సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘రాజ్యాంగ రచన’.. ఇ-ఫొటో ప్రదర్శనసహా ‘చిత్రాంజలి@75’ చలనచిత్ర


పోస్టర్ల వాస్తవిక ప్రదర్శనను ప్రారంభించిన శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌

‘మీ రాజ్యాంగం గురించి తెలుసుకోండి’ ప్రచార కార్యక్రమం
నిర్వహించనున్న ప్రభుత్వం: శ్రీ ఠాకూర్‌;

స్వాతంత్య్ర సమర యోధుల పవిత్ర జ్ఞాపకాలను చిత్రాంజలి@75 గుర్తుచేస్తుంది; భవిష్యత్తులో ఇలాంటి చిత్రాలను మంత్రిత్వశాఖ ప్రజల్లోకి తీసుకెళ్తుంది: శ్రీ ఠాకూర్

భారతదేశానికిగల మృదువైన శక్తిని ముందుకు తీసుకెళ్లడంలో
భారతీయ చిత్రాలకు ఇదొక విశిష్ట అవకాశం: శ్రీ జి.కిషన్‌రెడ్డి;

స్వాతంత్ర్యం దిశగా మన పయనంలోని మైలురాళ్లను ‘రాజ్యాంగ రచన’ వివరిస్తుంది.. ఇది హిందీ, ఆంగ్లంసహా 11 ప్రాంతీయ భాషల్లో లభ్యం కానుంది

Posted On: 27 AUG 2021 4:05PM by PIB Hyderabad

   ‘రాజ్యాంగ రచన’.. ఇ-ఫొటో ప్రదర్శనసహా ‘చిత్రాంజలి@75’ చలనచిత్ర పోస్టర్ల వాస్తవిక ప్రదర్శనను కేంద్ర సమాచార-ప్రసార; క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌తోపాటు కేంద్ర పర్యాటక-సాంస్కృతిక, ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. కేంద్ర మత్స్య-పశుసంవర్ధక-పాడి పరిశ్రమల శాఖతోపాటు  సమాచార-ప్రసార శాఖల సహాయమంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగేశన్‌; సాంస్కృతిక-పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌; విదేశాంగ-సాంస్కృతిక శాఖల సహాయమంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ నేపథ్యంలో సమాచార-ప్రసార శాఖ వివిధ మాధ్యమ సంస్థలతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘విశిష్ట వారం’ వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు భారీ ప్రజా కార్యక్రమాల ద్వారా స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో సమర, అజ్ఞాత యోధుల త్యాగాలను స్మరిస్తూ, నవ భారత పయనాన్ని ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

   ఈ సందర్భంగా శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌ ప్రసంగిస్తూ- రాజ్యాంగ రచన గురించి ప్రజలకు తెలియజేయడమే సంబంధిత ఇ-ఫొటో ప్రదర్శన ఉద్దేశమని పేర్కొన్నారు. ‘ప్రజా భాగస్వామ్యం’ దిశగా ఈ ప్రదర్శన ఒక ముందడుగని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాజ్యాంగం గురించి తెలుసుకునేలా దేశ యువతరాన్ని ప్రోత్సహించడంతోపాటు తమ హక్కుల గురించి వారిలో అవగాహన కల్పించేందుకు ఇదొక ఉపకరణం కాగలదన్నారు. అదే సమయంలో దేశంపట్ల తమ కర్తవ్య నిబద్ధత స్ఫూర్తిని కూడా వారికి ఎరుకపరచగలదని వివరించారు. ప్రభుత్వం త్వరలోనే ‘మీ రాజ్యాంగం గురించి తెలుసుకోండి’ పేరిట ప్రచార కార్యక్రమం చేపడుతుందని శ్రీ ఠాకూర్‌ ప్రకటించారు. భారత రాజ్యాంగ నిర్మాణ మూల సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ కృషికి తోడ్పాటునిచ్చేలా యువతరాన్ని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని చెప్పారు.

   అలాగే- “మేం చేపట్టిన పరివర్తనాత్మక డిజిటల్‌ విప్లవానికి అనుగుణంగా సంబంధిత అంశాలను డిజిటల్‌ రూపంలో క్రోడీకరించి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాం. ఇది హిందీ, ఆంగ్లంతోపాటు 11 భారతీయ భాషలలోనూ అందుబాటులోకి వస్తుంది. ఇది హిందీ, ఆంగ్లంసహా 11 ప్రాంతీయ భాషల్లో లభ్యం కానుంది, స్వాతంత్ర్యం దిశగా మన పయనంలోని మైలురాళ్లను ఈ విశిష్ట సంకలనం వివరిస్తుంది” అని మంత్రి వెల్లడించారు. ఈ వాస్తవిక సాదృశ ప్రదర్శన పలు వీడియోలు, ప్రసంగాలతో కూడిన సంకలనమని, దీంతోపాటు పరస్పర సంభాషణాత్మక క్విజ్‌సహా ‘ఇ-సర్టిఫికెట్‌’ పొందే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు.

   చలనచిత్ర పోస్టర్ల వాస్తవిక ప్రదర్శన ‘చిత్రాంజలి@75’ గురించి వివరిస్తూ- “ఇది 75 సంవత్సరాల భారతీయ చలనచిత్ర చరిత్రకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మన స్వాతంత్య్ర సమర యోధుల, సంఘ సంస్కర్తల పవిత్ర జ్ఞాపకాలతోపాటు మన సైనికుల శౌర్యపరాక్రమాలను ఇది స్ఫురణకు తెస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇటువంటి 75 విశిష్ట చిత్రాలను ఈ పోస్టర్ల ప్రదర్శనలో చేర్చడానికి మేం ప్రయత్నించాం” అని మంత్రి తన ప్రసంగంలో తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పోస్టర్లను మాత్రమేగాక చిత్రాలను సేకరించి దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తమ శాఖ కృషి చేస్తుందని మంత్రి చెప్పారు.

   ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ ఇంతటి విస్తృత కార్యక్రమం నిర్వహించడంపై కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- “అమృత్‌ మహోత్సవ్‌ కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోకుండా ప్రజా కార్యక్రమంగా రూపుదిద్దుకోవాలన్నది మన ప్రధాని ఆలోచన. ఆ మేరకు ఇందులో ప్రధానాంశం ప్రజా భాగస్వామ్యమే. మనం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి సుదృఢ, శక్తిమంతమైన, ఆత్మవిశ్వాసం నిండిన దేశంగా భారత్‌ రూపొందడాన్ని నేటి యువతరం ఊహించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తున్నారు” అని గుర్తుచేశారు. ఇక మన స్వాతంత్ర్య సమర యోధుల అసమాన త్యాగాలను ‘చిత్రాంజలి@75’ ప్రజలకు జ్ఞాపకం చేస్తుందని శ్రీ రెడ్డి అన్నారు. “ఈ చలనచిత్రాలను సాంస్కృతిక వారసత్వంలో భాగంగా పరిగణించడానికి మాత్రమే కాకుండా భారతదేశానికిగల మృదువైన శక్తిని ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ చిత్రాలకు ఇదొక విశిష్ట అవకాశం కాగలదు. మొత్తంమీద ఫొటో, పోస్టర్ల ప్రదర్శనలు దేశ యువతరంలో స్ఫూర్తి నింపడంతోపాటు మరింత శక్తిమంతం చేస్తాయనడంలో సందేహం లేదు” అని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశారు.

   సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మాట్లాడుతూ- మన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని దేశ యువతరానికి చేరువ చేయడంలో ఈ కార్యక్రమం ఒక ప్రయత్నమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రెండు ప్రదర్శనలకు సంబంధించిన చిత్రాల సమాహారాన్ని శ్రీ రెడ్డి, డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌, శ్రీ అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, శ్రీమతి మీనాక్షి లేఖి తదితరులతో సంయుక్తంగా శ్రీ ఠాకూర్‌ ఆవిష్కరించారు.

***

చిత్రాంజలి@75 గురించి:

   ఇదొక విస్తృత దృశ్య రూపకం... ఈ వాస్తవిక సాదృశ ప్రదర్శన స్వాతంత్య్ర సమరయోధుల ఎనలేని త్యాగాలను, సైనికుల ధైర్యసాహసాలను కొనియాడటంతోపాటు భారతీయ సమాజ అంతర్లీన లక్షణాలను ప్రతిబింబించే... చలనచిత్రాల ద్వారా వివిధ సంస్కరణలకు దోహదం చేసిన భారతీయ చలనచిత్ర పరిశ్రమ పయనాన్ని విశదం చేస్తుంది. అదేవిధంగా యూనిఫారాల్లోని మన కథానాయకులైన సాయుధ దళాల చిరస్మరణీయ గాథలను ఈ చిత్రాలు కళ్లకు కట్టినట్లు చూపుతాయి.

   వివిధ భారతీయ భాషల్లోని 75 చలనచిత్ర పోస్టర్లు, ఛాయాచిత్రాలతో కూడిన  ‘చిత్రంజలి@75’ ప్రదర్శన దేశభక్తికి సంబంధించిన వివిధ భావోద్వేగాలను ఆవిష్కరిస్తుంది. ఈ ప్రదర్శన... ‘సాంఘిక సంస్కరణల సినిమాలు’, ‘సినిమా మాధ్యమంలో స్వాతంత్ర్య పోరాటం’, ‘సాహస సైనికులకు వందనం’ శీర్షికలతో మూడు విభాగాలుగా విభజించబడింది.

   ఈ మేరకు మూకీ చిత్రం ‘భక్త విదుర’ (1921)తో మొదలై స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ప్రేరణగా ఇటీవల రూపొందిన తెలుగు సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ (2019) వరకూ చిత్రాలకు చెందిన 75 పోస్టర్లుంటాయి. ఈ 75 చిత్రాలలో ప్రముఖ స్వాతంత్ర్య యోధుల జీవిత చరిత్రకు చెందినవే కాకుండా భారత స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తిని చాటే వివిధ భాషల చిత్రాలకు చెందినవి... సామాజిక దురాచారాలపై సాధించిన విజయాలకు సంబంధించినవి... దేశ సరిహద్దుల రక్షణలో మన వీరుల సాహసాన్ని ప్రతిబింబించేవి కూడా ఉన్నాయి. ఇక్కడి చిత్రాలను పరస్పరం పంచుకోవడానికి, కావాలంటే డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి కూడా ఈ ప్రదర్శనలో వెసులుబాటు కల్పించబడింది. ఈ ప్రదర్శనను https://www.nfai.gov.in/virtual-poster-exhibition.php ద్వారానూ వీక్షించవచ్చు.

‘చిత్రంజలి@75’ గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

‘రాజ్యాంగ రచన’ గురించి

   భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవం నేపథ్యంలో చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన అనేక అంశాలపై సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఏడాదిపాటు పలు ‘ఇ-పుస్తకాలు’ విడుదల చేస్తుంది. ఈ వరుసలో ‘రాజ్యాంగ రచన’ తొలి పుస్తకం కాగా- ఆ తర్వాత ‘దేశ సమైక్యత’, స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర’, ‘గిరిజన ఉద్యమాలు’, ‘విప్లవ/గాంధీవాద ఉద్యమాలు’ తదితరాలపైనా పుస్తకాలు ఆవిష్కృతం కానున్నాయి.

   ఈ మేరకు భారత రాజ్యాంగ నిర్మాణాన్ని వివరించే సుమారు 25 అరుదైన ఛాయాచిత్రాలతో తొలి ఇ-పుస్తకంగా ‘రాజ్యాంగ రచన’ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అలాగే ఆకాశవాణి (AIR), చలనచిత్ర విభాగం (ఫిల్మ్స్‌ డివిజన్‌) భాండాగారాలలోగల పలు వీడియోలు, ప్రసంగాల లింకు కూడా ఈ పుస్తకంలో లభ్యమవుతుంది. అంతేకాకుండా పరస్పర సంభాషణాత్మక/ ఆసక్తికర ఇ-క్విజ్‌ కూడా ఉంది. దీనిలో పాఠకుల విజ్ఞానాన్ని పరీక్షించే, ‘పౌర భాగస్వామ్యాన్ని’ ప్రోత్సహించే 10 ప్రశ్నలుంటాయి.

   ఈ ‘ఇ-పుస్తకం’ హిందీ, ఆంగ్లంసహా 11 ఇతర (ఒడియా, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, పంజాబీ, బెంగాలీ, ఉర్దూ) భాషలలోనూ అందుబాటులో ఉంటుంది. అలాగే పీఐబీ/ఆర్‌ఓబీ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా స్థానిక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు లభ్యమవుతుంది. అంతేకాకుండా వాటికి సంబంధించిన సామాజిక మాధ్యమాల వేదికలపైనా ఈ లింకులు అందుబాటులో ఉంటాయి. ఈ సంకలనం https://constitution-of-india.in/లోనూ లభ్యమవుతుంది.

 

వాస్తవిక సాదృశ ప్రదర్శన చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి:

 

***



(Release ID: 1749759) Visitor Counter : 218