ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్లాస్గో లో సి.ఓ.పి-26 సదస్సు లో ‘స్థితిస్థాపక ద్వీప దేశాల కోసం మౌలిక సదుపాయాలు' అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి - తెలుగు అనువాదం

Posted On: 02 NOV 2021 8:11PM by PIB Hyderabad

మహనీయులారా,

*      ‘స్థితిస్థాపక ద్వీప దేశాల కోసం మౌలిక సదుపాయాలు'  - ఐ.ఆర్.ఐ.ఎస్. ప్రారంభం కొత్త ఆశను, కొత్త విశ్వాసాన్ని ఇస్తుంది.  ఇది అత్యంత బలహీన దేశాల కోసం ఏదైనా చేసామన్న సంతృప్తినిస్తుంది.

*     ఈ విషయంలో, విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి (సి.డి.ఆర్.ఐ) ని నేను అభినందిస్తున్నాను.

*     ఈ ముఖ్యమైన వేదిక నుండి,  ఆస్ట్రేలియా, యు.కె. తో సహా ప్రధానంగా మారిషస్, జమైకా వంటి చిన్న ద్వీప సమూహాలకు చెందిన అన్ని మిత్ర దేశాల నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

*     ఈ ప్రారంభ కార్యక్రమం కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ కి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మహనీయులారా,

*     వాతావరణ మార్పుల ప్రభావం బారిన పడకుండా ఏ దేశమూ లేదన్న విషయం గత కొన్ని దశాబ్దాలుగా రుజువయ్యింది.   అవి అభివృద్ధి చెందిన దేశాలైనా, సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న దేశాలైనా, ప్రతి దేశానికీ ఇది పెద్ద ముప్పు గా పరిణమించింది. 

*     అదేవిధంగా, ఇక్కడ , "అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీపాలు-ఎస్.ఐ.డి.ఎస్." కి కూడా , వాతావరణ మార్పుల నుండి అతిపెద్ద ముప్పు పొంచి వుంది. ఇది వారికి ఒక జీవన్మరణ సమస్య;  అది వారి ఉనికికే ఒక సవాలు.  వాతావరణ మార్పుల వల్ల సంభవించే విపత్తులు వారికి అక్షరాలా ఘోరమైన విపత్తు రూపంలో ఉంటాయి.  

*     అలాంటి దేశాల్లో, వాతావరణ మార్పు అనేది వారి జీవిత భద్రతకే కాదు, వారి ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద సవాలుగా మారింది. 

*     అటువంటి దేశాలు పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.  అయితే, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పర్యాటకులు కూడా అక్కడికి రావడానికి భయపడుతున్నారు.

మిత్రులారా,

*     ఎస్.ఐ.డి.ఎస్. దేశాలు శతాబ్దాలుగా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నందువల్ల, ప్రకృతిసిద్దమైన మార్పులకు అనుగుణంగా ఎలా జీవించాలో వారికి బాగా తెలుసు.

*     అయితే, గత కొన్ని దశాబ్దాలుగా చూపిన స్వార్థపూరిత ప్రవర్తనల కారణంగా, ప్రకృతి యొక్క అసహజ రూపం తెరపైకి రావడంతో, వాటి దుష్ఫలితాలను, ఈ రోజు అమాయక చిన్న ద్వీప  దేశాలు ఎదుర్కొంటున్నాయి.

*     అందువల్ల, సి.డి.ఆర్.ఐ. లేదా ఐ.ఆర్.ఐ.ఎస్. కేవలం మౌలిక సదుపాయాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది మానవ సంక్షేమం యొక్క అత్యంత సున్నితమైన బాధ్యతలో ఒక భాగంగా, నేను భావిస్తున్నాను. 

*     ఇది మానవాళి పట్ల మనందరి సమిష్టి బాధ్యత.

*     ఒక విధంగా, మన పాపాలకు ఇది ఒక సాధారణ ప్రాయశ్చిత్తంగా నేను భావిస్తున్నాను. 

మిత్రులారా,

*     సి.డి.ఆర్.ఐ. అనేది కేవలం ఒక సదస్సు నుండి ఉద్భవించిన ఒక ఊహా చిత్రం కాదు, అయితే, సి.డి.ఆర్.ఐ. ఏర్పాటు అనేది సంవత్సరాల ఆలోచనలు, అనుభవాల ఫలితం.

*     చిన్న ద్వీప దేశాలపై వాతావరణ మార్పు ముప్పు పొంచి ఉందని గుర్తించిన భారతదేశం, పసిఫిక్ దీవులు మరియు కారికోమ్ (సి.ఏ.ఆర్.ఐ.సి.ఓ.ఎం) దేశాలతో సహకారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

*     మేము వారి పౌరులకు సౌర సాంకేతికతలలో శిక్షణ ఇచ్చాము.  అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం సహకరించాము.

*     దీనికి కొనసాగింపుగా, ఈ రోజు, ఈ వేదిక నుండి నేను భారతదేశం తరఫున మరొక కొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటిస్తున్నాను.

*     భారత అంతరిక్ష సంస్థ ఇస్రో, ఎస్.ఐ.డి.ఎస్. కోసం ఒక ప్రత్యేక డేటా విండో ను రూపొందించనుంది.

*     దీంతో, ఉపగ్రహం ద్వారా తుఫానులు, పగడపు దిబ్బల పర్యవేక్షణ, తీర-రేఖ పర్యవేక్షణ మొదలైన వాటి గురించి, ఎస్.ఐ.డి.ఎస్. సకాలంలో సమాచారాన్ని నిరంతరాయంగా అందుకునే అవకాశం ఉంది. 

మిత్రులారా,

 
*     సి.డి.ఆర్.ఐ. మరియు ఎస్.ఐ.డి.ఎస్. రెండూ కలిసి ఐ.ఆర్.ఐ.ఎస్. ని గ్రహించడానికి కలిసి పనిచేశాయి. సహ-సృష్టి మరియు సహ-ప్రయోజనాలకు ఇది ఒక మంచి ఉదాహరణ.
 
*     అందుకే ఈరోజు ఐ.ఆర్‌.ఐ.ఎస్‌. ను ప్రారంభించడం చాలా ముఖ్యమైనది గా భావిస్తున్నాను.
 
*     ఐ.ఆర్.ఐ.ఎస్. ద్వారా, ఎస్.ఐ.డి.ఎస్. కి సాంకేతిక, ఆర్థిక సమాచారంతో పాటు, ఇతర అవసరమైన సమాచారాన్ని సులభంగా, వేగంగా సమీకరించడానికి అవకాశం ఉంటుంది.  చిన్న ద్వీప దేశాల్లో నాణ్యమైన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం వల్ల అక్కడి ప్రజలతో పాటు, వారి జీవనోపాధికి ప్రయోజనం చేకూరుతుంది.
 
*     ఈ దేశాలను తక్కువ జనాభా కలిగిన చిన్న దీవులుగా, ప్రపంచం పరిగణిస్తోందని, నేను గతంలో చెప్పాను,  కానీ, ఈ దేశాలను గొప్ప సామర్థ్యం ఉన్న పెద్ద మహా సముద్ర దేశాలుగా నేను చూస్తున్నాను.  సముద్రం నుంచి వచ్చిన ముత్యాల దండ అందరినీ అలంకరిస్తున్నట్లే, సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఎస్.ఐ.డి.ఎస్. కూడా అలా ప్రపంచాన్ని అలంకరిస్తుంది. 
 
*     ఈ కొత్త ప్రాజెక్ట్‌ కు భారతదేశం పూర్తిగా మద్దతు ఇస్తుందని, దాని విజయం కోసం సి.డి.ఆర్.ఐ., ఇతర భాగస్వామ్య దేశాలు, ఐక్యరాజ్యసమితితో కలిసి పని చేస్తుందని, నేను మీకు హామీ ఇస్తున్నాను.
 
*     ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టిన సి.డి.ఆర్.ఐ. తో పాటు, అన్ని చిన్న ద్వీప సమూహాలకు అభినందనలు, శుభాకాంక్షలు.

అనేక ధన్యవాదాలు.

గమనిక: 

ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి ఇంచుమించు సమీప అనువాదం. అసలు ప్రసంగం హిందీ లో చేశారు. 

 

*****


(Release ID: 1769149) Visitor Counter : 226