ప్రధాన మంత్రి కార్యాలయం

అహ్మదాబాద్ లోని అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీ వద్ద అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించిన ప్రధానమంత్రి


గాంధీనగర్ స్టేషన్ లో గాంధీనగర్-ముంబై మధ్య నడిచే కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి
అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి పచ్చజెండా
“21వ శతాబ్దికి, అర్బన్ కనెక్టివిటీకి, ఆత్మనిర్భర్ భారత్ కు ఇది కీలకమైన దినం”

“21వ శతాబ్ది భారతదేశం నగరాల ద్వారా కొత్త ఉత్తేజం పొందుతుంది”

“దేశ మెట్రో చరిత్రలోనే తొలిసారిగా 32 కిలోమీటర్ల నిడివి గల మెట్రో మార్గం ఒకేసారి ప్రారంభమవుతోంది”

“21వ శతాబ్ది భారతదేశం వేగమే కీలకంగా పరిగణిస్తుంది, వేగవంతమైన అభివృద్ధికి హామీ ఇస్తుంది”

“జాతీయ గతిశక్తి మాస్టర్ ప్లాన్, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీలో వేగం స్పష్టంగా కనిపిస్తుంది”

“గత 8 సంవత్సరాల కాలంలో మేం మౌలిక వసతులను ప్రజల ఆకాంక్షలతో అనుసంధానం చేశాం”

Posted On: 30 SEP 2022 1:47PM by PIB Hyderabad

అహ్మదాబాద్ లోని అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణంలో అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టు తొలి దశను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడంతో పాటు కలుపూర్ స్టేషన్ నుంచి దూరదర్శన్ కేంద్ర మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. అలాగే గాంధీనగర్-ముంబై మధ్యన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు గాంధీనగర్ స్టేషన్ లో పచ్చజెండా ఊపి ప్రారంభించడంతో పాటు కలుపూర్ మెట్రో స్టేషన్ వరకు ఆ రైలులో ప్రయాణించారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు హాజరైన వారినుద్దేశించి మాట్లాడుతూ 21వ శతాబ్ది భారతదేశానికి, పట్టణ కనెక్టివిటీకి, ఆత్మనిర్భర్ భారత్ కు ఇది కీలకమైన రోజు అన్నారు. వందే భారత్ రైలు, అహ్మదాబాద్ మెట్రోలలో ప్రయాణించినందుకు ఆయన ఆనందం ప్రకటించారు.

వందే భారత్ రైళ్ల లోపల సౌండ్ ప్రూఫింగ్ ను ప్రధానమంత్రి ప్రశంసించారు. విమానాల లోపల సౌండ్ ప్రూఫింగ్ తో పోల్చితే వందే భారత్ రైళ్ల లోపల ధ్వని నూరు శాతం తగ్గిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన అహ్మదాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ అహ్మదాబాద్ ప్రజల జ్ఞానం, కాలిక్యులేషన్ అద్భుతమని ఛలోక్తిగా ఆయన అన్నారు. “అహ్మదాబాద్ కు నేను సంపూర్ణంగా అభివాదం చేయలేను, అహ్మదాబాద్ నా హృదయాన్ని దోచుకుంది” అని చలించిపోయినట్టు స్పష్టంగా కనిపించిన ప్రధానమంత్రి అన్నారు.

దేశంలోని నగరాల నుంచి 21వ శతాబ్ది భారతం కొత్త ఉత్తేజం పొందుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “మారుతున్న కాలం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా మన నగరాలను నిరంతరం ఆధునికీకరిస్తూ ఉండాలి” అని శ్రీ మోదీ చెప్పారు. నగరాల్లోని రవాణా వ్యవస్థ కూడా ఆధునికం అవుతూ ఉండాలి, ఒక దానికి ఒకటి మద్దతు ఇవ్వగలిగే నిరంతరాయ రవాణా వ్యవస్థ అభివృద్ధి కావాలి అని ఆయన అన్నారు. ఈ ఆలోచనకు దీటుగానే పట్టణ మౌలిక వసతుల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. గత 8 సంవత్సరాల కాలంలో రెండు డజన్లకు పైగా నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయి లేదా పురోగమన దశలో ఉన్నాయన్నారు. కొన్ని డజన్ల చిన్న నగరాలు ఉడాన్ స్కీమ్ పుణ్యమా అని వాయు కనెక్టివిటీ కలిగి ఉన్నాయని చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్లు కూడా భారీగా పరివర్తన చెందుతున్నాయన్నారు. “నేడు గాంధీనగర్ రైల్వే స్టేషన్ ప్ర‌పంచంలోని ఏ విమానాశ్రయం కన్నా తక్కువ కాదు” అన్నారు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

అహ్మదాబాద్-గాంధీనగర్ విజయం గురించి ప్రస్తావిస్తూ జంటనగరాల అభివృద్ధి కాన్సెప్ట్ విజయం గురించి ప్రధానమంత్రి వివరించారు. అలాగే ఆనంద్-నదియాడ్, భారూచ్-అంకాలేశ్వర్, వల్సద్-వాపి, సూరత్-నవ్ సారి, వడోదర-హలోల్ కలోల్, మోర్వి-వాంకనీర్, మెహసనా-కడి వంటి పలు జంట నగరాలు గుజరాత్ గుర్తింపును పటిష్ఠం చేస్తాయని చెప్పారు.

రానున్న 25 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందిన దేశం హోదా సాధించడంలో అహ్మదాబాద్, సూరత్, భోపాల్, ఇండోర్, జైపూర్ వంటి నగరాలు కీలక పాత్ర పోషించనున్నాయని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచ వ్యాపారాల డిమాండ్లకు అనుగుణంగా పాత నగరాలు, కొత్త నగరాల మెరుగుదల, విస్తరణకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “చక్కని ప్లగ్ అండ్ ప్లే వసతులకు గిఫ్ట్ సిటీలు చక్కని ఉదాహరణ” అన్నారు.

దేశ మెట్రో చరిత్రలోనే తొలిసారిగా ఏక కాలంలో 32 కిలోమీటర్ల నిడివి గల మెట్రో మార్గాన్ని ప్రారంభించినట్టు ప్రధానమంత్రి చెప్పారు. రైల్వే లైనుపై మెట్రో మార్గం నిర్మాణంలో ఎదురైన సవాళ్లను కూడా దీటుగా ఎదుర్కొని ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ గురించి మాట్లాడుతూ ఈ రైలుతో రెండు పెద్ద నగరాలు అహ్మదాబాద్-ముంబై మధ్య ప్రయాణం సౌకర్యవంతం కావడంతో పాటు దూరం కూడా తగ్గుతుందని ప్రధానమంత్రి చెప్పారు. రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని సాధారణ ఎక్స్ ప్రెస్ రైలు ఏడు నుంచి ఎనిమిది గంటల వ్యవధిలో పూర్తి చేస్తే శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఆరున్నర, ఏడు గంటల వ్యవధిలో పూర్తి చేస్తుందని, అదే వందేభారత్ రైలు గరిష్ఠంగా ఐదున్నర గంటల్లోనే పూర్తి చేయగలుగుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అంతే కాదు, ఇతర రైళ్లతో పోల్చితే వందే భారత్ రైలు ఎక్కువ మంది ప్రయాణికులను కూడా తరలించగలుగుతుందన్నారు. వందేభారత్ రైలు డిజైనింగ్, తయారీలో పాల్గొన్న టెక్నీషియన్లు, ఇంజనీర్లతో తన సంభాషణ గురించి కూడా ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్టు పట్ల వారు చూపిన చొరవ, ప్రదర్శించిన విశ్వాసాన్ని ప్రశంసించారు. కాశీ రైల్వే స్టేషన్ లో తన సంభాషణలో కూడా వందే భారత్ ఎక్స్ ప్రెస్ గురించి ప్రస్తావించి లగేజి పెట్టుకునేందుకు ఎక్కువ ప్రదేశం, తక్కువ ప్రయాణ సమయంతో ఈ రైలు కార్మికులు, పేదలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పిన విషయం గుర్తు చేశారు. “ఇదే వందే భారత్ శక్తి” అని శ్రీ మోదీ అన్నారు. డబుల్-ఇంజన్ ప్రభుత్వ అనుమతులు, మెట్రో ప్రాజెక్టులకు అందించిన ఇతర అనుమతుల కారణంగానే ఈ ప్రాజెక్టు అంత త్వరగా పూర్తయిందని చెప్పారు. పేదలు, సౌకర్యాలు కావలసిన వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రూట్ ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ ప్రాజెక్టుతో కలుపూర్ మల్టీ మోడల్ హబ్ గా మారుతుందని చెప్పారు.

పట్టణాల్లోని పేదలు, మధ్యతరగతి మిత్రులకు వాహనాల పొగ నుంచి విముక్తి కలిగించడం కోసం విద్యుత్ బస్సుల తయారీ, నిర్వహణ లక్ష్యంగా ఫేమ్ పథకం ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. “ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు ఏడు వేలకు పైగా విద్యుత్ బస్సులకు అనుమతి మంజూరు చేశాం” అని శ్రీ మోదీ చెప్పారు. “ఈ విద్యుత్ బస్సులపై కేంద్రప్రభుత్వం రూ.3,500 కోట్ల వరకు ఖర్చు చేసింది” అన్నారు. ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు గుజరాత్ లో 850 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టామని వాటిలో వందలాది బస్సులు నిత్యం నడుస్తున్నాయని ఆయన చెప్పారు.

గతంలో పని చేసిన కేంద్రప్రభుత్వాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ నగరాల్లో ట్రాఫిక్ జామ్ ల నివారణకు అవి చేసిన కృషి నామమాత్రమేనన్నారు. వేగవంతమైన అభివృద్ధికి వేగమే ప్రధానం, హామీ అని 21వ శతాబ్ది భారతం భావించిందని శ్రీ మోదీ చెప్పారు. నేషనల్ గతిశక్తి మాస్టర్ ప్లాన్ లో గాని, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీలో గాని ఈ వేగానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు ప్రధానమంత్రి తెలిపారు. మన రైల్వేల వేగం పెంచడానికి చేసిన కృషిలో కూడా ఇది స్పష్టం అని ప్రధానమంత్రి చెప్పారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 75 వందే భారత్ రైళ్లు నడిపేలా తాము వేగంగా కృషి చేస్తున్నామని తెలిపారు. “కేవలం 52 సెకండ్ల సమయంలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకోగలగడం ఈ వందే భారత్ రైళ్ల ప్రత్యేకత” అని ఆయన చెప్పారు.

రైల్వే నెట్ వర్క్ లో చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రస్తావిస్తూ దేశంలో అధిక భాగం రైల్వే నెట్ వర్క్ మనిషి కాపలా లేని గేట్ల నుంచి విముక్తం అయిందన్నారు. “తూర్పు, పశ్చిమ డెడికేటెడ్ రవాణా కారిడార్లు సిద్ధం అయినట్టయితే గూడ్స్ రైళ్ల వేగం కూడా పెరుగుతుంది. ప్రయాణికుల రైళ్ల జాప్యం తగ్గుతుంది” అని ప్రధానమంత్రి చెప్పారు.

వేగమే కీలకంగా దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రక్రియలో కూడా అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. “గత 8 సంవత్సరాల కాలంలో మేం ప్రజల ఆకాంక్షలతో మౌలిక వసతులను అనుసంధానం చేశాం” అని శ్రీ మోదీ అన్నారు. “ఒకప్పుడు ఎన్నికల్లో విజయం దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులకు సంబంధించిన ప్రకటనలు వెలువడేవి. కాని చివరికి నష్టమే మిగిలేది. పన్ను చెల్లింపుదారులు అందించిన ఆదాయం రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేది. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఈ ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేసింది” అన్నారు. శక్తివంతమైన, విజనరీ ఆలోచనతో మౌలికవసతుల నిర్మాణంలో సుస్థిర అభివృద్ధిని సాధించాం. నేడు పనులన్నీ ఈ ఆలోచనతోనే అనుసంధామయ్యాయి అని ప్రధానమంత్రి చెప్పారు.

భూమికి దిగువన, ఉపరితలంలోను జరుగుతున్న మెట్రో నిర్మాణాలు, వాటిలో పెడుతున్న భారీ పెట్టుబడుల గురించి పాఠశాల, ఇంజనీరింగ్ విద్యార్థులకు తెలియచేయాలన్న ఆకాంక్ష ప్రధానమంత్రి ప్రకటించారు. ఇది దేశ పురోగతిలో టెక్నాలజీ పాత్రపై వారి విశ్వాసాన్ని ఇనుమడింపచేసి వారిలో యాజమాన్య భావాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు. వారిలో యాజమాన్య భావన కలిగితే ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం చేయడానికి ఇష్టపడని కొత్త తరం ఆవిర్భవిస్తుంది; వారి ప్రయత్నాలు, పెట్టుబడులు కూడా ఇలాంటి నిర్మాణాత్మక కార్యకలాపాల వైపు మరలుతాయని ప్రధానమంత్రి అన్నారు.

ఆజాదీ కా అమృత్ కాలంలో అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మించాలంటే ఆధునిక మౌలిక వసతుల నిర్మాణంలో వేగం, శక్తి పెరగాలని ప్రసంగాన్ని ముగిస్తూ ప్రధానమంత్రి అన్నారు. “గుజరాత్ లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఈ దిశగా గట్టి కృషి చేస్తోంది. సబ్ కా ప్రయాస్ (ప్రతీ ఒక్కరి ప్రయత్నం) స్ఫూర్తితో ఈ కల సాకారం అవుతుందని నేను విశ్వసిస్తున్నాను” అని ప్రధానమంత్రి చెప్పారు.

