ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఎంఎస్ఎంఈ రంగంపై నియంత్రణల సడలింపు కీలకం: ఆర్థిక సర్వే 2023-24
ఎంఎస్ఎంఈలకు పరిమితి ఆధారిత ప్రోత్సాహకాల్లో (త్రెషోల్డ్ బేస్డ్ ఇన్సెంటివ్స్) తప్పక ముగింపు నిబంధనలు (సన్ సెట్ క్లాజులు) ఉండాలి: సర్వే
ఆవశ్యకమైన విధాన మార్పులపై రాష్ట్రాలతో చర్చించాలని సర్వే సూచన
Posted On:
22 JUL 2024 2:34PM by PIB Hyderabad
మధ్యతరహా, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) సంబంధించి రుణ అంతరాన్ని పూడ్చడమన్నది కీలకమైన అంశంగా ఉన్నప్పటికీ; నిబంధనల సడలింపు, భౌతిక – సాంకేతిక అనుసంధానాన్ని పెంచడం, ఎంఎస్ఎంఈల మార్కెట్ సదుపాయాన్ని విస్తరించడానికి - పెంచడానికి వీలు కల్పించే ఎగుమతి వ్యూహాన్ని అమలు చేయడంపై కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వే ఈ విషయాన్ని పేర్కొన్నది.
భారత ఆర్థిక రంగంలో ఎంఎస్ఎంఈ కేంద్ర స్థానంలో ఉందని చెప్తూ – ఈ రంగం విస్తృతమైన నియంత్రణ, అనుమతి ఆవశ్యకతలను ఎదుర్కొంటోందని, సకాలంలో చౌకగా నిధుల లభ్యత ప్రదాన అవరోధాల్లో ఒకటిగా ఉండి, గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోందని సర్వే పేర్కొన్నది. ఎంఎస్ఎంఈలు ఎదుర్కోవాల్సి ఉన్న ముఖ్యంగా ప్రాంతీయ ప్రభుత్వాలు విధించిన లైసెన్సింగ్, తనిఖీ, అనుమతి అనివార్యతలు వాటిని సమర్థతకు తగిన విధంగా ఎదగనీయడం లేదని, ప్రధాన ఉద్యోగ సృష్టికర్తలుగా మారకుండా నిరోధిస్తున్నాయని అది పేర్కొన్నది. పరిమితి ఆధారిత రాయితీలు, మినహాయింపులు సంస్థల ప్రోత్సాహకాల్లో అనుద్దిష్ట ప్రభావాలను కలిగించి తమ పరిమాణాలను పరిమితుల కన్నా తక్కువగా ఉంచుతాయని సర్వే చెప్తోంది. కాబట్టి, పరిమితి ఆధారిత ప్రోత్సాహకాల్లో ముగింపు నిబంధనలు (సన్సెట్ క్లాజులు) తప్పక ఉండాలని సర్వే సూచించింది.
నియంత్రణల సడలింపును ఒక కీలకమైన విధాన సహకారంగా పేర్కొంటూ, ఆవశ్యకమైన విధాన మార్పులపై రాష్ట్రాలతో చర్చల కోసం సంస్థాగత యంత్రాంగాల పునరుద్ధరణ లేదా ఏర్పాటు అవసరమని సర్వే పేర్కొన్నది. చాలా చర్యలు ఉప జాతీయ (రాష్ట్ర, స్థానిక) ప్రభుత్వాల స్థాయిలో జరగాల్సి ఉందని చెప్పింది. ఎంఎస్ఎంఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక నిర్వహణలోని కీలక విభాగాలైన మానవ వనరుల నిర్వహణ, ఆర్థిక నిర్వహణ, సాంకేతికత అంశాల్లో శిక్షణ అవసరం. ఆ శిక్షణ ద్వారా ఆవిష్కృతమైన యజమానులైన పారిశ్రామిక వేత్తల ఉత్పాదకత అపారంగా ఉంటుందని సర్వే వెల్లడించింది.
దేశ జిడిపిలో సుమారు 30 శాతం, తయారీ ఉత్పత్తిలో 45 శాతం, భారతదేశ జనాభాలో 11 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయని సర్వే పేర్కొన్నది. ఎంఎస్ఎంఈలు సహా వ్యాపారాల కోసం అత్యవసర క్రెడిట్ లైన్ భరోసా పథకానికి రూ.5 లక్షల కోట్లు కేటాయింపు; ఎంఎస్ఎంఈ స్వయం సమృద్ధ భారత నిధి ద్వారా రూ.50,000 కోట్ల ఈక్విటీ అందించడం; ఎంఎస్ఎంఈల వర్గీకరణకు ప్రమాణాల పునరుద్ధరణ; 5 సంవత్సరాలలో 6,000 కోట్ల రూపాయల వ్యయంతో ఎంఎస్ఎంఈ పనితీరును పెంచడం-వేగవంతం చేయడం; ప్రాధాన్య రంగ రుణాల కింద ప్రయోజనాన్ని పొందడానికి అనధికారిక సూక్ష్మ సంస్థలను అధికారిక పరిధిలోకి తీసుకురావడానికి 2023 నవంబరు 1న ఉద్యోగ్ సహాయక వేదికను ప్రారంభించడం వంటి కార్యక్రమాల ద్వారా ఎంఎస్ఎంఈ రంగ వృద్ధిని పెంచడంలో భారత ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని సర్వే పేర్కొన్నది. ప్రధానంగా సకాలంలో, చౌకగా రుణాలు పొందడంలో ఈ రంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్ల దృష్ట్యా ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు సర్వే పేర్కొన్నది.
***
(Release ID: 2035186)