ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘సేవ్ సాయిల్’పై ఇషా ఫౌండేషన్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం


“ఎనిమిదేళ్లలో కీలక పథకాలన్నీ పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యంతో కూడినవే”;

‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ నేపథ్యంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
ఇవాళ ‘సేవ్ సాయిల్’ ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నారు;

“వాతావరణ మార్పులో భారతదేశం పాత్ర చాలా స్వల్పం.. కానీ, పర్యావరణ పరిరక్షణపై దీర్ఘదృష్టితో అంతర్జాతీయ సమాజంతో కలిసి భారత్‌ కృషి చేస్తోంది”;

“భూసార పరిరక్షణపై భారత్‌లో ఐదు అంశాల కార్యక్రమం అమలవుతోంది”;

“జీవ వైవిధ్యం-వన్య ప్రాణులకు సంబంధించి భారతదేశం నేడు అనుసరిస్తున్న విధానాలు వన్యప్రాణుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడానికి దోహదం చేశాయి”;

“10 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని నిర్దేశిత
గడువుకు 5 నెలల ముందే భారత్‌ నేడు సాధించింది”;

“దేశంలో 2014నాటికి ఇథనాల్‌ మిశ్రమం 1.5 శాతం మాత్రమే”;

“10 శాతం ఇథనాల్ మిశ్రమంతో కర్బన ఉద్గారాలు 27 లక్షల టన్నులదాకా
తగ్గి రూ.41 వేల కోట్ల విలువైన విదేశీ మారకం ఆదా కావడమేగాక
ఎనిమిదేళ్లలో మన రైతులకు రూ.40,600 కోట్లు ఆర్జించి పెట్టింది”

Posted On: 05 JUN 2022 12:25PM by PIB Hyderabad

   ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా సంద‌ర్భంగా ప్రధానమంత్రి ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ‘సేవ్‌ సాయిల్‌’ ఉద్యమాన్ని అభినందిస్తూ- దేశం స్వాతంత్ర్య మహోత్సవాలు నిర్వహించుకుంటూ కొత్త సంకల్పాలు పూనుతున్న వేళ ఇలాంటి ప్ర‌జా ఉద్య‌మాలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. దేశంలో ఎనిమిదేళ్లుగా అమ‌లవుతున్న కీలక ప‌థ‌కాలు ఎంతోకొంత పర్యావరణ కోణంతో ముడిపడి ఉండటం తనకెంతో సంతృప్తినిస్తోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు భారతదేశం బహుముఖంగా కృషి చేస్తున్నదని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు స్వచ్ఛ భారత్ కార్య‌క్ర‌మం లేదా ‘వ్యర్థం నుంచి అర్థం’ సంబంధిత కార్యక్రమాలు, అల్ప వినియోగ ప్లాస్టిక్‌ను వదిలించుకోవడం, ఒకే సూర్యుడు-ఒకే భూమి లేదా ఇథనాల్ మిశ్రమం కార్యక్రమం వంటివాటిని ఇందుకు ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు.

   ర్యావరణ పరిరక్షణకు భారతదేశం బహుముఖంగా ప్రయత్నాలు చేస్తున్నదని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వాతావరణ మార్పు విపరిణామాల్లో భారత్‌ పాత్ర నామమాత్రమే అయినా, బాగుచేయడంలో తనవంతు కృషికి ఎన్నడూ లోటులేదని చెప్పారు. ప్రపంచంలోని పెద్ద, ఆధునిక దేశాలు భూమ్మీది వ‌న‌రుల‌ను మ‌రింత‌గా దోచుకుంటున్నాయని, ప‌ర్య‌వ‌సానంగా అత్యధిక క‌ర్బన్ ఉద్గారాలు కూడా వాటి ఖాతాలోకే వెళ్తాయని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల త‌ల‌స‌రి సగటు 4 టన్నులు కాగా, భారత్‌లో క‌ర్బ‌న ఉద్గార జాడ ఏడాదికి 0.5 టన్నులు మాత్రమేనని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయినప్పటికీ పర్యావరణ ప‌రిర‌క్ష‌ణ‌కు అంత‌ర్జాతీయ స‌మాజంతో సంయుక్తంగా భార‌త్‌ ఒక దీర్ఘకాలిక సమగ్ర దృక్పథంతో కృషి చేస్తున్నదని వివరించారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విపత్తు ప్ర‌తిరోధ‌క మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), అంత‌ర్జాతీయ సౌర‌శ‌క్తి కూట‌మి (ఐఎస్ఎ) ఏర్పాటుకు భారత్ నాయకత్వం వహించిందని పేర్కొన్నారు. మరోవైపు 2070 నాటికి నికర శూన్య ఉద్గార స్థాయి సాధన స్వీయ లక్ష్యాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు.

   భూసార పరిరక్షణ కోసం ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. మొదటిది- మట్టిని రసాయన విముక్తం చేయడంఎలా? రెండోది- సాంకేతిక భాషలో భూ సేంద్రియ పదార్థంగా వ్యవహరించే మట్టిలోని జీవుల రక్షణ ఎలా? మూడోది- నేలలో తేమను కాపాడుకోవడం… ఆ దశదాకా నీటి లభ్యతను పెంచడం ఎలా? నాలుగోది- భూగర్భజలాల కొరతతో నేలకు వాటిల్లే నష్టనివారణ ఎలా? ఐదోది- అడవుల క్షీణతవల్ల సంభవించే నిరంతర భూమికోతను ఆపడం ఎలా?

   భూసార సమస్యల పరిష్కారం దిశగా వ్యవసాయ రంగంలో ప్రధానంగా కృషి చేస్తున్నట్లు  తెలిపారు. కాగా- నేల రకాలు, మట్టిలోని లోపం, నీటి పరిమాణం వగైరాలపై దేశంలోని రైతలకు తగిన సమాచారం లేదని అంతకుముందు ప్రధాని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా దేశవ్యాప్తంగా రైతులందరికీ ‘భూసార కార్డులు’ అందించేందుకు భారీ కార్యక్రమం చేపట్టామని వివరించారు.

   దేశ ప్రజానీకాన్ని నీటి పొదుపుతో అనుసంధానించే దిశగా ప్రతి వర్షపు చినుకునూ ఒడిసిపట్టడం వంటి కార్యక్రమాల ద్వారా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ప్ర‌ధాని తెలియజేశారు. మరోవైపు దేశంలోని 13 పెద్ద నదుల పరిరక్షణకు ఈ ఏడాది మార్చిలోనే ఉద్యమం కూడా ప్రారంభమైందన్నారు. జల కాలుష్యం తగ్గింపుతోపాటు నదీతీరాల్లో అడవుల పెంపకానికీ కృషి సాగుతున్నదని పేర్కొన్నారు. తద్వారా 7400 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. దీంతో గత ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన 20 వేల చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం మరింత పెరుగుతుందని ఆయన వివరించారు.

   జీవవైవిధ్యం-వన్యప్రాణులకు సంబంధించి భారత్‌ నేడు అనుసరిస్తున్న విధానాలు కూడా వన్యప్రాణుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవాళ దేశంలో పులి, సింహం, చిరుతపులి, ఏనుగు వంటి వన్యప్రాణి ఏదైనా వాటన్నిటి సంఖ్యా పెరుగుతున్నదని పేర్కొన్నారు. దేశంలో ఇంధనానికి సంబంధించి స్వచ్ఛత, స్వావలంబన కార్యక్రమాలను తొలిసారి చేపట్టామని ప్రధాని నొక్కిచెప్పారు. రైతుల ఆదాయం పెంపు, భూసారం పెంపు సంబంధిత కార్యక్రమాల పరస్పర అనుసంధానానికి ‘గోబర్‌-ధన్‌’ పథకాన్ని ఆయన ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.

   నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో కొన్నిటికి ప్రకృతి వ్యవసాయంలో విస్తృత పరిష్కారం ఉందని ప్రధానమంత్రి అన్నారు. తదనుగుణంగా గంగా నదీతీర గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయానికి ఈ ఏడాది బడ్జెట్‌లో పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు గుర్తుచేశారు. దీంతో మన పొలాలు రసాయన విముక్తం కావడమేగాక ‘నమామి గంగే’ ఉద్యమానికి కొత్త బలం చేకూరుతుందని చెప్పారు. ఈ మేరకు 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమి పునరుద్ధరణ లక్ష్యంతో భారత్‌ కృషి చేస్తున్నదని ప్రధాని తెలిపారు. అలాగే ‘బిఎస్‌-6, ఎల్‌ఈడీ’ బల్బుల పంపిణీ కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.

   మన వ్యవస్థాపిత విద్యుదుత్పాదన సామర్థ్యంలో 40 శాతాన్ని శిలాజేతర ఇంధనం వనరులద్దారా పొందే లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు 9 ఏళ్లు ముందుగానే భారత్‌ సాధించిందని ప్రధాని చెప్పారు. అలాగే సౌరశక్తి ఉత్పాదక సామర్థ్యం 18 రెట్లు పెరిగిందని, ఉదజని కార్యక్రమం (హైడ్రోజన్ మిషన్), వర్తుల ఆర్థిక వ్యవస్థ సంబంధిత విధానాలు, తుక్కు విధానం వంటివి పర్యావరణ పరిరక్షణపై మన నిబద్ధతకు నిదర్శనాలని ఆయన ఉదాహరించారు.

   రోవైపు ఇంధనంలో 10 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు 5 నెలలు ముందుగానే భారత్ నేడు సాధించిందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ ఘనత ఎంత బృహత్తరమైనదో వివరిస్తూ- 2014లో ఇథనాల్ మిశ్రమం 1.5 శాతమేనని ఆయన గుర్తుచేశారు. ఈ లక్ష్య సాధనతో మూడు స్పష్టమైన ప్రయోజనాలు సమకూరాయని ప్రధాని తెలిపారు. మొదటిది- 27 లక్షల టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపు; రెండోది- రూ.41 వేల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా; మూడోది- ఇథనాల్ మిశ్రమం ద్వారా గడచిన ఎనిమిదేళ్లలో దేశంలోని రైతులు రూ.40,600 కోట్లు ఆర్జించగలిగారని వివరించారు. ఈ ఘనత సాధించడంపై దేశ ప్రజలు, రైతులు, చమురు కంపెనీలను ప్రధాని అభినందించారు.

   ప్రధానమంత్రి జాతీయ గతిశక్తి బృహత్‌ ప్రణాళికతో మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ బలోపేతం అవుతాయని, తద్వారా కాలుష్యం తగ్గుతుందని ప్రధాని అన్నారు. అలాగే 100కుపైగా జలమార్గాలపై బహుళ ప్రయాణ సాధన అనుసంధానం పనులు కూడా కాలుష్యం తగ్గింపులో తోడ్పడతాయన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల దృష్టిని ఆయన హరిత ఉద్యోగావకాశాలవైపు మళ్లించారు. పర్యావరణ పరిరక్షణలో భారత్‌ కృషి ఊపందుకోవడం వల్ల  హరిత ఉద్యోగావకాశాలు పెద్ద సంఖ్యలో అందివస్తాయన్నారు. పర్యావరణం, భూసార పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోనూ 75 అమృత్‌ సరోవరాల రూపకల్పనకు ప్రజా ఉద్యమం చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.

   భూసారం నానాటికీ క్షీణిస్తున్న పరిస్థితుల నడుమ నేలను రక్షించుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్‌ సాయిల్‌’ ఉద్యమం మొదలైంది. ఈ మేరకు సద్గురు 2022 మార్చి 5వ తేదీన మోటార్‌ సైకిల్‌పై 27 దేశాల మీదుగా 100 రోజుల యాత్రను ప్రారంభించారు. దీనికి జూన్ 5వ తేదీతో 75 రోజులు పూర్తయిన నేపథ్యంలో న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ప్రధానమంత్రి ఇందులో పాల్గొనడం భారతదేశంలో భూసారం మెరుగుపరచే కృషిలో సంయుక్త భాగస్వామ్యం దిశగా ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.


(Release ID: 1831502) Visitor Counter : 289