ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆఫ్ఘనిస్థాన్ సిక్కు-హిందూ ప్రతినిధి బృందంతో ప్రధానమంత్రి సమావేశం


ఆపదలో తమను ఆదుకున్నందుకు.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సురక్షితంగా
భారత్‌ తీసుకొచ్చే ఏర్పాట్లు చేసినందుకు ప్రధానికి ప్రతినిధుల కృతజ్ఞతలు;

ఇది మీ సొంతిల్లు.. మీరు అతిథులు కారు... భారత్ మీ స్వగృహమే: ప్రధానమంత్రి ;

సీఏఏ అమలుపై ప్రధానికి ప్రతినిధుల ధన్యవాదాలు.. ప్రపంచ ప్రధానమంత్రి గా ప్రశంస;

ఆఫ్ఘన్‌ నుంచి గురుగ్రంథ సాహిబ్‌ ప్రతిని భారత్‌కు సగౌరవంగా తీసుకొచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లపై ప్రధానమంత్రి వ్యాఖ్యలు విన్నపుడు మా కళ్లలో నీళ్లు తిరిగాయి: ప్రతినిధులు;

భవిష్యత్తులోనూ అన్ని కష్టాలు.. సమస్యల పరిష్కారంలో
నిరంతర మద్దతుపై ప్రతినిధులకు ప్రధానమంత్రి హామీ

Posted On: 19 FEB 2022 2:43PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నం.7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఆఫ్ఘనిస్థాన్ సిక్కు-హిందూ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి సిక్కులు, హిందువులను  సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడంపై ఈ సందర్భంగా ప్రతినిధి బృందం ప్రధానమంత్రిని సత్కరించి, ధన్యవాదాలు తెలిపింది. ప్రధాని వారికి ఆహ్వానం పలుకుతూ- వారు సొంత ఇంటికి వచ్చినవారే తప్ప అతిథులు కారని, భారతదేశం వారి స్వగృహమని వ్యాఖ్యానించారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో వారు ఎదుర్కొన్న అంతులేని కష్టాల గురించి, వారిని భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడం కోసం ప్రభుత్వం చేసిన సహాయం గురించి ప్రధాని మాట్లాడారు. అలాగే పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) ప్రాముఖ్యంతోపాటు దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ఆయన వారికి వివరించారు. భవిష్యత్తులోనూ అన్ని కష్టాలు, సమస్యల పరిష్కారంలో వారికి నిరంతర మద్దతుపై ప్రధానమంత్రి వారికి హామీ ఇచ్చారు.

   గురు గ్రంథ్ సాహిబ్‌ను గౌరవించే సంప్రదాయంలోని ప్రాధాన్యం గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ నేపథ్యంలో గురు గ్రంథ్ సాహిబ్ ప్రతిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ తీసుకొచ్చేందుకు చేసిన ప్రత్యేక ఏర్పాట్ల గురించి వెల్లడించారు. ఆఫ్ఘన్ల నుంచి ఎన్నో ఏళ్లుగా తనకు లభిస్తున్న ప్రేమాభిమానాలను ప్రస్తావిస్తూ, తన కాబూల్ పర్యటన సమయంలో వారు చూపిన గౌరవాదరాలను గుర్తు తెచ్చుకున్నారు.

   సిక్కు-హిందూ సామాజిక సభ్యులను భారతదేశానికి సురక్షితంగా  తీసుకురావడానికి ప్రధానమంత్రి అన్నిరకాలుగా చేయూతనివ్వడంపై శ్రీ మంజిందర్ సింగ్ సిర్సా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తమ గోడును ఏ ఒక్కరూ పట్టించుకోని తరుణంలో ప్రధానమంత్రి నిరంతరం మద్దతునిస్తూ సకాలంలో సహాయం అందించారని కొనియాడారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచినందుకు ప్రతినిధి బృందంలోని ఇతర సభ్యులు కూడా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆఫ్ఘన్‌ నుంచి గురుగ్రంథ సాహిబ్‌ ప్రతిని భారత్‌కు సగౌరవంగా తీసుకొచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రధాని చెబుతుండగా తమ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయని వారు చెప్పారు. ‘సీఏఏ’ అమలుపైనా ప్రధానికి వారు ధన్యవాదాలు తెలుపుతూ, ఇది తమ సమాజానికి అంతులేని ఆత్మస్థైర్యాన్నిస్తుందని పేర్కొన్నారు. ఒక్క భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికీ ప్రధానమంత్రిగా శ్రీ మోదీని ప్రతినిధులు అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి... హిందువులు, సిక్కులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను అర్థం చేసుకుని, సంక్లిష్ట సందర్భాల్లో తక్షణ సహాయం అందించడానికి ఆయన కృషి చేయడమే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. కాగా, ఆఫ్ఘన్ హిందూ-సిక్కు సమాజం ప్రతినిధులతో ప్రధానమంత్రి సమావేశం కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర సహాయమంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి కూడా పాల్గొన్నారు.


(Release ID: 1799847) Visitor Counter : 149