ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాన్పూర్‌లోని ప‌రౌనుఖ్ గ్రామంలో జ‌రిగిన అధికారిక కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించిన‌ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ.

రాష్ట్ర‌ప‌తితో క‌లిసి వారి పూర్వీకుల గ్రామానికి వెళ్లిన ప్ర‌ధాన‌మంత్రి.

"ఏక్ భార‌త్ శ్రేష్ఠ్ భార‌త్ కు ప‌రౌనుఖ్ ఒక గొప్ప ఉదాహ‌ర‌ణ‌."

"సంవిధాన్‌, సంస్కార్‌మూర్తీభవించిన వ్య‌క్తి రాష్ట్ర‌ప‌తిజి".

"ఇండియాలో గ్రామీణ ప్రాంతంలో జన్మించిన వ్య‌క్తికూడా రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి, గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అందుకోగ‌ల‌రు."

"భార‌త‌దేశంలో గ్రామాల సాధికార‌త ప్ర‌భుత్వ అత్యున్న‌త ప్రాధాన్య‌త‌ల‌లో ఒక‌టి.
పేద ప్ర‌జ‌ల సంక్షేమం కోసం దేశం మున్నెన్న‌డూ లేనంత వేగంతో కృషి చేసింది."

"వంశ‌పారంప‌ర్య రాజ‌కీయాల‌ ఉచ్చులో చిక్కుకున్న పార్టీలు ఈ వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు మాత్ర‌మే భార‌త‌దేశ ప్ర‌జాస్వామ్యం బ‌లంగా ఉంటుంది. ఈ దేశ యువ‌త రాజ‌కీయాల‌లోకి వ‌చ్చేందుకు గ‌రిష్ఠ స్థాయిలో అవ‌కాశాలు పొంద‌గ‌లుగుతారు."

Posted On: 03 JUN 2022 5:17PM by PIB Hyderabad

కాన్పూర్ లోని ప‌రౌనుఖ్ గ్రామంలోని ప‌త్రి మాతా మందిర్‌కు , రాష్ట్ర‌ప‌తి శ్రీ రామ్ నాథ్ కోవింద్ తో క‌లిసి ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ వెళ్లారు. అనంత‌రం వారు డాక్ట‌ర్ బి.ఆర్‌.అంబేడ్క‌ర్ భ‌వ‌న్‌ను సంద‌ర్శించి అక్క‌డ నుంచి మిల‌న్ కేంద్రానికి వెళ్లారు. ఈ కేంద్రం రాష్ట్ర‌ప‌తి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పూర్వీకుల  ఇల్లు. దీనిని  ప్ర‌జ‌ల అవ‌స‌రార్ధం విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత దానిని క‌మ్యూనిటీ సెంట‌ర్ ( మిల‌న్ సెంట‌ర్ ) గా మార్చారు. రాష్ట్ర‌ప‌తి,ప్ర‌ధాన‌మంత్రి ఇరువురూ  ప‌రౌనుఖ్ గ్రామంలో ప‌లు కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. రాష్ట్ర‌ప‌తి స‌తీమ‌ణి శ్రీమ‌తి సవితా కోవింద్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ మ‌తి ఆనందిబెన్ ప‌టేల్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్‌, కేంద్ర మంత్రులు , రాష్ట్ర మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు  ఈ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన వారిలో ఉన్నారు.

  ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, రాష్ట్ర‌ప‌తిగారి పూర్వీకుల గ్రామాన్ని సంద‌ర్శించ‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు. రాష్ట్ర‌ప‌తి గారి బాల్యం అక్క‌డే గ‌డిచింది. అక్క‌డి నుంచి వారు రాష్ట్ర‌ప‌తి స్థాయికి ఎదిగారు. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆనాటి జ్ఞాప‌కాల‌ను రాష్ట్ర‌ప‌తి త‌న‌తో పంచుకున్న విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర‌ప‌తి జీవితగ‌మ‌నంలోని ముఖ్య‌ఘ‌ట్టాలను, వారి గొప్ప‌ద‌నాన్నిప్ర‌ధాన‌మంత్రి  కొనియాడారు.

 

ఆద‌ర్శగ్రామాల బ‌లం ప‌రౌన‌ఖ్ లో ఉంద‌ని తాను భావిస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. ఏక్ భార‌త్ శ్రేష్ఠ్ భార‌త్ కు ఈ గ్రామం గొప్ప ఉదాహ‌ర‌ణ అని  ఆయ‌న అన్నారు.  ప‌త్రిమాత మందిర్ దేవ భ‌క్తి, దేశ‌భ‌క్తికి నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న అన్నారు.  రాష్ట్ర‌ప‌తిగారి తండ్రిగారి ఆలోచ‌న‌లు, యాత్ర‌ల‌పై మ‌క్కువ‌, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్క‌డి రాళ్లు,  అక్క‌డి  నుంచి వివిధ వ‌స్తువుల‌ను సేక‌రించడం వంటి వారి ఆలోచ‌న‌ల‌కు శిర‌సువంచి న‌మ‌స్క‌రిస్తున్న‌ట్టు ప్ర‌ధానమంత్రి తెలిపారు.
ప‌రౌన‌ఖ్ గ్రామ మ‌ట్టినుంచి రాష్ట్ర‌ప‌తిగారు పొందిన సంస్కారాన్ని ప్ర‌పంచం ఇవాళ చూస్తున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.రాష్ట్ర‌ప‌తి రాంనాథ్‌కోవింద్‌, సంవిధాన్ , సంస్కార్‌కు ప్ర‌తిరూప‌మ‌ని అన్నారు. ప్రొటొకాల్‌ను ప‌క్క‌న పెట్టి రాష్ట్ర‌ప‌తి త‌న‌కు హెలిపాడ్ వ‌ద్ద స్వాగ‌తం ప‌ల‌క‌డం ప్ర‌ధాన‌మంత్రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అతిథుల‌కు స్వాగతం ప‌ల‌క‌డ‌మనే సంస్కారాన్నితాను కొన‌సాగిస్తున్న‌ట్టు రాష్ట్ర‌ప‌తిగారు త‌న‌కుచెప్పిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. రాష్ట్ర‌ప‌తి త‌న‌ప‌ట్ల చూపిన ఆద‌రాభిమానాల‌కు ప్ర‌ధాన‌మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

త‌మ పూర్వీకుల ఇంటిని రాష్ట్ర‌ప‌తి  మిల‌న్ కేంద్ర గా అభివృద్ధి చేసేందుకు ఇచ్చార‌ని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. అది ఇవాళ మ‌హిళా సాధికార‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలిచి మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ‌నిస్తూ వారికి బ‌లాన్ని చేకూరుస్తున్న‌దని ఆయ‌న అన్నారు. అలాగే. డాక్ట‌ర్ బి.ఆర్‌.అంబేడ్క‌ర్ భ‌వ‌న్ బాబాసాహెబ్ ఆశ‌యాల‌ను ముందుకు తీసుకుపోతున్న‌ద‌ని అన్నారు. ప‌రౌన‌ఖ్ గ్రామం గ్రామ ప్ర‌జ‌ల స‌మ‌ష్ఠి కృషితో అభివృద్ధిలో  మ‌రింత ముందుకు పోనున్న‌ద‌ని చెప్పారు. ఇది ఖ‌చ్ఛిత‌మైన  ప‌రిపూర్ణ‌గ్రామానికి  దేశంలోనే ఒక న‌మూనాగా నిలుస్తుంద‌ని అన్నారు. అత‌డు లేదా ఆమె ఎక్క‌డికి వెళ్లినా పుట్టిన  ఊరు  మాత్రం వారిని వ‌ద‌ల‌ద‌ని ఆయ‌న అన్నారు.  భార‌త‌దేశ స్వాతంత్రాన్ని గ్రామాల అనుసంధానంలో మ‌హాత్మాగాంధీ చూసేవార‌ని ప్ర‌ధానమంత్రి అన్నారు.
భార‌త‌దేశ గ్రామం అంటే ఆథ్యాత్మిక‌త‌, ఆద‌ర్శాలు అని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశ గ్రామంఅంటే సంప్ర‌దాయాలు, అభివృద్ధి అని ప్ర‌ధానమంత్రి అన్నారు. ఎక్క‌డ సంస్కృతి సంప్ర‌దాయాలు ఉంటాయో  అక్క‌డ స‌హ‌కారం ఉంటుంద‌ని అదే భార‌తీయ గ్రామ‌మ‌ని అన్నారు. ప్రేమ ఉన్న‌చోట స‌మాన‌త్వం ఉంద‌ని అన్నారు. ప్ర‌స్తుత అమృత్‌కాల్‌లో ఇలాంటి గ్రామాల‌ను బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. గ్రామాల అభివృద్ధి, రైతులు,పేద‌లు,పంచాయ‌త్ ప్ర‌జాస్వామ్యం అభివృద్ధికి సంక‌ల్పం చెప్పుకుని దేశం ముందుకు సాగుతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.
 మ‌న గ్రామాలు ఎంతో సామ‌ర్ధ్యం క‌లిగిన‌వ‌ని , కార్మిక శ‌క్తి అత్యున్న‌త అంకిత భావం క‌లిగిన‌వ‌ని అన్నారు. అందువ‌ల్ల గ్రామాల సాధికార‌త మా ప్ర‌భుత్వ అత్యున్న‌త ప్రాధాన్య‌త‌లో ఒక‌టిగా ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

జ‌న్‌ధ‌న్‌యోజ‌న‌, పిఎంఎవై, ఉజ్వ‌ల , హ‌ర్ ఘ‌ర్‌జ‌ల్ వంటి ప్ర‌భుత్వ‌ప‌థ‌కాల‌తో కోట్లాదిమంది గ్రామీణ ప్ర‌జ‌లు ల‌బ్ధిపొందార‌ని ప్ర‌ధానమంత్రి అన్నారు. పేద ప్ర‌జ‌ల సంక్షేమం కోసం దేశం మున్నెన్న‌డూ లేనంత‌టి వేగంతో ప‌నిచేసింద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ప్ర‌స్తుతం దేశం అన్ని ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాల‌ను నూరు శాతం, ప్ర‌జ‌లంద‌రికీ అందేట్టు చూసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌న్నారు. వివిధ ప‌థ‌కాల‌ను గ‌రిష్ఠ స్థాయిలో అముల చేయ‌డం ప్ర‌స్తుతం ఉన్న త‌మ ప్రాధాన్య‌త అని ఆయ‌న అన్నారు. ఇది ఎలాంటి వివ‌క్ష‌కు తావులేకుండా సాధికార‌త‌కు దారితీస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశ ప్ర‌జాస్వామ్య బ‌లం గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, వేదిక మీద ఉన్న న‌లుగురు ప్ర‌ముఖులు, రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి, గ‌వ‌ర్న‌ర్ , ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వీరంద‌రూ  చిన్న గ్రామాలు లేదా చిన్న ప‌ట్ట‌ణాల నుంచి వ‌చ్చిన‌వారే న‌ని ఆయ‌న అన్నారు. మేం ప‌డిన క‌ష్టాలు, పేద‌రికంతో మాకు ప్ర‌త్య‌క్షంగా గ‌ల సంబంధం, పెరిగిన గ్రామీణ వాతావ‌ర‌ణం ఇవ‌న్నీ మా సంస్కారాల‌ను బ‌లోపేతం చేశాయి అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. భార‌త‌దేశంలో గ్రామీణ ప్రాంతాల‌లో అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టిన వారు సైతం రాష్ట్ర‌ప‌తి ప్ర‌ధాన‌మంత్రి , గ‌వ‌ర్న‌ర్, ముఖ్య‌మంత్రి వంటి ప‌ద‌వులు అధిరోహించే స్థాయికి చేరుకోగ‌ల‌ర‌ని అన్నారు.
ప్ర‌జాస్వామ్య నేప‌థ్యంలోంచి చూసిన‌పుడు , ప్ర‌ధాన‌మంత్రి వార‌స‌త్వ రాజ‌కీయాల ప‌ట్ల అప్ర‌మత్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఇవి రాజ‌కీయాల‌లో ప్ర‌తిభ‌ను కాల‌రాయ‌డ‌మేకాక‌, ప్ర‌తి రంగంలో నూత‌న ప్ర‌తిభ‌ను వృద్ధిలోకి రాకుండా అణిచివేస్తుంద‌ని అన్నారు. నాకు ఏ రాజ‌కీయ పార్టీపైన లేదా ఏ వ్య‌క్తి పైనా క‌క్ష లేదు. దేశంలో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉండాల‌ని నేను కోరుకుంటాను. ప్ర‌జాస్వామ్యానికి అంకిత‌మైన రాజ‌కీయ పార్టీలు ఉండాల‌ని కోరుకుంటాను అని ఆయ‌న అన్నారు. వార‌స‌త్వ రాజ‌కీయాల‌లో కూరుకుపోయిన పార్టీలు ఈ జ‌బ్బునుంచి బ‌య‌ట‌ప‌డాలి. దీనిని వారే న‌యం చేసుకోవాలి. అప్పుడు మాత్ర‌మేదేశంలో ప్ర‌జాస్వామ్యం బ‌లంగా ఉంటుంది.  అప్పుడే దేశ యువ‌త రాజ‌కీయాల‌లో చేర‌డానికి గ‌రిష్ఠ స్థాయిలో అవ‌కాశాలు పొంద‌గ‌లుగుతారు అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.
గ్రామంలో అమృత్‌స‌రోవ‌ర్ నిర్మాణంలో స‌హ‌క‌రించాల్సిందిగా , గ్రామ‌స్థుల‌ను ప్ర‌ధాన‌మంత్రి కోరారు. అలాగే ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేయాల్సిందిగా వారిని కోరారు. అంద‌రి కృషిఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కు ఆత్మ‌నిర్భ‌ర్ గ్రామం ఎంతో ముఖ్య‌మని అన్నారు.
ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి , కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

*****

DS

***


(Release ID: 1831134)