ప్రధాన మంత్రి కార్యాలయం
భావ్ నగర్ లో రూ.5200 కోట్లకు పైబడిన ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
ప్రపంచంలోనే తొలి సిఎన్ జి టెర్మినల్ కు ప్రధానమంత్రి శంకుస్థాపన
భావ్ నగర్ లో రీజినల్ సైన్స్ సెంటర్ ప్రారంభించిన ప్రధానమంత్రి
2.25 మెగావాట్ల పలిటానా సోలార్ పివి ప్రాజెక్టులో సౌని యోజన లింక్ కు చెందిన ప్యాకేజ్ 7, ఇతర ప్రాజెక్టులను, ఎపిపిఎల్ కంటైనర్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధానమంత్రి
సౌని యోజన లింక్ 2కు చెందిన ప్యాకేజి 9, చోర్ వడ్ల జోన్ నీటి సరఫరా ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన
“3000 సంవత్సరాల ప్రయాణంలో భావ్ నగర్ నిలకడగా వృద్ధి చెందడంతో పాటు సౌరాష్ట్ర ప్రాంతానికి సాంస్కృతిక రాజధానిగా తనదైన ముద్ర వేసుకుంది”
“గుజరాత్ కోస్తాను భారత సంపన్నతకు గేట్ వేగా మార్చడానికి గత రెండు దశాబ్దాల కాలంలో చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరిగాయి”
“పోర్టు ఆధారిత అభివృద్ధికి భావ్ నగర్ సజీవ ఉదాహరణగా నిలిచింది”
“లోధాల్ ప్రపంచంలో అతి ప్రాచీన పోర్టు, ఇక్కడ లోథాత్ మారిటైమ్ మ్యూజియం ఏర్పాటు ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపు తెస్తుంది”
“రైతుల సాధికారతకు చేపట్టిన విధఃగానే ఇప్పుడు మత్స్యకారులకు కూడా క్రెడిట్ కార్డులు జారీ చేస్తున
Posted On:
29 SEP 2022 3:57PM by PIB Hyderabad
భావ్ నగర్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ.5200 కోట్లకు పైబడిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు లేదా ప్రారంభించారు. ప్రపంచంలోనే తొలి సిఎన్ జి టెర్మినల్ కు, భావ్ నగర్ లో కొత్త పోర్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించిన 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న రీజినల్ సైన్స్ సెంటర్ ను ప్రధానమంత్రి ప్రారంభించారు. అలాగే 2.25 మెగావాట్ల సామర్థ్యం గల పలిటానా సోలార్ పివి ప్రాజెక్టులో సౌని యోజన లింక్ లో ప్యాకేజి 7, ఎపిపిఎల్ కంటైనర్ (అవధ్ కృప ప్లాస్టోమెక్ ప్రైవేట్ లిమిటెడ్) ప్రాజెక్టు సహా వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే సౌని యోజన లింక్ 2కి చెందిన ప్యాకేజి 9కి, చోర్వడ్ల జోన్ నీటి సరఫరా ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.
అత్యంత వేడిగా ఉన్న వాతావరణంలో కూడా ఇంత భారీ సంఖ్యలో ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రజలకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఒకపక్క దేశం 75వ స్వాతంత్ర్య దినోవత్సవ వేడుకలు నిర్వహించుకుంటుండగా భావ్ నగర్ ఏర్పాటైన 300 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటోంది. ఈ 300 సంవత్సరాల ప్రయాణంలో భావ్ నగర్ నిలకడ వృద్ధిని సాధించడంతో పాటు సౌరాష్ట్రకు సాంస్కృతిక రాజధానిగా తనదైన ముద్ర వేసింది. నేడు ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు భావ్ నగర్ అభివృద్ధి యానానికి కొత్త ఉత్తేజం కలిగిస్తోంది. రాజ్ కోట్-జామ్ నగర్-భావ్ నగర్ ప్రాంతం సూరత్-వడోదర-అహ్మదాబాద్ ప్రాంతానికి వచ్చిన ప్రాముఖ్యత పొందుతుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్టు ఆయన చెప్పారు. పరిశ్రమలు, వ్యవసాయం, వ్యాపార రంగాల పరంగా భావ్ నగర్‌కు అద్భుతమైన సామర్థ్యం ఉందని ఆయన తెలిపారు. ఈ దిశగా డబుల్-ఇంజన్ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది సజీవ ఉదాహరణ అన్నారు.
