ప్రధాన మంత్రి కార్యాలయం

‘నా నేల... నా దేశం’ కార్యక్రమంలో భాగమైన ‘అమృత కలశ’ యాత్ర సమాపనోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి


దేశంలోని అన్నిప్రాంతాల మ‌ట్టితో అమృత వాటిక‌తోపాటు
అమృత మహోత్సవ స్మార‌కం నిర్మాణానికి శంకుస్థాప‌న‌;

దేశ యువత కోసం ‘నా యువ భార‌తం - నా భారత వేదిక‌’కు శ్రీకారం;

మూడు అగ్రశ్రేణి రాష్ట్ర/కేంద్ర పాలిత‌ ప్రాంతాలు- 1.జ‌మ్ముక‌శ్మీర్‌.. 2.గుజ‌రాత్‌.. 3.హ‌ర్యానా.. రాజ‌స్థాన్‌ల‌కు స్వాతంత్ర్య‌ అమృత మ‌హోత్స‌వ పుర‌స్కార ప్ర‌దానం;

మూడు అత్యుత్తమ మంత్రిత్వ శాఖ‌లు- 1.విదేశీ వ్య‌వ‌హారాలు.. 2.ర‌క్ష‌ణ‌.. 3.రైల్వే/
విద్యా శాఖ (సంయుక్తంగా)లకు స్వాతంత్ర్య‌ అమృత మ‌హోత్స‌వ పుర‌స్కార ప్ర‌దానం;

‘‘ఈ 21వ శతాబ్దంలో ‘నా భారతదేశం’ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది’’;

‘‘దేన్న‌యినా నిర్వ‌హించ‌డం.. ప్ర‌తి ల‌క్ష్యాన్నీ సాధించ‌డంలో యువత
అపార ప్ర‌తిభ‌కు ‘నా నేల‌.. నా దేశం‘ కార్య‌క్ర‌మ‌మే ప్రత్యక్ష నిదర్శనం’’;

‘‘ప్రపంచంలో అనేక గొప్ప నాగరకతలు నశించినా... భారత గడ్డపై నిత్య
చైతన్యం ప్రాచీన కాలం నుంచీ నేటిదాకా దేశాన్ని కాపాడుతూ వచ్చింది’’;

‘‘భారతదేశపు నేల ఆధ్యాత్మికతతో ఆత్మకు అనుబంధం సృష్టిస్తుంది’’;

‘‘భవిష్యత్తరానికి ‘ఒకే భారతం - విశిష్ట భారతం’ గురించి అమృత వాటిక ప్రబోధిస్తుంది’’;

‘‘చ‌రిత్

Posted On: 31 OCT 2023 7:14PM by PIB Hyderabad

‘నా నేల - నా దేశం’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ న్యూఢిల్లీలోని క‌ర్త‌వ్య ప‌థ్‌లో నిర్వహించిన అమృత కలశయాత్ర సమాపనోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇది స్వాతంత్ర్య అమృత మహోత్సవాల ముగింపు వేడుక కూడా కావడం విశేషం. ఈ సందర్భంగా అమృత వాటిక, అమృత మహోత్సవ స్మారకాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే దేశ యువతరం కోసం ‘‘నా యువ భారతం – నా భారత వేదిక’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

   ఈ సందర్భంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 3 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర/మంత్రిత్వ శాఖలు విభాగాలకు స్వాతంత్ర్య అమృత‌ మహోత్సవ పుర‌స్కారాల‌ను శ్రీ మోదీ ప్ర‌దానం చేశారు. ఈ మేర‌కు జమ్ముక‌శ్మీర్‌, గుజరాత్ తొలి రెండుస్థానాల్లో నిల‌వ‌గా హర్యానా, రాజస్థాన్‌లు సంయుక్తంగా మూడో స్థానం పొందాయి. అలాగే విదేశీ వ్య‌వ‌హారాల‌, ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌లు ఖ‌లుగా తొలి రెండుస్థానాల‌ను కైవ‌సం చేసుకోగా, విద్యా/రైల్వే మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి.

