ప్రధాన మంత్రి కార్యాలయం

ఎస్సీవో తొలి పర్యాటక-సాంస్కృతిక రాజధానిగా వారణాసి


ఎస్సీవో-2022 సదస్సులో ప్రతిపాదనకు ఆమోదం

Posted On: 16 SEP 2022 11:07PM by PIB Hyderabad
  1. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో 2022 సెప్టెంబర్ 16నాటి షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్యదేశాల అధినేతల మండలి 22వ సమావేశం సందర్భంగా 2022-2023 సంవత్సరానికిగాను వారణాసి నగరం ఎస్సీవో తొలి పర్యాటక-సాంస్కృతిక రాజధానిగా ప్రతిపాదించబడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.
  2. ఎస్సీవో తొలి పర్యాటక-సాంస్కృతిక రాజధానిగా వారణాసి ప్రతిపాదించబడిన నేపథ్యంలో భారత-ఎస్సీవో సభ్యదేశాల మధ్య పర్యాటక-సాంస్కృతిక, మానవ ఆదానప్రదానాలకు ప్రోత్సాహం లభిస్తుంది. అంతేకాకుండా ఈ పరిణామం వల్ల ఎస్సీవో సభ్యదేశాలతో... ముఖ్యంగా మధ్య ఆసియా గణతంత్ర దేశాలతో భారత దేశానికిగల ప్రాచీన నాగరకత సంబంధాల ప్రాముఖ్యం స్పష్టమైంది.
  3. ఈ ప్రధాన సాంస్కృతిక ఆదానప్రదాన కార్యక్రమ చట్రం కింద 2022-23లో వారణాసి నగర పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వీటిలో పాల్గొనాల్సిందిగా ఎస్సీవో సభ్య దేశాల అతిథులకు ఆహ్వానం లభిస్తుంది. భారత చరిత్ర అధ్యయనకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, రచయితలు, సంగీత విద్వాంసులు, కళాకారులు, ఫొటో జర్నలిస్టులు, పర్యాటక రచయితలు, ఇతర ఆహ్వానిత అతిథులను ఈ కార్యక్రమాలు ఆకట్టుకోగలవని భావిస్తున్నారు.
  4. పర్యాటక-సాంస్కృతిక రంగంలో ఎస్సీవో సభ్యదేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా 2021నాటి దుషాంబే శిఖరాగ్ర సదస్సులో పర్యాటక-సాంస్కృతిక  రాజధాని ప్రతిపాదన సంబంధిత నిబంధనలు ఆమోదించబడ్డాయి.

సమర్కండ్,

16 సెప్టెంబరు 2022.

 

***



(Release ID: 1860555) Visitor Counter : 131