ప్రధాన మంత్రి కార్యాలయం
ఇంధన పరివర్తనలో ఇటలీ-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఉమ్మడి ప్రకటన
Posted On:
30 OCT 2021 2:24PM by PIB Hyderabad
ఇటలీ ఆతిథ్యంలో రోమ్ లో 2021 అక్టోబర్ 30, 31 తేదీల్లో జరిగిన జి-20 దేశాల నాయకుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇటలీ రిపబ్లిక్ గౌరవనీయ అధ్యక్షుడు మరియో డ్రాఘితో భారత ప్రధానమంత్రి గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
2020 నవంబర్ 6వ తేదీన భారత-ఇటలీ మధ్య మరింత విస్తృత భాగస్వామ్యానికి (2020-2024) కార్యాచరణ ప్రణాళిక ఆమోదించినప్పటి నుంచి ద్వైపాక్షిక సంబంధాల్లో అద్భుతమైన పురోగతి ఏర్పడిందన్న విషయం ఉభయ దేశాల నాయకులు అంగీకరించారు. వాతావరణ మార్పులపై పోరాటానికి స్వచ్ఛ ఇంధనాలకు పరివర్తన వేగవంతం చేయడం సహా కార్యాచరణ ప్రణాళికలో ప్రత్యేకంగా గుర్తించిన వ్యూహాత్మక రంగాల్లో భాగస్వామ్యం బలోపేతం చేసుకోవాలన్న సంకల్పం వారు ప్రకటించారు. రోమ్ లో జరుగుతున్న జి-20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలోను, గ్లాస్గోలో జరుగనున్న సిఓపి26 సమావేశాల్లోనూ కూడా వాతావరణ మార్పులపై పోరాటానికి స్వచ్ఛ ఇంధనాలకు పరివర్తనే ప్రధాన చర్చనీయాంశం కావడం గమనార్హం.
2021 మే 8వ తేదీన పోర్టోలో జరిగిన భారత-ఇయు నాయకుల సమావేశంలో కూడా వాతావరణ మార్పులపై పరస్పర ఆధారిత సవాళ్ల పరిష్కారం, జీవవైవిధ్య నష్టం, కాలుష్యం వంటి అంశాలపై తక్షణం దృష్టి సారించాలని యూరోపియన్ యూనియన్, భారత్ కోరిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఆఫ్ షోర్ పవన విద్యుత్ సహా నవ్యతతో కూడిన పునరుత్పాదక టెక్నాలజీల వినియోగం ద్వారా పునరుత్పాక ఇంధనం మరింతగా అందుబాటులోకి తేవడం, హరిత హైడ్రోజెన్ సామర్థ్యం, ఇంధన సామర్థ్యానికి ప్రోత్సాహం, స్మార్ట్ గ్రిడ్ లు, స్టోరేజ్ టెక్నాలజీల అభివృద్ధి, విద్యుత్ మార్కెట్ ఆధునికీకరణ వంటి విభాగాల్లో మరింత లోతైన సహకారం పెంపొందించుకునేందుకు వారు అంగీకారానికి వచ్చారు.
అలాగే ఉపాధి అవకాశాల కల్పనకు, జిడిపి వృద్ధికి దోహదపడే స్వచ్ఛ ఇంధనాల్లోకి పరివర్తన చెందడం, సార్వత్రికంగా ఇంధనం అందుబాటులో ఉంచడం, ఇంధన పేదరిక నిర్మూలనకు ఉపయోగపడే విలువైన ఆస్తిగా తమ దేశాల విద్యుత్ వ్యవస్థల్లోకి తక్కువ ధరల్లో పునరుత్పాదక ఇంధన అనుసంధానతకు అత్యంత ప్రాముఖ్యం ఉన్నదని ఉభయ వర్గాలు అంగీకరించాయి.
2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం సాధించాలన్న భారతదేశం ఆకాంక్షను ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు. అలాగే అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ కు క్రియాశీల మద్దతు ఇచ్చేందుకు కూడా వారు అంగీకారానికి వచ్చారు. ఇంధన పరివర్తనలో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభించేందుకు కూడా అంగీకరించారు.
ఇటలీకి చెందిన పర్యావరణ పరివర్తన మంత్రిత్వ శాఖ, భారత నవ్య, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ; పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖల మధ్య పునరుత్పాదక ఇంధన సహకార భాగస్వామ్యానికి ప్రస్తుత భాగస్వామ్యాల పరిధిలోనే కృష చేయడానికి కూడా అంగీకరించారు.
ఇంధన పరివర్తన రంగంలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇటలీ, భారతదేశం తీసుకునే చర్యలు :
- ఇంధన రంగంలో సహకారానికి ఢిల్లీలో 2017 అక్టోబర్ 30వ తేదీన ఏర్పాటు చేసిన "సంయుక్త కార్యాచరణ బృందం" విభిన్న రంగాల్లో సహకారానికి గల అవకాశాలపై అధ్యయనం చేయాలని కోరనున్నారు. ఆ రంగాలు : స్మార్ట్ సిటీలు, మొబిలిటీ, స్మార్ట్ గ్రిడ్, విద్యుత్ పంపిణీ, స్టోరేజి సొల్యూషన్లు; గ్యాస్ రవాణా, ప్రత్యామ్నాయ ఇంధనంగా సహజ వాయువుకు ప్రోత్సాహం; సమీకృత వ్యర్థాల నిర్వహణ (చెత్త నుంచి విద్యుత్); హరిత ఇంధనం (హరిత హైడ్రోజెన్; సహజ వాయువు, ఎల్ఎన్ జి; బయో మిథేన్; బయో రిఫైనరీ; రెండో తరం బయో ఇథనాల్; కాస్టర్ ఆయిల్; బయో ఆయిల్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి)
- భారతదేశంలో హరిత హైడ్రోజెన్, సంబంధిత టెక్నాలజీల అభివృద్ధి, అమలు కోసం చర్చలకు చొరవ చూపించడం
- భారత్ నిర్దేశించుకున్న 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్య సాధన లక్ష్యాన్ని సొమ్ము చేసుకునేందుకు భారతదేశంలో భారీ హరిత కారిడార్ ప్రాజెక్టు ఏర్పాటుకు మద్దతుగా ఇటలీతో కలిసి పని చేయడం
- సహజవాయు ప్రాజెక్టుల అభివృద్ధికి; డీ కార్బనైజేషన్, స్మార్ట్ సిటీలు, ఇతర రంగాల్లో (పట్టణ ప్రజా రవాణా విద్యుదీకరణ) కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడం వంటి రంగాల్లో సంయుక్త ప్రాజెక్టులు చేపట్టేలా ఇటలీ, భారత కంపెనీలకు ప్రోత్సాహం
- ఇంధన పరివర్తన సంబంధిత రంగాల్లో పని చేస్తున్న భారత, ఇటలీ కంపెనీల సంయుక్త పెట్టుబడులు ప్రోత్సహించడం
- స్వచ్ఛ ఇంధనాల పరివర్తనకు దోహదపడే విభాగాలు, వాణిజ్యపరంగా లాభసాటి అయిన ఇంధనాలు/ టెక్నాలజీలు, దీర్ఘకాలిక గ్రిడ్ ప్లానింగ్, పునరుత్పాదక ఇంధన పథకాలు, సామర్థ్య చర్యలకు ప్రోత్సాహం; ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి సహాయకారిగా ఉండే ఆర్థిక సహాయ పథకాలు ప్రవేశపెట్టడం సహా విభిన్న రంగాల్లో విధానాలు, నియంత్రణ వ్యవస్థల అభివృద్ధిలో ఉపయోగకరమైన సమాచారం, అనుభవాలు పంచుకోవడం
***
(Release ID: 1768366)
Visitor Counter : 250
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam