హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన వరద నిర్వహణ సంసిద్ధత సమీక్షకు సంబంధించిన ఉన్నతస్థాయి సమావేశం
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో శూన్య ప్రమాద విధానం అమలు చేస్తూ ముందడుగు వేస్తున్న భారతదేశ విపత్తు నిర్వహణ విభాగం
కేంద్ర జల సంఘానికి చెందిన వరద పర్యవేక్షణ కేంద్రాలు మన అవసరాలకు అనుగుణంగా పని చేయాలి. అవి అంతర్జాతీయ ప్రమాణాలతో పని చేయాలి: హోమ్ శాఖ మంత్రి
బ్రహ్మపుత్ర నది నీటిని మళ్లించడానికి వీలుగా ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం 50 భారీ చెరువులను నిర్మించాలి. తద్వారా వరద నిర్వహణ జరిగి వ్యవసాయానికి ఆ నీరు వినియోగించవచ్చు. అంతే కాదు పర్యాటక రంగం ప్రగతి సాధిస్తుంది
మెరుగైన వరద నిర్వహణకోసం నదుల నీటి మట్టాన్ని ముందుగా తెలియజేసే వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలి
రోడ్ల నిర్మాణ డిజైన్లలో సహజ నీటి పారుదల వ్యవస్థల అంతర్భాగంగా వుండేలా చూడాలి. తద్వారా వరద నీటితో రోడ్లు మునిగిపోయే ప్రమాదం వుండదు.
సిక్కిం, మణిపూర్ రాష్ట్రాలలో సంభవించే వరదలపై సమగ్రమైన అధ్యయనాన్ని చేయాలని ఎన్ డి ఎంఏకు, జలశక్తి మంత్రిత్వ శాఖకు సూచనలు చేసిన హోమ్ శాఖ మంత్రి
అడవుల్లో అగ్ని ప్రమాదాలను నివారించడం కోసం క
Posted On:
23 JUN 2024 4:22PM by PIB Hyderabad
కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన వరద నిర్వహణ సంసిద్ధత సమీక్షకు సంబంధించిన ఉన్నతస్థాయి సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా వరదనీటి ప్రమాదాల్ని తగ్గించడం కోసం ఒక సమగ్రమైన విధానాన్ని తయారు చేయడంకోసం దీర్ఘకాల చర్యలను చేపట్టడంపైనా హోమ్ మంత్రి సమీక్ష చేశారు.
గత ఏడాది నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఎలాంటి చర్యలను తీసుకున్నారనే అంశంపైన కూడా కేంద్రమంత్రి సమీక్ష చేశారు. అన్ని విభాగాలు ఉపయోగిస్తున్న నూతన సాంకేతికతలపైనా, వరద నిర్వహణకోసం ఆయా విభాగాలు తమ నెట్ వర్క్ ను విస్తరించిన తీరుపైన కూడా సమీక్షించారు. గ్లేషియల్ సరస్సుకు సంబంధించిన ఆకస్మిక వరదలను ఎలా ఎదుర్కొనాలనే దానిపైన కూడా శ్రీ అమిత్ షా సమీక్ష కొనసాగింది. వరదలు, నీటి నిర్వహణకు సంబంధించిన పలు సంస్థలు తమకు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) అందించే ఉపగ్రహ చిత్రాలను సంపూర్ణంగా వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో శూన్య ప్రమాద విధానం అమలు చేస్తూ భారతదేశ విపత్తు నిర్వహణ విభాగం ముందడగు వేస్తోందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అన్నారు. వరద నిర్వహణపై ఎప్పటికప్పుడు ఎన్ డి ఎం ఏ విడుదల చేస్తున్న హెచ్చరికలను సమయానికి వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. భారతదేశ వాతావరణ శాఖ, కేంద్ర నీటి వనరుల శాఖ తమ దగ్గరున్న పరికరాలను అవసరాలకు అనుగుణంగా మల్చుకొని వరద హెచ్చరికలకోసం ఎంత వీలైతే అంత తొందరగా వాడుకోవాలని ఆయన కోరారు. సిక్కిం, మణిపూర్ రాష్ట్రాలలో ఈ మధ్యనే సంభవించిన వరదలపై సమగ్రమైన అధ్యయనాన్ని చేయాలని,నివేదికను కేంద్ర హోమ్ శాఖకు సమర్పించాలని ఎన్ డి ఎంఏకు, జలశక్తి మంత్రిత్వ శాఖకు హోమ్ శాఖ మంత్రి సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా వున్న ప్రధానమైన రిజర్వాయర్ల వరద గేట్లు సక్రమంగా వున్నాయా లేదా అని చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు. సిడబ్ల్యుసికి చెందిన వరద పర్యవేక్షణ కేంద్రాలు మన అవసరాలకు అనుగుణంగా వుండాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో పని చేయాలని అమిత్ షా అన్నారు. వర్షాకాలంలో మాత్రమే వరదనీటితో పారే నదులనేవి ఎక్కువగా నేలకోతకు, ఒండ్రుకు కారణమవుతాయని కేంద్ర హోమ్ మంత్రి అన్నారు. తద్వారా వరదలకు కారణమవుతాయని అన్నారు. వరద నిర్వహణ మెరుగ్గా వుండడంకోసం ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రోడ్ల నిర్మాణ డిజైన్లలో సహజ నీటి పారుదల వ్యవస్థలు అంతర్భాగంగా వుండేలా చూడాలని తద్వారా వరద నీటితో రోడ్లు మునిగిపోయే ప్రమాదం వుండదని అధికారులకు వివరించారు శ్రీ అమిత్ షా.
బ్రహ్మపుత్ర నది నీటిని మళ్లించడానికి వీలుగా ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం 50 భారీ చెరువులను నిర్మించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. తద్వారా వరద నిర్వహణ జరిగి వ్యవసాయానికి ఆ నీరు వినియోగించవచ్చని... అంతే కాదు పర్యాటక రంగం ప్రగతి సాధిస్తుందని స్థానిక ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందుతుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
అడవుల్లో అగ్ని ప్రమాదాలను నివారించడం కోసం క్రమం తప్పకుండా ఆయా అడవుల్లో సరైన దారులను తయారు చేసుకొని, ఆయా ప్రాంతల్లో ఎండిన ఆకులను తొలగించాలని, స్థానికులతోను, అటవీ సిబ్బందితోను కలిసి మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఎన్ డి ఎంఏకు, కేంద్ర పర్యావరణ శాఖకు హోమ్ శాఖ మంత్రి సూచించారు. ఒకటే ప్రాంతంలో పదే పదే సంభవిస్తున్న అగ్ని ప్రమాదాల ఘటనల్ని విశ్లేషించాలని అధికారులను కోరారు. అటవీ అగ్ని ప్రమాదాల నివారణకోసం సమగ్రమైన కరదీపికను తయారు చేయాలని ఎన్ డి ఎంకు ఆదేశాలిచ్చారు.
దేశంలో ఉరుములు మెరుపులకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర వాతావరణ శాఖ తెలియజేయగానే దాన్ని వెంటనే ఎస్ ఎం ఎస్లు, టీవీ, ఎప్ ఎం లద్వారా ఇంకా ఇతర మాధ్యమాలద్వారా వెంటనే ప్రజలకుచేరేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణం, వానలు, వరద హెచ్చరికలకు సంబంధించి వివిధ విభాగాలవారు తయారు చేసిన యాప్స్ ను అనుసంధానం చేయాలని హోమ్ మంత్రి ప్రత్యేకంగా సూచించారు. వరదలతో సహా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మొదటగా ప్రభావం పడేది ఆయా ప్రాంతాల ప్రజలపైనే (కమ్యూనిటీలు). కాబట్టి వివిధ సంస్థల సాయంతో ఆయా కమ్యూనిటీ ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తే ఫలితాలు బాగా వుంటాయని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ఐఎండి, సిడబ్ల్యుసి, ఎన్ డిఆర్ ఎఫ్, ఎన్ డి ఎంఏలు వివరణాత్మక ప్రజెంటేషన్లు ఇచ్చాయి. గత ఏడాది వరద సమీక్ష కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలయ్యిందీ ఆయా విభాగాలవారు తెలియజేశారు. ఈ వానాకాలంలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనడానికి వీలుగా ఎలా సిద్ధంగా వున్నదీ వివరించారు. భవిష్యత్తు ప్రణాళిక గురించి తెలియజేశారు.
ఈ సమీక్షా కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సిఆర్ పాటిల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్, కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శితోపాలు పలు శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. రైల్వే బోర్డ్ అధ్యక్షులు, ఎన్ డి ఎంఏ విభాగాల అధిపతులు, సభ్యులు, ఎన్ డిఆర్ ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఐఎండి డైరెక్టర్ జనరల్, ఎన్ హెచ్ ఏ ఐ అధ్యక్షులు, ఎన్ ఆర్ ఎస్ సీ సీనియర్ అధికారులు, సిడబ్ల్యుసితోపాటు ఇతర సంబంధిత విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2028332)
Visitor Counter : 70
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam