ప్రధాన మంత్రి కార్యాలయం

జనవరి 8-10 తేదీల మధ్య ప్రధానమంత్రి గుజరాత్‌ పర్యటన


ఉజ్వల గుజరాత్ 10వ ప్రపంచ సదస్సుకు ప్రారంభోత్సవం;

సదస్సు ఇతివృత్తం: భవిష్యత్తుకు సింహద్వారం;

ప్రధాని చేతులమీదుగా ఉజ్వల గుజరాత్ వాణిజ్య ప్రదర్శన ప్రారంభం;

అగ్రశ్రేణి అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో సమావేశంకానున్న ప్రధానమంత్రి;

‘గిఫ్ట్‌సిటీ’లో ప్రపంచ సాంకేతికార్థిక నేతృత్వ వేదికపై ప్రముఖ వ్యాపారవేత్తలతో చర్చలు

Posted On: 07 JAN 2024 3:11PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 8-10 తేదీల మధ్య గుజరాత్‌లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా జనవరి 9వ తేదీన ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఆయన గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ చేరుకుంటారు. అక్కడ ప్రపంచాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం అగ్రశ్రేణి అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో సమావేశమవుతారు. అటుపైన మధ్యాహ్నం 3:00 గంటల ప్రాంతంలో ఉజ్వల గుజరాత్ వాణిజ్య ప్రదర్శనను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

   మరునాడు జనవరి 10వ తేదీ ఉదయం 9:45 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సు-2024ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత పలు అంతర్జాతీయ సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ‘గిఫ్ట్‌సిటీ’కి చేరుకుని, సాయంత్రం 5:15 గంటలకు ప్రపంచ సాంకేతికార్థిక నేతృత్వ వేదికలో భాగస్వాములైన ప్రముఖ వ్యాపారవేత్తలతో చర్చల్లో పాల్గొంటారు.

   శ్రీ నరేంద్ర మోదీ 2003లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన దార్శనిక నాయకత్వంలో ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సుకు రూపమిచ్చారు. ఈ వేదిక నేడు వ్యాపార సహకారం, విజ్ఞాన భాగస్వామ్యంతోపాటు సమ్మిళిత-సుస్థిర అభివృద్ధి దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యాలకు అత్యంత ప్రసిద్ధ ప్రపంచ వేదికగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో ఉజ్వల గుజరాత్ 10వ ప్రపంచ సద్సు 2024 జనవరి 10-12 తేదీల మధ్య గాంధీనగర్‌లో నిర్వహించబడుతుంది. ఈసారి ‘భవిష్యత్తుకు సింహద్వారం’ (గేట్‌వే టు ది ఫ్యూచర్) ఇతివృత్తంగా జరిగే ఈ కార్యక్రమంలో ‘‘రెండు దశాబ్దాల ఉజ్వల గుజరాత్‌ సదస్సు విజయోత్సవం’’ కూడా నిర్వహిస్తారు.

   ఈ ఏడాది సదస్సు నిర్వహణలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈశాన్య భారతంలో పెట్టుబడి అవకాశాలను వివరించే వేదికగా సదస్సును సద్వినియోగం చేసుకుంటుంది.

   ఈసారి సదస్సులో- పరిశ్రమ 4.0, సాంకేతికత-ఆవిష్కరణలు, సుస్థిర తయారీ రంగం, హరిత ఉదజని, విద్యుదాధారిత రవాణా, పునరుత్పాదక ఇంధనం, సుస్థిరత దిశగా పరివర్తన వంటి ప్రపంచ ప్రాధాన్యంగల అంశాలపై చర్చాగోష్ఠులు, సమావేశాలుసహా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

   ఇక ఉజ్వల గుజరాత్ వాణిజ్య ప్రదర్శనలో వివిధ కంపెనీలు ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఈ సందర్భంగా ‘ఇ-మొబిలిటీ, అంకుర సంస్థలు, ‘ఎంఎస్ఎంఇ’లు, నీలి ఆర్థిక వ్యవస్థ, హరిత ఇంధనం, అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన వంటివాటికి అగ్ర ప్రాధాన్యం ఉంటుంది.

****



(Release ID: 1993971) Visitor Counter : 135