ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో అడవి చిరుతల విడుదల సందర్భంగా జాతినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం


“ఇవాళ చిరుతపులి భారత గడ్డపై తిరిగి పాదం మోపింది”;

“మన మూలాలకు మనం దూరం కావడమంటే ఎన్నిటినో కోల్పోవడమే”;

“మరణించిన ప్రాణులకు తిరిగి జీవంపోసే శక్తి అమృతానికి ఉంది”;

“అంతర్జాతీయ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ చిరుతల
ఆవాస స్థిరీకరణకు భారతదేశం శాయశక్తులా కృషి చేస్తుంది”;

“పర్యావరణ పర్యాటకం వృద్ధితో ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి”;

“భారతదేశానికి ప్రకృతి.. పర్యావరణం.. పక్షి-జంతుజాతులు సుస్థిరత..
భద్రత కోసం మాత్రమేగాక దేశ సున్నితత్వం.. ఆధ్యాత్మికతలకు ఆధారం”;

“నేడు మన అడవులు.. జీవనంలోని ఒక భారీ
శూన్యం చిరుతల ద్వారా భర్తీ చేయబడుతోంది”;

“ఒకవైపు మనం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలలో చేరాం… మరోవైపు దేశంలో అటవీ ప్రాంతాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి”;

“దేశంలో 2014 నుంచి సుమారు 250 కొత్త అభయారణ్యాలు జోడించబడ్డాయి”;

“పులుల సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యాన్ని మనం గడువులోగానే సాధించాం”;

“కొన్నేళ్లుగా దేశంలో ఏనుగుల సంఖ్య కూడా 30 వేలకుపైగా పెరిగింది”;

“దేశంలోని 75 చిత్తడి నేలలు ‘రామ్‌సర్ సైట్’లుగా ప్రకటించబడ్డాయి..
వీటిలో 26 గడచిన 4 సంవత్సరాలలో జోడించబడినవే

Posted On: 17 SEP 2022 12:09PM by PIB Hyderabad

   భారతదేశంలో అంతరించిపోయిన అడవి చిరుతలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కునో జాతీయ పార్కులోకి విడుదల చేశారు. ఈ చిరుతలను- నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రపంచంలో తొలి ఖండాంతర భారీ మాంసభక్షక అటవీ జంతువుల స్థాన మార్పిడి పథకం ‘ప్రాజెక్ట్ చీతా’ కింద వీటిని ఇక్కడకు తరలించారు. ఈ మేరకు కువో జాతీయ పార్కులోని రెండు ప్రదేశాల్లో ప్రధానమంత్రి ఈ చిరుతలను అడవిలోకి విడిచిపెట్టారు. అనంతరం చిరుతల పునరావాస, సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించే ‘చీతా మిత్ర’ బృందం కార్యకర్తలతోపాటు విద్యార్థులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఈ చరిత్రాత్మక  సందర్భాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు.

   మానవాళి తన గతాన్ని సరిదిద్దుకుని, సరికొత్త భవిష్యత్తును నిర్మించుకునే దిశగా లభించే కొన్ని అవకాశాల గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ మనముందున్నది అలాంటి ఒక అవకాశమేనని శ్రీ మోదీ పేర్కొన్నారు. “దశాబ్దాల కిందట జీవవైవిధ్యం పురాతన బంధం విచ్ఛిన్నమై క్రమేణా అంతరించింది. నేడు దాన్ని పునరుద్ధరించే అవకాశం మనకు అందివచ్చింది. అందులో భాగంగానే ఈ రోజున చిరుత పులి తిరిగి భారత గడ్డపై పాదం మోపింది” అన్నారు. ప్రకృతిని ఆరాధించే భారతదేశ చైతన్యాన్ని సంపూర్ణ శక్తితో మేల్కొల్పడానికి ఈ చారిత్రక సందర్భం దోహదం చేసిందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. నమీబియా దేశం, అక్కడి ప్రభుత్వం సహకారంతో చిరుతలు దశాబ్దాల తర్వాత తిరిగి భారతగడ్డకు చేరాయని ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఈ చారిత్రక సందర్భంలో దేశప్రజలందరికీ శ్రీ మోదీ అభినందనలు తెలిపారు. “ప్రకృతి పట్ల మన కర్తవ్యాన్ని తెలుసుకోవడమే కాకుండా మనవైన మానవీయ విలువలు, సంప్రదాయాలపై ఈ చిరుతలు మనకు అవగాహన కల్పిస్తాయని నేను కచ్చితంగా విశ్వసిస్తున్నాను” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   స్వాతంత్ర్య అమృతకాలం దృష్ట్యా ప్రధానమంత్రి ‘పంచ్ ప్రాణ్’ను గుర్తుచేసుకుంటూ ‘మన వారసత్వానికి గర్వించడం’, ‘బానిస మనస్తత్వం నుంచి విముక్తి’ ప్రాముఖ్యం గురించి నొక్కిచెప్పారు. “మన మూలాలకు మనం దూరం కావడమంటే ఎన్నిటినో కోల్పోవడమే”నని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గత శతాబ్దాల్లో ప్రకృతిని దోపిడీ చేయడమే శక్తికి, ఆధునికతకు ప్రతీకగా భావించేవారని గుర్తుచేశారు. “దేశంలో 1947నాటికి సాల్‌ అడవుల్లో మూడు చిరుతలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిసి కూడా వాటిని నిర్దాక్షిణ్యంగా, బాధ్యతారహితంగా వేటాడారు” అని ఆయన వెల్లడించారు. చివరకు 1952కల్లా భారత్‌లో చిరుతలు అంతరించిపోగా గడచిన ఏడు దశాబ్దాలుగా వాటి పునరావాసానికి ఎలాంటి అర్థవంతమైన కృషి చేసిన దాఖలాలు లేవని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల నడుమ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా దేశంలో కొత్త శక్తితో చిరుతలకు పునరావాస కల్పనపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. “మరణించిన ప్రాణులకు తిరిగి జీవంపోసే శక్తి అమృతానికి ఉంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నేపథ్యంలో ఈ కర్తవ్య, ఆత్మవిశ్వాస అమృతం మన వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసిందని, దీంతోపాటు నేడు చిరుతలు భారతగడ్డపై పాదం మోపాయని ప్రధానమంత్రి అన్నారు.

   పునరావాసం విజయవంతం కావడానికి సంవత్సరాల తరబడి సాగిన శ్రమను ప్రధానమంత్రి ప్రజల దృష్టికి తెచ్చారు. ఈ మేరకు రాజకీయంగా పెద్దగా ప్రాముఖ్యం లేని అంశం కోసం అత్యధిక శక్తిసామర్థ్యాలు వినియోగించారని చెప్పారు. ప్రతిభావంతులైన మన శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికా, నమీబియా నిపుణులతో కలిసి విస్తృత పరిశోధనలు నిర్వహించారని పేర్కొన్నారు. అటుపైన ఒక ‘చిరుతలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించారని తెలిపారు. ఇందులో భాగంగా చిరుతల ఆవాసానికి అత్యంత అనువైన ప్రాంతాల గుర్తింపు నిమిత్తం దేశవ్యాప్తంగా శాస్త్రీయ అధ్యయనం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అటుపైన ఈ శుభారంభం కోసం కునో జాతీయ పార్కును ఎంపిక చేసుకున్నామని ప్రధాని తెలిపారు. “ఈ కృషి ఫలితం నేడు మన కళ్లముందుంది” అని ఆయన అన్నారు.

   ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని, వృద్ధితోపాటు శ్రేయస్సుకు బాటలు పడతాయని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. కునో జాతీయ పార్కులో చిరుతల పరుగులతో గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ జరుగుతుందని, అది జీవవైవిధ్య వృద్ధికి దోహదం చేస్తుందని శ్రీ మోదీ అన్నారు. ఈ ప్రాంతంలో పర్యావరణ పర్యాటకం వృద్ధితో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని, తద్వారా అభివృద్ధికి కొత్త మార్గాలు అందివస్తాయని శ్రీ మోదీ నొక్కిచెప్పారు.

   కునో జాతీయ పార్కులో విడుదల చేసిన చిరుతలను మళ్లీ చూసేందుకు దేశ ప్రజలంతా ఓపికగా.. కొన్ని నెలలపాటు వేచి ఉండాలని ప్రధాని సూచించారు. “ఇవాళ ఈ చిరుతలు మన అతిథులుగా వచ్చాయి.. ఈ ప్రాంతం గురించి వాటికి ఇంకా తెలియదు” అని ఆయన వ్యాఖ్యానించారు. “కునో జాతీయ పార్కును తమ నివాసంగా మార్చుకోవడానికి మనం ఈ చిరుతలకు కొన్ని నెలల సమయం ఇవ్వాలి” అన్నారు. అంతర్జాతీయ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ చిరుతల ఆవాస స్థిరీకరణకు భారతదేశం శాయశక్తులా కృషి చేస్తుందని ప్రధాని వివరించారు. “ఈ కృషిలో వైఫల్యానికి మనమెన్నడూ తావివ్వరాదు” అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నేడు ప్రకృతి, పర్యావరణం వైపు చూస్తున్న ప్రపంచం ఇప్పుడు సుస్థిర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, “భారతదేశానికి ప్రకృతి, పర్యావరణం, పక్షి-జంతుజాతులు సుస్థిరత, భద్రతల కోసం మాత్రమేగాక దేశ సున్నితత్వం.. ఆధ్యాత్మికతలకు ఆధారం” అని ఆయన అన్నారు. “మన చుట్టూ నివసించే చిన్న జీవులపైనా శ్రద్ధ వహించడం మనం ఉగ్గుపాలతో నేర్చుకున్నాం. మన సంప్రదాయం ఎలాంటిదంటే- అకారణంగా ఒక ప్రాణం పోతే మనలో అపరాధ భావన నిండిపోయేలా చేస్తుంది.  అలాంటప్పుడు మనవల్ల మొత్తం ఓ జాతి ఉనికే అంతరిస్తుందంటే అంగీకరించగలమా?” అన్నారు.

   చిరుతలు నేడు కొన్ని ఆఫ్రికా దేశాల్లో, ఇరాన్‌లో మాత్రమే కనిపిస్తాయి. ఒకప్పుడు ఆ దేశాల జాబితాలోగల భారత్‌ పేరు చాలాకాలం కిందటే తొలగించబడింది. కానీ, రాబోయే సంవత్సరాల్లో మన భవిష్యత్తరం ఈ దుస్థితిని చూసే పరిస్థితి రాదు. మన మాతృభూమిలోని కువో జాతీయ పార్కులో చిరుత పులులు పరుగు తీయడాన్ని వారు కళ్లారా… కనువిందుగా చూడగలరన్న విశ్వాసం నాకుంది. “నేడు మన అడవులతోపాటు మన జీవనంలోని ఒక భారీ శూన్యం ఈ చిరుతల ద్వారా భర్తీ చేయబడుతోంది” అని శ్రీ మోదీ అన్నారు. ఆర్థిక వ్యవస్థ, జీవావరణ శాస్త్రం పరస్పర విరుద్ధ రంగాలు కాదనే సందేశాన్ని ఈ 21వ శతాబ్దపు భారతదేశం యావత్ ప్రపంచానికీ ఇస్తున్నదని ప్రధాని వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణతోపాటు దేశ ఆర్థిక ప్రగతి కూడా దీనితో సాధ్యమేనని చెప్పడానికి భారతదేశం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. “ఒకవైపు మనం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలలో చేరాం… మరోవైపు దేశంలో అటవీ ప్రాంతాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు.

   మేరకు ప్రభుత్వం చేసిన కృషిని వివరిస్తూ- 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో దాదాపు 250 కొత్త ప్రాంతాలను అభయారణ్యాల జాబితాలో చేర్చినట్లు ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో ఆసియా సింహాల సంఖ్య భారీగా పెరిగిందని, ఈ విషయంలో గుజరాత్‌ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని వివరించారు. “దీనివెనుక దశాబ్దాలపాటు సాగిన కృషి, పరిశోధన-ఆధారిత విధానాలు, ప్రజా భాగస్వామ్యం ఉన్నాయి” అని శ్రీ మోదీ అన్నారు.  “నాకు బాగా గుర్తుంది… గుజరాత్‌లో మేమొక ప్రతిజ్ఞ చేశాం- అడవి జంతువుల పట్ల ఆదరణను పెంచుతూ వైరుధ్యాలను తగ్గిస్తామని మేం శపథం చేశాం. ఈ ఆలోచన ధోరణితో ఒనగూడిన ఫలితం ఇవాళ మన కళ్లముందుంది” అని ఆయన పేర్కొన్నారు. ఇక పులుల సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యాన్ని మనం గడువుకు ముందే సాధించామని ప్రధాని తెలిపారు. అస్సాంలో లోగడ ఒంటికొమ్ము ఖడ్గమృగం ఉనికి ప్రమాదంలో పడినప్పటికీ, ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే కొన్నేళ్లుగా ఏనుగుల సంఖ్య కూడా 30 వేలకుపైగా పెరిగిందని చెప్పారు. చిత్తడి నేలల విస్తరణలో భాగంగా దేశంలోని వృక్ష, జంతుజాలాల సంరక్షణకు చేసిన కృషి గురించి కూడా శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల జీవనం, అవసరాలు చిత్తడి నేలల జీవావరణంపైనే ఆధారపడి ఉన్నాయని ఆయన చెప్పారు. “దేశంలోని 75 చిత్తడి నేలలు ‘రామ్‌సర్ సైట్’లుగా ప్రకటించబడ్డాయి. వీటిలో 26 గడచిన 4 సంవత్సరాలలో జోడించబడినవే”నని ప్రధానమంత్రి వెల్లడించారు. అలాగే “దేశం చేస్తున్న ఈ కృషి రాబోయే కొన్ని శతాబ్దాలపాటు కొనసాగుతూ ప్రగతికి కొత్త బాటలు వేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

   భారతదేశం నేడు పరిష్కరిస్తున్న ప్రపంచ సమస్యల గురించి కూడా ప్రధాని అందరి దృష్టికీ తెచ్చారు. ఈ మేరకు అంతర్జాతీయ సమస్యలు-వాటి పరిష్కారాలనే కాకుండా మన జీవితాలను కూడా సమగ్రంగా విశ్లేషించుకోవాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచం.. పర్యావరణం కోసం జీవనశైలి (లైఫ్‌) తారకమంత్రంతోపాటు అంతర్జాతీయ సౌర కూటమి కృషిని ప్రస్తావిస్తూ- వీటిద్వారా ప్రపంచానికి భారతదేశం ఒక వేదికను సమకూరుస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఈ ప్రయత్నాల విజయమే ప్రపంచ దిశ, దశలను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచ సవాళ్లను మన వ్యక్తిగత సవాళ్లుగా పరిగణించాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మన జీవితాల్లో ఒక చిన్న మార్పు మొత్తం ప్రపంచ భవిష్యత్తుకు ప్రాతిపదిక కాగలదని పునరుద్ఘాటించారు. “భారతదేశ కృషి, భారతీయ సంప్రదాయాలు మొత్తం మానవాళిని ఈ దిశగా నడిపిస్తూ మెరుగైన ప్రపంచం నిర్మాణ స్వప్న సాకారానికి బలాన్నిస్తాయని నాకు నూటికి నూరుపాళ్లు విశ్వాసం ఉంది” అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

నేపథ్యం

   భారతదేశంలో వన్యప్రాణులతోపాటు వాటి ఆవాసాల పునరుజ్జీవనానికి, జీవవైవిధ్య వికాసానికి ప్రధానమంత్రి చేస్తున్న కృషిని కునో జాతీయ పార్కులో అడవి చిరుతల విడుదల ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో చిరుతల జాతి అంతరించిందని 1952లో ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదల చేసిన చిరుతలు నమీబియాకు చెందినవి కాగా, ఆ దేశంతో ఈ ఏడాది ఆరంభంలో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ఇక్కడికి తరలించబడ్డాయి. ప్రపంచంలో తొలి ఖండాంతర భారీ మాంసభక్షక అటవీ జంతువుల స్థాన మార్పిడి పథకం ‘ప్రాజెక్ట్ చీతా’ కింద వీటిని ఇక్కడకు తీసుకువచ్చారు.

   దేశంలో బహిరంగ అటవీ-గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణకు చిరుతలు తోడ్పడతాయి. ఇది జీవవైవిధ్య పరిరక్షణతోపాటు జల భద్రత, కర్బన ఉద్గార బంధనం, నేలలో తేమ పరిరక్షణ వగైరా పర్యావరణ వ్యవస్థల మెరుగుకూ సహాయపడుతుంది. దీంతో సమాజానికీ ఎనలేని ప్రయోజనం చేకూరుస్తుంది. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా ఈ కృషి సాగుతోంది. దీంతో పర్యావరణ ప్రగతి పర్యావరణ-పర్యాటక కార్యకలాపాల ద్వారా స్థానిక సమాజాలకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు కూడా అందివస్తాయి.


(Release ID: 1860255) Visitor Counter : 207