ప్రధాన మంత్రి కార్యాలయం
‘క్లియా’ కామన్వెల్త్ అటార్నీలు.. సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్-2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి
‘‘అద్భుత భారతాన్ని సంపూర్ణంగా చూడాలని అంతర్జాతీయ అతిథులందరికీ నా వినతి’’;
‘‘జి-20కి భారత అధ్యక్షత వేళ ఆఫ్రికా సమాఖ్య భాగస్వామి కావడంపై గర్విస్తున్నాం’’;
‘‘స్వతంత్ర స్వపరిపాలనకు మూలం న్యాయమే... అది లేనిదే దేశం ఉనికి అసాధ్యం’’;
‘‘సహకారంతో మన వ్యవస్థలను పరస్పరం చక్కగా అర్థం చేసుకోగలం.. తద్వారా అవగాహన పెరిగి.. మెరుగైన-
వేగవంతమైన న్యాయ ప్రదానానికి తోడ్పడుతుంది’’;
‘‘ఈ 21వ శతాబ్దపు సమస్యలను 20వ శతాబ్దపు విధానాలతో పరిష్కరించలేం... పునరాలోచన-పునరావిష్కరణ-సంస్కరణల అవసరం ఎంతయినా ఉంది’’;
‘‘న్యాయ ప్రదానం ఇనుమడించడంలో న్యాయ విద్య కీలక సాధనం’’;
‘‘భారతదేశం ప్రస్తుత వాస్తవాలను ప్రతిబింబించేలా చట్టాలను ఆధునికీకరిస్తోంది’’;
‘‘ప్రతి ఒక్కరికీ సకాలంలో న్యాయం లభించే...
ఏ ఒక్కరూ వెనుకబడని ప్రపంచాన్ని నిర్మిద్దాం’’
Posted On:
03 FEB 2024 12:11PM by PIB Hyderabad
కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (క్లియా)-నిర్వహించిన కామన్వెల్త్ అటార్నీలు.. సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ (సిఎఎస్‌జిసి)-2024ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు. ‘‘న్యాయ ప్రదానంలో సీమాంతర సవాళ్లు’’ ఇతివృత్తంగా నిర్వహించబడుతున్న ఈ సదస్సులో న్యాయవ్యవస్థ పరివర్తన-న్యాయవాద వృత్తిపరమైన నైతిక కోణాలు వంటి చట్టం-న్యాయం సంబంధిత కీలకాంశాలు; కార్యనిర్వాహక వ్యవస్థ జవాబుదారీతనం; ఆధునిక న్యాయ విద్యపై పునఃసమీక్ష తదితరాలపై చర్చిస్తారు.
ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- తన చేతుల మీదుగా సదస్సును ప్రారంభించడంపై సంతోషం వెలిబుచ్చారు. ప్రపంచవ్యాప్తంగాగల ప్రముఖ న్యాయకోవిదుల భాగస్వామ్యంతో సాగే ఈ సదస్సుకు 140 కోట్ల మంది భారత పౌరుల తరఫున అంతర్జాతీయ అతిథులందరికీ సాదర స్వాగతం పలికారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ‘‘అద్భుత భారతదేశాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలని మీకందరికీ నా విజ్ఞప్తి’’ అని ఆయన కోరారు. ఈ సదస్సుకు ఆఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరు కావడంపై మాట్లాడుతూ- ఆఫ్రికా సమాఖ్యతో భారతదేశానికి ప్రత్యేక సంబంధాలున్నాయని పేర్కొన్నారు. అలాగే జి-20కి భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నపుడు ఆఫ్రికా సమాఖ్య ఈ కూటమిలో భాగస్వామి కావడంపై ఎంతో గర్విస్తున్నామని చెప్పారు. ఆఫ్రికా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఇది ఎంతగానో దోహదపడగలదని ప్రధాని అన్నారు.
కొన్ని నెలలుగా పలు సందర్భాలలో న్యాయనిపుణ సోదరులతో తన సమావేశాలు, సంభాషణలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల కిందటే భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాల్లో పాల్గొన్నట్లు గుర్తుచేశారు. అలాగే నిరుడు సెప్టెంబరులో భారత మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ న్యాయవాదుల సమావేశానికీ హాజరయ్యానని తెలిపారు. ఇటువంటి పరస్పర సంభాషణలు న్యాయ వ్యవస్థల పనితీరుకు పరస్పర పూరకాలుగా తోడ్పడతాయని తెలిపారు. అలాగే మెరుగైన, సమర్థ, వేగవంతమైన న్యాయ ప్రదానానికి వీలు కల్పిస్తాయని చెప్పారు. భారతీయ దృక్పథంలో న్యాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ మేధావులు ‘‘న్యాయమూలమ్ స్వరాజ్యం స్యాత్’’ అని ప్రబోధించారని తెలిపారు. అంటే- ‘స్వతంత్ర స్వపరిపాలనకు న్యాయమే మూలం’ అని, న్యాయం లేనిదే దేశం ఉనికిని ఊహించడం కూడా అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
నేటి సదస్సు ఇతివృత్తం ‘‘న్యాయ ప్రదానంలో సీమాంతర సవాళ్లు’’ గురించి ప్రస్తావిస్తూ- వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో ఇది సందర్భోచిత అంశమని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. తదనుగుణంగా న్యాయ ప్రదానంపై భరోసా ఇచ్చేందుకు అన్ని దేశాలూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతయినా ఉందని స్పష్టం చేశారు. ‘‘పరస్పర సహకారంతో మనం మన వ్యవస్థలను చక్కగా అర్థం చేసుకోగలం. ఆ మేరకు లోతైన అవగాహన అత్యున్నత సమన్వయానికి తోడ్పడుతుంది. మెరుగైన సమన్వయంతో న్యాయ ప్రదాన వేగం కూడా పెరుగుతుంది’’ అన్నారు. కాబట్టి, తరచూ ఇటువంటి సదస్సులు, సమావేశాలు నిర్వహించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. గగనతల, సముద్ర రాకపోకల నియంత్రణ-నిఘాలో వ్యవస్థలు పరస్పరాధారితమై ఉండటాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అదేతరహాలో దర్యాప్తు-న్యాయప్రదానం విషయంలోనూ అధికార పరిధిని పరస్పరం గౌరవిస్తూ, ఈ సహకారాన్ని కూడా విస్తరించాలని స్పష్టం చేశారు. ఇలా అన్ని దేశాలూ సంయుక్తంగా పనిచేస్తే న్యాయ పరిధి జాప్యం లేకుండా న్యాయ ప్రదానం చేయగల ఉపకరణం కాగలదని ఆయన వివరించారు.
ఇటీవలి కాలంలో నేరాల స్వభావం, పరిధి సమూలంగా రూపుమారుతున్నాయని ప్రధాని గుర్తుచేశారు. ఆ మేరకు ఒక ప్రాంతంలోని ఆర్థిక నేరాలు ఇతర ప్రాంతాల్లో విచ్ఛిన్న కార్యకలాపాలకు నిధులు సమకూర్చే వనరుగా మారాయనే వాస్తవాన్ని వివరించారు. క్రిప్టోకరెన్సీ పెరుగుదల, సైబర్ బెదిరింపులు వంటివి ఈ తరహా కొత్త సవాళ్లకు నిదర్శనాలని చెప్పారు. ఈ 21వ శతాబ్దపు సవాళ్లను 20వ శతాబ్దపు విధానాలతో ఎదుర్కోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. కాబట్టి పునరాలోచన, పునరావిష్కరణ, సంస్కరణల ఆవశ్యకత ఎంతయినా ఉందని చెప్పారు. న్యాయప్రదానం చేసే న్యాయ వ్యవస్థల ఆధునికీకరణ కూడా ఇందులో అంతర్భాగంమని, తద్వారా మన వ్యవస్థలను మరింత సరళం, సానుకూలం చేయగలమని స్పష్టీకరించారు. న్యాయ ప్రదానానికి న్యాయ సౌలభ్యం మూలస్తంభం కాబట్టి, న్యాయ వ్యవస్థలను మరింత పౌర-కేంద్రకం చేయకపోతే సంస్కరణలు అమలు కాబోవని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ- అప్పట్లో సాయంత్రం వేళ పనిచేసే కోర్టుల ఏర్పాటుకు నిర్ణయించామని, దీనివల్ల ప్రజలు తమ పని వేళలు ముగిశాక కోర్టు విచారణకు హాజరయ్యే వెసులుబాటు లభించిందని తెలిపారు. ఈ వినూత్న చర్యతో లక్షలాదిగా ప్రజలు లబ్ధి పొందారని, వారికి సకాలంలో న్యాయ ప్రదానంతోపాటు సమయం, డబ్బు ఆదా అయ్యాయని తెలిపారు.
లోక్ అదాలత్- లేదా ప్రజా న్యాయస్థానం వ్యవస్థ గురించి వివరిస్తూ- ఈ కోర్టులు ప్రజా వినియోగ సేవల సంబంధిత చిన్న కేసులను పరిష్కరించే యంత్రాంగాన్ని సమకూరుస్తాయని వెల్లడించారు. ఇది వ్యాజ్యానికి ముందు నడిచే ప్రక్రియ కావడంతో ఇలాంటి న్యాయస్థానాలు వేలాది కేసులను పరిష్కరించడమే కాకుండా సులభ న్యాయ ప్రదానానికి భరోసా ఇచ్చాయని తెలిపారు. ఇటువంటి వినూత్న చర్యలపై సదస్సులో చర్చకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో విలువ ఉంటుందని చెప్పారు. అలాగే ‘‘న్యాయ ప్రదానానికి ఉత్తేజమివ్వడంలో న్యాయ విద్య కీలక సాధనం’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. యువ మేధావులకు అభిరుచితోపాటు వృత్తిగత అర్హతను కూడా కల్పించేది విద్యేనని చెప్పారు. ప్రతి రంగంలోనూ మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా విద్యా స్థాయిలోనే ప్రతి రంగాన్నీ సార్వజనీనం చేయాలని ఆయన సూచించారు. న్యాయ విద్యా సంస్థలలో మహిళల సంఖ్య పెరిగితే, న్యాయవాద వృత్తిలోనూ వారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఆ మేరకు మహిళలను మరింత ఎక్కువగా న్యాయ విద్యవైపు ఆకర్షించడంపై ఈ సదస్సులో పాల్గొంటున్నవారు తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకోవాలని సలహా ఇచ్చారు.
వైవిధ్యభరిత అవగాహనగల యువ న్యాయకోవిదులు నేటి ప్రపంచానికి అవసరమని ప్రధాని చెప్పారు. మారుతున్న కాలం, దూసుకెళ్తున్న సాంకేతికతలకు అనుగుణంగా న్యాయ విద్య కూడా ముందంజ వేయడం అవశ్యమని స్పష్టం చేశారు. నేరాలు, దర్యాప్తు, సాక్ష్యాల విషయంలో తాజా పోకడలను అర్థం చేసుకోవడంపై దృష్టి సారిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. యువ న్యాయ నిపుణులకు మరింత ఎక్కువగా అంతర్జాతీయ అవగాహన కల్పన కోసం చేయూత ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాని చెప్పారు. తదనుగుణంగా దేశాల మధ్య ఆదానప్రదానాలను మన అత్యుత్తమ న్యాయ విశ్వవిద్యాలయాలు మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఉదాహరణకు ఫోరెన్సిక్ సైన్స్ సంబంధిత ప్రత్యేక విశ్వవిద్యాలయం ప్రపంచం మొత్తంమీద భారతదేశంలో మాత్రమే ఉందని చెబుతూ- వివిధ దేశాల విద్యార్థులు, న్యాయశాస్త్ర బోధకులు, న్యాయమూర్తులు కూడా ఇక్కడ చిన్నచిన్న కోర్సులను అధ్యయనం చేయవచ్చునని ప్రధానమంత్రి సూచించారు. అలాగే న్యాయ ప్రదానానికి సంబంధించి అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయని, వర్ధమాన దేశాలు వాటిలో మరింత ప్రాతినిధ్యం కోసం సమష్టిగా కృషి చేయవచ్చునని తెలిపారు. అటువంటి సంస్థలలో శిక్షణార్థులుగా చేరడంలో విద్యార్థులకు తోడ్పడవచ్చునని, ఈ ప్రక్రియలన్నీ మన న్యాయ వ్యవస్థలు అంతర్జాతీయ ఉత్తమాచరణల నుంచి నేర్చుకునేందుకు దోహదం చేస్తాయని విశదీకరించారు.
భారతదేశం వలస పాలన నుంచి న్యాయ వ్యవస్థను వారసత్వంగా పొందినప్పటికీ, కొన్నేళ్లుగా అందులో అనేక సంస్కరణలు తెచ్చామని ప్రధానమంత్రి చెప్పారు. ఆ మేరకు వలస పాలన నాటి కాలం చెల్లిన వేలాది చట్టాలను భారత ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడించారు. ఈ చట్టాలలో కొన్ని ప్రజలను వేధించే సాధనాలుగా ఆనాడు ఉపయోగపడ్డాయన్నారు. ఇలాంటి అరాచక చట్టాల రద్దుతో జీవన సౌలభ్యం ఇనుమడించడమేగాక వ్యాపార సౌలభ్యం కూడా పెరిగిందని ఆయన ఉదాహరించారు. అదే సమయంలో ‘‘ప్రస్తుత వాస్తవాలను ప్రతిబింబించేలా చట్టాల ఆధునికీకరణలో భారత్ చురుకైన నిర్ణయాలతో ముందుకెళ్తోంది’’ అని శ్రీ మోదీ వివరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 3 కొత్త చట్ట సంహితలు రూపొందించబడ్డాయని, 100 ఏళ్లకుపైగా కొనసాగిన వలసపాలనలోని క్రిమినల్ చట్టాల స్థానంలో ఈ కొత్త స్మృతి అమలులోకి వచ్చిందని తెలిపారు. ‘‘అంతకుముందు శిక్ష, శిక్షార్హ అంశాలపై మాత్రమే నాటి చట్టాలు దృష్టి సారించేవి. కానీ, ఇప్పుడు వాటితోపాటు బాధితులకు న్యాయం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించబడింది. తద్వారా పౌరులకు భయంకన్నా న్యాయ ప్రదానంపై భరోసా ఎక్కువగా ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
నానాటికీ వృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం న్యాయ వ్యవస్థలపైనా సానుకూల ప్రభావం చూపగలదని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా భారత్ స్థలాల మ్యాప్ రూపొందించడంతోపాటు గ్రామీణఉలకు స్పష్టమైన ఆస్తి కార్డులను అందించే దిశగా డ్రోన్లను ఉపయోగించిందని తెలిపారు. ఇలా మ్యాపింగ్ చేయడం వల్ల వివాదాలు సమసిపోయి, వ్యాజ్యాల సంఖ్య కూడా తగ్గుతుందని, ఫలితంగా న్యాయ వ్యవస్థ పనిభారం తగ్గి, సామర్థ్యం ఇనుమడిస్తుందని చెప్పారు. భారతదేశంలోని అనేక న్యాయస్థానాలు ఆన్‌లైన్ విచారణ ప్రక్రియను అనుసరించడంలో డిజిటలీకరణ ఎంతగానో తోడ్పడిందని ప్రధాని తెలిపారు. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు న్యాయం పొందగల వెసులుబాటు లభించిందని చెప్పారు. దీనికి సంబంధించి భారతదేశం తన అనుభవాలను ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ఇతర దేశాల్లోని ఇలాంటి కార్యక్రమాల గురించి తెలుసుకోవడంపై భారత్ కూడా ఆసక్తి చూపుతున్నదని తెలిపారు.
చివరగా- న్యాయ ప్రదానంలో ప్రతి సవాలునూ పరిష్కరించవచ్చునని ప్రధాని చెప్పారు. అయితే, ఒక ఉమ్మడి విలువను ప్రపంచ దేశాలు పంచుకోవాలని చెప్పారు. ‘‘ఇదే స్ఫూర్తిని ఈ సదస్సు బలోపేతం చేస్తుందని, ప్రతి ఒక్కరికీ సకాలంలో న్యాయం లభించే, సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడని ప్రపంచాన్ని నిర్మించుకుందాం రండి! అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, కేంద్ర న్యాయ-చట్టం అమలు శాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, భారత సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, భారత అటార్నీ జనరల్ డాక్టర్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మెహతాలతోపాటు కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (క్లియా) అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఈ సదస్సులో వివిధ అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు ఆసియా-పసిఫిక్, ఆఫ్రికా, కరేబియన్ దీవులలోగల కామన్వెల్త్ దేశాల నుంచి అటార్నీ, సొలిసిటర్ జనరళ్లు పాల్గొన్నారు. కామన్వెల్త్ న్యాయ వ్యవస్థలోని వివిధ భాగస్వాముల మధ్య పరస్పర సంభాషణలకు అనువైన ప్రత్యేక వేదికను ఈ సదస్సు సమకూరుస్తుంది. న్యాయ విద్య, అంతర్జాతీయ న్యాయ ప్రదానంలో సవాళ్ల పరిష్కారం దిశగా సమగ్ర మార్గ ప్రణాళిక రూపకల్పన లక్ష్యంతో అటార్నీ, సొలిసిటర్స్ జనరళ్లు పాల్గొనే ప్రత్యేకమైన రౌండ్ టేబుల్ సదస్సు కూడా ఇందులో భాగంగా నిర్వహించబడుతుంది.
(Release ID: 2002609)
Visitor Counter : 93
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam