సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్ర‌ధాన‌మంత్రి అందుకున్న కానుక‌లు, మెమెంఓల ఇ-ఆక్ష‌న్ లో ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన తొలి మ‌హిళా క‌త్తిసాము క్రీడాకారిణి భ‌వానీ దేవి క‌త్తి వేలంపై వ‌చ్చే ఆదాయం న‌మామి గంగే కోశ్ కు

Posted On: 28 SEP 2021 2:17PM by PIB Hyderabad

టోక్యో ఒలింప‌క్స్‌కు తొలి భార‌తీయ మ‌హిళా క‌త్తిసాము క్రీడాకారిణిగా ఎంపిక కావ‌డం భ‌వానీ దేవి జీవితంలో మ‌రుపురాని ఘ‌ట‌న‌. టోక్యో ఒలింపిక్స్ లో తొలి మ్యాచ్‌ను గెలిచి ఆమె చ‌రిత్ర‌ను సృష్టించింది. మ‌రే భార‌తీయ కత్తిసాము (ఫెన్స‌ర్‌) క్రీడాకారిణీ ఆ స్థాయికి చేర‌ని నేప‌థ్యంలో అదే పెద్ద గెలుపు. త‌ర్వాత మ్యాచ్‌లో ప‌రాజ‌యం పాలై మెడ‌ల్ రేసులో నిలువ‌క‌పోయినా, భార‌త ఆశ‌ల‌కు, ఆకాంక్ష‌లకు ఊత‌మిచ్చేందుకు అది చాలు.
త‌మిళ‌నాడుకు చెందిన భ‌వానీ దేవి పూర్తి పేరు, చ‌ద‌ల‌వాడ ఆనంద సుంద‌ర‌రామ‌న్ భ‌వానీ దేవి. ఆమె త‌న క్రీడా వృత్తిని 2003లో ప్రారంభించారు కానీ క‌త్తిసాములో ఆస‌క్తి చూప‌లేదు. ఆమె దానిని ఎంచుకోవ‌డం వెనుక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ఉంది. ఆమె పాఠ‌శాల క్రీడ‌ల‌లో పాలు పంచుకుంటున్న‌ప్పుడు, త‌న క్లాసుకు చెందిన ఆరుగురు పిల్ల‌ల‌ను పోటీల‌కు ఎంపిక చేస్తున్న‌ట్టు ఆమెకు తెలిసింది. భ‌వానీ వంతు వ‌చ్చేస‌రికి అన్ని క్రీడ‌ల‌కూ పిల్ల‌ల‌ను ఎంపిక చేశారు. విధి వ‌శాత్తు క‌త్తిసాముకు ఎవ‌రూ న‌మోదు చేసుకోలేదు. కంటి రెప్ప‌ను కూడా ఆర్ప‌కుండా ఆమె త‌న పేరును అందులో న‌మోదు చేసుకొని, శిక్ష‌ణ పొంద‌డం ప్రారంభించింది. మిగిలిన‌ది చ‌రిత్ర. 
ఆమె ఫెన్సింగ్‌లో ఎనిమిదిసార్లు జాతీయ ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఒలింపిక్స్‌లో తొలి మ్యాచ్‌ను గెలిచి చరిత్ర‌ను సృష్టించిన భ‌వానీని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆమె అదే క‌త్తిని ప్ర‌ధాన‌మంత్రికి బ‌హుక‌రించింది. 
దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మైన ఆ చారిత్రిక క‌త్తి మీది కావ‌చ్చు. ఆ క్ష‌ణాల‌ను మీరు శాశ్వ‌తంగా నిక్షిప్తం చేసుకోవ‌చ్చు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అందుకున్న బ‌హుమానాలు, మెమెంటోల ఇ-వేలంలో దీనిని కూడా జోడించారు. ఈ క‌త్తిని మీరు సొంతం చేసుకోవాలంటే, 17 సెప్టెంబ‌ర్ నుంచి 7 అక్టోబ‌ర్ 2021 వ‌ర‌కు pmmementos.gov.in అన్న లింక్‌లో జ‌రుగ‌నున్న ఇ-ఆక్ష‌న్‌లో పాల్గొన‌వ‌చ్చు. 
గ‌తంలో కూడా ప్ర‌ధాన‌మంత్రి అందుకున్న కానుక‌ల‌ను వేలం వేశారు. గ‌త ఆక్ష‌న్ 2019లో జ‌రిగింది. దీని ద్వారా ప్ర‌భుత్వానికి రూ. 15.13 కోట్ల ఆదాయం వ‌చ్చింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో  స్వ‌చ్ఛ‌మైన, శుభ్ర‌మైన గంగ కోసం ఉద్దేశించిన న‌మామి గంగే కోశ్‌లో ఈ మొత్తాన్నీజ‌మ చేశారు. ఈసారి కూడా వేలం ద్వారా వ‌చ్చే ఆదాయం న‌మామి గంగే కోశ్‌కు వెడుతుంది. 


  

****(Release ID: 1759027) Visitor Counter : 90