ప్రధాన మంత్రి కార్యాలయం

దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం


15-18 ఏళ్ల యువసమూహం టీకాలు తీసుకోవాలి; ఇది విద్యకు తోడ్పడుతుంది;

ముందువరుస సిబ్బంది.. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు.. ఇతర
అనారోగ్యాలున్న వృద్ధులకు ముందుజాగ్రత్త టీకాపై ప్రధాని ప్రకటన;

దీంతో ఆరోగ్య కార్యకర్తలు.. ముందువరుస సిబ్బంది ఆత్మవిశ్వాసం బలోపేతం;

ఒమిక్రాన్‌ గురించి ఆందోళన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచన;

దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులపై అవగాహన కల్పించిన ప్రధాని;

“వైరస్ పరివర్తనతో సమాంతరంగా సవాలును ఎదుర్కొనగల మన వినూత్న స్ఫూర్తితోపాటు మన సామర్థ్యం.. విశ్వాసం కూడా పరిగణనలో ఉన్నాయి”

Posted On: 25 DEC 2021 10:53PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయసుగల పిల్లలకు 2022 జనవరి 3 (సోమవారం) నుంచి టీకాల కార్యక్రమం ప్రారంభం కానుందని ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. పాఠశాలల్లో విద్యాబోధన సాధారణ స్థితికి రావడంసహా పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన తొలగించేలా ఈ చర్య తోడ్పడగలదని పేర్కొన్నారు. మరోవైపు ముందువరుస సిబ్బంది, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఇతర అనారోగ్యాలున్న వృద్ధులకు 2022 జనవరి 10 (సోమవారం) నుంచి ముందు జాగ్రత్త టీకాపైనా ఆయన ప్రకటన చేశారు. ముందువరుస సిబ్బంది, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు కోవిడ్‌ బాధితుల సేవలో గడపాల్సిన సమయం రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఇది ‘ముందుజాగ్రత్త టీకా’గా పిలవబడుతుంది తప్ప ‘అదనపు టీకా’ (బూస్టర్‌ డోస్‌)గా కాదని ఆయన స్పష్టంచేశారు. ముందుజాగ్రత్త టీకాపై నిర్ణయంతో ఆరోగ్య కార్యకర్తలు,  ముందువరుస సిబ్బందిలో ఆత్మవిశ్వాసం బలోపేతం కాగలదన్నారు. ఇతర అనారోగ్యాలున్న, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వైద్యుల సలహా మేరకు 2022 జనవరి 10 నుంచి ముందు జాగ్రత్త టీకా అందుబాటులో ఉంటుందని కూడా ప్రధానమంత్రి ప్రకటించారు.

   భారతదేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తిగురించి ప్రధాని ప్రస్తావిస్తూ- దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అయితే, మాస్కు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి ముందు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై యుద్ధంలో నిర్దేశిత మార్గదర్శకాలను తూచా తప్పకుండా అనుసరించడమే అతిపెద్ద ఆయుధమని మహమ్మారిపై పోరులో ప్రపంచ అనుభవం స్పష్టం చేస్తున్నదని ప్రధాని గుర్తుచేశారు. ఈ క్రమంలో టీకా రెండో ఆయుధం మాత్రమేనని ఆయన విడమరచి చెప్పారు.

   ఏడాది జ‌న‌వ‌రి 16న ప్రారంభించిన టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ 141 కోట్ల టీకాల స్థాయిని అధిగమించినట్లు ప్ర‌ధానమంత్రి తెలిపారు. ఈ విజయానికి తోడ్పడిన పౌరులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యుల సమష్టి కృషిని ఆయన కొనియాడారు. టీకా అవసరాన్ని చాలా ముందుగానే గుర్తించడమే కాకుండా టీకాలపై పరిశోధనతోపాటు ఆమోద ప్రక్రియ, సరఫరా ప్రక్రియ, పంపిణీ, శిక్షణ, సమాచార సాంకేతికత మద్దతు వ్యవస్థ, ధ్రవీకరణలపైనా దృష్టి కేంద్రీకరించినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ కృషి ఫలితంగానే దేశంలోని దేశంలోని వయోజనులలో 61 శాతం రెండు టీకాలు పొందగా, 90 శాతం వయోజనులకు తొలి మోతాదు టీకా పూర్తిచేసినట్లు చెప్పారు.

   నేడు వైరస్ పరివర్తనతో సమాంతరంగా సవాలును ఎదుర్కొనగల మన వినూత్న స్ఫూర్తితోపాటు మన సామర్థ్యం.. విశ్వాసం కూడా ద్విగుణీకృతం అవుతున్నాయని ప్రధాని నొక్కిచెప్పారు. దేశంలో ఇవాళ 18 లక్షల ఏకాంత చికిత్స పడకలు, 5 లక్షల ప్రాణవాయు మద్దతు పడకలు, 1.40 లక్షల ఐసీయూ పడకలు, పిల్లల కోసం ప్రత్యేకంగా 90 వేల ఐసీయూ/నాన్ ఐసీయూ పడకలు, 3 వేలకుపైగా ‘పీఎస్‌ఏ’ ఆక్సిజన్ ప్లాంట్లు, 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అంతేకాకుండా రాష్ట్రాల్లో టీకా నిల్వలు, పరీక్ష సదుపాయాలకు మద్దతు కల్పించబడుతున్నదని ఆయన పేర్కొన్నారు.

   న దేశం త్వరలోనే ‘నాసిక టీకా’తోపాటు ప్రపంచంలోనే తొలి ‘డీఎన్‌ఏ’ టీకాను రూపొందిస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. క‌రోనాపై భారత్‌ పోరాటం ఆదినుంచీ వైజ్ఞానిక సూత్రాలు, సంప్ర‌దింపులు, ప‌ద్ధ‌తుల ప్రాతిపదికగానే సాగుతున్నద‌ని ప్ర‌ధాని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 11 నెలలుగా టీకాల కార్యక్రమం ప్రజల దైనందిన జీవితాల్లో ఉపశమనం కల్పించడమే కాకుండా సాధారణ స్థితిని నెలకొల్పిందని ప్రధాని అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పారు. అయితే, కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని ప్రధాని అప్రమత్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నడుమ వదంతుల వ్యాప్తిసహా గందరగోళం, భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని శ్రీ మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వచ్చే నెల ప్రారంభం కానున్న ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమం వేగం పుంజుకునేలా తోడ్పడాలని ఆయన సూచించారు.



(Release ID: 1785252) Visitor Counter : 182