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, కేంద్ర గృహనిర్మాణం-పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పురి, పార్లమెంటు సభ్యుడు శ్రీ సిఆర్ పాటిల్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన విక్రమ్ జర్దోశ్, అహ్మదాబాద్ మేయర్ శ్రీ కిరీట్ పర్మార్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

పూర్వాపరాలు

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు విమానంలో ప్రయాణిస్తున్న అద్భుత అనుభూతిని అందిస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన రైళ్లు డీకొనడాన్ని నివారించే కవచ్ వ్యవస్థ వంటి అత్యాధునిక ఫీచర్లు దీనికి ఉన్నాయి. ప్రతీ తరగతిలోను వెనక్కి వాలి విశ్రాంతి తీసుకునే సీట్లు, ఎగ్జిక్యూటివ్ కోచ్ లలో 180 డిగ్రీలు చుట్టూ తిరిగే సీట్లు ఉన్నాయి. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం, వినోదం అందించేందుకు ప్రతీ ఒక్క కోచ్ లోను 32 అంగుళాల స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టు తొలి దశలో నిర్మించిన 32 కిలోమీటర్ల నిడివి గల మెట్రో మార్గంలో భాగమైన ఈస్ట్-వెస్ట్ కారిడార్ యాపిల్ పార్కు నుంచి తట్లెజ్ ను, నార్త్-సౌత్ కారిడార్ మోతెరా నుంచి గ్యాస్ పూర్ ను అనుసంధానం చేస్తాయి. ఈస్ట్-వెస్ట్ కారిడార్ లో తట్లెజ్-వస్ర్టాల్ మధ్యన 17 స్టేషన్లుంటాయి. ఇందులో 6.6 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మార్గం కూడా ఉంది. ఈ మార్గంలో నాలుగు స్టేషన్లుంటాయి. గ్యాస్ పూర్ నుంచి మోతెరా స్టేడియం మధ్యన విస్తరించిన 19 కిలోమీటర్ల నిడివి గల నార్త్-సౌత్ కారిడార్ లో 15 స్టేషన్లుంటాయి. మొత్తం తొలిదశ నిర్మాణానికి రూ.12,900 కోట్ల వ్యయం అయింది. అండర్ గ్రౌండ్ సొరంగాలు, వయాడక్టులు, వంతెనలు; ఎత్తులోను, భూమికి దిగువన నిర్మించిన స్టేషన్లు, బెలాస్ట్ లెస్ రైల్ ట్రాక్ లు, డ్రైవర్ లేకుండానే నడిచే టెక్నాలజీతో కూడిన బోగీలు వంటి అద్భుత మౌలిక వసతులు అహ్మదాబాద్ మెట్రోలో ఉన్నాయి. రైళ్లకు అమర్చిన ఇంధనం పొదుపు చేసే ప్రొపల్షన్ సిస్టమ్ ఇంధన వినియోగాన్ని 30-35 శాతం మేరకు ఆదా చేస్తుంది. ప్రయాణికులు శ్రమ లేకుండా కుదుపులు లేని ప్రయాణానుభూతి పొందేందుకు రైళ్లకు అత్యాధునిక సస్పెన్షన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ తొలి దశ మెట్రో ప్రాజెక్టు నగరానికి ప్రపంచ శ్రేణి మల్టీ-మోడల్ కనెక్టివిటీని కల్పిస్తుంది. భారతీయ రైల్వే, బస్ వ్యవస్థ (బిఆర్ టిఎస్, జిఎస్ ఆర్ టిసి, సిటీ బస్సు సర్వీస్) ఈ తరహా మల్టీ-మోడల్ కనెక్టివిటీని అందిస్తాయి. రణిప్, వదాజ్, ఎఇసి స్టేషన్ల వద్ద బిఆర్ టిఎస్; గాంధీధామ్, కలుపూర్, సబర్మతి స్టేషన్ల వద్ద రైల్వే నెట్ వర్క్ అనుసంధానత ఉంది. కలుపూర్ లో మెట్రో లైను ముంబై-అహ్మదాబాద్ మధ్యన నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ వ్యవస్థతో అనుసంధానత కలిగిస్తుంది.

దేశంలో ప్రపంచ శ్రేణి మౌలిక వసతుల కల్పన, అర్బన్ మొబిలిటీ పెంపు, మల్టీ-మోడల్ కనెక్టివిటీ కల్పన వంటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్న ప్రధానమంత్రి కట్టుబాటుకు ఈ విస్తృత ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన దర్పణం పడతాయి. సగటు జీవికి జీవన సౌలభ్యం కల్పించేందుకు ఆయన ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిని ఇది ప్రతిబింబిస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1864081) Visitor Counter : 140