ప్రధాన మంత్రి కార్యాలయం

గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీలో ‘ఐఎఫ్‌ఎస్‌సిఎ’ ప్రధాన కార్యాలయానికి ప్రధానమంత్రి శంకుస్థాపన


గిఫ్ట్ సిటీలో దేశంలోనే తొలి అంతర్జాతీయ బులియన్
ఎక్స్ఛేంజ్-‘ఐఐబీఎక్స్’కూ ప్రధాని ప్రారంభోత్సవం;

“ప్రపంచ ఆర్థిక రంగానికి దిశ నిర్దేశిస్తున్న అమెరికా.. యూకే..
సింగపూర్ వంటి దేశాల జాబితాలో స్థానం పొందిన భారతదేశం”;

“దేశంలోని సామాన్యుల ఆకాంక్షలు గిఫ్ట్‌ సిటీ దార్శనికతలో భాగం”;

“గిఫ్ట్ సిటీ సంపద-విజ్ఞానాలు రెండింటికీ నెలవు”;

“ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన వర్తమానం.. మెరుగైన
భవిష్యత్ పాత్రకు తగిన సంస్థలు మనకు నేడు అవసరం”;

“ఇవాళ మన అత్యంత ప్రధాన కృషిలో ఏకీకరణ కూడా ఒకటి; మనమిప్పుడు
ప్రపంచ మార్కెట్‌.. సరఫరా ప్రక్రియతో వేగంగా ఏకీకృతం అవుతున్నాం”;

“ఒకవైపు, స్థానిక సంక్షేమం కోసం మనం ప్రపంచ పెట్టుబడులు తెస్తున్నాం..
మరోవైపు ప్రపంచ సంక్షేమానికి స్థానిక ఉత్పాదకతనూ వాడుకుంటున్నాం”;

“సాంకేతికత.. విజ్ఞానం.. సాఫ్ట్ వేర్ విషయంలో భారత్‌కు
సానుకూల స్థితితోపాటు అనుభవం కూడా ఉంది”;

“నియంత్రణలో నాయత్వ పాత్ర... చట్టబద్ధ పాలనకు ఉన్నత ప్రమాణాల నిర్దేశం..
ప్రపంచం ఆకాంక్షించే మధ్యవర్తిత్వ కేంద్రంగా ఎదగడం మీ లక్ష్యాలు కావాలి”

Posted On: 29 JUL 2022 6:19PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీలో అంతర్జాతీయ ఆర్థికసేవా కేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్‌ఎస్‌సిఎ) ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అలాగే ‘గిఫ్ట్‌-ఐఎఫ్‌ఎస్‌సి’లో తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్ (ఐఐబిఎక్స్)ను కూడా ప్రధాని ప్రారంభించారు. అంతేగాక ‘ఎన్‌ఎస్‌ఇ- ఐఎఫ్‌ఎస్‌సి-ఎస్‌జిఎక్స్‌ కనెక్ట్‌’ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

   సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- భార‌త్‌ ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం అవుతుండటం, భారత‌దేశ సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం ఇనుమడిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఎంతో ముఖ్యమైన రోజని వ్యాఖ్యానించారు.  “ఈ రోజున గిఫ్ట్‌ సిటీలో అంతర్జాతీయ ఆర్థికసేవా కేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్‌ఎస్‌సిఎ) ప్రధాన కార్యాలయ నిర్మాణానికి పునాదిరాయి పడింది. ఈ భవనం ఎంతో సుందరంగా రూపొందడమే కాకుండా భారతదేశాన్ని తిరుగులేని ఆర్థికశక్తిగా మార్చడంలోనూ ఇది అపార అవకాశాలు సృష్టించగలదని నేను విశ్వసిస్తున్నాను” అన్నారు. ‘ఐఎఫ్‌ఎస్‌సి’ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని, వృద్ధికి దోహదం చేస్తుందని, అదే సమయంలో ఉత్ప్రేరకంగానూ కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని అన్నారు. నేడిక్కడ ప్రారంభించిన సంస్థలు, వేదికలు ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో 130 కోట్లమంది భారతీయులు అనుసంధానం కావడంలో తోడ్పడతాయన్నారు. “ప్రపంచ ఆర్థిక రంగానికి దిశ నిర్దేశిస్తున్న అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, సింగపూర్ వంటి దేశాల జాబితాలో భారతదేశం చోటు సంపాదించబోతున్నది” అని ఆయన పేర్కొన్నారు.

   గిఫ్ట్‌ సిటీపై తన భావనను గుర్తుకు తెచ్చుకుంటూ- ఇది కేవలం వ్యాపారం కోసం మాత్రమే ఉద్దేశించినది కాదన్నారు. గిఫ్ట్‌ సిటీ ఏర్పాటు దృక్పథంలో దేశంలోని సామాన్యుల ఆకాంక్షలు కూడా ఒక భాగమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “భారతదేశ భవిష్యత్‌ దార్శనికతసహా, గతకాలపు స్వర్ణయుగానికి చేరే భారత భవిష్యత్‌ స్వప్నాలు కూడా గిఫ్ట్‌ సిటీతో ముడిపడి ఉన్నాయి” అని పేర్కొన్నారు. ప్రపంచం 2008లో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, మాంద్యం నెలకొన్న సందర్భంగా భారతదేశంలోనూ విధాన స్తంభన వాతావరణం నెలకొన్నదని ప్రధాని గుర్తుచేశారు. “అయితే, ఆ సమయంలో గుజరాత్ సాంకేతికార్థిక రంగంలో సరికొత్త, భారీ అంగలు వేస్తున్నది. నాటి ఆలోచన నేడు ఈ స్థాయికి పురోగమించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది” అన్నారు. వాణిజ్యం, సాంకేతికతల కూడలిగా గిఫ్ట్ సిటీ బలమైన ముద్ర వేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. సంపద, విజ్ఞానం రెండింటికీ గిఫ్ట్ సిటీ నెలవుగా మారిందని, దీనిద్వారా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సేవా రంగంలో బలమైన వాటాతో ముందుకు సాగడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. గిఫ్ట్ సిటీ సంపద సృష్టికి వేదికని, ఇక్కడ ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులు సమావేశమై నేర్చుకుంటున్నారని చెప్పారు. “ఒక విధంగా ఇది ఆర్థిక, వాణిజ్య రంగాల్లో భారత గతవైభవ పునరుద్ధరణకు మాధ్యమం కూడా కాగలదు”  అని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.

   త్తేజకర సాంకేతికార్థిక రంగమంటే వ్యాపార సౌలభ్య వాతావరణం, సంస్కరణలు, నియంత్రణలకు ప్రతిరూపం మాత్రమే కాదన్న వాస్తవం గుర్తుంచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వృత్తి నిపుణులకు సరికొత్త అవకాశాలు, జీవితాన్ని చూపగల మాధ్యమంగా చూడాలని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత, అప్పటిదాక అనుభవించిన బానిసత్వం ఫలితంగా ఆత్మవిశ్వాసం సన్నగిల్లి, తన ఉజ్వల వ్యాపార, ఆర్థిక వారసత్వానికి దూరంగా ఉండిపోయిందన్నారు. ఆ మేరకు ప్రపంచంతో ఆర్థిక, సాంస్కృతిక, ఇతర సంబంధాలలో పరిమిత స్థాయిలో ఉండిపోయిందని చెప్పారు. “కానీ, ఇప్పుడు, ‘నవ భారతం’ బూజుపట్టిన ఆనాటి ఆలోచన విధానాన్ని వీడి, నేడు ఏకీకరణవైపు సాగుతున్నది. మనకు అత్యంత ముఖ్యమైన కృషిలో ప్రపంచంతో ఏకీకరణ కూడా ఒకటి. మనమిప్పుడు ప్రపంచ మార్కెట్‌.. సరఫరా ప్రక్రియతో వేగంగా ఏకీకృతం అవుతున్నాం” అని ఆయన అన్నారు. “గిఫ్ట్‌ సిటీ దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా  అవకాశాలతో అనుసంధానం కాగల ముఖద్వారం. మీరు గిఫ్ట్‌ సిటీతో ఏకీకృతమైతే మొత్తం ప్రపంచంతో ఏకీకృతమైనట్టే” అన్నారు.

   భారతదేశం ఇవాళ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటని ప్రధానమంత్రి చెప్పారు. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో మరింత పెద్దదిగా అవతరించేనాటికి మనం నేటినుంచే అందుకు సంసిద్ధులమై ఉండాలన్నారు. ఆ మేరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన వర్తమానం, మెరుగైన భవిష్యత్ పాత్రకు తగిన సంస్థలు మనకు నేడు అవసరమని చెప్పారు. ఈ దిశగా నేడు ప్రారంభించిన భారత అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్ఛేంజి-‘ఐఐబీఎక్స్‌’ కీలక ముందడుగని ఆయన చెప్పారు. భారత మహిళలకు ఆర్థిక సాధికారతకు భరోసాలో బంగారం పాత్ర కీలకమన్నారు. అయితే, ఒక భారీ మార్కెట్‌ అనే గుర్తింపునకు మాత్రమే భారత్‌ పరిమితం కారాదని, అది ‘మార్కెట్ల సృష్టికర్త’ స్థాయికి ఎదగాలని సూచించారు. “ఒకవైపు, స్థానిక సంక్షేమం కోసం మనం ప్రపంచ పెట్టుబడులు తెస్తున్నాం.. మరోవైపు ప్రపంచ సంక్షేమానికి స్థానిక ఉత్పాదకతనూ వాడుకుంటున్నాం” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు.

   భారతదేశానికిగల బలం పెట్టుబడిదారులకు మంచి రాబడులు ఇవ్వడానికి మించినదని ప్రధానమంత్రి అన్నారు. “ప్రపంచ సరఫరా ప్రక్రియల అనిశ్చితి ఫలితంగా ప్రపంచమంతా అల్లాడుతుంటే భారతదేశం నాణ్యమైన ఉత్పత్తులు, సేవల ప్రదానంపై ప్రపంచానికి భరోసా ఇస్తోంది” అని ఆయన వివరించారు. అలాగే “నవ భారతంలోని కొత్త సంస్థలు, వ్యవస్థలపై నాకెన్నో అంచనాలు, ఆకాంక్షలు ఉన్నాయి. అదే సమయంలో మీపై నాకు పూర్తి విశ్వాసం కూడా ఉంది. నేడు ఈ 21వ శతాబ్దంలో ఆర్థిక, సాంకేతికతలు పరస్పరం ముడిపడి ఉన్నాయి. సాంకేతికత, విజ్ఞానం, సాఫ్ట్‌ వేర్ విషయానికొస్తే, భారతదేశానికి సానుకూల స్థితితోపాటు విశాల అనుభవం కూడా ఉంది” అని ప్రధాని పేర్కొన్నారు. సాంకేతికార్థిక రంగంలో భారత్‌ నాయకత్వ పాత్రను నొక్కి చెబుతూ- ఈ రంగంపై ప్రధానంగా దృష్టి సారించాలని గిఫ్ట్‌ సిటీ భాగస్వాములను ప్రధాని కోరారు. “మీరంతా సాంకేతికార్థిక రంగంలో నవ్యావిష్కరణలను లక్ష్యంగా పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ నేపథ్యంలో గిఫ్ట్‌ ‘ఐఎఫ్‌ఎస్‌సి’ ఇప్పడు సాంకేతికార్థిక రంగంలో ప్రపంచ ప్రయోగశాలగా ఆవిర్భవించింది” అని వివరించారు.

   సుస్థిర, వాతావరణ ప్రాజెక్టులకు అంతర్జాతీయ రుణ, ఈక్విటీ మూలధన రాజధానికి ముఖద్వారంగా గిఫ్ట్‌ ‘ఐఎఫ్‌ఎస్‌సి’ రూపొందాలన్నది తన రెండో ఆకాంక్షగా ప్రధానమంత్రి ప్రకటించారు. అలాగే “విమానాల లీజు, నౌకా నిర్మాణ రుణ సదుపాయం, కర్బన వాణిజ్యం, డిజిటల్ నగదు, పెట్టుబడి నిర్వహణకు ఐపీ హక్కు” తదితరాల్లో ఆర్థిక ఆవిష్కరణల కోసం ‘ఐఎఫ్‌ఎస్‌సిఎ’ కృషి చేయాలన్నది తన మూడో ఆకాంక్షగా ప్రధాని పేర్కొన్నారు. అంతేకాకుండా “నియంత్రణ-నిర్వహణ వ్యయం రీత్యా స్వదేశంలోనేగాక దుబాయ్, సింగపూర్ వంటి దేశాలతో పోల్చినా భారతదేశం పోటీ ఇవ్వగలగాలి” అన్నారు. అలాగే “నియంత్రణలో నాయత్వ పాత్ర, చట్టబద్ధ పాలనకు ఉన్నత ప్రమాణాల నిర్దేశం, ప్రపంచం ఆకాంక్షించే మధ్యవర్తిత్వ కేంద్రంగా ఎదగడం వంటివి మీ లక్ష్యాలు కావాలి” అని దిశ నిర్దేశించారు. గ‌త 8 సంవ‌త్స‌రాల్లో దేశం సరికొత్త ఆర్థిక సార్వజనీన చ‌ర్య‌ల వెల్లువను చవిచూసింద‌ని ప్ర‌ధానమంత్రి పేర్కొన్నారు. నిరుపేదలు కూడా నేడు అధికారిక ఆర్థిక సంస్థల్లో భాగమవుతున్నారని చెప్పారు. నేడు మన జనాభాలో అధికశాతం ఆర్థిక రంగంవైపు వస్తున్నారని, ప్రభుత్వ-ప్రైవేట్‌ సంస్థలు కూడా కలిసి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజలు వృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నందున ప్రాథమిక బ్యాంకింగ్‌తో పోలిస్తే ఆర్థిక అక్షరాస్యత అవశ్యమని ప్రధాని పిలుపునిచ్చారు.

గిఫ్ట్‌ సిటీ.. ఐఎఫ్‌ఎస్‌సిఎ, ఐఐబిఎక్స్‌, ఎన్‌ఎస్‌ఇ ఐఎఫ్‌ఎస్‌సి-ఎస్‌జిఎక్స్‌ కనెక్ట్‌ గురించి..

   గుజరాత్‌ అంతర్జాతీయ ఆర్థిక-సాంకేతిక నగరం (గిఫ్ట్‌ సిటీ) భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికీ సాంకేతికార్థిక సేవల కూడలిగా ఏర్పాటు చేయబడింది. అలాగే భారతదేశంలోని అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల (ఐఎఫ్‌ఎస్‌సి)లో ఆర్థిక ఉత్పత్తులు, ఆర్థిక సేవలు, ఆర్థిక సంస్థల అభివృద్ధి-నియంత్రణ నిమిత్తం ఏర్పాటైన ఏకీకృత నియంత్రణ వ్యవస్థ ‘ఐఎఫ్‌ఎస్‌సిఎ’. ఈ నేపథ్యంలో ఈ భవనం ఒక ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా, గిఫ్ట్‌-‘ఐఎఫ్‌ఎస్‌సి’కి పెరుగుతున్న ప్రాముఖ్యం-స్థాయిని ప్రతిబింబించే నిర్మాణంగా రూపొందించబడుతోంది.

   క ‘ఐఐబిఎక్స్‌’ భారతదేశంలో బంగారం ఆర్థికీకరణకు ఊతమివ్వడమే కాకుండా, బాధ్యతాయుత మూలం, నాణ్యతకు హామీతో ప్రభావవంతమైన ధర ఆవిష్కరణను సులభతరం చేస్తుంది. ఇది అంతర్జాతీయ బంగారం (బులియన్) మార్కెట్లో సరైన స్థానం పొందేవిధంగా, సమగ్ర-నాణ్యతగల ప్రపంచ సరఫరా ప్రక్రియకు సేవలందించేలా భారతదేశానికి శక్తినిస్తుంది. అలాగే ప్రధాన వినియోగదారుగా అంతర్జాతీయంగా బంగారం ధరలను ప్రభావితం చేయగలిగేలా భారత్‌ను రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.

   కాగా… ‘ఎన్‌ఎస్‌ఇ ఐఎఫ్‌ఎస్‌సి-ఎస్‌జిఎక్స్ కనెక్ట్‌’ అనేది గిఫ్ట్‌ అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐఎఫ్‌ఎస్‌సి)లోని ఎన్‌ఎస్‌ఇ అనుబంధ సంస్థ-సింగపూర్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎస్‌జిఎక్స్‌)ల మధ్య ఒక చట్రంగా ఉంటుంది. ఈ ‘కనెక్ట్‌’ కింద కింద సింగపూర్ ఎక్స్ఛేంజ్ సభ్యులు ‘నిఫ్టీ’ డెరివేటివ్‌ల కోసం పెట్టే ఆర్డర్లు ఆర్డర్‌లు ‘ఎన్‌ఎస్‌ఇ ఐఎఫ్‌ఎస్‌సి’ ఆర్డర్ మ్యాచింగ్-ట్రేడింగ్ వేదికలకు పంపి, సరిపోల్చబడతాయి. దీనిద్వారా భారతదేశం నుంచేగాక, అంతర్జాతీయ అధికార పరిధిలోని బ్రోకర్లు-డీలర్లు ట్రేడింగ్ డెరివేటివ్‌ల కోసం పెద్ద సంఖ్యలో పాల్గొంటారని భావిస్తున్నారు. ఇది ‘గిఫ్ట్‌-ఐఎఫ్‌ఎస్‌సి’లోని డెరివేటివ్ మార్కెట్‌లలో నగదు లభ్యతను మరింత పెంచుతుంది, అంతర్జాతీయ భాగస్వాములను మరింత పెద్దసంఖ్యలో ఆకర్షించడంతోపాటు  ‘గిఫ్ట్‌-ఐఎఫ్‌ఎస్‌సి’లో ఆర్థిక పర్యావరణ వ్యవస్థపై సానుకూల ప్రభావం సృష్టిస్తుంది.



(Release ID: 1846608) Visitor Counter : 147