ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్ ప్రెస్‌వేకి ప్రధానమంత్రి శంకుస్థాపన


‘గంగా ఎక్స్‌ప్రెస్ వే’ మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా,

సంభాల్, బదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్,

రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్తుంది;

రేపు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లు వీరమరణం పొందిన రోజు నేపథ్యంలో వారికి ప్రధాని నివాళి అర్పించారు;

“గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్‌ ప్రగతికి కొత్త బాటలు వేస్తుంది”;

“ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం కూడా పురోగమిస్తుంది... అందుకే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రధానంగా యూపీ అభివృద్ధిపైనే దృష్టి సారించింది”

“సమాజంలో వెనుకబడిన, అణగారినవారికి ప్రగతి ఫలాలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యం; మా వ్యవసాయ.. రైతు విధానాల్లో ఈ భావనే ప్రతిబింబిస్తుంది”

“యూపీ ప్లస్ యోగి.. ‘బహుత్ హై ఉపయోగి’ (U.P.Y.O.G.I)-
ఇది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంతోపాటు ప్రజలందరూ అంటున్న మాట”

Posted On: 18 DEC 2021 2:48PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభిస్తూ ముందుగా ‘కాకోరి’ సంఘటన విప్లవ వీరులు రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లా ఖాన్‌, రోషన్‌ సింగ్‌లకు నివాళి అర్పించారు. ఈ మేరకు స్థానిక మాండలికంలో మాట్లాడుతూ- స్వాతంత్య్ర పోరాట కవులు దామోదర్ స్వరూప్ ‘విద్రోహి’, రాజ్ బహదూర్ వికల్, అగ్నివేష్ శుక్లాలకు ప్రధాని నివాళి అర్పించారు. “రేపు అమరవీరులైన పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌ల సంస్మరణ దినోత్సవం. షాజహాన్‌పూర్ గడ్డమీద పుట్టి, బ్రిటిష్ పాలనను సవాలు చేసిన ఈ ముగ్గురు భరతమాత పుత్రులను డిసెంబర్ 19న ఆనాటి పాలకులు ఉరితీశారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అలాంటి వీరులకు మనమెంతగానో రుణపడి ఉన్నాం” అని ప్రధాని పేర్కొన్నారు.

   గంగామాత మన దేశంలో సకల శుభాలకు, సర్వతోముఖాభివృద్ధికి మూలమని ప్రధానమంత్రి అన్నారు. గంగామాత మనకెన్నో సంతోషాలనిస్తుంది.. సకల సంకటాలనూ పోగొడుతుంది. అదే తరహాలో ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే కూడా ఉత్రప్రదేశ్‌ ప్రగతికి కొత్త బాటలు వేస్తుంది. ఇది రాష్ట్రానికి ఐదు వరాలుగా మారుతుందంటూ, ఎక్స్‌ప్రెస్‌వేలు, కొత్త విమానాశ్రయాలు, రైల్వే మార్గాల నెట్‌వర్క్‌ గురించి ప్రధాని ప్రస్తావించారు. ఇందులో మొదటి వరం- ప్రజల సమయాన్ని ఆదా చేయడం కాగా, ప్రజల సౌకర్య-సౌలభ్యాలు పెరగడం రెండో వరమని పేర్కొన్నారు. ఇక మూడో వరం- యూపీ వనరుల సద్వినియోగం కాగా, యూపీ సామర్థ్యాల పెంపు నాలుగో వరమని, మొత్తంమీద ఉత్తరప్రదేశ్‌లో సర్వతోముఖాభివృద్ధి ఐదో వరమని ఆయన వివరించారు.

   నేడు యూపీలో వనరులు ఏ విధంగా సద్వినియోగం అమవుతున్నదీ ప్రస్తుతం నిర్మాణంలోగల ఆధునిక మౌలిక సదుపాయాలే సుస్పష్టం చేస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “ఇంతకుముందు ప్రజాధనాన్ని ఎలా ఉపయోగించారో మీరు స్పష్టంగా చూశారు. కానీ ఇవాళ ఉత్తరప్రదేశ్ నిధులను ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసమే పెట్టుబడి పెడుతున్నారు” అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్‌ మొత్తంగా అభివృద్ధి చెందితేనే దేశం కూడా ప్రగతి పథంలో పయనిస్తుందని ప్రధాని అన్నారు. అందుకే తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రధానంగా యూపీ అభివృద్ధిపైనే దృష్టి సారించిందని చెప్పారు. ఆ మేరకు ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ అన్నదే తారకమంత్రంగా యూపీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. ఐదేళ్ల కిందట పరిస్థితులు ఎలా ఉండేవో ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు మినహా ఇతర నగరాలు, గ్రామాల్లో విద్యుత్ లభ్యత లేదు. అయితే, డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దాదాపు 80 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడమేగాక ప్రతి జిల్లాకు మునుపటికన్నా చాలా రెట్లు ఎక్కువగా విద్యుత్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా 30 లక్షల మందికిపైగా పేదలకు పక్కా గృహాలు అందాయని, ఇందులో భాగంగా షాజహాన్‌పూర్‌లోనూ 50వేల పక్కా ఇళ్లు నిర్మించారని గుర్తుచేశారు. ఇంకా అర్హులైన లబ్ధిదారులందరి సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుందని చెప్పారు.

   దేశంలో తొలిసారిగా దళితుల, వెనుకబడిన, అణగారిన వర్గాల అభివృద్ధికి వారి స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వబడిందని ప్రధాని అన్నారు. ఈ మేరకు “సమాజంలో వెనుకబడిన, అణగారినవారికి ప్రగతి ఫలాలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యం; మా వ్యవసాయ.. రైతు విధానాల్లో ఈ భావనే ప్రతిబింబిస్తుంది” అని చెప్పారు. దేశ వారసత్వం, ప్రగతి కోసం చేస్తున్న కృషిని ఓర్వలేని అసూయతో కూడిన మనస్తత్వాన్ని ప్రధానమంత్రి విమర్శించారు. పేదలు, సామాన్యులు తమపై ఆధారపడటమే అటువంటి పార్టీలకు అవసరమన్నారు. “కాశీ నగరంలో విశ్వనాథ స్వామికి గొప్ప ఆలయం నిర్మించడం ఇటువంటివారికి కంటగింపుగా ఉంది. అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణంతోనూ వీరికి సమస్యే. పుణ్య గంగానది ప్రక్షాళన కార్యక్రమం కూడా వారికి ఒక సమస్యే. ఉగ్రవాదులను పెంచిపోషించేవారిపై సైనిక చర్యనూ వీరు ప్రశ్నిస్తారు. భారతదేశంలో తయారైన కరోనా టీకాను, దాన్ని రూపొందించిన భారత శాస్త్రవేత్తల ఘనతను వీరు ఎంతమాత్రం గుర్తించనిదీ వీరే” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న శాంతిభద్రతల పరిస్థితి ఇటీవలి కాలంలో ఏ విధంగా మెరుగుపడిందీ ఆయన గుర్తుచేశారు. ఇందుకుగాను యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని కొనియాడుతూ- “యూపీ ప్లస్ యోగి.. ‘బహుత్ హై ఉపయోగి’ (U.P.Y.O.G.I)- ఇది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంతోపాటు ప్రజలందరూ అంటున్న మాట” అని పేర్కొన్నారు.

   దేశవ్యాప్తంగా వేగవంతమైన అనుసంధానంపై ప్రధానమంత్రి దార్శనికత స్ఫూర్తితోనే గంగా ఎక్స్‌ ప్రెస్‌వే చేపట్టబడింది. ఈ మేరకు రూ.36,200 కోట్ల వ్యయంతో 594 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించబడుతుంది. ఇది మీరట్‌లోని బిజౌలి గ్రామంవద్ద మొదలై ప్రయాగ్‌రాజ్‌లోని జుడాపూర్ దండు గ్రామం వరకు విస్తరించబడుతుంది. తదనుగుణంగా మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో పనులన్నీ పూర్తయ్యాక ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు-పశ్చిమ ప్రాంతాలను కలిపే అత్యంత పొడవైన ఎక్స్‌ ప్రెస్‌వే అవుతుంది. వాయుసేన విమానాలకు తోడ్పాటులో భాగంగా షాజహాన్‌పూర్‌లోని ఎక్స్‌ ప్రెస్‌వేపై ‘ఎమర్జెన్సీ టేకాఫ్-ల్యాండింగ్’ కోసం 3.5 కిలోమీటర్ల పొడవైన రన్‌వే కూడా నిర్మించబడుతుంది. ఈ ఎక్స్‌ ప్రెస్‌వే వెంట పారిశ్రామిక కారిడార్‌ను కూడా నిర్మించే ప్రతిపాదన ఉంది. ఈ ఎక్స్‌ ప్రెస్‌వే పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయం, పర్యాటకం తదితర రంగాలకు ఇతోధిక తోడ్పాటునివ్వడమే కాకుండా ఈ ప్రాంత సామాజిక-ఆర్థికాభివృద్ధికి కొత్త ఉత్తేజమిస్తుంది.

***

DS/AK



(Release ID: 1783031) Visitor Counter : 187