ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బెంగళూరు సాంకేతిక సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 16 NOV 2022 11:02AM by PIB Hyderabad

సాంకేతిక ప్రపంచంలో అగ్రగాములు.. అంతర్జాతీయ ప్రతినిధులు.. మిత్రులారా…

ఎల్లారిగు నమస్కార (అందరికీ నమస్కారం)… భారతదేశానికి స్వాగతం! నమ్మ కన్నడ నాడిగె స్వాగత (మా కన్నడ భూమికి స్వాగతం), నమ్మ బెంగళూరిగె స్వాగత (మా  బెంగళూరుకు స్వాగతం)...

   బెంగళూరు సాంకేతిక సదస్సులో మరోసారి ప్రసంగించే అవకాశం లభించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఉత్తేజపూరిత కన్నడ సంస్కృతి, కర్ణాటక ప్రజల ప్రేమాభిమానాలకు మీరెంతో ముగ్ధులయ్యారని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా!

   ఈ బెంగళూరు నగరం సాంకేతిక పరిజ్ఞానానికి, దూరదృష్టిగల నాయకత్వానికి పుట్టినిల్లు. ఇదొక సార్వజనీన, ఆవిష్కరణల నగరం కూడా.. భారత ఆవిష్కరణల సూచీలో అనేక సంవత్సరాలుగా బెంగళూరు అగ్రస్థానంలోఉంది.

మిత్రులారా!

   భారత సాంకేతిక విజ్ఞానం, ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఇప్పటికే మెప్పించాయి. అయితే, వర్తమానం కన్నా భవిష్యత్తుకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే- భారతదేశానికి ఆవిష్కరణాత్మక యువశక్తితోపాటు సాంకేతిక విజ్ఞాన లభ్యత సదా ఇనుమడిస్తూనే ఉంది.

మిత్రులారా!

   భారత యువతరం శక్తి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. వారు సాంకేతికంగానే కాకుండా  ప్రతిభ ప్రపంచీకరణకూ భరోసా ఇస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, నిర్వహణ, ఆర్థికం సహా అనేక రంగాల్లో నాయకత్వం వహిస్తున్న యువ భారతీయులు మీకు కనిపిస్తారు. మేము మా ప్రతిభను ప్రపంచ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాం. ఆ ప్రభావం భారతదేశంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో భారత్ 40వ స్థానానికి దూసుకెళ్లింది. కాగా, 2015లో మేం 81వ స్థానంలో ఉన్నామన్నది ఈ సందర్భంగా గమనార్హం! దేశంలో యూనికార్న్ అంకుర సంస్థల సంఖ్య 2021 నుంచి రెట్టింపైంది! మేమిప్పుడు ప్రపంచంలో 3వ అతిపెద్ద అంకుర సంస్థల కూడలిగా ఎదిగాం. మాకు 81,000కుపైగా గుర్తింపు పొందిన అంకుర సంస్థలున్నాయి. అలాగే వందలాది అంతర్జాతీయ కంపెనీలకు భారతదేశంలో పరిశోధన-అభివృద్ధి కేంద్రాలున్నాయి. దేశంలోని ప్రతిభా సంపత్తే ఈ ఘనత అంతటికీ ఏకైక కారణం.

మిత్రులారా!

   సాంకేతిక పరిజ్ఞాన లభ్యత పెరుగుతున్నందువల్ల భారత యువత శక్తిసామర్థ్యాలు పెంచుకుంటోంది. దేశంలో ఇవాళ మొబైల్‌, డేటా విప్లవం రూపుదిద్దుకుంటోంది. గడచిన 8 సంవత్సరాలలో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు 60 మిలియన్ల నుంచి 810 మిలియన్లకు పెరిగాయి. స్మార్ట్‌ ఫోన్‌ వాడకందారుల సంఖ్య 150 మిలియన్ల నుంచి 750 మిలియన్లకు చేరింది. ఇంటర్నెట్‌ విస్తరణ వేగం పట్టణ ప్రాంతాలకన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. సమాచార మహా రహదారితో సరికొత్త జన అనుసంధానం చోటుచేసుకుంటోంది.

మిత్రులారా!

   చాలాకాలంనుంచీ సాంకేతికత ఓ ప్రత్యేక రంగంగా.. ఉన్నత, శక్తిమంతమైన వర్గాలకు మాత్రమే అందుతుందన్న పరిస్థితి ఉండేది. కానీ, సాంకేతికత ప్రజాస్వామ్యీకరణ ఎలాగో భారతదేశం ప్రపంచానికి చూపింది. అంతేగాక సాంకేతికతకు మానవీయతను జోడించడం ఎలాగో కూడా తేటతెల్లం చేసింది. దేశంలో సమానత్వం, సాధికారతలకు సాంకేతికత ఒక శక్తిగా నిలిచింది. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్’ దాదాపు 200 మిలియన్ కుటుంబాలకు… అంటే- 600 మిలియన్ల పౌరులకు ఆరోగ్య భద్రత కల్పించింది! ఈ కార్యక్రమం సాంకేతిక వేదిక ఆధారంగా అమలవుతోంది. అలాగే భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌-19 టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇది ‘కోవిన్‌’ సాంకేతిక ఆధారిత వేదిక ద్వారానే సాధ్యమైంది. ఇప్పుడు ఆరోగ్య రంగంనుంచి విద్యారంగంవైపు వెళ్దాం… భారతదేశం నేడు సార్వత్రిక విద్యా కోర్సుల అతిపెద్ద ఆన్‌లైన్‌ భాండాగారంగా వెలుగొందుతోంది. దేశవ్యాప్తంగా వివిధ పాఠ్యాంశాల్లో వేలాది కోర్సులు అందుబాటులో ఉండగా- 10 మిలియన్లకు మించి విజయవంతంగా ధ్రువీకరణలు పూర్తయ్యాయి. ఇదంతా ఆన్‌లైన్‌ ద్వారా... అదీ ఉచితంగానే! మా డేటా ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువ. కోవిడ్‌-19 సమయంలో పేద విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావడంలో ఈ స్వల్ప డేటా ధర ఎంతగానో దోహదం చేసింది. లేకపోతే వారి రెండేళ్ల అమూల్యమైన కాలం వృథా అయ్యేది.

మిత్రులారా!

   పేదరికంపై పోరాటంలో సాంకేతిక పరిజ్ఞానమే భారతదేశానికి ఆయుధం. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో భూమి హద్దులు గుర్తించడానికి ‘స్వామిత్వ’ పథకం కింద డ్రోన్లు వినియోగిస్తున్నాం. ఆ మ్యాపుల ఆధారంగా ప్రజలకు ఆస్తి హక్కు కార్డులు అందజేస్తున్నాం. దీంతో భూ వివాదాలు తగ్గడమేగాక పేదలకు ఆర్థిక సేవలు, రుణపరపతి అందుతాయి. అనేక దేశాలు కోవిడ్‌-19 సమయంలో ఒక సమస్యతో తల్లడిల్లాయి. ప్రజలకు చేయూత అవసరమని, వారికి ప్రయోజనాలు బదిలీ అయితే మేలు కలుగుతుందని వాటికి తెలుసు. కానీ, ప్రయోజనాలను ప్రజలకు చేర్చే మౌలిక సదుపాయాలు వాటివద్ద లేవు. అయితే, ప్రజా శ్రేయస్సుకు సాంకేతికత ఒక శక్తిగా ఉపయోగపడగలదని భారతదేశం నిరూపించింది. ప్రజలకు నేరుగా లబ్ధి బదిలీలో మా జన్‌ధన్‌-ఆధార్‌-మొబైల్‌ త్రయం మాకు ఆ శక్తినిచ్చింది. ఆ మేరకు అర్హులైన, అధీకృత లబ్ధిదారులకు ప్రయోజనాలు ప్రత్యక్షంగా చేరాయి. ఆ విధంగా పేదల బ్యాంకు ఖాతాలకు కోట్లాది రూపాయలు నేరుగా జమయ్యాయి. ఇక కోవిడ్‌-19 సమయంలో చిన్న వ్యాపారాల గురించి ఎంతో ఆందోళన వ్యక్తమైంది. వారికీ సాయపడటంతోపాటు మేమొక  ముందడుగు వేశాం. తదనుగుణంగా వీధి వర్తకుల వ్యాపార పునఃప్రారంభానికి నిర్వహణ మూలధనం సమకూర్చాం. అలాగే డిజిటల్‌ చెల్లింపులు చేయడంపై ప్రోత్సాహకాలిచ్చాం. నేడు వారికి డిజిటల్‌ లావాదేవీలు ఒక జీవన విధానంగా మారిపోయాయి.

మిత్రులారా!

   ప్రభుత్వం ఒక విజయవంతమైన ఎలక్ట్రానిక్‌ వాణిజ్య వేదిక నిర్వహించడం గురించి మీలో ఎవరైనా విన్నారా? భారతదేశంలో అది సాధ్యమైంది… మాకిప్పుడు ‘జిఇఎం’ పేరిట ప్రభుత్వ ఇ-మార్కెట్‌ వేదిక ఉంది. ప్రభుత్వ అవసరాలను తీర్చే చిన్న వ్యాపారులు, వ్యాపారాలకు ఇదొక వేదికగా ఉపయోగపడుతోంది. చిన్న వ్యాపారాలు భారీ వినియోగదారులను అన్వేషించడంలో సాంకేతిక పరిజ్ఞానం సాయపడుతోంది. అదే సమయంలో అవినీతి నిరోధానికి ఇదెంతగానో తోడ్పడింది. అలాగే ఆన్‌లైన్‌ టెండర్లకు బాటలు వేసింది. పారదర్శకతకు పెద్దపీట వేసి, పథకాల పనుల్లో వేగం పెంచింది. ఈ విధంగా గత సంవత్సరం మొత్తంమీద రూ.లక్ష కోట్ల కొనుగోళ్లు నమోదయ్యాయి.

మిత్రులారా!

   ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి… అయితే, వాటికి సమన్వయం తోడైతే ఒక శక్తిగా రూపొందుతాయి. కాబట్టి గిరిగీత ధోరణిని అంతం చేసి, సమష్టి తత్వాన్ని పాదుకొల్పి, సేవలకు భరోసా ఇచ్చేవిధంగా సాంకేతికత వినియోగించబడుతోంది. ఒక ఉమ్మడి వేదిక ఉన్నపుడు గిరిగీత ధోరణికి తావుండదు. ‘పీఎం గతిశక్తి జాతీయ బృహత్‌ ప్రణాళిక’ ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఇందులో భాగంగా రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.100 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నాం. కనుక ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులోనైనా భాగస్వాముల సంఖ్య అధికంగా ఉంటుంది. భారతదేశంలో భారీ ప్రాజెక్టులు తరచూ జాప్యం కావడం ఒక సంప్రదాయం కాగా, వ్యయం పెరుగుదలతోపాటు పదేపదే గడువుల పొడిగింపు సర్వసాధారణం. అయితే, ‘గతిశక్తి’ ఉమ్మడి వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లాల యంత్రాంగాలు, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకునే వీలుంది. ఆ మేరకు ఇతర ప్రభుత్వాలు లేదా శాఖలు ఏం చేస్తున్నాయో మిగిలిన అన్నిటికీ సమాచారం ఉంటుంది. ప్రాజెక్టుల సమాచారం, భూ వినియోగం, భాగస్వామ్య వ్యవస్థల వివరాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి భాగస్వామ్య వ్యవస్థ ఒకే విధమైన సమాచారాన్ని చూడగలదు. దీనివల్ల సమన్వయం పెరిగి, సమస్యలు తలెత్తకముందే వాటికి పరిష్కారం సిద్ధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ అనుమతులు, ఆమోదాలు వేగం పుంజుకున్నాయి.

మిత్రులారా!

   భారతదేశంలో ఇక సాచివేతకు తావులేదు… అంటే- పెట్టుబడిదారులకు స్వాగతం పలకడమే ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) సంస్కరణలు కావచ్చు.. డ్రోన్‌ నిబంధనల సరళీకరణ కావచ్చు... సెమి కండక్టర్‌ రంగంలో చర్యలు కావచ్చు.. వివిధ రంగాల్లో ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాలు కావచ్చు… వాణిజ్య సౌలభ్యం పెరుగుదల కావచ్చు… అన్ని విషయాల్లోనూ ఇది ఇప్పటికే రుజువైంది.

మిత్రులారా!

   భారతదేశంలో కలిసివచ్చే విశిష్టాంశాలు అనేకం ఉన్నాయి. మీ పెట్టుబడి, మా ఆవిష్కరణలు కలగలిస్తే అద్భుతాలు సాధించగలవు. మీ విశ్వాసం, మా సాంకేతిక నైపుణ్యంతో చేయి కలిపితే తలచినవన్నీ నిజం కాగలవు. సమస్యల పరిష్కారంలో మేము ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో మాతో కలిసి పనిచేయాల్సిందిగా మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. బెంగళూరు సాంకేతిక సదస్సులో మీ చర్చలు ఆసక్తికరంగా, ఫలవంతంగా సాగుతాయని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీకందరికీ నా శుభాకాంక్షలు!

 

******

 


(Release ID: 1876543) Visitor Counter : 182