ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్‌లోని జునాగఢ్లో దాదాపు రూ.3,580 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాపన


“రెండు ఇంజన్ల ప్రభుత్వంతో అభివృద్ధి పనుల వేగం రెట్టింపు”;

“కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో ముఖ్యంగా పశుపోషకులకు..
మత్స్యకార సమాజానికి జీవన సౌలభ్యం కలిగింది”;

“వ్యవస్థాపన సంబంధిత ప్రతి దశలోనూ యువతకు ప్రభుత్వ చేయూత”;

“మౌలిక సదుపాయాల పెరుగుదలతో పర్యాటకానికి ఎనలేని ప్రోత్సాహం”;

“గుజరాత్‌ను బదనాం చేయడమే కొన్ని పార్టీల రాజకీయ సిద్ధాంతంగా మారింది”;

“ఒకే భారతం - శ్రేష్ట భారతం స్ఫూర్తిని..
సర్దార్ పటేల్‌ కలలను వమ్ము కానీయం”;

Posted On: 19 OCT 2022 5:44PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని గుజరాత్‌లోని జునాగఢ్‌లో దాదాపు రూ.3,580 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు తీర జాతీయ రహదారుల నవీకరణ, జోడింపు మార్గాల అనుసంధానం, రెండు నీటి సరఫరా పథకాలు, వ్యవసాయోత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగుల సముదాయ నిర్మాణం తదితరాలకు ఆయన పునాది రాయి వేశారు. అలాగే మాధవ్‌పూర్‌లోని శ్రీకృష్ణ రుక్షమణి మందిరం, మురుగు పారుదల- నీటి సరఫరా ప్రాజెక్టుల సమగ్రాభివృద్ధి, పోర్‌బందర్ ఫిషరీ హార్బర్‌ నిర్వహణ డ్రెడ్జింగ్‌ పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. గిర్ సోమనాథ్ వద్ద, మధ్వాడ్ వద్ద ఫిషింగ్ రేవు అభివృద్ధి సహా రెండు పథకాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

   అనంతరం కార్యక్రమాలకు హాజరైనవారికి ఉద్దేశించి మాట్లాడుతూ- జునాగఢ్‌ వాసులకు ధన్‌తేరస్‌, దీపావళి పండుగలు ముందుగానే రావడంతోపాటు కొత్త సంవత్సరం వేడుకల సన్నాహాలు అప్పుడే మొదలైపోయాయని చమత్కరించారు. అలాగే హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలర్పిస్తూ, ఆశీస్సులు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పటి రాష్ట్ర బడ్జెట్తో పోలిస్తే అంతకన్నా ఎక్కువ విలువగల ప్రాజెక్టులను అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించడంపై ప్రధాని హర్షం ప్రకటించారు. గుజరాత్‌ ప్రజానీకం ఆశీస్సులతోనే ఇదంతా సాధ్యమైందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

   జునాగఢ్, గిర్ సోమనాథ్, పోర్ బందర్‌లతో కూడిన ప్రాంతాన్ని గుజరాత్ పర్యాటక రాజధానిగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పునాదిరాయి పడిన పథకాలు యువత ఉపాధికి, స్వయం ఉపాధికి అపార అవకాశాలు సృష్టిస్తాయన్నారు. “ఇవాళ నా ఛాతీ సగర్వంగా ఉప్పొంగుతోంది” అని వ్యాఖ్యానిస్తూ- ఈ ఘనత మొత్తం గుజరాత్ ప్రజలతోపాటు వారిచ్చిన ఆశీర్వాదాలకే దక్కుతుందన్నారు. కేంద్రంలో బాధ్యతలు చేపట్టేందుకు తాను గుజరాత్‌ వీడిన తర్వాత కూడా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బృందం అదే విలువలు, సంప్రదాయాలతో గుజరాత్‌ను నడిపిస్తున్నదని ప్రధాని ప్రశంసించారు. “నేడు గుజరాత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది” అని ప్రధానమంత్రి అన్నారు.

   ప్రాంతంలో ఒకనాటి కరువులు, ఇతర ప్రాంతాలకు జనం వలసలు వగైరా కష్ట సమయాలను ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే, రెండు దశాబ్దాలుగా వాతావరణ ప్రతికూలతలు తగ్గాయని, అంకితభావం-కచ్చితత్వంతో కష్టించే ప్రజలకు ప్రకృతి కూడా ఈ విధంగా సహకరిస్తున్నదని ప్రధాని వ్యాఖ్యానించారు. “ఒకవైపు ప్రజల ఆశీర్వాదం, మరోవైపు ప్రకృతి మద్దతుతో ప్రజల సేవలో జీవితం గడపడం ఆనందంగా ఉంది” అని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. సుదూర తీర్థయాత్ర క్షేత్రమైన నర్మద నదీమాత ప్రజలు చెమటోడ్చటంతో సౌరాష్ట్ర గ్రామీణ ప్రాంతాలను ఆశీర్వదించడానికి తరలి వచ్చిందని ప్రధాని అన్నారు. జునాగఢ్ రైతులు పూర్తి అంకితభావంతో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారని ఆయన ప్రశంసించారు. గుజరాత్‌లో పండే కేసర్ మామిడి పండ్ల రుచి నేడు ప్రపంచ ప్రజానీకానికి నోరూరిస్తున్నదని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.

