ప్రధాన మంత్రి కార్యాలయం

‘ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం’ విజేతలకు ప్రధాని ప్రశంసలు

Posted On: 24 JAN 2023 8:33PM by PIB Hyderabad

ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం విజేతలను ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు. “ఆవిష్కరణ, సామాజిక సేవ, పాండిత్యం, క్రీడలు, కళలు, సంస్కృతి, సాహసం” సంబంధిత విభాగాల్లో విశిష్ట విజయాలు సాధించిన బాలలకు కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌” ((పీఎంఆర్‌బీపీ) ప్రదానం చేస్తుంది. ఈ మేరకు ‘పీఎంఆర్‌బీపీ-2023’కుగాను బాలశక్తి పురస్కార్‌లోని వివిధ కేటగిరీల కింద దేశంలోని 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 11 మంది బాలలు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురు బాలురు కాగా, ఐదుగురు బాలికలున్నారు.

విజేతలను ప్రశంసిస్తూ వరుస ట్వీట్ల ద్వారా ప్రధాని ఇలా సందేశమిచ్చారు:

“ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కార విజేతలతో నా సంభాషణ అద్భుతంగా సాగింది.”

“ఆదిత్య సురేష్‌ చూపిన మొక్కవోని మనోస్థైర్యం చూసి నేనెంతో గర్విస్తున్నాను. శల్య రుగ్మతతో బాధపడుతున్న అతడు ఎంతమాత్రం కుంగిపోలేదు. తనకిష్టమైన సంగీత రంగాన్ని ఎంచుకుని ఇప్పుడు ప్రతిభావంతుడైన గాయకుడుగా ఎదిగాడు. ఇప్పటికే 500కుపైగా సంగీత ప్రదర్శనలు కూడా ఇచ్చి తానేమిటో నిరూపించుకున్నాడు.”

“ఎం.గౌరవిరెడ్డి అద్భుత నర్తకి. భారతీయ సంస్కృతికి ఎంతో గౌరవమిచ్చే ఆమె వివిధ కార్యక్రమాలలో నాట్య ప్రదర్శనలిస్తూ రాణిస్తోంది. ఆమెకు ‘ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం లభించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.”

“నా చిన్నారి మిత్రుడు సంభవ్‌ మిశ్రా ఎంతో సృజనాత్మకతగల యువకుడు. అనేక వ్యాసాలు అతని ప్రతిభాపాటవాలను చాటుతాయి. ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌లను కూడా అందుకున్నాడు. అతనికి ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం లభించడంపై అభినందనలు తెలియజేస్తున్నాను.”

“ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం అందుకున్న శ్రేయా భట్టాచార్జీ తబలా కళాకారిణి. సుదీర్ఘ సమయంపాటు తబలా వాయించిన రికార్డు కూడా ఆమె సొంతం. ప్రదర్శనాత్మక కళా వేదిక సాంస్కృతిక ఒలింపియాడ్‌లోనూ ఆమెకు సముచిత సత్కారం దక్కింది. ఆమెతో చాలా సంభాషణ నన్ను ఉల్లాసపరచింది.”

“నదిలో మునిగిపోతున్న ఓ మహిళను రక్షించడంలో రామచంద్ర బహిర్ తెగువను చూసి నేను గర్వపడుతున్నాను. ఆ క్షణంలో నిర్భయంగా నీటిలో దూకి, ఎంతో సాహసంతో ఆమెను కాపాడగలిగాడు. ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం అందుకోవడంపై అతనికి నా అభినందనలు. భవిష్యత్తులో అతను ఏ రంగంలోకి వెళ్లినా విజయం సాధించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.”

“విశేష ప్రతిభావంతుడైన ఆదిత్య ప్రతాప్ సింగ్ చౌహాన్ ఆవిష్కరణ రంగంలో సాధించిన విజయానికి ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం లభించింది. పరిశుభ్రమైన తాగునీటికి భరోసా ఇస్తూ తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికత రూపకల్పనకు అతడు శ్రమిస్తున్నాడు.”

“యువతరంలో ఆవిష్కరణాత్మకత ఆనందదాయకం! రిషి శివ ప్రసన్న అనువర్తనాల రూపకల్పనపై ఆసక్తి చూపుతున్నాడు. శాస్త్ర విజ్ఞానంపైనా అదేస్థాయిలో మక్కువ చూపడమేగాక యువతలో విజ్ఞాన వ్యాప్తికి కృషి చేస్తున్నాడు. ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం పొందిన ఇలాంటి విజేతను కలుసుకోవడం సంతోషంగా ఉంది.”

“అనౌష్క జాలీ వంటి యువతరం ఎనలేని సహానుభూతి, ఆవిష్కరణకు ప్రతీకగా నిలుస్తున్నారు. హానిచేస్తామంటూ వచ్చే బెదిరింపులను ఎదుర్కొనడంపై అవగాహన కల్పించడానికి ఆమె ఒక అనువర్తనంతోపాటు ఇతర ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లపై శ్రద్ధతో కృషి చేస్తోంది. ఈ కృషికిగాను ఆమె ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం అందుకోవడం సంతోషం కలిగిస్తోంది.”

“హనయా నిసార్ ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం అందుకోవడం ప్రశంసనీయం. విభిన్న క్రీడలకు ప్రాచుర్యం కల్పించడంతోపాటు శరీర దృఢత్వానికి మేమెంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. దీనికి అనుగుణంగా వివిధ యుద్ధ విద్య పోటీలలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి గణనీయ విజయాలు, అవార్డులు సాధించడం నన్ను గర్వపడేలా చేస్తున్నాయి.”

“శౌర్యజిత్ రంజిత్‌కుమార్ ఖైరే 2022 జాతీయ క్రీడల్లో సాధించిన విజయాలు అతనికెన్నో ప్రశంసలు తెచ్చిపెట్టాయి. మల్లకంభంపై నైపుణ్యం విషయానికొస్తే మూర్తీభవించిన ప్రతిభకు అతడు ప్రతీక. ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం అందుకోవడంపై అతన్ని అభినందిస్తున్నాను. భవిష్యత్తులో అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.”

“ఇదిగో... ఈమె విశిష్ట చదరంగ క్రీడాకారిణి కుమారి కోలగట్ల అలన మీనాక్షి. ఇప్పుడామె ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కార గ్రహీత. చదరంగంలో ఆమె సాధించిన విజయాలు ఆమెను అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ క్రీడాకారిణిగా నిలిపాయి. ఆమె భవిష్యత్‌ విజయాలు ఈ రంగంలో ఎదుగుతున్న క్రీడాకారులకు కచ్చితంగా స్ఫూర్తినిస్తాయి.”

 

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1893359

*****

DS/TS



(Release ID: 1893474) Visitor Counter : 174