ప్రధాన మంత్రి కార్యాలయం

‘ఖేలో ఇండియా’ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి సందేశం


“అంకుర సంస్థ‌లు.. క్రీడల స‌మ్మేళ‌నం ప్రాధాన్యం గలది... బెంగళూరులో ‘ఖేలో ఇండియా’ విశ్వ‌విద్యాల‌య క్రీడ‌లు ఈ సుంద‌ర నగరానికి మ‌రింత శక్తినిస్తాయి;

“మహమ్మారి సవాళ్ల మధ్య క్రీడల నిర్వహణ నవ భారతం సంకల్పం.. అభిరుచికి ప్రతీక.. ఈ యువజనోత్సాహం దేశాన్ని ప్రతి రంగంలో కొత్త ఊపుతో నడిపిస్తోంది”;

“జీవితంలోనూ... క్రీడల్లోనూ విజయానికి సమగ్ర విధానం…
100 శాతం అంకితభావం ప్రధాన అవసరాలు”;

“విజయాన్ని ఆస్వాదించడం... ఓటమి నుంచి పాఠాలు
క్రీడా రంగంలో మనం నేర్చుకునే ముఖ్యమైన కళలు”

“చాలా కార్యక్రమాలు క్రీడలను మూస ధోరణి నుంచి విముక్తం చేస్తున్నాయి”;
“క్రీడల్లో గుర్తింపు... దేశానికి మరింత గుర్తింపు తెస్తుంది”

Posted On: 24 APR 2022 7:29PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘ఖేలో ఇండియా’ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా తన సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు. బెంగళూరులో నిర్వహిస్తున్న ఈ క్రీడలను భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు ఈ రోజు ప్రారంభించారు. కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్, దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలశాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్‌తోపాటు సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   దేశంలోని యువజనోత్సాహానికే బెంగళూరు ప్రతీక కాగా, వృత్తి నిపుణులకు గర్వకారణమైన నగరమని ఈ సందర్భంగా ప్రధాని అభివర్ణించారు. అంకుర సంస్థలు, క్రీడల సమ్మేళనం ఇవాళ ఇక్కడ సాకారం కావడం విశేషమని పేర్కొన్నారు. “బెంగళూరులో ‘ఖేలో ఇండియా’ విశ్వ‌విద్యాల‌య క్రీడ‌ల నిర్వహణ ఈ సుంద‌ర నగరానికి మ‌రింత శక్తినిస్తుంది” అని ఆయన అన్నారు. మహమ్మారి సవాళ్ల మధ్య క్రీడలు నిర్వహించడాన్ని నిర్వాహకుల దృఢ సంకల్పం,  అభిరుచికి ప్రతీకగా ప్రధాని వర్ణిస్తూ వారికి అభివందనం చేశారు. ఈ యువజనోత్సాహం భారతదేశాన్ని ప్రతి రంగంలోనూ కొత్త ఊపుతో నడిపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.

   విజయానికి తొలి తారకమంత్రం జట్టు స్ఫూర్తేనని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. “క్రీడల ద్వారానే ఈ జట్టు స్ఫూర్తిని మనం అలవరచుకుంటాం. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో ఇది నేరుగా మీ అనుభవంలోకి వస్తుంది. ఈ జట్టు స్ఫూర్తి జీవితంపట్ల సరికొత్త దృక్పథాన్ని ఏర్పరస్తుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. అదేవిధంగా జీవితంలోనూ, క్రీడల్లోనూ విజయానికి సమగ్ర విధానంతోపాటు 100 శాతం అంకితభావం ప్రధాన అవసరాలని ఆయన పేర్కొన్నారు. క్రీడా రంగంలో మన బలాలు, మనం నేర్చుకునే పాఠాలు మనను ముందుకు నడిపిస్తాయని చెప్పారు. “వాస్తవానికి క్రీడలంటే- జీవితానికి అసలైన అండదండగా నిలిచే వ్యవస్థ” అని శ్రీ మోదీ నొక్కిచెప్పారు. అభిరుచి, సవాళ్లు, ఓటమి నుంచి పాఠాలు, నిబద్ధత, వర్తమానంలో చైతన్య సామర్థ్యం వంటి వివిధ అంశాల రీత్యా క్రీడలకు, జీవితానికిగల సారూప్యాన్ని ప్రధానమంత్రి విశదీకరించారు. “విజయాన్ని ఆస్వాదించడం, ఓటమి నుంచి పాఠాలు క్రీడా రంగంలో మనం నేర్చుకునే ముఖ్యమైన కళలు” అని ఆయన అభివర్ణించారు.

   క్రీడాకారులు నవభారత యువజనం మాత్రమేగాక ‘ఐక్య భారతం-శ్రేష్ఠ భారతం’ పతాకధారులని ప్రధానమంత్రి చెప్పారు. యువోత్సాహ ఆలోచన ధోరణి, పద్ధతులు నేడు దేశ విధివిధానాలకు రూపుదిద్దుతున్నాయని చెప్పారు. దేశ ప్రగతికి శరీర దారుఢ్యాన్ని మన యువత ఒక మంత్రంగా మార్చుకున్నారని ప్రధాని అన్నారు. అనేక కార్యక్రమాలు పాతకాలపు మూస ఆలోచన ధోరణి నుంచి క్రీడలను విముక్తం చేస్తున్నాయని చెప్పారు. కొత్త విద్యా విధానంలో క్రీడలకు ప్రాధాన్యం, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, పారదర్శక ఎంపిక ప్రక్రియ లేదా క్రీడల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెంపు వంటి చర్యలు నవ భారతానికి ప్రతీకగా మారాయి. అలాగే యువతరం ఆశలు, ఆకాంక్షలు నవ భారత నిర్మాణం దిశగా నిర్ణయాలకు పునాదిగా ఉన్నాయన్నారు. “నేడు దేశంలో కొత్త క్రీడా విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ప్రత్యేక క్రీడా విశ్వవిద్యాలయాలు రానున్నాయి. ఇదంతా  మీ సౌలభ్యం కోసమేగాక మీ కలలను నెరవేర్చుకోవడం కోసమే” అని ప్రధానమంత్రి అన్నారు.

   క్రీడలలో గుర్తింపు దేశానికి మరింత గుర్తింపు తెస్తుంది కాబట్టి క్రీడాశక్తి, దేశం సామర్థ్యాలకు మధ్య అవినాభావ సంబంధం ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ బృందంతో తన సమావేశాన్ని గుర్తుచేసుకుంటూ- దేశం కోసం ఎంతోకొంత సాధించామన్న ఆనందం, సంతృప్తి వారి వదనాల్లో మెరిశాయని పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొంటూనే దేశం కోసం ఆడాల్సిందిగా క్రీడాకారులకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.



(Release ID: 1819669) Visitor Counter : 150