ప్రధాన మంత్రి కార్యాలయం

భారత-ఆస్ట్రేలియా ద్వితీయ దృశ్య మాధ్యమ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రారంభోపన్యాసం - తెలుగు అనువాదం

Posted On: 21 MAR 2022 1:54PM by PIB Hyderabad

 

నా ప్రియమైన స్నేహితుడు స్కాట్ గారికి నమస్కారం ! 

హోలీ పండుగ మరియు ఎన్నికల్లో విజయం సాధించినందుకు మీరు అందజేసిన శుభాకాంక్షలకు, నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

క్వీన్స్‌లాండ్ మరియు న్యూ సౌత్ వేల్స్‌ లో వరదల వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి భారతీయులు అందరి తరపున నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

ఇంతకు ముందు మన మధ్య దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన సదస్సులో, మన సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి కి పెంచుకున్నాము.  అదేవిధంగా, ఈ రోజు మనం రెండు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశాల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను.  ఇది మన సంబంధాన్ని క్రమం తప్పకుండా సమీక్షించడానికి అవసరమైన ఒక నిర్మాణాత్మక విధానాన్ని సృష్టిస్తుంది.

ఎక్సలెన్సీ, 

గత కొన్ని సంవత్సరాలుగా మన సంబంధాలు అద్భుతమైన పురోగతి ని సాధించాయి.  వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, విద్య, ఆవిష్కరణలు, శాస్త్ర, సాంకేతికత వంటి అన్ని రంగాల్లో మన మధ్య చాలా సన్నిహిత సహకారం నెలకొని ఉంది.  వీటితో పాటు - కీలకమైన ఖనిజాలు, నీటి నిర్వహణ, పునరుత్పాదక శక్తి, కోవిడ్-19 పరిశోధన వంటి అనేక ఇతర రంగాలలో కూడా మన భాగస్వామ్యం వేగంగా అభివృద్ధి చెందింది.

క్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత విధానం కోసం బెంగళూరులో ఒక అత్యుత్తమ కేంద్రం ఏర్పాటు ప్రకటనను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను.  సైబర్, క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల విషయంలో మన మధ్య మెరుగైన సహకారాన్ని కలిగి ఉండటం అత్యవసరం. ఇటువంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల విషయంలో తగిన ప్రపంచ స్థాయి ప్రమాణాలు అనుసరించవలసిన బాధ్యత మనలాంటి సారూప్య విలువలు కలిగిన దేశాల పై ఉంది. 

ఎక్సలెన్సీ, 

మన సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం - "సి.ఈ.సి.ఏ.", గురించి, మీరు చెప్పిన విధంగా,  చాలా తక్కువ సమయంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించిన విషయాన్ని నేను కూడా తెలియజేస్తున్నాను.   మిగిలిన అంశాల విషయంలో కూడా త్వరలో పరస్పర అంగీకారం లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.  "సి.ఈ.సి.ఏ."ని త్వరగా పూర్తి చేయడం మన ఆర్థిక సంబంధాలు, ఆర్థిక పునరుద్ధరణ, ఆర్థిక భద్రతకు అత్యంత కీలకం కానుంది. 

క్వాడ్‌ విషయంలో కూడా మన మధ్య మంచి సహకారం ఉంది.  ఉచిత, బహిరంగ, సమ్మిళిత భారత-పసిఫిక్‌ దిశగా మన సహకారం, మన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.  ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి క్వాడ్ విజయం చాలా ముఖ్యం.  

ఎక్సలెన్సీ, 

పురాతన భారతీయ కళాఖండాలను తిరిగి అప్పగించడానికి, చొరవ తీసుకున్నందుకు నేను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  మీరు పంపిన కళాఖండాలలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తో సహా అనేక ఇతర భారతీయ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించబడిన వందల సంవత్సరాల నాటి విగ్రహాలు, చిత్రాలు ఉన్నాయి.  ఈ విషయమై భారతీయులందరి తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  మీరు మాకు తిరిగి ఇచ్చిన అన్ని విగ్రహాలు, ఇతర వస్తువులను వాటి స్వస్థలాలకు తిరిగి చేర్చే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది.  మీరు చేపట్టిన ఈ చొరవకు, భారతీయ పౌరులందరి తరపున,  మీకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ప్రపంచ కప్‌ క్రికెట్ పోటీలో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించినందుకు మీకు అనేక అభినందనలు.  శనివారం జరిగిన ఆటలో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికీ, ఈ పోటీ ఇంకా ముగియలేదు.  ఇరు దేశాల జట్లకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

ఎక్సలెన్సీ, 

ఈరోజు నా ఆలోచనలు మీతో పంచుకునే అవకాశం లభించినందుకు, మరోసారి, నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను.

ఇప్పుడు నేను మన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, నా ప్రారంభోపన్యాసం ముగిస్తున్నాను.  దీని తర్వాత, కొంత విరామం అనంతరం, కార్యక్రమంలోని తదుపరి అంశాలపై నా ఆలోచనలు మీకు తెలియజేస్తాను. 

 

*****



(Release ID: 1889716) Visitor Counter : 74