వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వారణాసిలో రేపు ప్రధాని చేతులమీదుగా ‘పిఎం-కిసాన్’ పథకం 17వ విడత నిధుల విడుదల


దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మందికిపైగా రైతులకు రూ.20,000 కోట్లకుపైగా లబ్ధి

‘వ్యవసాయ సఖి’ శిక్షితులైన 30వేల మందికిపైగా స్వయం సహాయ
సంఘాల మహిళలకు ప్రధాని చేతులమీదుగా ధ్రువపత్రాల ప్రదానం

Posted On: 17 JUN 2024 2:30PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసిలో 2024 జూన్ 18వ తేదీన ‘పిఎం-కిసాన్’ పథకం 17వ విడత నిధులను విడుదల చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మందికిపైగా రైతులకు రూ.20,000 కోట్లకుపైగా ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు పాక్షిక విస్తరణ కార్మికులుగా పనిచేసేందుకు ‘వ్యవసాయ (కృషి) సఖి’ శిక్షణ పొందిన 30,000 మందికిపైగా స్వయం సహాయ సంఘాల మహిళలకు ధ్రువీకరణ పత్రాలను కూడా ప్రధానమంత్రి ప్రదానం చేస్తారు.

   ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగాగల 732 వ్యవసాయాభివృద్ధి కేంద్రాలు (కెవికె), లక్షకుపైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల సార్వత్రిక సేవా కేంద్రాల ద్వారా మొత్తం 2.5 కోట్ల మందికిపైగా రైతులు కూడా వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా ఇందులో పాలుపంచుకుంటారు.

   మరోవైపు ఎంపిక చేసిన 50 ‘కెవికె‘లలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలోనూ రైతులు గణనీయ సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు ఆయా కేంద్రాలను సందర్శించి రైతులతో సంభాషిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, ఈ రంగంలో వర్ధమాన కొత్త సాంకేతికతలు, వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయం తదితరాలపై అవగాహన కల్పిస్తారు. అలాగే ‘పిఎం-కిసాన్’ లబ్ధిదారుగా తమ ఖాతా స్థితి, నిధుల జమ స్థితి చూసుకోవడం, ‘కిసాన్-ఇమిత్ర చాట్‌బాట్’ వినియోగించే విధానం వంటివి కూడా నేర్పుతారు. ఈ కేంద్రాల పరిధిలో ‘వ్యవసాయ సఖి’ శిక్షణ పొందన మహిళలకు కేంద్రమంత్రులు ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేస్తారు.

   కాగా, కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ 2024 జూన్ 15న విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర, అన్నదాతకు ప్రధానమంత్రి మోదీ నిరంతర చేయూత గురించి నొక్కిచెబుతూ, ఈ రంగానికి ఆయన సదా అగ్ర ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. ఆ మేరకు 2019లో ఆయన శ్రీకారం చుట్టిన ‘పిఎం-కిసాన్’ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయం చేరడం ద్వారా వారు గణనీయ ప్రయోజనం పొందుతున్నారని గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి కీలక వ్యవసాయ శాఖ బాధ్యతను తనకు అప్పగించడంపై  ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో నేటికీ వ్యవసాయ రంగంలోనే అత్యధిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశం ఆహార నిల్వలను సమర్థంగా నిర్వహించడంలో రైతులు కీలకపాత్ర పోషిస్తున్నారని ఆయన ఉద్ఘాటించారు. వ్యవసాయ రంగానికి, రైతులకు సేవలందించ‌డం దైవారాధ‌నేనని మంత్రి  అభివర్ణించారు. రాబోయే 100 రోజుల ప్రణాళిక సహా నిరంతర కృషి, వ్యూహాత్మక ప్రణాళికలే వ్యవసాయ రంగ ప్రగతిపై ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనమన్నారు.

   దేశంలో అధికాదాయం గల రైతులు మినహా భూకమతాలున్న రైతులందరి ఆర్థిక అవసరాలకు తోడ్పాటు లక్ష్యంగా ‘పిఎం-కిసాన్’ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించబడింది. దీనికింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 వంతున మూడు సమాన వాయిదాలలో ఏటా రూ.6,000/- మేర ఆర్థిక ప్రయోజనం ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డిబిటి) విధానం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతోంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా దేశంలోని 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ.3.04 లక్షల కోట్లకుపైగా లబ్ధి చేకూరింది. తాజాగా 17వ విడత నిధుల విడుదలతో ఆదినుంచీ పథకం కింద లబ్ధిదారులకు బదిలీ అయిన మొత్తం రూ.3.24 లక్షల కోట్లకుపైగా లెక్క తేలుతుంది.

   ఇక ఇప్పటికే విశ్వసనీయ సామాజిక సేవా ప్రదాతలు, అనుభవంగల రైతులైన మహిళలను ‘వ్యవసాయ సఖి’ పేరిట పాక్షిక వ్యవసాయ విస్తరణ సిబ్బందిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. పైగా వీరంతా వివిధ రకాల వ్యవసాయ పద్ధతులలో విస్తృత శిక్షణతో సాటి రైతులకు సమర్థ చేయూత సహా మార్గనిర్దేశం చేయడానికి సన్నద్ధులయ్యారు. ఈ మేరకు ఇప్పటిదాకా శిక్షణ పొందిన 70,000 మందిలో 34,000 మంది ‘వ్యవసాయ సఖి’ విధులకు ఎంపికయ్యారు.

***



(Release ID: 2025998) Visitor Counter : 152