దేశంలో గుజరాత్ కు పొడవైన తీర ప్రాంతం ఉన్నదని, ఆ కోస్తాలో ఏర్పాటైన జిల్లా భావ్ నగర్ అని ప్రధానమంత్రి చెప్పారు. కాని స్వాతంత్ర్యానంతరం కోస్తా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ లోపించడం వల్ల ఈ పొడవైన కోస్తా తీరం ప్రజలకు పెద్ద సవాలుగా మారిందన్నారు. డబుల్-ఇంజన్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ గుజరాత్ తీరాన్ని భారత సుసంపన్నతకు గేట్ వే చేసేందుకు గత రెండు దశాబ్దాలుగా కృషి జరిగిందన్నారు. “మేం గుజరాత్ లో పలు పోర్టులు అభివృద్ధి చేసి ఆధునికీకరించాం” అని ప్రధానమంత్రి చెప్పారు. “ఉపాధికి కొత్త అవకాశాలు కూడా సృష్టించడం జరిగింది” అని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో ఎల్ ఎన్ జి టెర్మినల్ గల తొలి రాష్ట్రం గుజరాత్ అన్నారు. నేడు గుజరాత్ లో మూడు ఎల్ ఎన్ జి టెర్మిన ల్స్ ఉన్నాయన్నారు.
కోస్తా పర్యావరణ వ్యవస్థ ప్రాధాన్యతను నొక్కి చెబుతూ కోస్తా ప్రాంత పరిశ్రమల అభివృద్ధి, వాటికి అవసరం అయిన ఇంధన నెట్ వర్క్ ల అభివృద్ధిలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు ఫిషింగ్ హార్బర్లు నిర్మించి ఫిష్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామన్నారు. అలాగే ఆ ప్రాంతాల్లో చిన్న తోటల వంటి అడవులను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. కోస్తా ప్రాంతాల అభివృద్ధి విషయంలో గుజరాత్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చునని అప్పటి కేంద్రప్రభుత్వం వ్యాఖ్యానించిందని శ్రీ మోదీ తెలిపారు. వ్యవసాయాన్ని ముందుకు నడిపించేందుకు కూడా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నదని ప్రధానమంత్రి అన్నారు. గుజరాత్ లో కోస్తా ప్రాంతం లక్షలాది మంది ఉపాధికి చక్కని మాధ్యమంగా మారిందని, ఎగుమతి, దిగుమతి కార్యకలాపాల్లో కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. “నేడు గుజరాత్ కోస్తా పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజెన్ వ్యవస్థలకు మారుపేరుగా మారింది” అని వ్యాఖ్యానించారు. “మేం సౌరాష్ట్రను ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. నేడు ఏ ఇంధన అవసరాలకైనా ఈ ప్రాంతం ఒక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది” అన్నారు.
స్వయం-సమృద్ధ భారత్ నిర్మాణంలోను, రాష్ట్రంలో కొత్త ఉపాధి అవకాశాల కల్పనలోను భావ్ నగర్ పోర్టు కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “వ్యాపార సంబంధిత స్టోరేజి, రవాణా, లాజిస్టిక్స్ అభివృద్ధి చెందుతాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అలాంగ్ షిప్ బ్రేకింగ్ యార్డ్ చరిత్ర గురించి ప్రస్తావిస్తూ భవిష్యత్తులో వాహన తుక్కు విధానంలోకూడా భావ్ నగర్ పెద్ద లబ్ధిదారు అవుతుందన్నారు. తుక్కుగా మార్చిన ఇనుము నుంచి కంటైనర్ నిర్మాణావకాశాలు కూడా ఏర్పడగలవని ఆయన అన్నారు.
లోథాల్ కు గల చారిత్రక ప్రాధాన్యతను గురించి ప్రస్తావిస్తూ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన పోర్టు అని, తాజాగా లోథాల్ మారిటైమ్ మ్యూజియం నిర్మాణంతో ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు. లోథాల్ ను ప్రపంచ టూరిజం చిత్రపటంలోకి తెచ్చే కృషి వేగంగా సాగుతున్నదని చెప్పారు. “లోథాల్ తో పాటు వెలవడార్ నేషనల్ పార్క్ భావ్ నగర్ కు...ప్రత్యేకించి చిన్న వ్యాపారాలకు లాభం అందించగలుగుతాయి” అని ప్రధానమంత్రి అన్నారు. చైతన్యం లేని కారణంగా ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ప్రాణాంతకమైన పరిస్థితులు ఎదుర్కొన్న స్థితి గురించి ఆయన గుర్తు చేశారు. తాను గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మత్స్యకారులకు కొన్నిమీటలతో కూడిన ఒక బుట్ట అందించిన విషయం కూడా గుర్తు చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కోస్తా గస్తీ దళం సహాయం కోసం మత్స్యకారులు బటన్ నొక్కే వెసులుబాటు కల్పించామన్నారు. అలాగే పడవల మరమ్మత్తులు, ఆధునికీకరణకు మత్స్యకారులకు సబ్సిడీలు కూడా అందించామని చెప్పారు. “అదే తరహాలో మత్స్యకారులకు ఇచ్చినట్టుగానే రైతుల సాధికారతకు క్రెడిట్ కార్డులు అందిస్తున్నాం” అని శ్రీ మోదీ తెలిపారు.
రాజ్ కోట్ తో ప్రారంభించి సౌని యోజన అమలుపరిచిన తర్వాత వచ్చిన మార్పుల పట్ల ప్రధానమంత్రి సంతృప్తి ప్రకటించారు. కొంత మంది పెదవి విరిచినప్పటికీ ఈ ప్రాజెక్టు అద్భుతంగా పురోగమిస్తున్న విషయం నొక్కి చెబుతూ “నేడు సౌని యోజన విభిన్న ప్రాంతాల్లో వేగం పెంచేందుకు నర్మదను అన్ని ప్రాంతాలకు చేర్చుతోంది” అన్నారు. నేడు ప్రారంభిస్తున్న పలు ప్రాజెక్టులు భావ్ నగర్, ఆమ్రేలి ప్రాంతాల్లోని పలు జిల్లాలకు తీసుకువెళ్తాయని ఆయన తెలిపారు. వీటితో భావ్ నగర్ ప్రాంతంలోని గరియధర్, జెసార్, మహువా; ఆమ్రేలి జిల్లాకు చెందిన రజులా, ఖంబా తాలూకాలకు చెందిన పలువురు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని శ్రీ మోదీ చెప్పారు. “భావ్ నగర్, గిర్ సోమనాథ్, ఆమ్రేలి, బొటాడ్, జునాగఢ్, రాజ్ కోట్, పోర్ బందర్ జిల్లాల్లోని పలు నగరాలు, గ్రామాలకు నేడు ప్రారంభించిన పనులు చేరతాయి” అని ప్రధానమంత్రి తెలిపారు.
ఇంత కాలం అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా వెనుకబాటులో నిలిపి ఉంచిన వారందరికీ మద్దతు ఇవ్వడమే డబుల్-ఇంజన్ ప్రభుత్వ కట్టుబాటు అని ప్రసంగం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి అన్నారు. నిరుపేదలకు తగినన్ని వనరులు, గౌరవం అందించగలిగితే తమ శ్రమశక్తి, సంరక్షణ కార్యకలాపాల ద్వారా వారు పేదరికాన్ని అధిగమించగలుగుతారని చెప్పారు. “గుజరాత్ లో తరచుగా గరీబ్ కల్యాణ్ మేళాలు నిర్వహిస్తూ ఉంటాం. అలాంటి ఒక కార్యక్రమంలో నేను భావ్ నగర్ లోనే ఒక సోదరికి ట్రైసికిల్ అందించాను. నేనెప్పుడూ ట్రైసికిల్ నడపలేదని ఆ సోదరి చెప్పింది. అప్పుడు విద్యుత్ ట్రైసికిల్ అందించమని ఆదేశించాను. పేదలకు గల ఆ నమ్మకం, కలలే నేటికీ నాకు బలంగా నిలిచాయి. పేదల ఈ కలలు, ఆకాంక్షలే నిరంతరం పని చేసే శక్తిని నాకు అందిస్తున్నాయి” అని ప్రధానమంత్రి చెప్పారు.
ప్రధానమంత్రి ఈ సందర్భంగా భావ్ నగర్ తో తనకు గల సుదీర్ఘ అనుబంధం గురించి, తన పాత సహచరుల గురించి గుర్తు చేసుకుంటూ కాసేపు గతంలోకి వెళ్లారు. నేటి ప్రాజెక్టులు భావ్ నగర్ కు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు ఉపయోగపడతాయంటూ తనపై ఎల్లప్పుడు అపార ప్రేమాభిమానాలు ప్రకటించే ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్; కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయ, పార్లమెంటు సభ్యుడు శ్రీ సిఆర్ పాటిల్, డాక్టర్ భారతిబెన్ షియాల్, శ్రీ నరంభాయ్ కచాడియా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
పూర్వాపరాలు...
భావ్ నగర్ లో రూ.5200 కోట్లకు పైబడిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. భావ్ నగర్ లో ప్రపంచంలోనే తొలి సిఎన్ జి టెర్మినల్ కు, కొత్త పోర్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.4000 కోట్ల వ్యయంతో ఈ పోర్టును అభివృద్ధి చేస్తారు. ఇక్కడ నిర్మిస్తున్న తొలి సిఎన్ జి టెర్మినల్ కు ప్రపంచంలోనే నాల్గవ లాక్ గేట్ వ్యవస్థ సహా పలు ఆధునిక మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయి. ఈ సిఎన్ జి టెర్మినల్ తో పాటు ఇక్కడ వస్తున్న వివిధ ప్రాజెక్టులతో ఈ ప్రాంతం భవిష్యత్ అవసరాలు తీరతాయి. ఈ పోర్టుకు అత్యాధునిక కంటైనర్ టెర్మినల్, మల్టీపర్పస్ టెర్మినల్, ప్రస్తుత రైల్వే, రోడ్డు మార్గాలతో ఇంటి ముంగిటికి అనుసంధానత ఏర్పడతాయి. కార్గో హ్యాండ్లింగ్ ద్వారా వ్యయాలు పొదుపు కావడం, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అలాగే సిఎన్ జి దిగుమతి టెర్మినల్ స్వచ్ఛ ఇంధనాలకు పెరుగుతున్న డిమాండుకు దీటుగా అదనపు ఇంధన వనరులు అందుబాటులోకి తెస్తుంది.
భావ్ నగర్‌లో రూ.100 కోట్లకు పైబడిన వ్యయంతో 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన రీజినల్ సైన్స్ సెంటర్ ను కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇందులో మెరైన్ అక్వాటిక్ గ్యాలరీ, ఆటోమొబైల్ గ్యాలరీ, నోబుల్ ప్రైజ్ గ్యాలరీ సహా వివిధ థీమ్ ఆధారిత గ్యాలరీలు, ఫిజియాలనీ అండ్ మెడిసిన్, ఎలక్ర్టో-మెకానిక్స్ గ్యాలరీ, బయో సైన్స్ గ్యాలరీ వంటివి ఉంటాయి. అలాగే ఈ సెంటర్ కు వెలుపల ఏర్పాటు చేసిన యానిమాట్రానిక్స డైనోసార్స్, సైన్స్ థీమ్ ఆధారిత టాయ్ ట్రెయిన్ వంటి అన్వేషణాత్మకమైన వసతులుంటాయి. దీనికి తోడు ప్రకృతి అన్వేషణ, మోషన్ సిమ్యులేటర్లు, పోర్టబుల్ సోలార్ అబ్జర్వేటరీలు ఉంటాయి.
ఈ కార్యక్రమంలోప్రధానమంత్రి 2.25 మెగావాట్ల సామర్థ్యం గల పలిటానా సోలార్ పివి ప్రాజెక్టులో సౌని యోజన లింక్ ప్యాకేజి 7ను, ఎపిపిఎల్ కంటైనర్ (అవద్ కృప ప్లాస్టోమెక్ ప్రైవేట్ లిమిటెడ్) ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే సౌని యోజన కింద ప్యాకేజి 9, చోర్వడ్ల జోన్ వాటర్ సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ప్రధానమంత్రి ప్రకటించిన దేశంలో ప్రపంచ శ్రేణి మౌలిక వసతులు అందుబాటులోకి తేవడం, పట్టణ మొబిలిటీని విస్తరించడం, మల్టీ-మోడల్ కనెక్టివిటీని మెరుగు పరచడం వంటి కట్టుబాట్లకు ఈ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభం దర్పణం పడుతుంది. సామాన్య మానవునికి జీవన సౌలభ్యం పెంపునకు ఆయన ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను కూడా ఇవి ప్రతిబింబిస్తాయి.
(Release ID: 1863692)
Visitor Counter : 187
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam