్బణ దృక్పథానికి సానుకూలం.

భారతదేశానికి స్వల్పకాలిక ద్రవ్యోల్బణ దృక్పథం సానుకూలంగా ఉంది. ఏదేమైనా, దీర్ఘకాలిక ధరల స్థిరత్వం కోణంలో, ఆర్థిక సర్వే ఈ క్రింది అంశాలను ముందుకు వెళ్ళే మార్గంగా అన్వేషించాలని సూచిస్తుంది:

  1. దేశీయంగా ప్రధాన నూనెగింజల ఉత్పత్తిని పెంచడం ద్వారా వంట నూనెల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైస్ బ్రాన్ ఆయిల్ మరియు మొక్కజొన్న నూనె వంటి సంప్రదాయేతర నూనెల సామర్థ్యాన్ని అన్వేషించడం మరియు వంట నూనెలపై జాతీయ మిషన్ పరిధిని విస్తరించడం

 

  1. పప్పుధాన్యాలు, ముఖ్యంగా కందిపప్పు, మినప పప్పు  పంటల విస్తీర్ణాన్ని మరిన్ని జిల్లాలకు, వరి బీడు ప్రాంతాలకు విస్తరించాలి. నీటి పారుదల సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో వేసవిలో మినప , పెసర సాగును ప్రోత్సహించడం.

 

3. కూరగాయలు, ముఖ్యంగా టమోటాలు మరియు ఉల్లిపాయల కోసం ఆధునిక నిల్వ మరియు ప్రాసెసింగ్ సౌకర్యాలను మరింత మెరుగుపరచడం మరియు అభివృద్ధి చేయడం.

 

4. వ్యవసాయ ఉత్పత్తి కేంద్రం నుంచి తుది వినియోగదారుడి వరకు అధిక ఫ్రీక్వెన్సీ ధరల పర్యవేక్షణ డేటాను గుణాత్మక పరిమాణంలో క్రోడీకరించడం ద్వారా నిర్దిష్ట వస్తువుల ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం యొక్క పరిపాలనా చర్యల వేగాన్ని మరియు ప్రభావాన్ని మెరుగుపరచడం. ఖర్చు ప్రేరిత ( కాస్ట్-పుష్) ద్రవ్యోల్బణం యొక్క పర్యవసానాలను  బాగా అర్థం చేసుకోవడానికి వస్తువులు మరియు సేవల కోసం ఉత్పత్తిదారు ధరల సూచికను వేగవంతం చేయడం                        మరియు

 

5. గృహ వినియోగదారుల వ్యయ సర్వే, 2022-23 ఉపయోగించి వినియోగదారుల ధరల సూచికను తాజా ప్రాధాన్యత  మరియు వస్తు వినియోగం ఆధారంగా సవరించడం.

***

 


(Release ID: 2035762) Visitor Counter : 503