ప్రధాన మంత్రి కార్యాలయం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞాన సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
21వ శతాబ్ద ప్రగతికి దోహదం చేస్తున్నవాటిలో శక్తివంతమైనది శాస్త్రవిజ్ఞానం..ఇది దేశంలోని ప్రతి ప్రాంతం, రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుంది : ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
నాలుగో పారిశ్రామిక విప్లవాన్నిసాధించడంలో భారతదేశ శాస్త్రవేత్తలు, దేశీయ శాస్త్ర విజ్ఞానం కీలకపాత్ర పోషిస్తాయి : ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదాలతో నూతన భారతదేశం ప్రగతిబాటలో పయనిస్తోంది: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
పరిష్కారాలకు, పరిణామానికి, నూతన ఆవిష్కరణలకు ప్రధాన భూమిక లాంటిది విజ్ఞాన శాస్త్రం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
మన శాస్త్రవేత్తల విజయాలను సంబరాలుగా జరుపుకున్నప్పుడే విజ్ఞాన శాస్త్రమనేది మన సమాజంలో, సంస్కృతిలో భాగమవుతుంది : ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
విజ్ఞాన శాస్త్ర ఆధారిత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది : ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
రాష్ట్రప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో ఎన్ని వీలైతే అన్ని విజ్ఞాన శాస్త్ర సంస్థలను ఏర్పాటు చేయడం, అందుకు తగిన వ
Posted On:
10 SEP 2022 11:57AM by PIB Hyderabad
అహమ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞాన శాస్త్ర సదస్సును ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని ఈ సదస్సు ఉద్దేశ్యాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సబ్ కా ప్రయాస్ అనే దానికి ఈ సదస్సు ఒక ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. 21వ శతాబ్ద ప్రగతికి దోహదం చేస్తున్నవాటిలో శక్తివంతమైనది శాస్త్రవిజ్ఞానమని, ఇది దేశంలోని ప్రతి ప్రాంతం, రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుందని ఆయన అన్నారు.
నాలుగో పారిశ్రామిక విప్లవాన్నిసాధించడంలో భారతదేశ శాస్త్రవేత్తలు, దేశీయ శాస్త్ర విజ్ఞానం కీలకపాత్ర పోషిస్తాయి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యనిర్వాహకుల, విధాన నిర్ణేతల బాధ్యత గణనీయంగా పెరుగుతోందని అన్నారు.
పరిష్కారాలకు, పరిణామానికి, నూతన ఆవిష్కరణలకు ప్రధాన భూమిక లాంటిది విజ్ఞాన శాస్త్రమని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదాలతో నూతన భారతదేశం ప్రగతిబాటలో పయనిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
చరిత్రను తెలుసుకోవడం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలపైన వ్యాఖ్యానించిన ప్రధాని అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపయోగపడతాయని అన్నారు. గత శతాబ్ది ప్రారంభ దశాబ్దాలను ఒక సారి గుర్తు చేసుకుంటే నాటి ప్రపంచం ఎదుర్కొన్న దుర్భర పరిస్థితుల గురించి తెలుస్తుందని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచంలోని నలుమూలలా వున్న శాస్త్రవేత్తలు తమ తమ పరిశోధనల్ని కొనసాగించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. పాశ్చాత్య దేశాల్లో ఐన్ స్టీన్, ఫెర్మి, మాక్స్ ఫ్లాంక్, నీల్స్ బోర్, టెస్లా లాంటి శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలతో ప్రపంచాన్ని అబ్బురపరిచారని ప్రధాని అన్నారు. అదే సమయంలో సివి రామన్, జగదీష్ చంద్రబోస్, సత్యేంద్రనాధ్ బోస్, మేఘానంద్ సాహా, ఎస్. చంద్రశేఖర్ మొదలైనవారు నూతన ఆవిష్కరణల్నిచేశారు. పాశ్చాత్య, తూర్పు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలకు లభించిన గుర్తింపు గురించి ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. మనవాళ్లకు తగిన గుర్తింపు లభించలేదని అన్నారు. మన శాస్త్రవేత్తల విజయాలను గుర్తించి వాటిని సంబరాలుగా జరుపుకుంటేనే విజ్ఞాన శాస్త్రమనేది మన సమాజంలోను, మన సంస్కృతిలోను భాగమవుతుందని ప్రధాని స్పష్టం చేశారు. మన దేశానికి చెందిన శాస్త్రవేత్తల విజయాలను గుర్తించి వాటిన ఉత్సవాలుగా జరుపుకోవాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. వాటిని ఎందుకు ఉత్సవాలుగా జరుపుకోవాలి అనే సందేహం ఎవరికైనా వచ్చినా వారి సందేహాలను తొలగిస్తూ మన దగ్గర అనేక ఉదాహరణలున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో టీకాను అభివృద్ధి చేయడానికిగాను భారతీయ శాస్త్రవేత్తలు చేసిన కృషిని ఆయన ప్రజలకు గుర్తు చేశారు. దాంతోనే ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహించుకోగలిగాని అన్నారు.
