ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జీ-20 భారతదేశం-ఆరోగ్య రంగం

Posted On: 18 JAN 2023 11:47AM by PIB Hyderabad

కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న జీ-20 ఆరోగ్య రంగంపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన  కేంద్ర, మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ ఎస్.వి. మురళీధరన్

ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన విధానం తప్పనిసరిగా  ఆరోగ్య విధానంలో అంతర్భాగంగా ఉండాలి  ...  డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్  

అనేక విధాలుగా ప్రపంచ దేశాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తున్న సమయంలో  ఆరోగ్య సంక్షోభం ఏర్పడితే  ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

 

“ సంసిద్ధత, ప్రతిస్పందన విధానాల రూపకల్పన కోసం మహమ్మారి సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ 

ఆరోగ్య సంక్షోభం ఏర్పడిన సమయంలో సమిష్టి చర్యలు అమలు చేసేందుకు సామర్ధ్యాలు మెరుగుపరుచుకుని పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ... డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్   

హైదరాబాద్, జనవరి 18:

"అనేక విధాలుగా ప్రపంచ దేశాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తున్న సమయంలో  ఆరోగ్య సంక్షోభం ఏర్పడితే ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది.   దీనిని దృష్టిలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన విధానం తప్పనిసరిగా  ఆరోగ్య విధానం లో అంతర్భాగంగా ఉండాల్సిన అవసరం ఉంది " అని  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. ఈ రోజు కేరళలోని తిరువనంతపురంలో జరిగిన  జీ-20   ఆరోగ్య కార్యవర్గ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు,  ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ ఎస్ వి మురళీధరన్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్ కూడా పాల్గొన్నారు.

మహమ్మారి నివారణ, సంసిద్ధత , ప్రతిస్పందన చర్యలు అమలు చేసేందుకు వివిధ విభాగాలు, సంస్థలు కలిసి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని  డాక్టర్ పవార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజా సంఘాలను  బలోపేతంచేసి, సాధికారత కల్పించడంతప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు.  "కోవిద్-19 చివరి మహమ్మారి కాదు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఏర్పడితే సంఘటిత సమిష్టి కృషి జరగాల్సి ఉంటుంది. గతంలో ఎదురైన అనుభవాలు ప్రాతిపదికన భవిష్యత్తు కార్యాచరణ రూపొందాలి.  సంసిద్ధత, ప్రతిస్పందన చర్యలు రూపొందించాలి. వివిధ రంగాల్లో సామర్థ్యాన్నిమెరుగు పరుచుకుని  ఏదైనా ఆరోగ్య సంక్షోభం ఎదురైనప్పుడు సమిష్టిగా, మనల్ని మనం కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలి " అని డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. 

పటిష్టమైన  ఆరోగ్య వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి  ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్‌లు, చికిత్సలు, వ్యాధి నిర్ధారణ రంగాల్లో పెట్టుబడి పెట్టే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అన్నారు.  

భారతదేశంలో అమలు జరుగుతున్న, వైద్య విధానాలు , ఆవిష్కరణల సంస్కృతిని  శ్రీ ఎస్.వి.  మురళీధరన్ ప్రస్తావించారు. "ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు" కోసం  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అన్ని దేశాలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. పెరుగుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో భారతదేశం ప్రతిపాదించిన విధానం అన్ని విధాలుగా ఆచరణ సాధ్యంగా ఉంటుందని మంత్రి అన్నారు.   

"ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి సంసిద్ధత మరియు ప్రతిస్పందన కోసం అన్ని దేశాలు కలిసి పనిచేయడానికి ముందుకు రావాలి " అని శ్రీ మురళీధరన్ అన్నారు. 

 ఆరోగ్య రంగంలో దేశాల మధ్య సహకారం మెరుగు పరిచి ఆరోగ్య రంగ అభివృద్ధికి కృషి చేయాలనీ  జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం కృషి చేస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్  అన్నారు. లక్ష్య సాధన కోసం భారతదేశం గుర్తించిన మూడు ప్రాధాన్యతా రంగాలను శ్రీ రాజేష్ భూషణ్ వివరించారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన- సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యమైన మరియు సరసమైన వైద్యపరమైన అంశాలు అందుబాటులోకి తెచ్చి  (వ్యాక్సిన్‌లు, థెరప్యూటిక్స్ మరియు డయాగ్నోస్టిక్స్) అవసరాల మేరకు సరఫరా చేయడం- సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించడానికి, ఆరోగ్య సేవలను  మెరుగుపరచడానికి డిజిటల్ ఆరోగ్య సేవల అభివృద్ధి, నూతన ఆవిష్కరణ రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా భారతదేశం గుర్తించిందని అన్నారు. 

ఆరోగ్య రంగంలో మూడు ప్రాధాన్యతా రంగాలను గుర్తించిన భారతదేశాన్ని ఇండోనేషియా, బ్రెజిలియన్  సభ్యులు అభినందించారు.  మహమ్మారి  ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి అవకాశాన్ని ఇచ్చిందని పేర్కొన్న ప్రతినిధులు ప్రజలందరికి ఆరోగ్య సంరక్షణ అందించడానికి జరుగుతున్న ప్రయత్నాలు వేగవంతం కావాలని అన్నారు.  

 ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహల్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి  శ్రీ లవ్ అగర్వాల్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి  శ్రీ అభయ్ ఠాకూర్ , జీ-20 సభ్య దేశాల ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు సమావేశానికి  హాజరయ్యారు.

 

***



(Release ID: 1892074) Visitor Counter : 419