   సువిశాల భార‌త‌ తీరప్రాంతం గురించి ప్ర‌ధాని ప్ర‌స్తావిస్తూ- దేశ తీర రేఖ‌లో అధికశాతం గుజ‌రాత్‌కే సొంతమన్నారు. సముద్రాలను ఒక మోయలేని భారంగా, దాని స్వచ్ఛమైన గాలిని విషపూరితమైనదిగా గత ప్రభుత్వాలు పరిగణించేవని, ఇప్పుడు ఆ కాలం మారిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. “ఒకనాడు భారమని భావించిన సముద్రాలే ఇవాళ మా కృషితో ఎనలేని ఫలితాలిస్తున్నాయి” అని స్పష్టం చేశారు. లోగడ కష్టనష్టాలకు గురైన కచ్‌ ప్రాంతం ఇవాళ గుజరాత్‌ ప్రగతికి మార్గనిర్దేశం చేస్తున్నదని పేర్కొన్నారు. గుజరాత్‌ ప్రగతికి 25 ఏళ్ల కిందట తాను పూనిన దృఢ సంకల్పం నేడు సత్ఫలితాలిస్తున్నదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మత్స్యకార సమాజ సంక్షేమం, భద్రత, సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన దిశగా ‘సాగర్ ఖేడు’ పథకాన్ని ప్రారంభించానని ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఈ కృషితో రాష్ట్రం నుంచి చేపల ఎగుమతి ఏడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. అప్పట్లో జపాన్‌ ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శించిన సంఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మత్స్యరంగం ప్రగతికి తీసుకున్న చర్యలపై ప్రదర్శనను వారు తిలకించారని పేర్కొన్నారు. అమోఘమైన రుచికి పేరుపొందిన సుర్మాయి చేపను తెరపై చూసి, ఆ చేప వంటకం తమకు రుచి చూపాల్సిందేనని ప్రతినిధులు పట్టుబట్టారని తెలిపారు. ఇప్పుడు సుర్మాయి చేపకు జపాన్‌ మార్కెట్‌లో గిరాకీ పెరిగిందని, తదనుగుణంగా ఏటా ఎగుమతులు కూడా గణనీయంగా సాగుతున్నాయని ఆయన చెప్పారు. మొత్తంమీద “రెండు ఇంజన్ల ప్రభుత్వం అభివృద్ధి పనుల వేగాన్ని రెట్టింపు చేసింది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక్కరోజే మూడు ఫిషింగ్‌ రేవుల పనులు ప్రారంభం కావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

   గుజరాత్‌లో తొలిసారి రైతులు, పశుపోషకులు, సాగర్‌ ఖేడు పథకం మత్స్యకారులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకంతో సంధానించబడ్డారని ప్రధాని తెలిపారు. తద్వారా వారు బ్యాంకు రుణాలు పొందే ప్రక్రియ సరళంగా మారిందని చెప్పారు. “ఈ పథకంతో ఇప్పుడు 3.5 కోట్ల మంది లబ్ధిదారులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు సేవలను వినియోగించుకుంటున్నారు” అని శ్రీ మోదీ తెలిపారు. సమాజంలోని నిరుపేదలు, ఆపన్నులు తమ కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పరచుకోవడానికి ఇది సాధికారత కల్పించిందని ప్రధాని అన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించే లబ్ధిదారులకు వడ్డీ మాఫీ కూడా లభిస్తుందని ఆయన తెలిపారు. “కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో ముఖ్యంగా పశుపోషకులకు.. మత్స్యకార సమాజానికి జీవన సౌలభ్యం కలిగింది” అని ప్రధానమంత్రి అన్నారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- “రెండు దశాబ్దాల్లో ఓడరేవుల విస్తృత ప్రగతి ఫలితంగా గుజరాత్‌ సౌభాగ్యానికి తలుపులు తెరుచుకున్నాయి. రాష్ట్రానికి కొత్త అవకాశాలు పోటెత్తాయి” అన్నారు. సాగరమాల పథకం గురించి ప్రస్తావిస్తూ- కేవలం ఓడరేవులను అభివృద్ధి చేయడమేగాక రేవుల ఆధారిత ప్రగతి కోసం భారత తీరప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనను ప్రోత్సహించడంపై ప్రభుత్వం చొరవ తీసుకున్నదని ప్రధాని చెప్పారు. “దీని ఆధారంగా గుజరాత్‌లోని రేవు ప్రాంతాల్లో అనేక కొత్త ప్రాజెక్టులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్త తీర జాతీయ రహదారి జునాగఢ్‌తోపాటు పోర్‌బందర్‌, జామ్‌నగర్, దేవభూమి ద్వారక, మోర్బి వంటి అనేక జిల్లాల మీదుగా మధ్య-దక్షిణ గుజరాత్‌ వరకూ వెళ్తుంది. గుజరాత్ తీరప్రాంతం మొత్తాన్నీ ఇది మరింత బలంగా అనుసంధానిస్తుంది” అని ప్రధాని వెల్లడించారు.

   రాష్ట్ర ప్రగతిలో తల్లులు, సోదరీమణుల కృషి అద్భుతమని, గుజరాత్‌కు వారు రక్షణ కవచంగా మారారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఇక గత 8 ఏళ్లలో మహిళా నేతృత్వ ప్రగతి సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తల్లులు, సోదరీమణుల జీవన సౌలభ్యం కోసం అన్ని స్థాయులలోనూ పలు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. దీంతో మహిళల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు వారి ఆత్మగౌరవం ఇనుమడించిందని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ అభియాన్ కింద కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణమే ఈ ఘనతకు కారణమని ప్రధాని విశ్లేషించారు. అలాగే ఉజ్వల యోజన మహిళల సమయాన్ని ఆదా చేయడమేగాక వారితోపాటు కుటుంబ ఆరోగ్యం మెరుగుకు దోహదం చేస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు. లోగడ ఓ గ్రామంలో ‌కాసిని చేతిపంపులు ఏర్పాటు చేసి, ఆర్భాటంగా వాటికి ప్రారంభోత్సవం చేస్తూ ఏదో పెద్ద ఘనత సాధించినట్లు ప్రచారం చేసుకునే కాలం ఉండేదని ప్రధాని ఎద్దేవా చేశారు. “ఆ పరిస్థితి నుంచి ఇవాళ మీ కుమారుడు ఇంటింటికీ కొళాయి నీరు సరఫరా చేస్తున్నాడు” అంటూ తమ ప్రభుత్వం చేసిన కృషిని నొక్కిచెప్పారు. ప్ర‌ధానమంత్రి మాతృ వంద‌న యోజ‌న‌ గురించి ప్రస్తావిస్తూ- ఈ పథకం కింద గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం కోసం అనేకానేక రూపాల్లో ప్రభుత్వం సహాయం చేస్తున్నదని ఆయన గుర్తుచేశారు. “ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద మా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో అధికశాతం మహిళల పేరిటే ఉన్నాయి” అని ప్రధాని పేర్కొన్నారు. అలాగే “ఇవాళ మా ప్రభుత్వం స్వయం సహాయ సంఘాల ద్వారా గ్రామగ్రామాన మహిళా వ్యవస్థాపకతకు విస్తృత చేయూతనిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికిపైగా సోదరీమణులు ఈ సంఘాలతో ముడిపడి ఉన్నారు, వీరిలో గుజరాత్‌ రాష్ట్రవాసులు కూడా లక్షల మంది ఉన్నారు. మరోవైపు ముద్రా యోజన కింద పలువురు సోదరీమణులు తొలిసారి పారిశ్రామికవేత్తలుగా మారారు” అని ప్రధానమంత్రి వివరించారు.

   గుజరాత్‌ సహా దేశవ్యాప్తంగా యువతకిస్తున్న ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతూ- యువతరంలో సామర్థ్యం పెంచేందుకు ఎనిమిదేళ్లుగా తాము అనేక చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి తెలిపారు. విద్య నుంచి ఉపాధి, స్వయం ఉపాధి వరకూ ప్రతి అంశంలోనూ సరికొత్త అవకాశాల సృష్టికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఆ మేరకు నేడు వ్యవస్థాపన సంబంధిత ప్రతి దశలోనూ యువతకు అడుగడుగునా ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. అంతకుముందు గాంధీనగర్‌లో తాను ప్రారంభించిన ‘డిఫెక్స్‌ పో-2022’ గురించి ప్రధాని వివరిస్తూ- గుజరాత్‌లో యుద్ధ ట్యాంకులు తయారయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. విద్యా రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని కూడా ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. గత 8 ఏళ్లలో దేశమంతటా వందలాది విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. అందులో భాగంగా గుజరాత్‌లోనూ అనేక నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానంతో గుజరాతీ భాషలో కొత్త అవకాశాలు అందివస్తాయని చెప్పారు. అంతేగాక డిజిటలీకరణ పరిణామాలు కూడా గుజరాత్ యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. “డిజిటల్ ఇండియా కార్యక్రమంతో గుజరాత్ యువత తమ రకరకాల ప్రతిభకు మెరుగులు దిద్దుకునే కొత్త అవకాశాలు కల్పించింది. దీంతో కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడ్డాయి. యువతకు పెద్ద మార్కెట్‌ అందుబాటులోకి వచ్చింది. చౌకగా లభించే ‘భారత తయారీ’ మొబైల్ ఫోన్లతోపాటు చౌక డేటా సదుపాయంతో ఇదంతా సాధ్యమైంది” అని ప్రధాని వివరించారు.

   మౌలిక సదుపాయాల పెరుగుదలతో పర్యాటకానికి ఎనలేని ప్రోత్సాహం లభిస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు అతిపెద్ద రోప్‌వే ఒకటి అందుబాటులో ఉన్నదని ఆయన తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో కేశోద్ విమానాశ్రయం నుంచి మళ్లీ విమాన సేవలు మొదలయ్యాయని ప్రధాని చెప్పారు. ఈ విమానాశ్రయం మరింత అభివృద్ధి చెంది, సరకుల రవాణా సదుపాయాలు కూడా ఏర్పడితే ఇక్కడినుంచి పండ్లు, కూరగాయలు, చేపలుసహా ఇతర ఉత్పత్తుల రవాణా సులభం కాగలదన్నారు. కేశోద్ విమానాశ్రయ విస్తరణవల్ల దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఇక్కడి అన్ని ప్రదేశాల సందర్శన సులభమై, పర్యాటక రంగం మరింత వృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

   అంతరిక్షం, శాస్త్రవిజ్ఞానం లేదా క్రీడారంగం.. వగైరాలలో జాతీయ విజయాలపై దేశం మొత్తం హర్షాతిరేకంతో ఉప్పొంగుతోందని ప్రధాని గుర్తుచేశారు. అయితే, గుజరాత్సహా, ఈ రాష్ట్ర ప్రజలు సాధిస్తున్న విజయాలను కొన్నివర్గాలు రాజకీయం చేసే ధోరణి పెరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. “గుజరాత్‌ను బదనాం చేయడమే కొన్ని పార్టీలకు రాజకీయ సిద్ధాంతంగా మారింది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గుజరాతీలను... ఆ మాటకొస్తే దేశంలోని ఏ రాష్ట్ర ప్రజలనైనా అవమానిస్తే ఎంతమాత్రం సహించేది లేదని ఆయన నొక్కిచెప్పారు. ఈ మేరకు మనం ‘ఒకే భారతం - శ్రేష్ట భారతం’ స్ఫూర్తిని, సర్దార్‌ పటేల్‌ కన్న కలలను పలుచన కానివ్వరాదన్నారు. నిరాశను ఆశగా మార్చుకుంటూ ప్రగతి పథంలో పయనించడం ద్వారా అసత్యాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. గుజరాత్ ఐక్యతే దాని బలమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంట్ సభ్యులు శ్రీ రాజేష్ భాయ్ చుదాసామ, శ్రీ రమేష్ ధాదుక్సహా  రాష్ట్ర మంత్రులు శ్రీ రుషీకేశ్‌ పటేల్, శ్రీ దేవభాయ్ మాలం తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   తీరప్రాంత జాతీయ రహదారుల నవీకరణ, జోడింపు మార్గాల అనుసంధానం పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కింద తొలిదశలో గుజరాత్‌లోని 13 జిల్లాల మీదుగా జాతీయ రహదారి 270 కిలోమీటర్ల పొడవున వెళ్తుంది. దీంతోపాటు రెండు నీటి సరఫరా పథకాలు, వ్యవసాయోత్పత్తుల నిల్వ కోసం జునాగఢ్‌లో గిడ్డంగుల సముదాయం నిర్మాణానికి ఆయన పునాది రాయి వేశారు. అలాగే మాధవ్‌పూర్‌లోని శ్రీకృష్ణ రుక్షమణి మందిరం, మురుగు పారుదల- నీటి సరఫరా ప్రాజెక్టుల సమగ్రాభివృద్ధి, పోర్‌బందర్ ఫిషరీ హార్బర్‌ నిర్వహణ డ్రెడ్జింగ్‌ పనులకు కూడా పోర్‌బందర్‌ వద్ద ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. మరోవైపు గిర్ సోమనాథ్ వద్ద, మధ్వాడ్ వద్ద ఫిషింగ్ రేవు అభివృద్ధి సహా రెండు పథకాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

 

జునాగఢ్‌లో పర్యటన ఎంతో సంతోషదాయకం. పౌరులకు ఎనలేని ప్రయోజనాలు చేకూర్చే వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబడింది

*****

DS/TS



(Release ID: 1869374) Visitor Counter : 132