ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలో రూ.75,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి


మహారాష్ట్ర సమృద్ధి మహామార్గాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి;

“మహారాష్ట్ర అభివృద్ధికి నేడు పదకొండు కొత్త నక్షత్రాల కూటమి ఆవిర్భవిస్తోంది”;

“మౌలిక వసతులంటే నిర్జీవ రహదారులు.. ఫ్లై ఓవర్లకు
పరిమితం కాదు; ఇతర రంగాలకూ విస్తరణ చాలా ముఖ్యం”;

“లోగడ నిర్లక్ష్యానికి గురైనవారు నేడు ప్రభుత్వ ప్రాథమ్యంగా మారారు”;

“అడ్డదారి రాజకీయాలు వ్యాధితో సమానం”;

“అడ్డదారుల్లో వెళ్లే రాజకీయ పార్టీలు పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద శత్రువులు”;

“అడ్డదారులతో ఏ దేశమూ ముందుకు వెళ్లదు..
దేశ ప్రగతికి దీర్ఘదృష్టితో శాశ్వత పరిష్కారాలు చాలా కీలకం”;

“శాశ్వత ప్రగతి.. శాశ్వత పరిష్కారంతో కూడిన
ఆర్థిక విధానానికి గుజరాత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం”

Posted On: 11 DEC 2022 2:43PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ మ‌హారాష్ట్ర‌లో రూ.75,000 కోట్లకుపైగా విలువైన వివిధ ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌నతోపాటు జాతికి అంకితం చేశారు. ఇందులో రూ.1500 కోట్లకుపైగా విలువైన జాతీయ రైలు ప్రాజెక్టులు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒన్ హెల్త్ (ఎన్‌ఐఓ), నాగ్‌పూర్-నాగ్ నది కాలుష్య ప్రక్షాళన ప్రాజెక్ట్ కూడా వీటిలో భాగంగా ఉన్నాయి. మరోవైపు చంద్రాపూర్‌లోని ‘సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ’ (సిపెట్‌)ను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేశారు. అలాగే ‘సెంటర్ ఫర్ రీసెర్చ్, మేనేజ్‌మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హిమోగ్లోబినోపతీస్’ను ఆయన ప్రారంభించారు.

   అంతకుముందు నాగ్‌పూర్‌-బిలాస్‌పూర్‌ మార్గంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా ‘నాగ్‌పూర్‌ మెట్రో ఫేజ్‌-1’ను జాతికి అంకితం చేసి, రెండో దశ మెట్రోకు శంకుస్థాపన చేశారు. ఇవేగాక నాగ్‌పూర్‌-షిర్డీల మధ్య 520 కిలోమీటర్ల పొడవైన ‘హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్‌ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌’ తొలిదశ రహదారిని ప్రధాని ప్రారంభించారు. అలాగే నాగ్‌పూర్‌లో రూ.1,575 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ‘ఎయిమ్స్‌’ ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. ఈ ఆస్పత్రిలో అత్యధునాతన సదుపాయాలతోపాటో ఓపీడీ, ఐపీడీ, రోగనిర్ధారణ సేవలు, శస్త్రచికిత్స గదులు ఉన్నాయి. వీటితోపాటు 38 వైద్య విభాగాలతో వైద్య విజ్ఞానానికి సంబంధించిన స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ఆధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా గడ్చిరోలి, గోండియా, మేల్ఘాట్‌ వంటి పరిసర గిరిజన ప్రాంతాలకు ఇదొక వరమని చెప్పవచ్చు.

   కార్యక్రమాల అనంతరం ప్రధానమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- పవిత్ర శంకాష్టి చతుర్థి నేపథ్యంలో గణేశుని ప్రస్తుతించారు. ఇది అత్యంత ప్రత్యేకమైన రోజని, నాగ్‌పూర్‌ నుంచి అనేక ప్రగతి పనులు ప్రారంభమయ్యాయని ప్రధాని గుర్తుచేశారు. దీంతో మహారాష్ట్ర ప్రజల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు “మహారాష్ట్ర అభివృద్ధికి నేడు పదకొండు కొత్త నక్షత్రాలతో ఓ కూటమి ఆవిర్భవిస్తోంది. ఇది కొత్త దిశను నిర్దేశిస్తూ రాష్ట్రాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడంలో తోడ్పడుతుంది” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 11 కొత్త ప్రాజెక్టుల జాబితాను ప్రధానమంత్రి ప్రస్తావించారు.

   ఈ మేరకు “నాగ్‌పూర్ నుంచి షిర్డీ వరకు ‘హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్’ ఇప్పుడు సిద్ధమైంది. ‘ఎయిమ్స్‌’ విదర్భ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒన్ హెల్త్ ఏర్పాటైంది. చంద్రపూర్‌లో నిర్మించిన ‘ఐసీఎంఆర్‌’ పరిశోధన కేంద్రం, ‘సీఐపీటీ’ ఏర్పాటయ్యాయి. నాగ్ నది కాలుష్య ప్రక్షాళన, నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-1 ప్రారంభోత్సవంతోపాటు ఫేజ్‌-2కు శంకుస్థాపన, నాగ్‌పూర్-బిలాస్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం, నాగ్‌పూర్, అజ్ని రైల్వేస్టేషన్ల నవీకరణకు శ్రీకారం, అజ్ని వద్ద 42 వేల హార్స్‌పవర్ రైలు ఇంజిన్ల నిర్వహణ కేంద్రం, నాగ్‌పూర్-ఇటార్సీ మార్గంలో భాగమైన కోహ్లీ-నార్ఖేడ్ విభాగం ప్రారంభం వగైరాలున్నాయి” అని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తయిన, మరిన్ని ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. మహారాష్ట్రలో రెండు ఇంజన్ల ప్రభుత్వ వేగవంతమైన కృషికి నేటి ప్రాజెక్టులే నిదర్శనమని ప్రధాని చెప్పారు. సమృద్ధి మహామార్గ్‌ కేవలం నాగ్‌పూర్‌-ముంబై మార్గంలో దూరం తగ్గించడానికి మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రంలోని 24 జిల్లాలకు ఆధునిక సంధానం కల్పిస్తుందని వివరించారు. ఈ సంధాన ప్రాజెక్టులతో ఉద్యోగావకాశాలు పెరగడమే కాకుండా ఈ ప్రాంతంలోని రైతులు, యాత్రికులు, పరిశ్రమలకూ ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు.

   యా ప్రాజెక్టుల వాస్తవిక ప్రణాళిక గురించి వివరిస్తూ- ఇవన్నీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమగ్ర దృక్పథాన్ని స్పష్టం చేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. “ఎయిమ్స్‌, నాగ్‌పూర్‌ లేదా సమృద్ధి మహామార్గ్ కావచ్చు... వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కావచ్చు లేదా నాగ్‌పూర్ మెట్రో కావచ్చు... ఈ ప్రాజెక్టుల రూపురేఖలలో వ్యత్యాసాలు ఉండవచ్చు. కానీ ఇవన్నీ పుష్పగుచ్ఛంలాంటివి.. పరస్పరం కలిపినపుడు సంపూర్ణ ప్రగతి ఫలితాలు ప్రతి పౌరునికీ చేరుతాయి” అని ఆయన విశదీకరించారు. రెండు ఇంజన్ల ప్రభుత్వ కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- సామాన్యులకు వైద్యం, సంపద సృష్టి, రైతుకు సాధికారత, జల సంరక్షణ తదితర మౌలిక సదుపాయాలు ఏవైనప్పటికీ మానవీయ దృక్కోణాన్ని ప్రభావితం చేసే వీటన్నిటికీ ప్రభుత్వం మానవ రూపమివ్వడం ఇదే ప్రథమమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   మౌలిక సదుపాయాల అభివృద్ధి వెనుకగల సమగ్ర దృక్పథానికి ప్రధానమంత్రి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఈ మేరకు “ప్రతి పేదకూ రూ.5 లక్షలదాకా ఉచిత చికిత్సనందించే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం సామాజిక మౌలిక వసతికి ఒక ఉదాహరణ. కాశీ, కేదారనాథ్‌, ఉజ్జయిని, పంధర్‌పూర్‌ వంటి మన విశ్వాస క్షేత్రాల అభివృద్ధి సాంస్కృతిక మౌలిక వసతులకు నిదర్శనం. దేశంలోని 45 కోట్లమంది పేదలను బ్యాంకింగ్‌ వ్యవస్థతో జోడించే జనధన్‌ యోజన ఆర్థిక మౌలిక వసతికి రుజువు” అని వివరించారు. నాగ్‌పూర్‌ ‘ఎయిమ్స్‌’ తరహాలో ఆధునిక ఆస్పత్రులు, వైద్య కళాశాలల ఏర్పాటు కార్యక్రమాలు వైద్య మౌలిక వసతులకు రూపమని ఆయన పేర్కొన్నారు. కాబట్టి “మౌలిక వసతులంటే నిర్జీవ రహదారులు.. ఫ్లై ఓవర్లకు పరిమితం కాదు.. ఇతర రంగాలకూ విస్తరణ చాలా ముఖ్యం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

   సందర్భంగా గోస్‌ఖుర్ద్‌ ఆనకట్టను ఉదాహరిస్తూ- దీనికి 30-35 ఏళ్ల కిందట రూ.400 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేసినా నేటికీ నిర్మాణం పూర్తికాలేదని ప్రధానమంత్రి ఎత్తిచూపారు. ఫలితంగా ఈ ఆనకట్ట అంచనా వ్యయం నేడు రూ.18 వేల కోట్లకు చేరిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఈ పరిస్థితుల నడుమ 2017లో రెండు ఇంజన్ల ప్రభుత్వం ఏర్పడిన ఈ ఆనకట్ట పనులు వేగిరం చేశామన్నారు. అంతేకాకుండా ప్రతి సమస్యకూ పరిష్కారం లభించిందని ఆయన అన్నారు. ఈ ఏడాది జలాశయం పూర్తిగా నిండిందంటూ ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు.

   “స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రగతిశీల భారత నిర్మాణ సంకల్పంతో దేశం ముందుకెళ్తోంది. జాతి సమష్టి శక్తిసామర్థ్యాలతోనే ఈ స్వప్నం సాకారం కాగలదు. దేశాభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రం ప్రగతి సాధించడమే ప్రగతిశీల భారత సంకల్పం నెరవేరడానికి తారకమంత్రం” అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. అనుభవం నుంచి పాఠం నేర్వడాన్ని ప్రస్తావిస్తూ- అభివృద్ధి పరిమితమైనప్పుడు అవకాశాలూ పరిమితమే అవుతాయన్నారు. సమాజంలో కొందరికి మాత్రమే విద్య పరిమితమైనపుడు జాతి ప్రతిభ పరిగణనలోకి రాదన్నారు. బ్యాంకులు కొందరికే అందుబాటులో ఉంటే వాణిజ్య-వ్యాపారాలూ పరిమితమే అవుతాయి. మెరుగైన అనుసంధానం కేవలం కొన్ని నగరాలకు పరిమితమైన ఫలితంగా ప్రగతి కూడా ఆ పరిధికే పరిమితమైందని ప్రధానమంత్రి విశదీకరించారు. ఈ కారణంగానే దేశ జనాభాలో అధికశాతానికి ప్రగతి ఫలాలు పూర్తిస్థాయిలో అందలేదని లేదా జాతి వాస్తవ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి రావడం లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అయితే, ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. సబ్‌కా విశ్వాస్.. సబ్‌కా ప్రయాస్’ సూత్రాలతో గత 8 ఏళ్లలో ఈ దృక్పథం, విధానం రెండూ మారాయని ఆయన గుర్తుచేశారు. అందువల్లనే “లోగడ నిర్లక్ష్యానికి గురైనవారు ఇవాళ ప్రభుత్వ ప్రాథ్యమంగా మారారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఇక రైతుల నాయకత్వంలో ప్రగతి గురించి శ్రీ మోదీ ప్రస్తావిస్తూ- పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధితో విదర్భ ప్రాంత రైతులు కూడా కూడా ఎంతో ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. మరోవైపు పశుపోషకులకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ కిసాన్‌ క్రెడిట్‌కార్డు సౌకర్యాన్ని అనుసంధానం చేసిందని చెప్పారు.

   నిర్లక్ష్యానికి గురైనవారికి ప్రాథమ్యం గురించి మాట్లాడుతూ- 100కుపైగా ప్రగతికాంక్షిత జిల్లాలతోపాటు చిన్న వర్తకులకు సులభ రుణలభ్యతకు చేపట్టిన చర్యల గురించి ప్రధాని వెల్లడించారు. మరఠ్వాడా, విదర్భసహా దేశంలోని 100కుపైగా జిల్లాలు అనేక పరామితుల రీత్యా వెనుకబడి ఉన్నాయని ప్రధాని గుర్తుచేశారు. అయితే, “ఈ వెనుకబడిన ప్రాంతాలను సత్వర ప్రగతికి సరికొత్త శక్తి కేంద్రాలుగా రూపొందించడం కోసం గత ఎనిమిదేళ్లుగా మేం కృషి చేస్తున్నాం” అని ఆయన ఉద్ఘాటించారు. భారతదేశంలో అడ్డదారి రాజకీయాలు పుట్టుకొస్తున్నాయంటూ ప్రధానమంత్రి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇలాంటి పార్టీలు స్వార్థపూరిత రాజకీయాలతో పన్ను చెల్లింపుదారుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా అధికారంలోకి రావడమే పరమావధిగా బూటకపు హామీలతో అడ్డదారి పట్టాయని విమర్శించారు. రాబోయే 25 ఏళ్ల వ్యవధిలో భారత్‌ ప్రగతిశీల దేశంగా రూపొందడానికి కృషి చేస్తుంటే, కొన్ని పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రధాని హెచ్చరించారు.

   తొలి పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలను అందిపుచ్చుకునే అవకాశాలను కోల్పోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. దీని ఫలితంగానే 2వ, 3వ పారిశ్రామిక విప్లవాల సమయంలో వెనుకబడ్డామని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవ సమయంలో ఏ అవకాశాన్నీ భారత్‌ వదులుకోబోదని పునరుద్ఘాటించారు. ఈ మేరకు “అడ్డదారిలో పరుగు ఏ దేశానికీ సాధ్యం కాదు.. శాశ్వత పరిష్కారాల దిశగా దూరదృష్టి కలిగి ఉండటమే దేశాభివృద్ధికి చాలా ముఖ్యం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియా, సింగపూర్‌ ఒకనాడు పేద దేశాలుగా పరిగణించబడేవని ప్రధాని గుర్తుచేశారు. అయితే, మౌలిక సదుపాయాల రంగంలో ఊపును సద్వినియోగం చేసుకుంటూ తమ తలరాతను మార్చుకోవడంలో సఫలమైనందువల్లే ఆర్థిక వ్యవస్థలకు నేడు భారీ కేంద్రాలుగా రూపొందాయని చెప్పారు. రాబోయే యువతరానికి ఉజ్వల భవిష్యత్‌ కల్పన దిశగా ప్రభుత్వ ఖజానాలోని ప్రతి పైసా ఖర్చు చేయడం నేటి తక్షణావసరమని ఆయన పునరుద్ఘాటించారు.

   స్వార్థ రాజకీయ పార్టీల గుట్టురట్టు చేయాలని యువతరానికి, పన్ను చెల్లింపుదారులకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ‘పరిమిత ఆర్జన... అపరిమిత వ్యయం’ వాటి విధానమని, అటువంటి దుర్విధానాల కారణంగానే ప్రపంచంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయని వివరించారు. అయితే, మన దేశంలో మాత్రం సుస్థిర ప్రగతి, శాశ్వత పరిష్కారాల దిశగా ప్రభుత్వ కృషికి ప్రజానీకం మద్దతివ్వడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “సుస్థిర ప్రగతి, శాశ్వత పరిష్కారాలతో కూడిన ఆర్థిక విధానాలకు గుజరాత్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు.

   ఈ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి వెంట మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ భగత్‌ సింగ్‌ కోష్యారీ, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్ర రోడ్డు రవాణా - రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం – నాగ్‌పూర్‌ మెట్రో

   పట్టణ రవాణాను మరింత విప్లవాత్మకంగా తీర్చిదిద్దే దిశగా మరో అడుగుపడింది. ఈ మేరకు ‘నాగ్‌పూర్ మెట్రో తొలిదశ’ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. అలాగే ఖాప్రీ నుంచి ఆటోమోటివ్ స్క్వేర్ (ఆరెంజ్ లైన్), ప్రజాపతి నగర్ నుంచి లోకమాన్య నగర్ (ఆక్వా లైన్) వరకూగల మార్గంతోపాటు; ఖప్రీ మెట్రో స్టేషన్‌లో రెండు రైళ్లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. నాగ్‌పూర్ మెట్రో తొలి దశ రూ.8650 కోట్లకుపైగా వ్యయంతో పూర్తిచేయగా, మరో రూ.6700 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న నాగ్‌పూర్ మెట్రో రెండోదశకూ ప్రధాని శంకుస్థాపన చేశారు.

రైలు ప్రాజెక్టులు

   నాగ్‌పూర్‌-బిలాస్‌ పూర్‌ మార్గంలో నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నాగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే నాగ్‌పూర్‌, అజ్ని రైల్వేస్టేషన్ల పునర్నవీకరణకు శంకుస్థాపన చేశారు. వీటికోసం రూ.590 కోట్లు, రూ.360 కోట్లు వంతున నిధులు వెచ్చిస్తారు. అజ్నివద్ద రైలు ఇంజన్ల నిర్వహణ డిపోతోపాటు నాగ్‌పూర్‌-ఇటార్సీ మార్గంలోని కోహ్లీ-నార్ఖేడ్‌ విభాగం మార్గాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులను రూ.110 కోట్లు, రూ.450 కోట్ల వ్యయంతో పూర్తిచేశారు.

సమృద్ధి మార్గ్‌

   నాగ్‌పూర్‌-షిర్డీల మధ్య 520 కిలోమీటర్ల పొడవైన ‘హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌’ తొలిదశను ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలో అనుసంధానం మెరుగుపై ప్రధానమంత్రి దూరదృష్టికి అనుగుణంగా ముందడుగులో ఈ సమృద్ధి మార్గం లేదా నాగ్‌పూర్‌-ముంబై సూపర్‌ కమ్యూనికేషన్‌ ఎక్స్‌ ప్రెస్‌ రహదారి ప్రాజెక్టు ఒక భాగం. కాగా, రూ.55,000 కోట్లతో 701 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారి దేశంలోని అత్యంత పొడవైన ఎక్స్‌ ప్రెస్‌ మార్గాల్లో ఒకటి. ఇది మహారాష్ట్రలోని 10 జిల్లాల మీదుగా సాగుతుంది. అలాగే ప్రసిద్ధ అమరావతి, ఔరంగాబాద్‌, నాసిక్‌ నగరాలను తాకుతూ వెళ్తుంది. మరోవైపు పరిసర 14 జిల్లాలతో అనుసంధానం మెరుగుపరుస్తుంది. తద్వారా విదర్భ, మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్రసహా రాష్ట్రంలోని 24 జిల్లాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.

   ప్రధానమంత్రి గతిశక్తి కింద సమీకృత ప్రణాళిక, మౌలిక సదుపాయాల అనుసంధాన ప్రాజెక్టుల సమన్వయంపై ప్రధాని దృక్కోణానికి అనుగుణంగా ఈ రహదారి రూపొందింది. ఈ నేపథ్యంలో సదరు సమృద్ధి మహామార్గం ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, అజంతా-ఎల్లోరా గుహలు, షిర్డీ, వెరుల్, లోనార్ తదితర పర్యాటక ప్రదేశాలతోనూ అనుసంధానం అవుతుంది. మొత్తంమీద మహారాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంలో సమృద్ధి మహామార్గ్ కీలకపాత్ర పోషిస్తుంది.

‘ఎయిమ్స్’ నాగ్‌పూర్

నాగ్‌పూర్‌లో నిర్మించిన ‘ఎయిమ్స్‌’ను జాతికి అంకితం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రధానమంత్రి నిబద్ధతకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ రంగ పథకం ‘ప్రధానమంత్రి స్వాస్త్య సురక్ష యోజన’ కింద 2017 జులైలో ఆయన స్వయంగా దీనికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.1,575 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో అత్యధునాతన సదుపాయాలతోపాటో ఓపీడీ, ఐపీడీ, రోగనిర్ధారణ సేవలు, శస్త్రచికిత్స గదులు ఉన్నాయి. వీటితోపాటు 38 వైద్య విభాగాలతో వైద్య విజ్ఞానానికి సంబంధించిన స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ఆధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా గడ్చిరోలి, గోండియా, మేల్ఘాట్‌ వంటి పరిసర గిరిజన ప్రాంతాలకు ఇదొక వరమని చెప్పవచ్చు.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఒన్‌ హెల్త్‌, నాగ్‌పూర్‌

నాగ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒన్ హెల్త్ (ఎన్‌ఐఓ)కి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం ‘ఒన్ హెల్త్’ విధానంలో దేశ సామర్థ్యం, మౌలిక సదుపాయాల పెంపు దిశగా ఒక ముందడుగు. జంతుజాలంతోపాటు పర్యావరణంతోనూ మానవారోగ్యం ముడిపడి ఉంటుందన్నది ‘ఒన్‌ హెల్త్‌’ విధానం. మానవాళిని ప్రభావితం చేసే అనేక అంటువ్యాధులు ప్రకృతిలో జంతువు నుంచి మనిషి సంక్రమిస్తుంటాయని ఈ విధానం చెబుతుంది. ఈ నేపథ్యంలో రూ.110 కోట్లకుపైగా వ్యయంతో ఈ సంస్థ స్థాపించబడింది. దేశవ్యాప్తంగా ‘ఒన్ హెల్త్’ విధానంలో పరిశోధన-సామర్థ్య వికాసం దిశగా భాగస్వామ్య సంస్థలన్నిటితో ఇది సహకరిస్తూ సమన్వయం చేసుకోవడమేగాక ఉత్ప్రేరకంగానూ పనిచేస్తుంది.

ఇతర ప్రాజెక్టులు

   నాగ్‌పూర్‌లో నాగ్ నది కాలుష్య నివారణకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక (ఎన్‌ఆర్‌సీపీ) కింద రూ.1925 కోట్లకుపైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలవుతుంది. కాగా, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే విదర్భలో... ముఖ్యంగా గిరిజన ప్రాబల్యం అధికంగాగల ప్రదేశాల్లో సికిల్‌ సెల్‌ వ్యాధి చాలా ఎక్కువగా ఉంది. తలసేమియా, హెచ్‌బిఇ వంటి ఇతర హిమోగ్లోబినోపతీలతోపాటు దేశంలో వివిధ వ్యాధుల భారానికి ఇది గణనీయంగా కారణమవుతుంది. ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రధానమంత్రి 2019 ఫిబ్రవరిలో “సెంటర్ ఫర్ రీసెర్చ్-మేనేజ్‌మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హిమోగ్లోబినోపతీస్, చంద్రాపూర్’ కేంద్రానికి శంకుస్థాపన చేయగా నేడు దేశానికి అంకితం చేశారు. దేశ హిమోగ్లోబినోపతి రంగంలో వినూత్న పరిశోధన-సాంకేతికతల అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధికి ఇది అత్యుత్తమ కేంద్రం కాగలదని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. అంతేకాకుండా చంద్రపూర్‌లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌)ను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. పాలీమర్, అనుబంధ పరిశ్రమల అవసరాలు తీర్చగల నిపుణ మానవ వనరులను అభివృద్ధి చేయడమే ఈ సంస్థ లక్ష్యం.

 

*****

DS/TS


(Release ID: 1883017) Visitor Counter : 160