ప్రధాన మంత్రి కార్యాలయం

వడోదరలో ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’లో పాల్గొన్న ప్రధానమంత్రి


రూ.21,000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు;

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.4 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవం.. శంకుస్థాపన;

రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులతో ఈ ప్రాంతంలో రైల్వే సంధానానికి కీలక ప్రోత్సాహం;

రూ.800 కోట్ల వ్యయంతో ‘ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన’కు ప్రధాని శ్రీకారం;

“ఈ 21వ శతాబ్దపు భారతదేశ సత్వర ప్రగతి ఎంత ముఖ్యమో మహిళల
అభివృద్ధిసహా వారికి వేగంగా సాధికారత కల్పన కూడా అంతే ముఖ్యం”;

“నేటి భారతదేశం మహిళల అవసరాలు.. ఆకాంక్షలను దృష్టిలో
ఉంచుకుని ప్రణాళికలు రూపొందిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది”;

“వడోదర సంస్కార నగరం... ఇక్కడికి వచ్చేవారిని ఈ నగరం అన్నివిధాలా ఆదుకుంటుంది”;

“విధాన నిర్ణయాత్మకత సహా ప్రతి స్థాయిలోనూ అవకాశాల కల్పనకు
కృషి చేయడం ద్వారా గుజరాత్‌లోని మహిళలను మేం ప్రోత్సహించాం”

Posted On: 18 JUN 2022 3:25PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వడోదరలో నిర్వహించిన ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రూ.21 వేల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతోపాటు ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ఇవాళ తనకు ‘మాతృవందన’ (తల్లికి ప్రణామం) దినమని పేర్కొన్నారు. ఈ మేరకు 100వ సంవత్సరంలో అడుగుపెట్టిన తన తల్లి ఆశీర్వాదాలతో ఆయన తన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ముందుగా పావగఢ్‌ కొండపై పునర్నిర్మిత శ్రీ కాళికామాత ఆలయాన్ని ప్రారంభించారు. దైవ దర్శనం సమయంలో దేశ క్షేమం కోసమేగాక దేశానికి సేవచేసేందుకు తనకు మరింత శక్తిని ప్రసాదించాలని, ఈ అమృత కాలంలో దేశం సంకల్పాలన్నీ నెరవేరేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించారు. అటుపైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ‘మాతృశక్తి’ (మహిళలు)కి ఆయన శిరసాభివందనం చేశారు.

   నేటి కార్య‌క్ర‌మంలో రూ.21000 కోట్ల విలువైన ప్రాజెక్టుల‌కు సంబంధించిన కార్యక్రమం గురించి ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావిస్తూ- గుజ‌రాత్ అభివృద్ధి ద్వారా భార‌త‌దేశ ప్రగతి అనే భావనను ఈ ప‌థ‌కాలు మరింత బలోపేతం చేస్తాయన్నారు. మాతాశిశు ఆరోగ్యం, పేదలకు ఇళ్లు, అనుసంధానం, ఉన్నత విద్య వగైరాలపై ఈ భారీ పెట్టుబడులు గుజరాత్ పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తాయని ఆయన అన్నారు. ఈ పథకాలలో అధికశాతం మహిళల ఆరోగ్యం, వారి సాధికారత, పోషకాహారానికి సంబంధించినవేనని ఆయన పేర్కొన్నారు. సంపూర్ణ ప్రగతికి మహిళా సాధికారతే ప్రధానంగా అభివృద్ధి పథంలో పయనించేందుకు ద్వంద్వ చోదక ప్రభుత్వం చేస్తున్న కృషి కాళికామాత ఆశీస్సులతో కొత్త పుంతలు తొక్కిందని ఆయన అన్నారు. సభకు హాజరైన ప్రజానీకంలో చిరపరిచితులను గుర్తించిన ఆయన- “ఈ 21వ శతాబ్దపు భారతదేశ సత్వర ప్రగతి ఎంత ముఖ్యమో మహిళల అభివృద్ధిసహా వారికి వేగంగా సాధికారత కల్పన కూడా అంతే ముఖ్యం. ఆ మేరకు నేటి భారతం మహిళ అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది” అని స్పష్టం చేశారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు కల్పించబడ్డాయని, వారి జీవిత చక్రంలోని ప్రతి దశనూ దృష్టిలో ఉంచుకుని మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం పథకాలు రూపొందించిందని ప్రధాని అన్నారు. “మాతృశక్తి వేడుకలకు వడోదర అనువైన నగరం.. ఎందుకంటే ఇది తల్లిలాగా సంస్కారం నేర్పే నగరం. ఈ నగరానికి వచ్చేవారికి అన్నివిధాలా రక్షణ కల్పిస్తుంది.. సుఖదుఃఖాల్లో తోడునీడగా నిలుస్తూ అనేక అవకాశాల కల్పనద్వారా ముందడుగు వేసేందుకు తోడ్పడుతుంది” అని అభివర్ణించారు.

   ఈ నగరం స్వామి వివేకానంద, మహర్షి అరవిందుడు, వినోబా భావే, బాబాసాహెబ్ అంబేడ్కర్‌ వంటి మహనీయులకు స్ఫూర్తినిచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే వ్యక్తిగతంగా తన జీవన పయనంలోనూ ఈ నగరం పోషించిన పాత్రను శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. ఆ మేరకు 2014లో వడోదర, కాశీ విశ్వనాథుడు ఆశీర్వదించినట్లు తెలిపారు. తల్లులు, మహిళల ఆరోగ్యం ప్రాముఖ్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. తల్లి ఆరోగ్యం ఆమెకు మాత్రమే కాదు… కుటుంబం మొత్తానికి- ముఖ్యంగా బిడ్డకు అత్యంత ఆవశ్యకమన్నారు. 

“రెండు దశాబ్దాల కిందట గుజరాత్ నాకు సేవచేసే అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ పోషకాహార లోపం పెను సవాలుగా ఉండేది. ఆనాటినుంచీ ఈ సమస్య పరిష్కారం దిశగా మేము ఒకదాని తర్వాత ఒకటిగా చేపట్టిన  చర్యలు నేడు సానుకూల ఫలితాలిస్తుండటం కళ్లకు కడుతోంది” అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ‘సికిల్‌ సెల్‌’ వ్యాధి సమస్యను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. దీంతోపాటు సెప్టెంబరు నెలను ‘పోషకాహార మాసం’గా నిర్వహించాలని నిర్ణయించినట్లు గుర్తుచేస్తూ- గుజరాత్‌లోని మహిళలకు ఇది ఎంతగానో సహాయపడుతుందని ఆయన అన్నారు. కాగా, పోషకాహారానికి మించి స్వచ్ఛ భారత్, ఉజ్వల వంటి పథకాల ద్వారా మహిళానుకూల వాతావరణం కల్పనకు ప్రభుత్వం కృషి చేసింది.

   “గుజరాత్‌లో మహిళలను ప్రతి స్థాయిలోనూ ప్రోత్సహించేందుకు మేము కృషి చేశాం. ఈ మేరకు విధాన నిర్ణయాత్మకతసహా మరిన్ని అవకాశాలిచ్చేందుకు ప్రయత్నించాం. మహిళల నిర్వహణ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని, గ్రామానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులలో సోదరీమణులకు నాయకత్వ పాత్ర ఇవ్వబడింది” అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగించారు. కుటుంబం ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలకు ప్రధానపాత్ర లభించేలా చూడటంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. జన్‌ధన్‌ ఖాతాలు, ముద్రా యోజన, స్వరోజ్‌గార్ యోజన వగైరాలు ఇందుకు సహకరిస్తున్నాయని తెలిపారు. పట్టణ పేదలు,  మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను కూడా శ్రీ మోదీ ఏకరువు పెట్టారు. పట్టణాల్లోని పేద కుటుంబాలకు ఇప్పటికే 7.5 లక్షల ఇళ్లు అందాయని, అలాగే 4.5 లక్షల మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణంలో సాయం అందిందని తెలిపారు. సరసమైన అద్దె, స్వానిధి యోజన పథకాలు గ్రామీణ పేద, మధ్య తరగతి వర్గాలకూ తోడ్పాటు ఇస్తున్నాయని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. సంక్షేమ చర్యలతోపాటు రాష్ట్రంలో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి కొనసాగుతున్నదని ఆయన వివరించారు. గుజరాత్‌లో పర్యాటక అభివృద్ధికి చేపట్టిన చర్యలు వడోదరకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని అన్నారు. పావగఢ్, కెవాడియా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయని, అలాగే రైల్వే, విమానయాన మౌలిక సదుపాయాలలో వడోదర భారీ ప్రగతిని సాధించిందని తెలిపారు. అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం, రైల్వే విశ్వవిద్యాలయం, బిర్సా ముండా గిరిజన విశ్వవిద్యాలయాలతో విద్యారంగానికి కొత్త శక్తినిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు.

కార్యక్రమం వివరాలు

   డోదరలో రూ.16,000 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. వీటిలో 357 కిలోమీటర్ల పొడవైన న్యూ పాలన్‌పూర్ – ప్రధాన సెక్షన్‌కు ప్రత్యేకించిన రవాణా కారిడార్‌ను జాతికి దేశానికి అంకితం చేశారు; అలాగే 166 కిలోమీటర్ల పొడవైన అహ్మదాబాద్-బోటాడ్ సెక్షన్ గేజ్ మార్పిడి పనులను; 81 కిలోమీటర్ల పొడవైన పాలన్‌పూర్ - మిఠ సెక్షన్‌ విద్యుదీకరణ; సూరత్, ఉద్నా, సోమనాథ్, సబర్మతి స్టేషన్ల పునరాభివృద్ధి, రైల్వే రంగంలో ఇతర పనులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఇవన్నీ రవాణా వ్యయాన్ని తగ్గించడానికి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు, వ్యవసాయ రంగ ప్రగతికి ఎంతో సాయపడతాయి. అవి ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని మెరుగుపరచడమేగాక ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తాయి.

   ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో సుమారు రూ.1,800 కోట్ల విలువైన ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,530 కోట్లకుపైగా విలువైన ఇళ్లుసహా మొత్తం 1.38 లక్షల ఇళ్లను ప్రధానమంత్రి అంకితం చేశారు. దీంతోపాటు రూ.310 కోట్లకుపైగా విలువైన దాదాపు 3000 ఇళ్లకు శంకుస్థాపన కూడా చేశారు.

   ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానమంత్రి ఖేడా, ఆనంద్, వ‌డోదర, ఛోటా ఉదయ్‌పూర్, పంచ‌మ‌హ‌ల్‌ల‌లో రూ.680 కోట్ల‌కుపైగా విలువైన వివిధ అభివృద్ధి ప‌నుల‌ను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాప‌న చేశారు. ఈ ప్రాంతంలో నివాస సౌలభ్యం కల్పించడమే దీని లక్ష్యం.

   గుజరాత్‌లోని దభోయ్ తాలూకాలోగల కుంధేలా గ్రామంలో గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. వడోదర నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోగల ఈ విశ్వవిద్యాలయం దాదాపు రూ. 425 కోట్లతో నిర్మితం కానుంది. దీంతో ఇక్కడ 2500 మంది విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాస అవసరాలు తీరుతాయి.

   మాతా-శిశు ఆరోగ్యం మెరుగుపై దృష్టి సారించిన ప్రధానమంత్రి ఈ దిశగా రూ.800 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ‘ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన’కు శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద గర్భిణులు, బాలింతలకు ప్రతినెలా అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 2 కిలోల శనగలు, 1 కిలో కందిపప్పు, 1 కిలో వంటనూనె ఉచితంగా అందజేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని గిరిజన లబ్ధిదారులందరికీ వర్తింపజేస్తున్న ‘పోషణ్ సుధా యోజన’ కోసం దాదాపు రూ.120 కోట్లను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. గిరిజన జిల్లాలకు చెందిన గర్భిణులు, బిడ్డలకు పాలిస్తున్న తల్లులకు ఐరన్, క్యాల్షియం మాత్రలు అందించి పౌష్టికాహారంపై అవగాహన కల్పించే ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు ఈ కార్యక్రమానికి నాంది పలికారు.

 

***



(Release ID: 1835242) Visitor Counter : 136