ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి రెండు వందే భారత్ రైళ్ళను జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగపు తెలుగు అనువాదం

Posted On: 10 FEB 2023 6:04PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

రైల్వే  రంగంలో ఒక చారిత్రాత్మక విప్లవం చోటుచేసుకుంటోంది.  ఈరోజు తొమ్మిదో, పదో  వందే భారత్ రైళ్ళను జాతికి అంకితం చేయటం ఎంతో ఆనందంగా ఉంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర గారు, నా మంత్రివర్గ సహచరులు, మహారాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, సోదరసోదరీమణులారా!

భారతీయ రైల్వేలకు ఈరోజు ఒక సుదినం. మరీ ముఖ్యంగా ముంబయ్ కి, మహారాష్ట్రకు  ఆధునిక  అనుసంధానత జరగటం. ఈరోజు మొట్ట మొదటిసారిగా ఒకేసారి రెండు వందే భారత్ రైళ్ళు ప్రారంభమయ్యాయి.  ఈ రెండు వందే భారత్ రైళ్ళు దేశంలోని రెండు ప్రముఖ ఆర్థిక కేంద్రాలైన ముంబయ్ ని, పూణేని కలపటంతోబాటు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా కలుపుతున్నాయి. వీటివలన కాలేజీలకు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, వ్యాపార పనుల మీద వెళ్ళేవాళ్ళు, రైతులు, భక్తులు కూడా లబ్ధిపొందుతారు.

ఈ రైళ్ళు  మహారాష్ట్రలో పర్యాటక రంగానికి, తీర్థయాత్రికులకు ఎంతో ఉపయోగపడతాయి. షిర్డీ సాయిబాబా దర్శనానికి కావచ్చు, నాసిక్ లో రామ్ కుండ్, త్రయంబకేశ్వర్, పంచవటి వెళ్ళేవారికి కావచ్చు.. కొత్త వందే భారత్ రైలు వలన ప్రయాణం చాలా సులువవుతుంది. 

అదే విధంగా ముంబై- సోలాపూర్ వందే భారత్ రైలు వలన పండరిపురం విఠలేశ్వరుడి దర్శనం సోలాపూర్ సిద్దేశ్వరుడి దర్శనం,  అక్కలకోట స్వామి సమర్థ దర్శనం, తుల్జా భవానీ దర్శనం ఇప్పుడు చాలా సులువవుతాయి. పైగా, సహ్యాద్రి పర్వతశ్రేణి గుండా వందే భారత్ రైల్లో  ప్రయాణిస్తూ ఆస్వాదించే అనుభూతి వర్ణనాతీతం! ఈ రెండు వందే భారత్ రైళ్ళ సేవలు అందుకోబోతున్న ముంబయ్, మహారాష్ట్ర ప్రజలకు నా అభినందనలు ! 

మిత్రులారా,

వందే భారత్ రైళ్ళు ఈనాటి ఆధునిక భారతదేశపు ప్రతిష్ఠకు  చిహ్నం. భారతదేశపు వేగానికి, భారీ తయారీకి ప్రతిరూపం.  దేశం ఎంత వేగంగా వందే భారత్ రైళ్ళను ప్రారంభిస్తున్నదో  మీరు చూడవచ్చు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 10 రైళ్లు నడుస్తున్నాయి. ఈరోజు దేశంలో 17 రాష్ట్రాలలో 108 జిల్లాల్లో ఈ  రైళ్ళు సేవలందిస్తున్నాయి.    ఎంపీలు తమ తమ ప్రాంతాలలోని స్టేషన్లలో ఒకటి లేదా రెండి నిమిషాలపాటు రైళ్లు ఆపాలని విజ్ఞప్తి చేయటం నాకు బాగా గుర్తు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలు ఎప్పుడు కలిసినా వాళ్ళు తమ ప్రాంతాలకూ ఈ వందే భారత్  రైలు కావాలని అడుగుతున్నారు. అదే వందే భారత్ కు ఈనాడు ఉన్న క్రేజ్.

మిత్రులారా,

ఈ రోజు ముంబయ్ ప్రజల జీవితాలు సుఖమయం అయ్యే ప్రాజెక్టులు కూడా ఇక్కడ మొదలవటం సంతోషంగా ఉంది. ముంబై తూర్పు-పడమర ప్రాంతాలను కలిపే ఎలివేటెడ్ కారిడార్ ఈ రోజు ప్రారంభమైంది. ముంబయ్ ప్రజలు దీనికోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. రోజూ 2 లక్షలకు పైగా వాహనాలు ఈ కారిడార్ గుండా ప్రయాణిస్తాయి. ఇప్పుడు ప్రజల సమయం బాగా ఆదా అవుతుంది.

అదే విధంగా ఇప్పుడు తూర్పు, పడమర సబర్బన్ ప్రాంతాల అనుసంధానత కూడా మెరుగైంది. కురార్ అండర్ పాస్ కూడా ఎంతో ముఖ్యం. ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన సందర్భంగా ముంబయ్ వాసులకు నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

21 వ శతాబ్దపు భారతదేశం తన ప్రజా రవాణా వ్యవస్థను వేగంగా మెరుగుపరచుకోవాల్సి ఉంది. మన ప్రజారవాణా వ్యవస్థ ఎంత వేగంగా ఆధునీకరించబడితే దేశ ప్రజల జీవనం, జీవన నాణ్యతా అంతా వేగంగా మెరుగుపడతాయి. ఈ ఆలోచనతో దేశంలో ఈనాడు ఆధునిక రైళ్ళు నడుపుతున్నాం, మెట్రో విస్తరిస్తున్నాం, కొత్త విమానాశ్రయాలు,  నౌకాశ్రయాలు నిర్మిస్తున్నాం.  ఇదే స్ఫూర్తిని ఇటీవలి బడ్జెట్ లోనూ నింపాం. దాన్ని మన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కూడా ఎంతగానో ప్రశంసించారు.

భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికే రూ.10 లక్షల కోట్లు కేటాయించాం. గత 9 ఏళ్ళనాటితో పోల్చితే ఇది 5 రెట్లు ఎక్కువ. ఇందులో రైల్వేల వాటా 2.5 లక్షల కోట్లు. మహారాష్ట్రకు రైల్వే కేటాయింపుల పెంపు కూడా చరిత్రాత్మకం. డబుల్ ఇంజన్ ప్రభుత్వపు రెట్టింపు కృషి వల్ల మహారాష్ట్రలో అనుసంధానత మరింత వేగంగా, ఆధునికంగా తయారవుతుందని విశ్వసిస్తున్నా.

మిత్రులారా,

మౌలిక వసతుల కల్పనకు వెచ్చించే ప్రతి రూపాయికీ కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి. నిర్మాణంలో వాడే సిమెంట్, ఇసుక, ఇనుము, యంత్రాలు, ఈ రంగాలకు చెందిన ప్రతి పరిశ్రమకూ ప్రోత్సాహం లభిస్తుంది.  వ్యాపారాల్లో ఉండే మధ్యవర్తులు కూడా లబ్ధిపొందుతారు. పేదలకు ఉపాధి దొరుకుతుంది. దీనివల్ల ఇంజనీర్లు మొదలు కార్మికుల దాకా అందరికీ ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయి. మౌలిక సదుపాయాల నిర్మాణం జరుగుతున్నప్పుడే అందరికీ  ఆదాయం లభిస్తుంది. పూర్తయ్యాక కొత్త పరిశ్రమలకు, కొత్త వ్యాపారాలకు మార్గం సుగమమవుతుంది.  

సోదర సోదరీమణులారా ,

ముఖ్యంగా ఈ బడ్జెట్ లో మధ్య తరగతి ఎంతగా బలపాడిందన్నదే ముంబయ్ ప్రజలకు నేను చెప్పదలచుకున్నది. జీతం అందుకునేవారు కావచ్చు, వ్యాపార లాభాలు అందుకునే మధ్యతరగతి వారు కావచ్చు ఈ బడ్జెట్ వాళ్ళిద్దరినీ సంతృప్తి పరచింది.. 2014 కు ముందు పరిస్థితి ఒకసారి చూడండి. ఏడాదికి 2 లక్షలు సంపాదించేవాడి మీద పన్ను వేశారు. బీజేఏపీ ప్రభుత్వం ఇంతకు ముందు 5 లక్షల వరకు మినహాయింపు ఇవ్వగా ఇప్పుడు 7 లక్షలకు పెంచింది.

ఈరోజు యూపీఏ ప్రభుత్వం ఆదాయం మీద 20 శాతం పన్ను విధిస్తోంది. దాన్ని మించి మధ్యతరగతివారు చెల్లించాల్సింది శూన్యం. నెలకు రూ. 60-65 వేలతో కొత్తగా ఉద్యోగం వచ్చిన యువత ఇప్పుడు మరింత పొదుపు చేసుకోగలుగుతుంది. పేద, మధ్య తరగతి ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వం మాత్రమే అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది.

మిత్రులారా,

సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ స్ఫూర్తిని సాధికారం చేసే ఈ బడ్జెట్ ప్రతి కుటుంబానికీ చేయూతనిస్తుందని నాకు పూర్తి విశ్వాసముంది.  అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించటానికి అది మనల్ని ప్రోత్సహిస్తుంది. బడ్జెట్ విషయంలోనూ, కొత్త రైళ్ళ విషయంలోనూ ముంబయ్ సహా యావత్ మహారాష్ట్రకు మరోమారు నా హృదయ పూర్వక అభినందనలు.   అందరికీ ధన్యవాదాలు!

గమనిక : ఇది ప్రధాని ప్రసంగానికి దగ్గరి అనువాదం. అసలు ప్రసంగం హిందీలో సాగింది.

                                                              

***

 


(Release ID: 1904308) Visitor Counter : 135