ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

గుజరాత్‌లో ‘పీఎంజేఏవై-ఎంఎ’ యోజన ఆయుష్మాన్ కార్డుల పంపిణీకి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీకారం


“ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆరోగ్య బీమా మాటలకే పరిమితం…
భారతదేశం ఒక్కటే ఆచరణాత్మకంగా ఆరోగ్య భరోసా కల్పిస్తోంది”;

“నేడు మా పథకాలు సామాన్యుల అవసరాలను నేరుగా తీరుస్తాయి”;

“పౌరులకు సాధికారత లభించినప్పుడే దేశం శక్తిమంతం అవుతుంది”;

“ఆయుష్మాన్ కార్డు రూ.5 లక్షల ఏటీఎం… ఇది ఏటా
ఉచిత చికిత్స ప్రయోజనాన్ని అందించే ఏటీఎం కార్డు”;

“దీనితో 30-40 ఏళ్లలో రూ.1.5-2 కోట్లదాకా విలువైన చికిత్సకు భరోసా”

Posted On: 17 OCT 2022 5:59PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లో ‘పీఎంజేఏవై-ఎంఎ’ యోజన ఆయుష్మాన్ కార్డుల పంపిణీకి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శ్రీకారం చుట్టారు. అనంతరం పథకం లబ్ధిదారులతో ఆయన కొద్దిసేపు సంభాషించారు. ఇందులో భాగంగా బనస్కాంత జిల్లా తువార్‌ నివాసి శ్రీ పీయూష్‌ భాయ్‌తో ముచ్చటిస్తూ- వారి కుటుంబం గురించి, ఆయన ఆరోగ్యం గురించి ప్రధాని వాకబు చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంతో ఆయన మెరుగైన చికిత్స పొంది కొత్త జీవితం ప్రారంభించారని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వంటి పేదల విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

   అటుపైన మహీసాగర్‌ వాస్తవ్యుడు శ్రీ దమోర్‌ లాలాభాయ్‌ సోమాభాయ్‌తో ప్రధాని సంభాషించారు. ఆయనకు కేన్సర్‌ చికిత్స ఎలా సాగిందో ఆరాతీశారు. శ్రీ దమోర్‌కు ఒక్కపైసా కూడా ఖర్చులేకుండా ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద చికిత్స పూర్తి కావడంపై ప్రధాని సంతోషం వెలిబుచ్చారు. అదే సమయంలో పొగాకు వాడటం మానేస్తానని శపథం చేయాల్సిందిగా కోరారు. దాంతోపాటు పొగాకు దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

   గాంధీనగర్‌ నివాసి, దర్జీ పనిచేసే మరో లబ్ధిదారు శ్రీమతి రమీలాబెన్‌ ప్రధానితో ముచ్చటిస్తూ- తనకు ఆయుష్మాన్‌ కార్డు లేకపోయి ఉంటే చికిత్స కోసం అప్పు చేయాల్సి వచ్చేదని చెప్పారు. అయినప్పటికీ శస్త్రచికిత్స చేయించుకోవడం సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు. దీనిపై ప్రధానమంత్రి స్పందిస్తూ- తల్లులు, సోదరీమణులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంపై హర్షం ప్రకటించారు.

   బ్ధిదారులతో సంభాషించిన తర్వాత ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్ర‌సంగించారు. ధ‌న్‌తేరస్, దీపావ‌ళి పర్వదినాలకు ముందు ప్ర‌జారోగ్యంపై ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ధన్‌తేరస్‌ సమీపిస్తున్నదని, ఆయుర్వేదానికి మూలపురుషుడుగా భావించే దైవం ధన్వంతరిని ఈ సందర్భంగా పూజించడం యాదృచ్చికమని పేర్కొన్నారు. శాస్త్రాలను ఉటంకిస్తూ, “ఆరోగ్యం పరమం భాగ్యం” అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాయకత్వంలో గుజరాత్‌లోని లక్షలాది మందికి ఆరోగ్య సౌభాగ్యం ప్రసాదించే ఈ బృహత్తర కార్యక్రమం ఏర్పాటు కావడంపై సంతోషం వెలిబుచ్చారు.

   దేవిధంగా ‘సర్వే సంతు నిరామయా’ స్ఫూర్తితో ప్రజలంతా ఎలాంటి వ్యాధులు లేకుండా జీవించాలని ఆకాంక్షిస్తూ ఆయుష్మాన్‌ యోజన అందరికీ ఆరోగ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నదని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌కు 50 ల‌క్ష‌ల కార్డులు పంపిణీ చేసే భారీ కార్యక్రమం నిర్వహించడాన్ని ప్ర‌ధానమంత్రి ప్ర‌శంసించారు. ఇది గుజరాత్ ప్రభుత్వ చొరవకు, చైతన్యానికి నిదర్శనమని కొనియాడారు. “ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆరోగ్య బీమా గురించి మనం వింటున్నాం.. కానీ, భారతదేశం ఆచరణాత్మకంగా అందరికీ ఆరోగ్యంపై భరోసా కల్పిస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు. మారిన రాజకీయ ఆలోచన ధోరణి, పని సంస్కృతి గురించి కూడా ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వాల హయాంలో సామాన్యులకు ఉపయోగపడే పథకాలు నామమాత్రంగానే మిగిలాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలు, నిర్దిష్ట అంశాల్లో స్వార్థపూరిత లబ్ధి కోసమే పథకాలపై సొమ్ము వెచ్చించారని పేర్కొన్నారు. “ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఏర్పడింది. ఆ మార్పు దిశగా మేం చొరవ చూపాం. కాబట్టే ఇవాళ ప్రణాళిక దశలోనే సామాన్యుల స్థితిగతులు, వారి అవసరాలపై అధ్యయనం చేస్తున్నాం” అని చెప్పారు. అలాగే “నేడు మా పథకాలు సామాన్యుల అవసరాలను నేరుగా తీరుస్తున్నాయి” అని పేర్కొన్నారు.

   ప్రధాని తన ప్రసంగం కొనసాగిస్తూ-  “పౌరులకు సాధికారత లభించినప్పుడే దేశం శక్తిమంతం అవుతుంది. అందుకే సాధారణ పౌరులకు.. ముఖ్యంగా దేశంలోని మహిళలకు సాధికారత కల్పనపై మేం దృష్టి సారించాం” అని ఉద్ఘాటించారు. ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌, పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, ఉచిత రేషన్‌, కొళాయి నీరు వగైరాలు ఈ విధానాలకు నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది పేద రోగులు ఆరోగ్య ప్రయోజనాలు పొందారని ప్రధానమంత్రి తెలిపారు. వీరిలో దాదాపు 50 లక్షల మంది గుజరాత్‌కు చెందిన వారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధి గురించి నొక్కిచెబుతూ- ఈ లబ్ధిదారుల చికిత్స కోసం కోట్లాది రూపాయలు వెచ్చించిందని గుర్తుచేశారు. ఈ పథకం లేకపోయినట్లయితే పేదలు తమ జేబుల నుంచే చికిత్స ఖర్చు భరించాల్సి వచ్చేదని ప్రధాని వ్యాఖ్యానించారు.

   పథకం లబ్ధిదారులలో 50 శాతానికిపైగా తల్లులు, సోదరీమణులు కావడం తనకెంతో సంతృప్తినిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. అంతకుముందు వీరంతా కుటుంబ ప్రయోజనాల నిమిత్తం తమ అనారోగ్యాన్ని గుంభనగా ఉంచేవారని శ్రీ మోదీ గుర్తుచేశారు. తమ చికిత్స కోసం పెద్ద మొత్తం ఖర్చుచేస్తే ఇంటిల్లిపాదీ అప్పుల భారం మోయాల్సి వస్తుందన్న ఆందోళనతోనే వారు ఇలా చేసేవారని పేర్కొన్నారు. “ఆయుష్మాన్ భారత్ యోజన పేద తల్లులు, సోదరీమణులకు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పించింది. ఒక్కమాటలో చెబితే, ఆయుష్మాన్ కార్డు రూ.5 లక్షల ఏటీఎం. ఇది ఏటా ఉచిత చికిత్స ప్రయోజనాన్ని అందించే ఏటీఎం కార్డు” అని ప్రధాని అన్నారు. ఒక వ్యక్తి 30-40 సంవత్సరాలు జీవించినట్లయితే, ఆ వ్యవధిలో రూ.1.5-2 కోట్ల విలువైన ఉచిత చికిత్సకు హామీ ఉంటుందని వివరించారు. “ఆయుష్మాన్ కార్డు మీ నిజమైన స్నేహితుడు, అతిపెద్ద ఆపద్బాంధవి” అన్నారు.

   గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తాను ప్రవేశపెట్టిన “చిరంజీవి, బాల్‌భోగ్‌, ఖిల్‌ఖిలత్‌” వంటి పథకాల గురించి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. అలాగే రాష్ట్రంలో చాలా ఏళ్లకిందటే ‘ముఖ్యమంత్రి అమృతం’ పేరిట ఒక పథకం అమలులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ‘పీఎంజేఏవై-ఎంఎ’ పథకంతో గుజరాత్‌ ప్రజలు రాష్ట్రం వెలుపల కూడా చికిత్స ప్రయోజనం పొందగలుగుతారని ప్రధాని పేర్కొన్నారు.

నేపథ్యం

   గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో అనారోగ్యం, చికిత్స ఖర్చులు భరించలేని పేదలు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకోకుండా శ్రీ మోదీ 2012లో ‘ముఖ్యమంత్రి అమృతం’ (ఎంఏ) పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2014లో వార్షికాదాయ  పరిమితి రూ.4 లక్షలుగా ఉన్న కుటుంబాలకూ వర్తించేలా ఈ పథకం విస్తరించబడింది. అటుపైన మరోసారి ఈ పథకాన్ని విస్తరించి ‘ముఖ్యమంత్రి అమృతం వాత్సల్య’ (ఎంఏవీ)గా పునఃనామకరణం చేశారు.

   రాష్ట్రంలో ఈ పథకం సాధించిన విజయం స్ఫూర్తితోనే ఆయుష్మాన్‌ భారత్‌ - ప్రధానమంత్రి జనారోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)ను 2018లో ప్రధాని శ్రీ మోదీ ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య బీమా పథకం కాగా, దీనికింద పేద కుటుంబాల పరిమాణం, వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఏటా రూ.5 లక్షల విలువైన ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయులలో చికిత్స ఉచితంగా లభిస్తుంది. ‘ఏబీ-పీఎంజేఏవై’ ప్రారంభంతో గుజరాత్‌లో అమలు చేస్తున్న ‘ఎంఏ-ఎంఏవీ’ పథకాలను 2019లో విలీనం చేసి, ‘పీఎంజేఏవై-ఎంఏ’గా పేరు మార్చారు. తదనుగుణంగా ‘పీఎంజేఏవై-ఎంఏ’ కార్డుదారులందర్నీ ‘ఏబీ-పీఎంజేఏవై’ కింద అర్హులుగా ప్రకటించారు.

   కాగా, నేటి కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం రంగులలో ముద్రించిన 50 లక్షల కార్డులు గుజరాత్‌ రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ వారి ఇళ్లవద్దనే అందజేయబడ్డాయి. ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ గుర్తింపుగల ప్రాతినిధ్య సంస్థలు అంతకుముందే లబ్ధిదారుల గుర్తింపు లాంఛనం (ఈ-కేవైసీ) పూర్తిచేశాయి.

 

***(Release ID: 1868666) Visitor Counter : 121