   అనంతరం కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- స‌ర్దార్ సాహెబ్ జ‌యంతి సంద‌ర్భంగా కర్తవ్య ప‌థంలో ఇవాళ మ‌హాయ‌జ్ఞం సాగుతున్నదని వ్యాఖ్యానించారు. ఆనాడు మహాత్మా గాంధీ నిర్వ‌హించిన దండి యాత్ర స్ఫూర్తితో 2021 మార్చి 12న‌ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని ఆయ‌న గుర్తుచేశారు. అప్పటినుంచీ సర్దార్ పటేల్ జయంతి అయిన 2023 అక్టోబర్ 31వ‌ర‌కూ కొన‌సాగిన ఈ వేడుక‌లు ఇవాళ్టితో ముగిశాయ‌ని ప్ర‌ధాని ప్రకటించారు. నాటి దండి యాత్ర‌లో ప్రతి భారతీయుడి భాగస్వామ్యాన్ని సాదృశం చేస్తూ అమృత మ‌హోత్స‌వం ప్రజా భాగస్వామ్యంలో కొత్త రికార్డు సృష్టించిందని ఆయ‌న వివ‌రించారు. ‘‘దండి యాత్ర స్వాతంత్ర్య ఆకాంక్షను మ‌ళ్లీ ర‌గిలించ‌గా, 75 ఏళ్ల భార‌త ప్ర‌గ‌తి ప్ర‌యాణం నేటి అమృత కాలంలో విక‌సిత భార‌త సంక‌ల్పంగా మారింది’’ అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. ఈ నేప‌థ్యంలో ‘నా నేల - నా దేశం’ కార్య‌క్ర‌మంతో రెండేళ్ల‌పాటు సాగిన అమృత‌ మహోత్సవాలు స‌మాప్త‌మ‌య్యాయ‌ని ఆయ‌న గుర్తుచేశారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని, భ‌విష్య‌త్త‌రాల‌కు నేటి చారిత్ర‌క కార్య‌క్ర‌మం గురించి తెలియ‌జేసేలా స్మార‌కం నిర్మాణానికి శంకుస్థాప‌న చేశామ‌ని పేర్కొన్నారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల‌తోపాటు కేంద్ర‌ మంత్రిత్వ శాఖలను కూడా ఆయన అభినందించారు.

   ఇప్పుడు మనం ఒక ఘనమైన వేడుకకు వీడ్కోలు పలుకుతూ, ‘‘నా భారతదేశం పేరిట సరికొత్త సంకల్పం స్వీకరిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం ప్రస్తుత 21వ శతాబ్దపు జాతి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. దేశ యువ‌త స‌మ‌ష్టి శక్తిని ప్ర‌స్తావిస్తూ ‘‘దేన్న‌యినా నిర్వ‌హించగల సామర్థ్యం, ప్ర‌తి ల‌క్ష్యాన్నీ సాధించ‌గల యువతరం ప్ర‌తిభ‌కు ‘నా నేల‌.. నా దేశం‘ కార్య‌క్ర‌మ‌మే ప్రత్యక్ష నిదర్శనం’’ అని ప్రధాని ఉద్ఘాటించారు. దేశం నలుమూలల నుంచి 8,500 అమృత కలశాలు కర్తవ్య పథానికి చేరాయని, కోట్లాది భారతీయుల ‘పంచప్రాణ‘ ప్రతిన చేస్తూ సెల్ఫీలను కార్యక్రమం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారని శ్రీ మోదీ తెలిపారు.

   స్వాతంత్ర్య అమృత మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో మట్టిని వినియోగించడంపై ప్రధానమంత్రి ఓ ప్రసిద్ధ కవి వాక్కును ఉదాహరిస్తూ- ‘‘ఇది ఎన్నో నాగరకతలు వర్ధిల్లిన నేల.. మానవులు పురోగమించిన గడ్డ. యుగయుగాల జాడలు ఈ మట్టిలో కనిపిస్తాయి’’ అన్నారు. అలాగే

