ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టు ప్రధాన సొరంగాన్ని మరియు ఐదు అండర్‌పాస్‌లను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి


“ఇది సమస్యలను పరిష్కరించే నవభారత దేశం.
కొత్త ప్రతిజ్ఞలు చేస్తుంది. వాటి సాకారానికి
నిర్విరామంగా కృషి చేస్తుంది”

“21వ శతాబ్దం అవసరాలకు తగినట్టుగా ప్రగతి
మైదాన్‌ను తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగమే ఈ ప్రాజెక్టు”

“దేశరాజధానిలో అధునాతన సదుపాయాలు,
ప్రపంచశ్రేణి కార్యక్రమాలతో కూడిన ఎగ్జిబిషన్ హాళ్ల
నిర్మాణానికే భారత ప్రభుత్వ నిర్విరామం కృషి,

“కేంద్రం అభివృద్ధి చేస్తున్న అధునాతన మౌలిక సదుపాయాలు ఢిల్లీని మరింత అధునాతనంగా తీర్చిదిద్దుతున్నాయి.
ఇది ఢిల్లీ నగరం దశనే మార్చేస్తోంది.”

“సామాన్య ప్రజలకు సౌకర్యవంతమైన సదుపాయాలే లక్ష్యంగా
మౌలిక సదుపాయాల ఆధునికీకరణపై దృష్టి కేంద్రీకరణ”

“ప్రపంచంలోనే ఉత్తమ అనుసంధానం కలిగిన రాజధానుల్లో ఒకటిగా
ఆవిర్భవిస్తున్న ఢిల్లీ నగరం”

“సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ లక్ష్యానికి మాధ్యమంగా
గతిశక్తి జాతీయ బృహత్పథకం”

“పట్టణ ప్రణాళికకు ప్రభుత్వం ఇంతగా ప్రాధాన్యం ఇవ్వడం
ఇదే తొలిసారి”

Posted On: 19 JUN 2022 1:13PM by PIB Hyderabad

   ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన సొరంగ మార్గాన్ని, ఐదు అండర్‌పాస్ మార్గాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జాతికి అంకితం చేశారు. ప్రగతి మైదాన్ పునరభివృద్ధి పథకంలో అంతర్భాగంగా ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టును రూపొందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, హర్‌దీప్‌సింగ్ పూరి, సోమ్‌ప్రకాశ్, అనుప్రియా పటేల్, కుశాల్ కిశోర్ తదితరులు హాజరయ్యారు.

  ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ఢిల్లీ ప్రజలకు కేంద్రప్రభుత్వం అందించిన కానుకగా అభివర్ణించారు. ఢిల్లీలో వాహనాల రాకపోకల రద్దీ, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వంటి సమస్యల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ఒక భారీ సవాలుగా నిలిచిందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో నవభారత దేశం పనిసంస్కృతి కీలకపాత్ర పోషించిందని, కార్మికులు, ఇంజనీర్లకే ఈ ఘనత చెందుతుందని ప్రధాని అన్నారు. ఇది సమస్యలను పరిష్కరించే నవ భారతదేశం. కొత్త ప్రతిజ్ఞలు పూనుతుంది. వాటిని సాకారం చేసుకునేందుకు నిర్విరామంగా కృషి చేస్తుంది అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.

  ప్రగతి మైదాన్ ప్రాంతాన్ని 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో చేపట్టిన ఉద్యమంలో భాగంగా ప్రధాన సొరంగ నిర్మాణానికి రూపకల్పన చేసినట్టు చెప్పారు. కాలానుగుణంగా భారతదేశం మారుతున్నప్పటికీ, దేశం గొప్పతనాన్ని తెలియజెప్పేందుకు రూపుదిద్దుకున్న ప్రగతి మైదాన్ మాత్రం బాగా వెనుకబడిపోయిందని, తగిన చొరవ లేకపోవడం, రాజకీయాల జోక్యమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. ప్రగతి మైదాన్‌లో  ఇన్నాళ్లూ ప్రగతి’ (అభివృద్ధి) లేకపోవడం దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్బాటం, ప్రచార పటాటోపం భారీ స్థాయిలో జరిగినప్పటికీ, గతంలో ప్రగతి మాత్రం జరగలేదని అన్నారు.దేశ రాజధానిలో ప్రపంచ శ్రేణి కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా అధునాతన సదుపాయాలు, ఎగ్జిబిషన్ హాళ్లు ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది. అని అన్నారు. ద్వారకలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్, ప్రగతి మైదాన్‌లో చేపట్టిన పునరభివృద్ధి పథకం వంటి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రస్తావించారు.కేంద్రప్రభుత్వం అభివృద్ధి చేసిన అధునాతన సదుపాయాలు ఢిల్లీ నగర స్వరూప స్వభావాలనే మార్చివేస్తున్నాయి. ఢిల్లీని అధునాతనంగా తీర్చిదిద్దుతున్నాయి. మనకు చిత్రరూపంలో కనిపించే ఈ మార్పు నగరం దశ మారేందుకు దోహదపడుతుంది.”, అని అన్నారు. సామాన్య ప్రజల సౌకర్యవంతమైన జీవితానికి నానాటికీ ఆవశ్యకత పెరుగుతున్నందునే మౌలిక సదుపాయాల ఆధునికీకరణపై దృష్టిని కేంద్రీకరించాల్సి వస్తోందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో పర్యావరణ స్పృహతో, వాతావరణ మార్పులపై అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆఫ్రికా అవెన్యూ ప్రాంతంలోని కొత్త రక్షణ కార్యాలయ భవన సముదాయం, కస్తూర్బా గాంధీ రోడ్డు ప్రాంతాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా మిలిగిన సమస్యల పరిష్కారంపట్ల వ్యవహరించే తీరుకు, పర్యావరణహితమైన నిర్మాణం తీరుకు, దేశంకోసం పనిచేస్తున్నవారిపట్ల జాగరూకతతో వ్యవహరించడానికి ప్రతీకకలుగా ఈ ప్రాజెక్టులను చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతూ ఉండటం తనకు సంతృప్తినిస్తోందన్నారు. రానున్న రోజుల్లో భారతదేశ రాజధాని ప్రపంచస్థాయిలో చర్చనీయాంశం అవుతుందని, భారతీయలకు గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు.

  ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుతో ఒనగూడే ప్రయోజనాలను గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుతో ప్రయాణికుల సమయం, ఇంధనం ఆదాఅవుతుందన్నారు. ఒక అంచనా ప్రకారం 55లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని, వాహనాల రాకపోకల రద్దీ నియంత్రణతో పర్యావరణానికి రక్షణ లభిస్తుందని అన్నారు. ఇది దాదాపు 5లక్షల మొక్కలు నాటటంతో సమాన స్థాయిలో ప్రయోజనాలు అందిస్తుందన్నారు. సౌకర్యవంతమైన జీవితాన్ని పెంపొందించేందుకు ఇలాంటి శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం ప్రస్తుత తరుణంలో చాలా అవసరమన్నారు.ఢిల్లీ నగరం-దేశ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్.) ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి గత ఎనిమిదేళ్లలో మేం కనివినీ ఎరుగని చర్యలు తీసుకున్నాం. గత ఎనిదేళ్లలో ఢిల్లీ-ఎన్.సి.ఆర్. ప్రాంతంలో మెట్రో సేవల నిడివిని 193 కిలోమీటర్లనుంచి 400 కిలోమీటర్లకు పెంచాం. అంటే ఈ సేవలను రెట్టింపుస్థాయికి మించి పెంచాంఅని ప్రధానమంత్రి అన్నారు. మెట్రో సేవలను, ప్రజా రవాణా సదుపాయాలను వినియోగించడం అలవాటుగా మార్చుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈస్ట్రన్-వెస్ట్రన్ ఫెరిపెరల్ ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే మార్గాలు ఢిల్లీ పౌరులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. కాశీ రైల్వే స్టేషన్‌లో పౌరులతోను, ఇతర భాగస్వామ్య వర్గాలతోను తాను జరిపిన సంభాషణను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, సామాన్యుడి ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చిందని, ఈ మార్పునకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ-చండీగఢ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వే మార్గాలతో ప్రపంచంలో ఎక్కువ అనుసంధానం కలిగిన రాజధానుల్లో ఒకటిగా ఢిల్లీ తయారైందని అన్నారు. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఢిల్లీ మీరట్ ర్యాపిడ్ రైలు వ్యవస్థ గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. దేశరాజధానిగా ఢిల్లీ ఉనికిని మరింత పటిష్టంచేసేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టామని, వృత్తి నిపుణులు, సామాన్య ప్రజలు, విద్యార్థులు, యువకులకు, పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లేవారికి, టాక్సీ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు, వాణిజ్య వర్గాలవారికి  ఢిల్లీ మీరట్ ర్యాపిడ్ రైలు వ్యవస్థ ఎంతో ప్రయోజనకరమని ఆయన అన్నారు.

  పి.ఎం.గతిశక్తి జాతీయ బృహత్ఫథకం దార్శనికతలో భాగంగా మల్టీ మోడల్ అనుసంధానాన్ని దేశం నిర్మించుకుంటోందని ప్రధానమత్రి అన్నారు. సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ నినాదమే మాధ్యమంగా పి.ఎం. గతిశక్తి జాతీయ బృహత్పథకం రూపుదాల్చిందన్నారు. గతిశక్తి పథకం పనులను రాష్ట్రాలు అందిపుచ్చుకోవడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ధర్మశాలలో ఇటీవల జరిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో తనకు ఈ విషయమై సమాచారం తెలిసిందన్నారు. అమృతకాలం గడువులోనే దేశంలోని మెట్రో నగరాల పరిధిని విస్తృతం చేయవలసిన అవసరం ఉందని, ఈ విషయంలో రెండవ కేటగిరీ, 3వ కేటగిరీ నగరాల్లో మరింత ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని ప్రధానమంత్రి అన్నారు. రానున్న పాతికేళ్లలో భారతదేశం శరవేగంతో అభివృద్ధి చెందనున్న నేపథ్యంలో మన నగరాలను హరిత నగరాలుగా, స్వచ్ఛ నగరాలుగా, స్నేహపూరిత నగరాలుగా తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణీకరణ ప్రక్రియను ఒక సవాలుగా కాకుండా, అవకాశంగా మనం పరిగణిస్తే అది దేశం విస్తృతాభివృద్ధికి ఉపయోగపడుతుంది.” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

  పట్టణ ప్రణాళికకు ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో ప్రాముఖ్యం ఇవ్వడం ఇదే తొలిసారని అన్నారు. పట్టణ పేదలనుంచి, పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజల వరకూ ప్రతి ఒక్కరికీ మెరుగైన సదుపాయాలు కల్పించేందుకే కృషి జరుగుతోందన్నారు. పట్టణాల్లోని పేదలకోసం గత ఎనిమిదేళ్లలో కోటీ 70 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.  లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలు తమ సొంత ఇళ్లను నిర్మించుకునేందుకు సహాయం అందించినట్టు చెప్పారు. నగరాల్లో అధునాతన రవాణా సౌకర్యాల కల్పనపై దృష్టిని కేంద్రీకరించినపుడు, సి.ఎన్.జి. ఆధారిత వాహనాలకు, విద్యుత్ ఆధారిత మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం వస్తుందని అన్నారు. విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన ఫేమ్‌ఇండియా పథకం ఇందుకు మంచి ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు.

   ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా జాతికి అంకితం చేసిన  సొరంగ మార్గంలో ప్రధానమంత్రి స్వయంగా కొంతసేపు నడిచారు. సొరంగ మార్గంలో ప్రణాళికకు అతీతంగా ఏర్పాటు చేసిన చిత్రకళ ఈ ప్రాజెక్టు విలువను మరింత ఇనుమడింపజేస్తోందన్నారు. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ నినాదంపై ఇది గొప్ప అధ్యన కేంద్రం అవుతుందన్నారు. బహుశా ఈ సొరంగం ప్రపంచంలోనే అతిపొడవైన ఆర్ట్ గ్యాలరీ కావచ్చని అన్నారు. ఈ చిత్రకళను వీక్షించేందుకు, కళాస్ఫూర్తిని పొందేందుకు వీలుగా ఈ సొంరంగాన్ని ఆదివారాల్లో కొన్ని గంటలపాటు పాఠశాల పిల్లలకు, పాదచారులకు మాత్రమే కేటాయించే విషయం పరిశీలించవచ్చని ఆయన సూచించారు.

 

ప్రాజెక్టు వివరాలు:

ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టును రూ. 920కోట్లకుపైగా నిధులతో నిర్మించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం జరిగింది. ప్రగతి మైదాన్‌లో అభివృద్ధి చేస్తున్న ప్రపంచ శ్రేణి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటరుకు అనుసంధానంగా, అక్కడికి ఎలాంటి వాహనాల రద్దీ లేకండా వెళ్లడానికి వీలుగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ప్రగతి మైదాన్‌లో చేపట్టే కార్యక్రమాల్లో ప్రదర్శనకారులు, సందర్శకులు సులభంగా పాల్గొనేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. 

  ఈ ప్రాజెక్టు ప్రభావం కేవలం ప్రగతిమైదాన్ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా వాహనాల రాకపోకలు సాగడంతో ప్రయాణికుల సమయం, ప్రయాణ వ్యయం ఆదా అవుతుంది. పట్టణ మౌలిక సదపాయాలను పూర్తిగా మార్చివేయడం ద్వారా ప్రజల జీవితాలను సౌకర్యవంతంగా చేయాలన్న ప్రభుత్వ దార్శికతతో ఈ ప్రాజక్టుకు రూపకల్పన జరిగింది. 

  ప్రధాన సొరంగం,..  పురాణా ఖిల్లా రోడ్డు, ప్రగతి మైదాన్ ద్వారా ఇండియా గేట్ రింగ్‌రోడ్డుతో అనుసంధానమవుతుంది. ఆరువరుసలతో నిర్మించిన ఈ సొరంగంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రగతిమైదాన్ బేస్‌మెంట్ పార్కింగ్‌కు ఇది అనుసంధానంగా ఉంటుంది. పార్కింగ్ ప్రాంతం మరోవైపునుంచి వాహనాలు సజావుగా ముందుకు కదిలేందుకు వీలుగా ప్రధాన సొరంగానికి దిగువ భాగంలో రెండు క్రాస్ టన్నెల్స్ నిర్మించారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా ఈ సొరంగాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించారు.  స్మార్ట్ ఫైర్‌మేనేజ్‌మెంట్, మాడర్న్ వెంటిలేషన్, అధునాతన డ్రైనేజి వ్యవస్థ, డిజిటల్ సి.సి.టి.వి., పబ్లిక్ అనౌన్స్‌మెంట్ వంటి అధునాతన సదుపాయాలను ఈ సొరంగంలో ఏర్పాటు చేశారు.  ప్రస్తుతం,  సామర్థ్యానికి మించి వాహనాల రాకపోకల రద్దీని భరిస్తున్న భైరాన్ మార్గ్ రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గంగా ఈ సొంరంగం ఉపయోగపడుతుంది. భైరాన్ మార్గ్‌లో వాహనాల రాకపోకల్లో సగం భారాన్ని ఈ సొంరంగం తగ్గించగలదని అంచనా.  ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన సొరంగంతో పాటుగా, ఆరు అండర్‌పాస్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. నాలుగు అండర్‌పాస్ మార్గాలు మథురా రోడ్డుపైన, ఒక అండర్ పాస్‌ను  భైరాన్ మార్గ్‌పైన నిర్మించారు. మరో అండర్ పాస్‌ను,.. రింగ్ రోడ్డు, భైరాన్ మార్గ్‌కు ఇంటర్‌సెక్షన్‌గా అందుబాటులోకి వచ్చింది.

 

****


(Release ID: 1835437) Visitor Counter : 162