ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విక‌సిత భార‌తం సంక‌ల్ప యాత్ర ల‌బ్ధిదారుల‌తో ప్ర‌ధాన‌మంత్రి సంభాష‌ణ‌


దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌ధానితో మాటామంతీలో పాల్గొన్న వేలాది ల‌బ్ధిదారులు;

ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లులో సంతృప్తత సాధన దృష్టితోనే సంక‌ల్ప యాత్ర;

‘‘ల‌బ్ధిదారుల జాబితాలో ఇంకా చేర‌నివారి కోసం నేను నిరంత‌రం శోధిస్తున్నాను’’;

‘‘మోదీ హామీ వాహ‌నం’ ఎక్క‌డికెళ్తే అక్క‌డ ప్ర‌జా విశ్వాసం
పెరగ‌డ‌మే కాకుండా వారికి ఆశ‌లు నెర‌వేరుతున్నాయి’’;

‘‘రెండు కోట్ల మంది ల‌క్షాధికారి సోద‌రీమ‌ణులుగా రూపొందాల‌న్న‌దే నా ల‌క్ష్యం;

‘‘ఒక జిల్లా - ఒక ఉత్ప‌త్తి కార్య‌క్ర‌మం అనేక‌మంది జీవితాల్లో సౌభాగ్యం నింపుతుంది’’;

‘‘భార‌త గ్రామీణ జీవ‌నంలో స‌హ‌కార సంఘాలు
బ‌ల‌మైన శ‌క్తిగా రూపొందాల‌న్న‌దే మా ధ్యేయం’’

Posted On: 27 DEC 2023 3:45PM by PIB Hyderabad

   హాప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ విక‌సిత భార‌తం సంక‌ల్ప యాత్ర ల‌బ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ స‌దుపాయం ద్వారా  సంభాషించారు. అనంత‌రం వారంద‌రినీ ఉద్దేశించి ప్ర‌సంగించారు. దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌ధానితో మాటామంతీలో వేలాది విబిఎస్‌వై ల‌బ్ధిదారులతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- “విక‌సిత భారతం సంకల్పంతో ప్ర‌జ‌ల అనుసంధానం దిశ‌గా ఈ కార్య‌క్ర‌మం నిరంతరం విస్తరిస్తోంది. యాత్ర ప్రారంభమై 50 రోజులు కూడా కాక‌పోయినా ఇప్పటిదాకా 2.25 లక్షల గ్రామాలకు చేరింది. ఇదో స‌రికొత్త రికార్డు” అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఇంత‌గా విజయవంతం కావ‌డంపై ప్ర‌జ‌లందరికీ... ముఖ్యంగా మహిళలు, యువతకు ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు.

   ‘‘ఏదైనా కారణంవల్ల కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు అందనివారికి చేరువ కావడమే వికసిత‌ భారతం సంకల్ప యాత్ర లక్ష్యం’’ అని ప్రధాని చెప్పారు. ముందుచూపుతో ప్రజలకు చేరువ కావడమంటే ప్రభుత్వ పథకాలు అందరికీ లభ్యమవుతాయని వివరించడమేనన్నారు. అలాగే వీటి అమలులో ఎలాంటి సానుకూల-ప్రతికూల భావనలకు తావులేదని వారికి భరోసా ఇవ్వడం కాగలదని ప్రధాని చెప్పారు. ‘‘పథకాల లబ్ధి అందని వారికోసం నేను నిరంతరం శోధిస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులలో మునుపెన్నడూ లేని విశ్వాసం కనిపిస్తున్నదని ప్రధాని అన్నారు. అలాగే ‘‘దేశవ్యాప్తంగా ప్రతి లబ్ధిదారుని జీవితంలో గత పదేళ్లలో సంభవించిన మార్పులపై తమదైన అనుభవం ఉంది... అది ఆత్మవిశ్వాసంతో కూడిన గాథ’’ అని ఆయన అభివర్ణించారు.

   లబ్ధిదారులు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడంలో ఈ ప్రయోజనాలు ఎంతగానో తోడ్పడతాయని ప్రధాని చెప్పారు. ‘‘దేశంలోని లక్షలాది లబ్ధిదారులు తమ ముందడుగు కోసం ఇవాళ ప్రభుత్వ పథకాలను ఒక మాధ్యమంగా వాడుకుంటున్నారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మోదీ హామీ’ వాహనం ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజల్లో అపార విశ్వాసం నింపుతూ, వారి ఆకాంక్షలు నెరవేరుస్తున్నదని ప్రధాని చెప్పారు. ఈ మేరకు వివిధ పథకాల కింద ప్రజల నమోదు జాబితాను ప్రధాని ఉటంకించారు. యాత్ర సందర్భంగా ఉజ్వల వంటగ్యాస్ కనెక్షన్ల కోసం 4.5 లక్షల కొత్త దరఖాస్తులు దరఖాస్తులు వచ్చాయన్నారు. కోటి ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ చేయగా, 1.25 కోట్ల ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. మరో 70 లక్షల క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు, 15 లక్షల కొడవలికణ రక్తహీనత నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ‘ఎబిహెచ్ఎ’ కార్డుల జారీవల్ల లబ్ధిదారుల వైద్య రికార్డుల సృష్టికి వీలు ఏర్పడిందని ప్రధాని తెలిపారు. ‘‘ఈ కార్యక్రమాలతో దేశమంతటా ఆరోగ్య స్థితిగతులపై సరికొత్త అవగాహన విస్తరిస్తుంది’’ అని ఆయన అన్నారు.

   సంకల్ప యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు కొత్త లబ్ధిదారులుగా నమోదవుతున్నారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రతినిధులు బాధ్యత వహించి వార్డు, గ్రామం, పట్టణం మొత్తంమీద అర్హులైన ప్రతి వ్యక్తినీ గుర్తించాలని సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం దిశగా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం భారీ స్వయం ఉపాధి కార్యక్రమం నిర్వహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్నేళ్లలో దాదాపు 10 కోట్ల మంది మహిళలు, సోదరీమణులు స్వయం సహాయ సంఘాల్లో సభ్యులయ్యారని గుర్తుచేశారు. వీరందరికీ బ్యాంకుల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించడం గురించి చెబుతూ- ‘‘రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 2 కోట్లమంది సోదరీమణులను లక్షాధికారులుగా రూపొందించాలని నేను లక్ష్య నిర్దేశం చేసుకున్నాను’’ అని ప్రకటించారు. అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ యోజన’తో గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందని చెప్పారు.

   చిన్న రైతులను సంఘటితం చేసే కార్యక్రమంలో భాగంగా రైతు ఉత్పత్తిదారు సంస్థలు (ఎఫ్‌పిఒ), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పిఎసిఎస్) పాత్రను ప్రధాని ప్రస్తావించారు. ఈ మేరకు ‘‘దేశంలో గ్రామీణ జీవితానికి చేయూతనిచ్చేలా బలమైన సహకార రంగం రూపొందటానికి మేం ప్రయత్నిస్తున్నాం. ఈ మేరకు ఇప్పటిదాకా పాలు, చెరకు వంటివాటిలో సహకార రంగంతో సత్ఫలితాలను మనం చూశాం. ఇప్పుడు దీన్ని వ్యవసాయ రంగంలోని ఇతర అంశాలకు.. చేపల ఉత్పత్తి వంటివాటికి విస్తరిస్తున్నాం. రాబోయే కాలంలో 2 లక్షల గ్రామాల్లో కొత్త ‘పిఎసిఎస్’ల సృష్టి లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాం’’ అని చెప్పారు. పాడి, ఉత్పత్తుల నిల్వ సంబంధిత సహకార రంగ  పరిష్కారాలను ప్రోత్సహించే ప్రతిపాదనల గురించి కూడా ఆయన వెల్లడించారు. ‘‘ఆహార తయారీ రంగంలో 2 లక్షలకుపైగా సూక్ష్మ పరిశ్రమల బలోపేతానికీ కృషి కొనసాగుతోంది’’ అని చెప్పారు.

   ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ పథకం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ- ‘స్థానికం కోసం నినాదం’ కార్యక్రమానికీ విస్తృత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. సంకల్పయాత్రలో భాగంగా ‘మోదీ హామీ వాహనం’ స్థానిక ఉత్పత్తుల గురించి ప్రజలకు వివరిస్తున్నదని, ఈ ఉత్పత్తులను ‘జిఇఎం’ పోర్టల్లో నమోదు చేయవచ్చునని తెలిపారు. ఈ నేపథ్యంలో మోదీ హామీ వాహనం తన విజయ యాత్రను కొనసాగించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

నేపథ్యం

   దేశవ్యాప్తంగా వికసిత భారతం సంకల్ప యాత్ర 2023 నవంబరు 15న ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి క్రమబద్ధంగా లబ్ధిదారులతో సంభాషిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ మూడు సార్లు (నవంబరు 30, డిసెంబరు 9, డిసెంబరు 16 తేదీల్లో) వారితో మమేకమయ్యారు. కాగా, ఇటీవల రెండు రోజులు (17, 18 తేదీల్లో) వారణాసిలో పర్యటించిన సందర్భంగా లబ్ధిదారులతో ఆయన ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. కాగా, లక్షిత లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనాలు అందేలా భరోసా ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాల అమలులో సంతృప్తత సాధనే ధ్యేయంగా దేశమంతటా వికసిత భారతం సంకల్ప యాత్ర  నిర్వహించబడుతోంది.

 

 

***

DS/AK


(Release ID: 1990970) Visitor Counter : 149