‘‘భారత గడ్డ నిత్య చైతన్యశీలం.. ప్రాచీన కాలం నుంచీ నాగరకత పతనాన్ని నిరోధిస్తూ నేటిదాకా కాపాడుకుంటూ వచ్చిన జీవశక్తి ఇదే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విధంగా భారత్ కాలపరీక్షకు తట్టుకుని నిలవగా, ప్రపంచంలోని ఎన్నో నారగకతలు నశించాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. భారత్ ధైర్యసాహసాలకు అనేక ఉదాహరణలు ఉన్నాయంటూ అందులో షహీద్ భగత్ సింగ్ పాత్రను ప్రధాని ప్రస్తావించారు. ఆ మేరకు ‘‘భారతదేశపు నేల ఆధ్యాత్మికతతో ఆత్మకు అనుబంధం సృష్టిస్తుంది’’ అని వివరించారు. ప్రతి పౌరుడూ మాతృభూమితో ఎంత మమేకమయ్యాడో వివరిస్తూ- ‘‘భరతమాత రుణం తీర్చుకోవడం కాకుండా ఈ జీవితానికి పరమార్థం ఇంకేముంటుంది?’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి చేరిన వేలాది ‘అమృత కలశ’ మట్టి ప్రతి ఒక్కరికీ కర్తవ్యం లేదా బాధ్యతను గుర్తుచేస్తూ- వికసిత భారతం సంకల్ప సాధనకు స్ఫూర్తినిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలని కోరారు.

   దేశం నలుమూలల నుంచి వచ్చే మొక్కలతో ఏర్పాటు చేయనున్న అమృత వాటిక భవిష్యత్తరానికి  ‘ఒకే భారతం - శ్రేష్ఠ భారతం’ గురించి వివరిస్తుందని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల మట్టితో 75 మంది మహిళా కళాకారులు రూపొందించిన కొత్త పార్లమెంటు భవనంలోని ‘జనం, జనని, జన్మభూమి’ కళాఖండాల గురించి ఆయన శ్రోతలకు వివరించారు. దాదాపు 1000 రోజులు కొనసాగిన స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు (ఆకం) దేశంలోని యువతరపై అత్యంత సానుకూల ప్రభావం చూపాయని ప్రధాని అన్నారు. నేటి తరం దాస్యవేదన అనుభవించలేదంటూ ఇటువంటి స్వేచ్ఛా భారతంలో జన్మించిన తొలి ప్రధానమంత్రిని తానేనని పేర్కొన్నారు. పరాయి పాలనలో స్వాతంత్య్రం కోసం ఉద్యమించని క్షణమంటూ ఒక్కటి కూడా లేదని, అలాగే ఈ ఉద్యమాలకు అతీతమైన వర్గం/ప్రాంతం అంటూ ఏదీలేదని ఈ మహోత్సవం గుర్తుచేసిందని తెలిపారు. ఈ మేరకు ‘‘చ‌రిత్ర పుట‌ల్లో కనుమరుగైన అనేక ఘ‌ట్టాల‌ను అమృత మహోత్సవం ఒక విధంగా భవిష్యత్త‌రాల‌తో జోడించింది’’ అన్నారు. అమృత మహోత్సవాలను భారతీయులు ఓ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దారని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘ఇంటింటా త్రివర్ణం’ కార్యక్రమం ప్రతి భారతీయుడి విజయమన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో తమవంతు పాత్ర పోషించిన కుటుంబాలు, గ్రామాల గురించి ప్రజలకు అవగాహన కలిగిందని, జిల్లాలవారీగా స్వాతంత్య్ర సమరయోధుల సమాచార నిధి రూపొందించామని తెలిపారు.

   అమృత మహోత్సవాల సమయంలో దేశం సాధించిన విజయాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 5వ స్థానానికి దూసుకెళ్లడం, చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా దిగడం, జి-20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడం, ఆసియా క్రీడలు-పారా గేమ్స్‌లో భారత్ 100కుపైగా పతకాలతో రికార్డు సృష్టించడం తదితరాలను గుర్తుచేశారు. అదేవిధంగా సరికొత్త పార్లమెంటు సౌధం ప్రారంభోత్సవం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం, ఎగుమతులు-వ్యవసాయ ఉత్పాదనలో కొత్త రికార్డు సృష్టి, వందేభారత్ రైలు నెట్‌వర్క్ విస్తరణ, అమృత భారతం రైల్వేస్టేషన్ల కార్యక్రమానికి శ్రీకారం, దేశంలో తొలి ప్రాంతీయ ర్యాపిడ్ రైలు ‘నమో భారత్’ ప్రారంభం, దేశవ్యాప్తంగా 65,000కుపైగా అమృత సరోవరాల నిర్మాణం, ‘మేడ్ ఇన్ ఇండియా 5జి’ ప్రారంభం-విస్తరణ, అనుసంధానం మెరుగు దిశగా ‘పిం గతిశక్తి’ బృహత్ ప్రణాళికను ప్రారంభించడం వంటివాటిని కూడా ఆయన వివరించారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- ‘‘స్వాతంత్ర్య‌ అమృత మ‌హోత్స‌వాల వేళ దేశం రాజ్‌పథ్ నుంచి కర్తవ పథంవైపు పయనించింది. ఇందులో భాగంగా అనేక బానిసత్వ కాలపు చిహ్నాలను కూడా తొలగించాం’’ అని పేర్కొన్నారు. ఇండియా గేట్ వద్దగల నేతాజీ సుభాష్ బోస్ విగ్రహం ప్రతిష్టాపన, నావికాదళానికి కొత్త పతాకం, అండమాన్-నికోబార్ దీవులకు స్ఫూర్తిదాయక నామకరణం, గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం ప్రకటన, ‘సాహిబ్‌జాదాల’ స్మారకంగా వీరబాలల దినోత్సవం, ఏటా ఆగస్టు 14న విభజన విషాద దినం నిర్వహణపై నిర్ణయం వగైరాలను ఆయన ప్రస్తావించారు.

   ప్రధానమంత్రి ఒక సంస్కృత శ్లోకాన్ని ఉదాహరిస్తూ- ‘‘ఏదైనా ముగింపు సదా నవ్యారంభానికి సూచిక’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు అమృత మహోత్సవాల ముగింపు సందర్భంగా ‘నా భారతదేశం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘‘నా భారతదేశం అనే నినాదం దేశంలోని యువశక్తికి సంకేతం’’ అన్నారు. దేశంలోని ప్రతి యువకుడినీ ఒకే వేదికపైకి తేవడంతోపాటు దేశ నిర్మాణంలో మరింత భాగస్వామ్యం కల్పించడంలో ఇదొక గొప్ప మాధ్యమం కాగలదని ఆయన నొక్కిచెప్పారు. ఈ దిశగా ‘మై భారత్‘ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ- యువత కోసం నిర్వహించే పలు కార్యక్రమాలను ఈ వేదికలో పొందుపరుస్తామని తెలిపారు. దీనితో వీలైనంతగా మమేకమవుతూ భారతదేశంలో సరికొత్త శక్తితో నింపుతూ, జాతిని ముందుకు నడిపించాలని యువతరానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

   చివరగా- భారత స్వాతంత్ర్యం ప్రతి పౌరుడి కనీస ఆకాంక్షను నెరవేర్చిందని, ఇప్పుడు ఐక్యంగా ఉంటూ దాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా తీర్చిదిద్దే  సంకల్పాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్వాతంత్య్రం శతాబ్ది (100 సంవత్సరాలు) నాటికి  ఈ ప్రత్యేక దినాన్ని దేశం గుర్తు చేసుకుంటుందన్నారు. ‘‘మన ఈ సంకల్పం భవిష్యత్తరానికి మనం చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి’’ అని ప్రధాని కోరారు. ‘‘మన దేశం వికసిత భారతంగా ప్రకాశించాలనే లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడూ తమవంతు పాత్ర పోషించడం కీలకం. రండి.. అమృత మహోత్సవం ద్వారా అమృత కాలంలో వికసిత భారతంవైపు కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడదాం’’ అని పిలుపినిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సమాచారప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం... ‘నా నేల - నా దేశం’

   దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వీరులు, వీరనారులకు ‘నా నేల-నా దేశం’ కార్యక్రమం ఒక నివాళి. దీనికింద ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో దేశంలోని ప్రతి పంచాయతీ/గ్రామం, సమితి, పట్టణ స్థానిక సంస్థ, రాష్ట్ర/జాతీయ స్థాయిలలో అనేక కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించారు.. అసమాన త్యాగధనులైన ఈ సాహసులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతా సూచకంగా శిలాఫలకం (స్మారక చిహ్నం) నిర్మించడం వంటి కార్యకలాపాలు కూడా చేపట్టారు. ఈ శిలాఫలకం వద్ద ప్రజలు ‘పంచప్రాణ’ ప్రతిజ్ఞ; స్వదేశీ జాతుల మొక్కలు నాటడం, ‘అమృత వాటిక’ (వసుధకు వందనం) ఏర్పాటు, స్వాతంత్ర్య యోధులకు సత్కారం, అమరుల (వీరులకు వందనం) కుటుంబాలను గౌరవించడం వంటివి చేపట్టారు.

   దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 2.3 లక్షల శిలాఫలకాల నిర్మాణం ద్వారా  కార్యక్రమం భారీ విజయం సాధించింది; అలాగే దాదాపు 4 కోట్ల పంచప్రాణ ప్రతిజ్ఞ సెల్ఫీలు అప్‌లోడ్ చేయబడ్డాయి; అలాగే 2 లక్షలకు పైగా ‘వీరులకు వందనం’ కార్యక్రమాలు; 2.36 కోట్లకుపైగా దేశీయ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడ్డాయి. అలాగే దేశవ్యాప్తంగా ‘వసుధకు వందనం’ ఇతివృత్తం కింద 2.63 లక్షల అమృత వాటికలను రూపొందించారు. ‘నా నేల - నాదేశం’ కార్యక్రమంలో

అమృత కలశ యాత్ర కూడా ఒక భాగం. ఉంది. దీనికింద 6 లక్షలకుపైగా గ్రామాల్లో/పట్టణాల్లో వార్డుల స్థాయి నుంచి మట్టి, వరి ధాన్యం సేకరించారు. వీటిని సమితి/డివిజన్ స్థాయికి పంపి (ఇందులో అన్ని గ్రామాలు, పట్టణాల మట్టి మిశ్రమం ఉంటుంది) అటుపైన రాష్ట్ర రాజధానికి పంపుతారు. ఈ మిశ్రమంతో రాష్ట్రస్థాయి నుంచి వేలాది అమృత కలశాలతో యాత్రికులు దేశ రాజధానికి చేరుతారు. తదనుగుణంగా ‘ఒకే భారతం - శ్రేష్ట భారతం’ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల నుంచి యాత్రికులు తెచ్చిన మట్టిని, నిన్న దేశ రాజధానిలో భారీ ‘అమృత కలశం’లో ఉంచారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమృత వాటిక, అమృత మహోత్సవ స్మారకాల నిర్మాణంలో దేశం నలుమూలల నుంచి సేకరించిన ఈ మట్టిని వినియోగిస్తారు.

   స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సమాపన కార్యక్రమంగా ‘నా నేల-నా దేశం’ నిర్వహించబడింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 2021 మార్చి 12న ఈ మహోత్సవం ప్రారంభించబడింది. నాటినుంచీ ప్రజల ఉత్సాహపూరిత భాగస్వామ్యంతో దేశమంతటా సాగిన ఈ వేడుకల కింద 2 లక్షలకుపైగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

 ‘మై భారత్’

   దేశ యువతరం కోసం ఏకైక సంపూర్ణ ప్రభుత్వ సేవల వేదికగా ‘నా యువ భారతం – నా భారతం’ పేరిట ఒక స్వయంప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటు చేయబడుతోంది. దేశంలోని ప్రతి యువకునికీ సమాన అవకాశాల కల్పనపై ప్రధాని దూరదృష్టికి అనుగుణంగా మొత్తం ప్రభుత్వ వ్యవస్థలోని ఒక సాధికార యంత్రాంగాన్ని అందించడంలో ఈ ‘మై భారత్’ వేదిక ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటుంది. తద్వారా వారు తమ ఆకాంక్షలను సాకారం చేసుకుంటూ వికసిత భారతం సంకల్ప సిద్ధికి తమవంతు సహకారం అందించగలరు. యువతను సామాజిక మార్పునకు ప్రతినిధులుగా, దేశ నిర్మాతలుగా రూపొందించడం, ప్రభుత్వం-పౌరుల మధ్య ‘యువ వారధి’ వ్యవహరించేలా చేయడమే ‘మై భారత్’ లక్ష్యం. ఈ మేరకు ‘యువతరం చోదిత ప్రగతి’కి ‘మై భారత్’ ప్రధానంగా ఊపునిస్తుంది.

*****

DS/TS



(Release ID: 1973624) Visitor Counter : 165