విజ్ఞాన ఆధారిత అభివృద్ధి గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రధాని మరోసారి పేర్కొన్నారు. 2014నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని అన్నారు. ప్రభుత్వం చేసిన కృషి కారణంగా ప్రపంచ ఆవిష్కరణల సూచికలో భారతదేశం 46వ ర్యాంకుకు చేరుకుందని ఈ ర్యాంకు 2015లో 81గా వుండేదని ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. దేశంలో రికార్డు స్థాయిలో పేటెంట్లు నమోదవుతున్నాయని అన్నారు. దేశంలో నూతన ఆవిష్కరణల, అంకుర సంస్థలకు సంబంధించిన వాతావరణం నెలకొన్నదని ప్రధాని అన్నారు.
శాస్త్ర సాంకేతిక రంగాల్లోను, ఆవిష్కరణలు చేయడంపట్ల మన యువత చొరవ చూపుతున్నారని అది వారి డిఎన్ ఏ లోనే వుందని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారికి తగిన మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకత మన మీద వుందని అన్నారు. దేశ యువతలోని పరిశోధనాత్మక స్ఫూర్తికి మద్దతకు ఇవ్వడం కోసంగాను ప్రధాని పలు నూతన రంగాల గురించి తన ప్రసంగంలో తెలియజేశారు. అంతరిక్ష రంగం, జాతీయ సూపర్ కంప్యూటింగ్ కార్యక్రమం, సెమీ కండక్టర్ రంగం, హైడ్రోజన్ మిషన్, డ్రోన్ సాంకేతికత రంగం మొదలై రంగాల్లో యువతకు మంచి అవకాశాలున్నాయని అన్నారు. అలాగే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానమనేది దేశంలో శాస్త్ర సాంకేతిక విద్యను మాతృభాషలో బోధించాలని చెబుతూ తగిన ప్రోత్సాహం ఇస్తోందని అన్నారు.
పరిశోధన, ఆవిష్కరణల రంగంలో భారతదేశం ప్రపంచ కేంద్రంగా వుండాలంటే, ఈ అమృతకాల సందర్భంలో మనం పలు రంగాల్లో సమాంతరంగా తగిన కృషి చేయాలని ప్రధాని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన పరిశోధనను స్థానిక స్థాయికి తీసుకుపోవాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలు తమ తమ అవసరాలకు అనుగుణంగా పరిశోధన, నూతన ఆవిస్కరణల్ని ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రాలు తమ తమ ప్రాంతాల్లో మరిన్ని వైజ్ఞానిక సంస్థల్ని నెలకొల్పాలని, అందుకు తగిన విధానాల్ని సరళీకృతం చేయాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాల్లోని ఉన్నత విద్యాసంస్థల్లో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రయోగశాలల్ని పెంచాలని అన్నారు. శాస్త్ర సాంకేతికత,ఆవిష్కరణలకు సంబంధించి ప్రతి రాష్ట్రం ఆధునిక విధానాన్ని తయారు చేసుకొని అమలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మరింతగా తమ శాస్త్రవేత్తలకు సహకరిస్తూ వారి భాగస్వామ్యాన్ని పెంచాలని అన్నారు. ఇది దేశంలో ఆధునిక శాస్త్ర విజ్ఞాన వాతావరణానికి మరింతగా దోహదం చేస్తుందని ప్రధాని అన్నారు.
దేశంలో ప్రస్తుతమున్న జాతీయ స్థాయి విజ్ఞాన సంస్థలు, జాతీయ ప్రయోగాశాలల అనుభవాన్ని, వాటి శక్తి సామర్థ్యాలను ఆయా రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని ప్రధాని ప్రత్యేకంగా సూచించారు. విజ్ఞాన శాస్త్ర సంబంధ సంస్థలను ఆయా రాష్ట్రాలకే పరిమితం చేయకుండా వాటిని దేశమంతా పూర్తిగా వినియోగించుకునేలా చూడాలని అన్నారు. గ్రామీణప్రాంతాల్లో విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఆయా రాష్ట్రాల విజ్ఞాన శాస్త్ర మంత్రులు తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాలికల్ని అందరితో పంచుకోవాలని ప్రధాని కోరారు.
రాష్ట్రాలు, కేంద్రం కలిసి ఏర్పాటు చేసిన ఈ విజ్ఞాన శాస్త్ర సదస్సు దేశంలోని విజ్ఞాన శాస్త్ర ప్రగతికి దోహదం చేస్తుందని తాను నమ్ముతున్నట్టు ప్రధాని తన ప్రసంగంలో తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలు అందిస్తున్న అవకాశాలను ఎవరూ వదులుకోకూడదని ప్రధాని విజ్ఞప్తి చేశారు. రాబోయే పాతిక సంవత్సరాలు భారతదేశానికి చాలా ముఖ్యమైన సంవత్సరాలని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సమయం దేశానికి నూతన శక్తిని, అస్థిత్వాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్నవారు ఇక్కడ నేర్చుకుంటున్న విషయాలను తమ తమ రాష్ట్రాలకు వెళ్లిన తర్వాత ఆచరణలో పెట్టి జాతి నిర్మాణానికి కృషి చేయాలని ప్రధాని కోరారు.
ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పాటిల్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు.
నేపథ్యం
దేశంలో నూతన ఆవిష్కరణలు, సరికొత్త పారిశ్రామిక వాతావరణం విస్తరించడంకోసం ప్రధాని చేస్తున్న అలుపెరగని కృషిలో భాగంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఇది కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన సంబంధాలను మెరుగుపరిచి సమాఖ్య స్ఫూర్తిని చాటుతుంది. అంతే కాదు దేశవ్యాప్తంగా బలమైన శాస్త్ర సాంకేతిక , ఆవిష్కరణల వాతావరణం నెలకొంటుంది.
అహమ్మదాబాద్ లోని సైన్స్ సిటీలో రెండు రోజుల సదస్సును సెప్టెంబర్ 10, 11 తేదీలలో ఏర్పాటు చేశారు. ఇందులో రాబోయే పాతిక సంవత్సరాలలో శాస్త్ర సాంకేతిక రంగాల దార్శనికతకు అనుగుణంగా పలు అంశాలమీద చర్చలు జరుగుతాయి. ఆరోగ్యరంగం, పరిశోధన అభివృద్ధి రంగాల్లో ప్రైవేటు రంగ పెట్టుబడులను రెట్టింపు చేయడం, వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు, తద్వారా రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడం, సురక్షితమైన నీరు, శక్తి వనరులరంగం, హైడ్రోజన్ మిషన్ లో శాస్త్ర సాంకేతిక రంగ పాత్ర, సముద్రాల ద్వారా లబ్ధి పొందే శాస్త్ర సాంకేతిక కార్యక్రమాలు మొదలైన అంశాలు ఈ సదస్సులో పొందుపరిచారు.
ఈ సదస్సులో గుజరాత్ సీఎం, కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి, ఆయా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, ఎన్జీవోలు, యువ శాస్త్ర వేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
***
(Release ID: 1860782)
Visitor Counter : 154
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam