ప్రధాన మంత్రి కార్యాలయం
గోవాలోని మోపాలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన - ప్రధానమంత్రి
"గోవా ప్రజల అభిమానానీకీ, ఆశీర్వాదాలకూ కృతజ్ఞతలు తెలియజేసే ప్రయత్నమే - ఈ అధునాతన విమానాశ్రయ టెర్మినల్"
"మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా, పారికర్ గారు ప్రయాణికులందరి జ్ఞాపకాలలో నిలిచిపోతారు"
"గతంలో, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన ప్రదేశాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి"
"గత 70 ఏళ్ళలో, 70 విమానాశ్రయాలతో పోలిస్తే, గత 8 సంవత్సరాలలో 72 కొత్త విమానాశ్రయాలు వచ్చాయి"
"భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్ గా అవతరించింది"
"21వ శతాబ్దపు భారతదేశం కొత్త భారతదేశం, ఇది అంతర్జాతీయ వేదికపై ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తోంది, ఫలితంగా, ప్రపంచ దృక్పథం వేగంగా మారుతోంది"
"ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి, దేశ పర్యాటక ముఖ చిత్రాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరిగాయి"
"గోవా ఇప్పుడు, నూరు శాతం సంతృప్త నమూనాకు సరైన ఉదాహరణ గా మారింది"
Posted On:
11 DEC 2022 7:50PM by PIB Hyderabad
గోవా లోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2016 నవంబర్ లో ప్రధానమంత్రి విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. దాదాపు 2,870 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయాన్ని సోలార్ పవర్ ప్లాంటు, గ్రీన్ బిల్డింగులు, రన్ వే పై ఎల్.ఈ.డి. దీపాలు, వర్షపు నీటి పరిరక్షణ, అత్యాధునిక మురుగునీటి శుద్ధి కర్మాగారం, రీసైక్లింగ్ వంటి పలు ఇతర స్థిరమైన మౌలిక సదుపాయాల తో నిర్మించడం జరిగింది. ప్రారంభంలో, ఈ విమానాశ్రయం మొదటి దశలో సంవత్సరానికి 4.4 మిలియన్ల మంది ప్రయాణీకుల (ఎం.పి.పి.ఏ) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ తర్వాత దీనిని 33 ఎం.పి.పి.ఏ. సామర్థ్యం వరకు విస్తరించవచ్చు.
సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, మోపా లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రారంభించినందుకు గోవాతో పాటు, దేశంలోని పౌరులందరికీ అభినందనలు తెలిపారు. గత ఎనిమిదేళ్లలో గోవాలో తాను చేసిన పర్యటనలను గుర్తుచేసుకున్న ప్రధాని, గోవా ప్రజలు తన పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలను అభివృద్ది రూపంలో వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. "వాటిని తిరిగి ఇచ్చే ప్రయత్నంలో భాగమే ఈ అధునాతన విమానాశ్రయ టెర్మినల్" అని, ఆయన వ్యాఖ్యానించారు. ఈ విమానాశ్రయానికి స్వర్గీయ మనోహర్ పారికర్ పేరు పెట్టడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పనలో అనుసరించిన విధానం గురించి ప్రస్తావిస్తూ, ప్రజల అవసరాలు, సౌకర్యాలకు బదులుగా ఓటు బ్యాంకు రాజకీయాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాయని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. అవసరం లేని ప్రాజెక్టుల కోసం వేల కోట్లు వెచ్చించారని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. దీంతో మౌలిక సదుపాయాల కల్పనకు నోచుకోని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. "గోవా అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి స్పష్టమైన ఉదాహరణ" అని ఆయన పేర్కొన్నారు. ప్రారంభంలో ఈ విమానాశ్రయం కోసం ప్రణాళిక రూపొందించిన అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గుర్తుచేసుకుంటూ, ఆయన ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తర్వాత, ఈ ప్రాజెక్టు చాలా సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కావడంతో, తదనంతరం, ఎటువంటి పురోగతి లేకుండా పోయిందని, విచారం వ్యక్తం చేశారు. 2014 లో, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, విమానాశ్రయం పనులు కొత్త ఊపందుకున్నాయనీ, చట్టపరమైన అడ్డంకులతో పాటు, మహమ్మారి విజృభించినప్పటికీ, 6 సంవత్సరాల క్రితం తాను శంకుస్థాపన చేయడంతో, ఈ విమానాశ్రయం ఈ రోజు పనిచేయడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి వివరించారు. ఈ విమానాశ్రయంలో సంవత్సరానికి దాదాపు 40 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సదుపాయం ఉంది, భవిష్యత్తులో 3.5 కోట్ల వరకు ప్రయాణించవచ్చు. పర్యాటక ప్రయోజనాలతో పాటు, రెండు విమానాశ్రయాలు, గోవా కు 'కార్గో-హబ్' గా కొత్త అవకాశాలను సృష్టించాయి.
మారిన వ్యవహార శైలికి, పరిపాలనా విధానానికి మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 2014 కి ముందు విమాన ప్రయాణం అనేది బాగా డబ్బున్న వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉన్న శ్రేష్టమైన వ్యవహారమని, ప్రధానమంత్రి అన్నారు. విమాన ప్రయాణం పట్ల సామాన్య పౌరుడి ఆకాంక్షను నిర్లక్ష్యం చేయడం వల్ల విమానాశ్రయాలు, విమాన ప్రయాణానికి సంబంధించిన ఇతర మౌలిక సదుపాయాలపై తక్కువ పెట్టుబడి పెట్టడం జరిగింది. ఫలితంగా భారీ సామర్థ్యం ఉన్నప్పటికీ భారతదేశం విమాన ప్రయాణంలో వెనుకబడి ఉంది. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం మొదటి 70 ఏళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య కేవలం 70 మాత్రమేనని, విమాన ప్రయాణాలను పెద్ద నగరాలకే పరిమితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో, ప్రభుత్వం రెండు స్థాయిలలో పని చేసిందని, ప్రధానమంత్రి వివరిస్తూ, ముందుగా, విమానాశ్రయాల వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగిందనీ, రెండవ చర్యగా, ఉడాన్ పథకం ద్వారా సాధారణ పౌరులకు విమాన ప్రయాణానికి అవకాశం కల్పించడం జరిగిందనీ, తెలియజేశారు. గత 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు నిర్మించగా, ఈ 8 ఏళ్ల లో 72 విమానాశ్రయాలు నిర్మించడం జరిగింది. అంటే దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరిగింది. అదేవిధంగా, 2000 సంవత్సరంలో కేవలం 6 కోట్ల మందిగా ఉన్న విమాన ప్రయాణికులతో పోలిస్తే, 2020 లో (కరోనా మహమ్మారి ప్రభావానికి ముందు) విమాన ప్రయాణీకుల సంఖ్య 14 కోట్లకు పెరిగింది. ఉడాన్ పథకం కింద కోటి మందికి పైగా ప్రజలు విమానాల్లో ప్రయాణించారు. "ఈ చర్యల ఫలితంగా, భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్ గా అవతరించింది" అని ప్రధానమంత్రి చెప్పారు.
ఉడాన్ యోజన సాధించిన విజయాలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఇది విద్యా ప్రపంచానికి ఒక అధ్యయన అంశంగా మారే అవకాశం ఉందని అన్నారు. మధ్యతరగతి ప్రజలు తక్కువ దూరం లోని ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా రైల్వేలకు బదులు విమాన ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్న తీరుపై కూడా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశంలో వాయు మార్గాల అనుసంధానత వ్యవస్థ విస్తరిస్తున్న నేపథ్యంలో, విమాన ప్రయాణం వేగవంతమైన రవాణా సాధనంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
"ఒక దేశం యొక్క మంచితనాన్ని పెంపొందించడంలో పర్యాటకం దోహదపడుతుందనేది నిజం, అయితే ఒక దేశం బలపడుతున్న నేపథ్యంలో, ప్రపంచ దేశాలు ఆ దేశం గురించి మరింత తెలుసుకోవాలని కోరుకుంటాయి, దాని వైపు ఆకర్షితులవుతాయి." అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతదేశ సుసంపన్నమైన చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, ఇది ప్రపంచం మొత్తానికి ఆకర్షణీయంగా ఉందని, ఇక్కడ భూమి గురించి మరింత తెలుసుకోవడానికి పండితులు, ప్రయాణికులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు భారతదేశానికి వస్తారని ప్రధానమంత్రి అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ దేశం పట్ల అభిప్రాయాన్ని, దృక్పథాన్ని మార్చిన భారతదేశం ఎదుర్కొన్న చీకటి బానిసత్వ కాలం గురించి కూడా ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. "21వ శతాబ్దపు భారతదేశం నూతన భారతదేశం, ఇది ప్రపంచ వేదికపై ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తోంది, ఫలితంగా ప్రపంచ దృక్పథం వేగంగా మారుతోంది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. నేటి ప్రపంచం భారతదేశం గురించి తెలుసుకోవాలనీ, దాని మార్గాలను అర్థం చేసుకోవాలనీ కోరుకుంటోందని, ఆయన నొక్కి చెప్పారు. చాలా మంది విదేశీయులు డిజిటల్ వేదికల ద్వారా భారతదేశ చరిత్రను వివరిస్తున్నారని కూడా ఆయన తెలియజేశారు.
గత ఎనిమిదేళ్లలో ప్రయాణ సౌలభ్యం తో పాటు, దేశ పర్యాటక రంగానికి మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. వీసా ప్రక్రియను సులభతరం చేయడం, మెరుగైన 'వీసా-ఆన్-అరైవల్' సౌకర్యాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, మారుమూల ప్రదేశాలకు అనుసంధానత తో పాటు, డిజిటల్, మొబైల్, రైల్వే అనుసంధానత గురించి ఆయన వివరించారు. ఈ చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. 2015 లో భారతదేశంలో దేశీయ పర్యాటకుల సంఖ్య 14 కోట్లు గా నమోదయ్యింది. గత ఏడాది ఈ సంఖ్య దాదాపు 70 కోట్లకు పెరిగిందని ఆయన చెప్పారు.
ఉపాధితో పాటు, స్వయం ఉపాధికి పర్యాటక రంగం అతిపెద్ద సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. గోవాలో పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే చర్యలను ఆయన వివరించారు. ‘‘2014 నుంచి రాష్ట్రంలో హైవే ప్రాజెక్టులపై 10 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. గోవాలో ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరిస్తున్నారు. కొంకణ్ రైల్వే విద్యుదీకరణ కూడా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తోంది” అని, ప్రధానమంత్రి తెలియజేశారు.
అనుసంధానత పెంచడంతో పాటు, స్మారక చిహ్నాల సంరక్షణ, అనుసంధానతకు సంబంధించిన సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడం పై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు ప్రధానమంత్రి చెప్పారు. ఈ కృషికి ఉదాహరణగా, అగోడా కారాగార భవన సముదాయం లోని మ్యూజియం అభివృద్ధిని, శ్రీ మోదీ ప్రస్తావించారు. స్మారక చిహ్నాలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, ప్రత్యేక రైళ్ల ద్వారా పుణ్యక్షేత్రాలు, స్మారక చిహ్నాలకు వెళ్లేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రధానమంత్రి తెలియజేశారు.
భౌతిక మౌలిక సదుపాయాలతో పాటు, సామాజిక మౌలిక సదుపాయాలకు కూడా సమానమైన ప్రాధాన్యతనిస్తూ గోవా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. 'స్వయం పూర్ణ గోవా అభియాన్' విజయవంతమైందనీ, ఇది జీవన సౌలభ్యాన్ని పెంపొందించడంతో పాటు, ఏ పౌరుడు ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండకుండా చూసుకోవడానికి కీలకమని కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు. “ఈరోజు, గోవా నూరు శాతం సంతృప్త నమూనాకు పరిపూర్ణ ఉదాహరణ గా మారింది”, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ముందుకు తీసుకు వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నానని పేర్కొంటూ, ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గోవా గవర్నర్ శ్రీ పి.ఎస్. శ్రీధరన్ పిళ్లై, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర ఓడరేవు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్ ప్రభృతులు పాల్గొన్నారు.
నేపథ్య సమాచార
దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు అందించాలనేది ప్రధానమంత్రి నిరంతర ప్రయత్నం. ఈ దిశగా మరో అడుగు ముందుకేసి, గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. 2016 నవంబర్ లో ప్రధానమంత్రి ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.
దాదాపు 2,870 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయాన్ని సోలార్ పవర్ ప్లాంటు, గ్రీన్ బిల్డింగులు, రన్ వే పై ఎల్.ఈ.డి. దీపాలు, వర్షపు నీటి పరిరక్షణ, అత్యాధునిక మురుగునీటి శుద్ధి కర్మాగారం, రీసైక్లింగ్ వంటి పలు ఇతర స్థిరమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో నిర్మించడం జరిగింది. ఈ విమానాశ్రయం 3-డి. మోనోలిథిక్ ప్రీకాస్ట్ భవనాలు, స్టెబిల్ రోడ్, రోబోమాటిక్ హాలో ప్రీకాస్ట్ గోడలు, 5-జి. అనుకూల ఐ.టి. మౌలిక సదుపాయాల వంటి కొన్ని అత్యుత్తమ-స్థాయి సాంకేతికతలను కలిగి ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద విమానాల రాకపోకలు అనువైన రన్ వే, 14 పార్కింగ్ స్థలాలు, విమానాల కోసం నైట్ పార్కింగ్ సదుపాయం, సెల్ఫ్ బ్యాగేజీ డ్రాప్ సౌకర్యాలు, అత్యాధునికమైన, స్వతంత్ర ఎయిర్ నావిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి ఈ విమానాశ్రయంలోని కొన్ని ప్రత్యేకతలు.
ప్రారంభంలో, ఈ విమానాశ్రయం మొదటి దశలో సంవత్సరానికి 4.4 మిలియన్ల మంది ప్రయాణికులు (ఎం.పి.పి.ఏ) రాకపోకలు సాగించే సదుపాయం ఉంది, దీనిని 33 ఎం.పి.పి.ఏ. సంతృప్త సామర్థ్యానికి విస్తరించవచ్చు. ఈ విమానాశ్రయం రాష్ట్ర సామాజిక ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తుంది, పర్యాటక పరిశ్రమ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది అనేక దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను నేరుగా కలుపుతూ కీలకమైన లాజిస్టిక్స్ హబ్ గా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విమానాశ్రయాన్ని వివిధ రవాణా వ్యవస్థలకు అనుసంధానమయ్యే విధంగా రూపొందించడం జరిగింది.
ప్రపంచ స్థాయి విమానాశ్రయం కావడంతో, ఈ విమానాశ్రయం సందర్శకులకు గోవా అనుభూతి, అనుభవాన్ని అందిస్తుంది. విమానాశ్రయ నిర్మాణంలో గోవా కు చెందిన సుప్రసిద్ధ 'అజులెజోస్' టైల్స్ ను విస్తృతంగా ఉపయోగించడం జరిగింది. ఫుడ్ కోర్టు ఒక సాధారణ గోవా కేఫ్ ఆకర్షణను కూడా పునః సృష్టిస్తుంది. స్థానిక వృత్తి కళాకారులు, హస్త కళాకారులు తమ వస్తువులను ప్రదర్శించడానికి, మార్కెట్ చేయడానికి వీలుగా, ఈ విమానాశ్రయంలో క్యూరేటెడ్ ఫ్లీ మార్కెట్ కోసం నిర్దేశిత ప్రాంతాన్ని కేటాయించారు.
(Release ID: 1882951)
Visitor Counter : 160
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam