కేంద్ర మంత్రివర్గ సచివాలయం
azadi ka amrit mahotsav

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బైపార్జోయ్’ తుఫానును ఎదుర్కోవడానికి జరిగిన సంసిద్ధత ఏర్పాట్లు సమీక్షించిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్ సీఎంసీ)

Posted On: 12 JUN 2023 5:07PM by PIB Hyderabad

కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన ఈరోజు సమావేశం అయిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్ సీఎంసీ)   అరేబియా సముద్రంలో ఏర్పడిన  ‘బిపార్జోయ్’ తుఫానును ఎదుర్కోవడానికి జరిగిన సంసిద్ధత ఏర్పాట్లను సమీక్షించింది.  గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర మంత్రిత్వ శాఖలు/ఏజెన్సీల సంసిద్ధత ఏర్పాట్లను కమిటీ సమీక్షించింది.

 తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన అత్యంత తీవ్రమైన తుఫాను 'బిపార్జోయ్' ప్రస్తుత స్థితి గురించి కమిటీకి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ (ఐఎండీ) వివరించారు. ఇది 14వ తేదీ ఉదయం వరకు  ఉత్తరం వైపు కదులుతుంది. , ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ సౌరాష్ట్ర, కచ్ ఆనుకుని ఉన్న పాకిస్తాన్ తీరాలను మాండ్వి (గుజరాత్), కరాచీ (పాకిస్తాన్) మధ్య జాఖౌ పోర్ట్ (గుజరాత్) సమీపంలోని జూన్ 15 మధ్యాహ్నానికి తీరాన్ని దాటే అవకాశం ఉంది. అత్యంత తీవ్ర తుపానుగా  'బిపార్జోయ్'తీరాన్ని దాటే సమయంలో గంటకు  125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు.

తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను రక్షించడానికి స్థానిక పరిపాలన యంత్రాంగం  తీసుకుంటున్నచర్యలను కమిటీకి  గుజరాత్ ప్రధాన కార్యదర్శి వివరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించామని, సముద్రంలో ఉన్న వారిని వెనక్కి రావాలని ఆదేశిస్తూ సూచనలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 21,000 పడవలను తీరంలో నిలిపివేశారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేశారు. ప్రజలను తరలించడానికి సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. తగిన షెల్టర్లు, విద్యుత్ సరఫరా, మందులు, అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 10 బృందాలను మోహరిస్తున్నారు.

 

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్‌ఎఫ్‌ ) ఇప్పటికే 12 బృందాలనుపంపింది. మరో  3 అదనపు బృందాలను గుజరాత్‌లో సిద్ధంగా ఉంచారు. అవసరమైతే తుపాను ప్రభావిత ప్రాంతాలకు తరలించడానికి అదనంగా 15 బృందాలను సిద్ధం చేశారు. ,అరకోణం (తమిళనాడు), ముండ్లి (ఒడిశా), బటిండా (పంజాబ్) వద్ద సిద్ధంగా ఉన్న బృందాలను స్వల్ప నోటీసులో విమానాల ద్వారా ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తారు. . కోస్ట్ గార్డ్, ఆర్మీ నేవీ కి చెందిన సహాయ బృందాలను సిద్ధం చేశారు.   ఓడలు, విమానాలను కూడా సిద్ధంగా ఉంచారు.

పరిస్థితిని ఎదుర్కోవడానికి గుజరాత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించడానికి

 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ సిబ్బందిని రంగంలోకి దించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బృందాలు సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడతాయి.   మారిటైమ్ బోర్డు ద్వారా డీజీ షిప్పింగ్   హెచ్చరికలు, సలహాలు జారీ చేస్తున్నారు. ఆఫ్‌షోర్ చమురు క్షేత్రాల పరిస్థితిని  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. గుజరాత్‌లోని ఆఫ్‌షోర్ కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందిని  తక్షణమే వెనక్కి రప్పించడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. . ప్రధాన ఓడరేవులు కాండ్లా,ముంద్రాలను అప్రమత్తం చేశారు.  నివారణ చర్యలు అమలు చేయాలని  ఇతర ఓడరేవులకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.

 సంసిద్ధత చర్యలు సమీక్షించిన  శ్రీ రాజీవ్ గౌబా కేంద్ర సంస్థలు,గుజరాత్ ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి సహాయ, పునరావాస కార్యక్రమాలు అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా, సాధ్యమైనంత తక్కువగా ఆస్తి నష్టం ఉండేలా చూసేందుకు చర్యలు అమలు కావాలన్నారు. విద్యుత్,టెలికాం వంటి మౌలిక సదుపాయాలకు నష్టం జరగకుండా చూడాలని, ఒకవేళ  నష్టం జరిగితే, సాధ్యమైనంత తక్కువ సమయంలో సౌకర్యాలు  పునరుద్ధరించాలని అన్నారు. 

సముద్రంలో ఉన్న మత్స్యకారులను వెనక్కి పిలిపించాలని, తుఫాను తీరం దాటే లోపు ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సకాలంలో తరలించేలా చూడాలని శ్రీ రాజీవ్ గౌబా  అన్నారు. అన్ని కేంద్ర సంస్థలు  సిద్ధంగా ఉన్నాయని, సహాయానికి అందుబాటులో ఉంటాయని  గుజరాత్ ప్రభుత్వానికి ఆయన హామీ ఇచ్చారు.

ఈ సమావేశానికి గుజరాత్ చీఫ్ సెక్రటరీ, కేంద్ర హోం కార్యదర్శి, రైల్వే బోర్డు ఛైర్మన్ సీఈఓ , పౌర విమానయాన, విద్యుత్, ఓడరేవులు, నౌకా రవాణా,జలమార్గాల మంత్రిత్వ శాఖ, మత్స్యశాఖ, టెలికాం డీజీ , ఎన్డి ఎంసీ సభ్య కార్యదర్శి , వాతావరణ శాఖ, ఎన్డిఆర్‌ఎఫ్‌ డీజీ, కోస్ట్ గార్డ్ డీజీ   హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు సమావేశానికి  హాజరయ్యారు.

***

 


(Release ID: 1931893) Visitor Counter : 174