ప్రధాన మంత్రి కార్యాలయం

ఈజిప్ట్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం

Posted On: 25 JAN 2023 4:21PM by PIB Hyderabad

గౌరవనీయులైన అధ్యక్షుడు సిసి గారూ,..

ఇరు దేశాలకు చెందిన మంత్రులు, ప్రతినిధులారా ..

మీడియా మిత్రులారా,

ముందుగా అధ్యక్షుడు సిసికి, ఆయన ప్రతినిధి బృందానికి భారతదేశానికి సాదర స్వాగతం పలుకుతున్నాను. అధ్యక్షుడు సిసి రేపు మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. యావత్ భారతావనికి ఇది గర్వకారణం, సంతోషకరమైన విషయం. ఈజిప్టుకు చెందిన సైనిక బృందం కూడా మన రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొని దానికి మరింత వైభవం తీసుకు రానుండడం సంతోషంగా ఉంది.

మిత్రులారా..

భారత్- ఈజిప్టు ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి. వేల సంవత్సరాలుగా మన మధ్య అనుబంధం కొనసాగుతోంది. నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈజిప్టుతో వాణిజ్యం గుజరాత్ లోని లోథాల్ ఓడరేవు ద్వారా జరిగేది. ప్రపంచంలో అనేక మార్పులు వచ్చినప్పటికీ, మన సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. మన సహకారం నిరంతరం బలపడింది.

గత కొన్నేళ్లుగా మన సహకారం మరింత పెరిగింది. దీనికి, నా స్నేహితుడు అధ్యక్షుడు సిసి సమర్థవంతమైన నాయకత్వానికి నేను పెద్ద క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను.

ఈ ఏడాది జీ-20 అధ్యక్ష హోదా సమయంలో ఈజిప్టును భారత్ అతిథి దేశంగా ఆహ్వానించడం మన ప్రత్యేక స్నేహానికి అద్దం పడుతోంది.

మిత్రులారా,

అరేబియా సముద్రానికి ఒకవైపు భారత్, మరోవైపు ఈజిప్టు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం మొత్తం ప్రాంతంలో శాంతి ,శ్రేయస్సును పెంపొందించడానికి సహాయపడుతుంది.

కాబట్టి నేటి సమావేశంలో, అధ్యక్షుడు సిసి ,నేను మన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని "వ్యూహాత్మక భాగస్వామ్యం" స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నాము.

భారత్-ఈజిప్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద రాజకీయ, భద్రత, ఆర్థిక, వైజ్ఞానిక రంగాల్లో మరింత సహకారం కోసం దీర్ఘకాలిక ఫ్రేమ్ వర్క్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదం పై భారత్, ఈజిప్టులు ఆందోళన చెందుతున్నాయి. ఉగ్రవాదం మానవాళికి అత్యంత తీవ్రమైన భద్రతా ముప్పు అని మేము ఏకాభిప్రాయంతో ఉన్నాము. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి సమిష్టి కార్యాచరణ అవసరమని ఇరు దేశాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఇందుకోసం ఇద్దరం కలిసి అంతర్జాతీయ సమాజాన్ని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తాం.

మన మధ్య భద్రత, రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు అపారమైన అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా మన సైన్యాల మధ్య ఉమ్మడి విన్యాసాల శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించడం గణనీయంగా పెరిగింది.మన రక్షణ పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, ఉగ్రవాద నిరోధానికి సంబంధించిన సమాచారం, ఇంటెలిజెన్స్ మార్పిడిని పెంచాలని నేటి సమావేశంలో నిర్ణయించాం.

తీవ్రవాద భావజాలాన్ని, తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి సైబర్ స్పేస్ ను దుర్వినియోగం చేయడం పెరుగుతున్న ముప్పు. దీనికి వ్యతిరేకంగా కూడా సహకారాన్ని విస్తరిస్తాం.

మిత్రులారా

కోవిడ్ మహమ్మారి సమయంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు,ప్రపంచ సరఫరా గొలుసులపై ప్రతికూల ప్రభావాలను మేము నిశితంగా పరిశీలించాము. ఈ సవాలు సమయంలో అధ్యక్షుడు సిసి ,నేను సన్నిహితంగా పరిస్థితి పై దృష్టి పెట్టాం. రెండు దేశాలు అవసరమైన సమయాల్లో ఒకరికొకరు తక్షణ సహాయాన్ని పంపుకున్నాయి.

కోవిడ్, ఉక్రెయిన్ ఘర్షణతో ప్రభావితమైన ఆహార, ఫార్మా సరఫరా గొలుసులను బలోపేతం చేయడంపై ఈ రోజు మేము విస్తృతమైన చర్చలు జరిపాము.ఈ రంగాల్లో పరస్పర పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని కూడా అంగీకరించాం. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 12 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ఇద్దరం కలిసి

నిర్ణయించాం.

మిత్రులారా

కాప్-27కు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చినందుకు, వాతావరణ రంగంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం ఈజిప్టు చేస్తున్న ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాము.

ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ వేదికలపై భారత్, ఈజిప్టుల మధ్య సుదీర్ఘమైన, అద్భుతమైన సహకారం ఉంది. అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి దౌత్యం, చర్చల ఆవశ్యకత పై మేమిద్దరం అంగీకారానికి వచ్చాం.

గౌరవనీయా..

భారతదేశానికి వచ్చిన మీకు, మీ ప్రతినిధి బృందానికి మరోసారి సాదర స్వాగతం పలుకుతున్నాను. మీకు, ఈజిప్టు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

చాలా ధన్యవాదాలు!

డిస్ క్లెయిమర్ - ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి సుమారు అనువాదం. అసలు ప్రకటన హిందీలో చేశారు.

 

***



(Release ID: 1893800) Visitor Counter : 292