ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్-2022 ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

Posted On: 29 APR 2022 11:41AM by PIB Hyderabad

నమస్కారం!

బెంగళూరుకు నమస్కారం!

సెమికాన్ ఇండియాకు నమస్కారం!

   నా మంత్రిమండలి సహచరులు.. ఎలక్ట్రానిక్స్‌, సెమి-కండక్టర్‌ పరిశ్రమాధిపతులు.. పెట్టుబడిదారులు.. విద్యావేత్తలు.. ఇతర దేశాల దౌత్య ప్రతినిధులు… మరియు

మిత్రులారా!

   భారతదేశంలో నిర్వహిస్తున్న తొలి ‘సెమికాన్‌ ఇండియా’ సదస్సు సందర్భంగా మీకందరికీ ఆహ్వానం పలకడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఇటువంటి సదస్సు భారత్‌లో నిర్వహించడంపై నేను చాలా ఆనందిస్తున్నాను. నేటి ప్రపంచంలో సెమి-కండక్టర్లు పోషిస్తున్న పాత్ర మనం ఊహిస్తున్న దానికన్నా చాలా కీలకమైనది. అంతర్జాతీయ సెమి-కండక్టర్‌ సరఫరా ప్రక్రియలో భారత్‌ ఓ కీలక భాగస్వామిగా స్థిరపడాలన్నది మనందరి ఉమ్మడి లక్ష్యం. ఈ దిశగా సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యత, విశ్వసనీయతల రీత్యా అత్యున్నత ప్రమాణాల సూత్రం ప్రాతిపదికన మనం కృషి చేయాల్సి ఉంది.

మిత్రులారా!

   సెమి-కండక్టర్ సాంకేతిక పరిజ్ఞానానికి భారతదేశం ఆకర్షణీయ పెట్టుబడి గమ్యం అనడానికి నేను ఆరు కారణాలను నేనిప్పుడు వివరిస్తాను. మొదటిది… మేం 1.3 బిలియన్లకుపైగా భారతీయుల అనుసంధానానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను రూపొందిస్తున్నాం. భారతదేశంలో ఆర్థిక సార్వజనీనత, బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి మీరందరూ వినే ఉంటారు. ఆ మేరకు ఏకీకృత చెల్లింపుల మాధ్యమం (యూపీఐ) నేడు ప్రపంచంలో అత్యంత సమర్థ చెల్లింపుల వ్యవస్థ. జనజీవన సౌలభ్యం మెరుగు దిశగా మేం ఇవాళ ఆరోగ్యం-సంక్షేమం నుంచి సార్వజనీనత-సాధికారత వరకూ అన్ని పాలన రంగాల్లో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. తలసరి డేటా యొక్క అతిపెద్ద వినియోగదారులలో మేము ఒకరిగా ఉన్నాము. మరియు మేము పెరుగుతూనే ఉంటాము. తలసరి డేటా వినియోగంలో అతిపెద్ద వినియోగదారు సమూహం మాదే. అంతేకాదు… ఇది మరింత పెరుగుతూనే ఉంటుంది.

   రెండోది… భారతదేశం తదుపరి సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించే దిశగా మేం మార్గం సుగమం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆరు లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానిస్తున్నాం. అలాగే 5జి, ఐఓటీ, పరిశుభ్ర ఇంధన సాంకేతిక పరిజ్ఞాన రంగాల సామర్థ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెడుతున్నాం. డేటా, కృత్రిమ మేధస్సు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాల్లో తదుపరి ఆవిష్కరణల తరం ఆవిష్కరణకు మేం కృషి చేస్తున్నాం.

   మూడోది… భారతదేశం పటిష్ట ఆర్థికవృద్ధి సాధిస్తోంది. అంతేగాక ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ మాదే. ప్రతి కొన్ని వారాల వ్యవధిలోనే కొత్త యూనికార్న్‌ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. దేశంలో సెమి-కండక్టర్ల స్వీయ వినియోగం 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు చేరి, 2030కల్లా 110 బిలియన్ డాలర్ల స్థాయిని దాటుతుందని అంచనా.

   నాలుగోది… భారతదేశంలో వ్యాపార నిర్వహణ సౌలభ్యం మెరుగుకు మేం విస్తృత సంస్కరణలు చేపట్టాం. ఈ మేరకు గత సంవత్సరంలో 25,000కు ఎక్కువగా నియంత్రణ అంశాలను రద్దు చేశాం. దీంతోపాటు లైసెన్సుల స్వయంచాలక-పునరుద్ధరణ దిశగా ముందడుగు వేశాం. అలాగే డిజిటలీకరణతో నియంత్రణ చట్రంలో వేగం, పారదర్శకత చోటుచేసుకుంటున్నాయి. అన్నిటికీ మించి ఇవాళ ప్రపంచంలోనే అత్యంత సానుకూల పన్నుల వ్యవస్థలలో ఒకటి మాదేనని సగర్వంగా చెప్పగలం.

   ఐదోది… ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్లుగా భారత యువతరానికి నైపుణ్యం, శిక్షణ కల్పనలో మేం భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. ప్రపంచంలోని అసాధారణ నైపుణ్యంగల సెమి-కండక్టర్ డిజైన్ ఇంజనీర్లలో 20 శాతం భారత్‌లోనే ఉన్నారు. అదేవిధంగా ప్రపంచంలోని 25 అగ్రశ్రేణి సెమి-కండక్టర్ డిజైన్ కంపెనీలన్నీ భారత్‌లో తమ డిజైన్ లేదా పరిశోధన-అభివృద్ధి కేంద్రాలు నిర్వహిస్తున్నాయి.

   ఆరోది… భారత తయారీ రంగం పరివర్తనాత్మకత దిశగా మేం అనేక చర్యలు చేపట్టాం. శతాబ్దంలో ఒకసారి వణికించే మహమ్మారితో మానవాళి మొత్తం పోరాడుతున్న వేళ  భారత్‌ తన ప్రజల ఆరోగ్యాన్ని మాత్రమేగాక ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా నిర్వహించుకుంది.

మిత్రులారా!

   మా “ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకం” పథకాలు 14 కీలక రంగాల్లో 26 బిలియన్ డాలర్లకుపైగా ప్రోత్సాహకాలను అందిస్తాయి. రాబోయే 5 సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం రికార్డు స్థాయి వృద్ధిని సాధించగలదని అంచనా. ఇటీవలే మేం 10 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో సెమి-కాన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రకటించాం. సెమి-కండక్టర్లు, డిస్ప్లే తయారీ, డిజైనింగ్‌ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఆర్థిక సహాయం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. సెమి-కండక్టర్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే  ప్రభుత్వం నుంచి తగిన మద్దతు ఉండాలన్న వాస్తవం మాకు తెలుసు. సెమి-కండక్టర్ల భాషలోనే మా విధానాన్ని కొనసాగించడానికి నన్ను అనుమతించండి. పూర్వ కాలంలో పరిశ్రమలు తమ పని తాము చేసుకునేందుకు సిద్ధంగా ఉండేవి. కానీ, ప్రభుత్వం ‘ఏకముఖ  ద్వారం’ (నాట్‌ గేట్‌) తరహాలో ఉండేది. ఏదైనా కొత్తగా వచ్చేదాన్ని ఈ ‘ఏకముఖ ద్వారం’ వ్యతిరేకించేది. ఫలితంగా పరిస్థితి ఎన్నో అనవసర నియంత్రణలతో ‘వాణిజ్య సౌలభ్యం శూన్యం’గా ఉండేది. అయితే, ప్రభుత్వం తప్పనిసరిగా “బహుళ ద్వారం” (అండ్‌ గేట్‌)లా ఉండాలని మేం అర్థం చేసుకున్నాం. పరిశ్రమ శ్రమిస్తున్నపుడు ప్రభుత్వం మరింత శ్రమించాలి. ఆ మేరకు భవిష్యత్తులోనూ మేం పరిశ్రమకు మద్దతిస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను. సెమి-కాన్ ఇండియా ప్రోగ్రామ్ సెమీ-కండక్టర్ ఫ్యాబ్, డిస్ప్లే ఫ్యాబ్, డిజైన్, అసెంబ్లీ, టెస్ట్, మార్కింగ్, సెమి-కండక్టర్ల ప్యాకేజింగ్ వంటి పర్యావరణ వ్యవస్థలోని వివిధ విభాగాలకు తోడ్పాటునిచ్చేలా మేం జాగ్రత్తలు తీసుకున్నాం.

మిత్రులారా!

   సరికొత్త ప్రపంచ క్రమం రూపొందుతున్న వేళ ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వృద్ధిని ప్రోత్సహించే వాతావరణ సృష్టికి మేం కొన్నేళ్లుగా శ్రమిస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం, సవాళ్లను ఎదుర్కొనడంలో భారతదేశం సదా ఆసక్తితోనే ఉంటుంది. మేం సహాయక విధాన పర్యావరణం ద్వారా మీకు అసమతౌల్యం కాగల అంశాలను సాధ్యమైనంత మేర మీకు అనుకూలం చేశాం. ఆ మేరకు భారత్‌ అంటే... వ్యాపారం అని రుజువు చేశాం! ఇప్పుడిక మీ వంతు వచ్చింది.

మిత్రులారా!

   రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ సెమి-కండక్టర్ల కూడలిగా రూపొందే దిశగా వెళ్లడం ఎలాగనే అంశంపై మీ అందరినుంచి ఆచరణాత్మక సూచనల కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ సదస్సు ద్వారా మేం సంబంధిత రంగ నిపుణులతో మమేకం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. శక్తిమంతమైన సెమి-కండక్టర్ పర్యావరణ వ్యవస్థ నిర్మాణానికి ఇంకా ఏమి చేయగలమో అర్థం చేసుకోవడానికి మేం భాగస్వాములందరితో కలసి కృషిచేస్తాం. ఈ సదస్సులో ఫలవంతమైన చర్చలు సాగుతాయని, భారతదేశాన్ని సరికొత్త భవిష్యత్‌వైపు నడపడంలో ఇది దోహదం చేయగలదని నేను విశ్వసిస్తున్నాను.

 

ధన్యవాదాలు...

 

మీకు చాలా కృతజ్ఞతలు...

 

నమస్కారం...

***


(Release ID: 1821488) Visitor Counter : 177