ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గోవాలో నిర్వహించిన గోవా విమోచన దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి


స్వాతంత్ర్య యోధులు… ‘ఆపరేషన్ విజయ్’లో పాల్గొన్నవారికి ప్రధాని సత్కారం;

“గోవా విముక్తి ఉద్యమం… స్వరాజ్య పోరాటాల స్ఫూర్తిని
ప్రజలు ఏనాడూ సడలించలేదు.. భారతదేశ చరిత్రలో
స్వాతంత్ర్య సమర జ్యోతిని ఎక్కువ కాలం రగిలించింది వారే”;

“స్వార్థంకన్నా దేశమే మిన్న అనడానికి భారతదేశం ఒక స్ఫూర్తి.. ఇక్కడ దేశమే ప్రధానమన్నది తారకమంత్రం.. ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ ఏకైక సంకల్పం”;

“సర్దార్ పటేల్ మరికొన్నేళ్లు జీవించి ఉంటే.. గోవా
విముక్తికి ఎంతోకాలం వేచి చూడాల్సి వచ్చేది కాదు”;

“ప్రతి పాలనా వ్యవహారంలో అగ్రగామి కావడమే రాష్ట్రానికి కొత్త గుర్తింపు.. ఎక్కడైనా పని ప్రారంభంలో లేదా కొనసాగుతుండగానే గోవా దాన్ని పూర్తిచేస్తుంది”;

పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం కావడాన్ని.. భారతదేశ వైవిధ్యం- శక్తిమంతమైన ప్రజాస్వామ్యాలపై ఆయనకుగల అభిమానాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు;

“నిజాయితీ.. ప్రతిభ.. అంకితభావం వంటి గోవా ప్రజల లక్షణాలు
మనోహర్‌ పరికర్‌లో ప్రతిబింబించడాన్ని దేశం ప్రత్యక్షంగా చూసింది”

Posted On: 19 DEC 2021 5:18PM by PIB Hyderabad

   గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో నిర్వహించిన వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులతోపాటు ‘ఆపరేషన్ విజయ్’లో పాల్గొన్న నాటి వీరులను ఆయన సత్కరించారు. నవీకరించిన ఫోర్ట్ అగ్వాడా జైలు మ్యూజియం, గోవా వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ భవన సముదాయం, న్యూ సౌత్ గోవా జిల్లా ఆస్పత్రి, మోపా ఎయిర్‌పోర్టులో విమానయాన నైపుణ్యాభివృద్ధి కేంద్రం,  మార్గోవాలోని డబోలిమ్-నవేలిమ్ వద్ద ‘గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌’సహా పలు అభివృద్ధి పథకాలను ఆయన ప్రారంభించారు. అలాగే గోవాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టుకు చెందిన ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి’ సంస్థకు శంకుస్థాపన చేశారు.

   సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- గోవా నేల, గోవా గాలి, గోవా సముద్రం తదితరాలను ప్రకృతి అద్భుత వరాలతో ఆశీర్వదించిందని పేర్కొన్నారు. నేడు గోవా ప్రజలందరి గోవా విమోచనకు తోడు ఇవాళ్టి వేడుకలతో ఆనందోత్సాహాలు మరింత ఉప్పొంగాయన్నారు. ఆజాద్‌ మైదాన్‌లోని షహీద్‌ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అమరవీరులకు నివాళి అనంతరం మిరామార్‌లో సెల్‌ పరేడ్‌, వైమానిక గౌరవ వందనం కూడా వీక్షించారు. ‘ఆపరేషన్‌ విజయ్‌’లో పాల్గొన్న వీరులను, మాజీ సైనికులను దేశం తరఫున సత్కరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ గోవా పోగుచేసిన అనేక అవకాశాలను, ఎన్నో అద్భుత అనుభవాలను అందించిన శక్తిమంతమైన గోవా స్ఫూర్తికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

   భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలు మొఘలుల ఆధీనంలో ఉన్నప్పటికీ గోవా మాత్రం  పోర్చుగీసు ఆధిపత్యంలోకి వచ్చిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆ తర్వాత భారత్ ఎన్నో ఒడుదొడుకులను చవిచూసిందని చెప్పారు. శతాబ్దాల తరబడి అధికారం చేతులు మారుతూ వచ్చినా గోవా తన భారతీయతను మరచిపోలేదని, అదేవిధంగా భారతదేశం గోవాను విస్మరించలేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. కాలక్రమంలో ఈ బంధం మరింత బలోపేతమైందని చెప్పారు. మరోవైపు గోవా విముక్తి ఉద్యమం… స్వరాజ్య పోరాటాల స్ఫూర్తిని ప్రజలు ఏనాడూ సడలించలేదని, భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్య సమర జ్యోతిని ఎక్కువ కాలం రగిలిస్తూ వచ్చింది గోవా ప్రజలేనని అన్నారు. భారతదేశం కేవలం రాజకీయ శక్తి కాదని, మానవాళి ప్రయోజనాలను కాపాడే ఆలోచన, వసుధైక కుటుంబాలను ప్రతిబింబించే స్ఫూర్తి కావడమే ఇందుకు కారణమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వార్థంకన్నా దేశమే మిన్న అనడానికి భారతదేశం ఒక నిదర్శనమని, ఇక్కడ దేశమే ప్రధానమన్నది తారకమంత్రమని, ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ అన్నదే ఏకైక సంకల్పమని స్పష్టం చేశారు.

   దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కొంత భాగం విముక్తం కాకపోవడంపై భారతదేశంలోని ప్రజలందరి మనసులో ఆందోళన నెలకొన్నదని ప్రధాని అన్నారు. సర్దార్ పటేల్ మరికొన్నేళ్లు జీవించి ఉంటే.. గోవా విముక్తి కోసం ప్రజలు ఎంతోకాలం ఎదురుచూడాల్సి వచ్చేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాటి పోరాట వీరులకు ప్రధాని శిరసాభివందనం చేశారు. గోవా ముక్తి విమోచన సమితి చేపట్టిన పోరాటంలో 31 మంది సత్యాగ్రహులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ఈ త్యాగాల గురించి, పంజాబ్‌కు చెందిన వీర్ కర్నైల్ సింగ్ బేణీపాల్ వంటి వీరుల గురించి అందరూ ఒకసారి ఆలోచించాలన్నారు. “గోవా స్వాతంత్ర్య పోరాట చరిత్ర కేవలం భారతదేశ సంకల్పానికి ప్రతీక మాత్రమే కాదని, భారతదేశ ఐక్యత- సమగ్రతలకు సజీవ పత్రం” అని ప్రధానమంత్రి అన్నారు.

   టీవల తాను ఇటలీ, వాటికన్ సిటీలకు వెళ్లిన సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్‌ను కలుసుకోవడాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. భారతదేశంపై పోప్ దృక్పథం ఎంతో విస్తృతమైనదని పేర్కొంటూ పోప్‌ను భారత్‌కు ఆహ్వానించడంపైనా ప్రధాని మాట్లాడారు. దీనిపై పోప్‌ స్పందిస్తూ “ఇది మీరు నాకిచ్చిన గొప్ప బహుమతి” అనడాన్ని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చుకున్నారు. భారతదేశ వైవిధ్యం, శక్తిమంతమైన మన ప్రజాస్వామ్యంపై పోప్‌కు ఎంతో ఆదరాభిమానాలు ఉన్నాయని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. కాగా, సెయింట్ క్వీన్ కేటెవన్ పవిత్ర అవశేషాలను జార్జియా ప్రభుత్వానికి అందజేయడంపైనా ప్రధానమంత్రి మాట్లాడారు.

   పాలనపరంగా గోవా సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ- గోవా సహజ సౌందర్యం దాని ప్రత్యేకత అని, దీనికితోడు గోవా ప్రభుత్వం మరొక గుర్తింపును సువ్యవస్థితం చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఆ మేరకు ప్రతి పాలనా వ్యవహారంలో అగ్రగామి కావడం రాష్ట్రానికి దక్కిన కొత్త గుర్తింపుగా పేర్కొన్నారు. దేశంలో మరెక్కడైనా పని ప్రారంభంలో లేదా కొనసాగుతుండగానే గోవా ఆ కార్యాన్ని పూర్తి చేసేస్తుందని కొనియాడారు. గోవా రాష్ట్రాన్ని బహిరంగ విసర్జనరహితం చేయడం, వ్యాధి నిరోధక టీకాలు వేయడం, ‘హర్ ఘర్ జల్’’, జనన-మరణాల నమోదుసహా జనజీవన సౌలభ్యాన్ని పెంచే ఇతర పథకాలు ఇందుకు నిదర్శనమని ప్రధాని ఉదాహరించారు. అలాగే ‘స్వయంపూర్ణ గోవా అభియాన్’ ప్రగతిని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర పాలనలో సాధించిన విజయాలకుగాను ముఖ్యమంత్రితోపాటు ఆయన బృందాన్ని అభినందించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలను కూడా ప్రధాని ప్రస్తావించారు. భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని ఇటీవల విజయవంతంగా నిర్వహించడంపై రాష్ట్రాన్ని ఆయన అభినందించారు.

   దివంగత శ్రీ మనోహర్ పరికర్‌కు ప్రధానమంత్రి నివాళి అర్పించారు. “గోవా సాధించిన ఈ విజయాలు, కొత్తగా దక్కించుకున్న గుర్తింపు బలోపేతం కావడం చూసినప్పుడు నా మిత్రుడు శ్రీ మనోహర్ పరికర్ గుర్తొస్తున్నారు. ఆయన గోవాను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేర్చడమేగాక గోవా సామర్థ్యాన్ని కూడా బహుముఖంగా విస్తరింపజేశారు. ఒక వ్యక్తి తన తుదిశ్వాస వీడేదాకా తన రాష్ట్రానికి, తన ప్రజలకు ఏ విధంగా నిబద్ధులై ఉండగలరో ఆయన జీవితమే స్పష్టం చేసింది” అని ప్రధాని అన్నారు. నిజాయితీ.. ప్రతిభ.. అంకితభావం వంటి గోవా ప్రజల లక్షణాలు మనోహర్‌ పరికర్‌లో ప్రతిబింబించడాన్ని దేశం ప్రత్యక్షంగా చూసిందంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.

***

DS/AK


(Release ID: 1783630) Visitor Counter : 205