ప్రధాన మంత్రి కార్యాలయం
వర్తక,, వాణిజ్య సంఘాల ప్రతినిధులు; విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అధిపతులతో ప్రధానమంత్రి సమావేశం
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, అజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహణ భవిష్యత్ భారతావనికి సంబంధించిన ప్రణాళిక, విజన్ ఆవిష్కారానికి చక్కని అవకాశం : ప్రధానమంత్రి
భౌతిక, సాంకేతిక, ఆర్థిక అనుసంధానతతో కుంచించుకుపోతున్న ప్రపంచంలో మన ఎగుమతులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు అపారంగా కొత్త అవకాశాలు : ప్రధానమంత్రి
మన ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం, పరిధి; మన తయారీ, సేవా రంగాల మూలాలను పరిగణనలోకి తీసుకుంటే ఎగుమతులు పెంచడానికి ఎన్నో అవకాశాలు : ప్రధానమంత్రి
మన తయారీ రంగం పరిధిని విస్తరించడమే కాకుండా ప్రపంచ శ్రేణి నాణ్యత, సమర్థత సాధనకు ప్రధాన దోహదకారి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం : ప్రధానమంత్రి
పాత తేదీ నుంచి పన్నుల విధానానికి స్వస్తి చెప్పాలన్న మా నిర్ణయం ప్రభుత్వ కట్టుబాటుకు నిదర్శనం; మా విధానాల్లో స్థిరత్వానికి సంకేతం; భారతదేశం ఇన్వెస్టర్లకు ద్వారాలు తెరడవమే కాదు...హామీలను నెరవేర్చే చిత్తశుద్ధితో కూడిన నిర్ణయాత్మక ప్రభుత్వం కలిగి ఉందనే సందేశం : ప్రధానమంత్రి
నియంత్రణల భారత
Posted On:
06 AUG 2021 8:48PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అధిపతులు; వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి ఇలాంటి సమావేశం నిర్వహించడం ఇదే ప్రథమం. కేంద్ర వాణిజ్య మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 20కి పైగా ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రప్రభుత్వాల అధికారులు, ఎగుమతుల ప్రోత్సహక మండలి, వాణిజ్య మండలుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇది అజాదీ కా అమృత్ మహోత్సవం జరుగుతున్న సమయమని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో పాటు ఈ ఉత్సవ్ భవిష్యత్ భారత ప్రణాళిక, విజన్ ప్రకటనకు చక్కని అవకాశమని ఆయన సూచించారు. ఎగుమతిదారులు, ఇతర ప్రతినిధులు ఇందులో పెద్ద పాత్ర పోషించవచ్చునని ఆయన అన్నారు. భౌతిక, సాంకేతిక, ఆర్థిక అనుసంధానతతో ప్రస్తుతం ప్రపంచం కుంచించుకుపోతోందని, ఇలాంటి వాతావరణంలో మన ఎగుమతులు ప్రపంచం అంతటా విస్తరించేందుకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు చొరవ ప్రదర్శిస్తున్న అన్ని వర్గాల వారిని కొనియాడుతూ ఎగుమతులు భారీగా పెంచాలన్న లక్ష్యం సాధించేందుకు వారు చూపుతున్న ఉత్సాహం, ప్రదర్శిస్తున్న ఆశావహ దృక్పథం, కట్టుబాటు ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. వాణిజ్యం, ఎగుమతులు బలంగా ఉన్న కారణంగానే గతంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ అధిక వాటా సాధించిందన్న విషయం ఆయన గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గతంలో ఉన్న వాటా తిరిగి సాధించేందుకు మన ఎగుమతులు బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు.
కోవిడ్ అనంతరం ప్రపంచం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ తెస్తున్న మార్పుల వల్ల అందుబాటులోకి వస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పూర్తి శక్తియుక్తులు కేంద్రీకరించాలని ఆయన వ్యాపార, వాణిజ్య, ఎగుమతివర్గాల ప్రతినిధులను కోరారు. మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం, సమర్థతతో పాటుతన తయారీ, సేవల పరిశ్రమల విస్తరణను పరిగణనలోకి తీసుకుంటే ఎగుమతులు వృద్ధి చేయడానికి అద్భుతమైన అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. దేశం ఆత్మనిర్భర్ బాటలో పురోగమిస్తున్న తరుణంలో ప్రపంచ విపణిలో భారత ఎగుమతుల వాటా ఎన్నో రెట్లు పెంచడం లక్ష్యాల్లో ఒకటి కావాలని ప్రధానమంత్రి ఉద్బోధించారు. మన వ్యాపారాల పరిధి విస్తరించి, వృద్ధి చెందాలంటే ప్రపంచ సరఫరా వ్యవస్థను మనం అందుకోవాలని, అప్పుడే మన లక్ష్యాన్ని చేరగలుగుతామని ఆయన చెప్పారు. మన పరిశ్రమ కూడా ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాలు సాధించే దిశగా అడుగేయడంతో పాటు నవ్యత, ఆర్ అండ్ డి వాటా పెంపుపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ బాటలో పయనించినప్పుడే ప్రపంచ విలువ ఆధారిత వ్యవస్థలో మన వాటా పెంచుకోగలుగుతామని ఆయన అన్నారు. పోటీ తత్వాన్ని, సమర్థతను ప్రోత్సహిస్తూనే ప్రతీ రంగంలోనూ ప్రపంచ చాంపియన్లను సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు.
ఎగుమతులు పెంచడానికి నాలుగు అంశాలు ప్రధానమని ప్రధానమంత్రి అన్నారు.
- మన దేశంలో తయారీ రంగం ఎన్నో రెట్లు పెరిగింది, అలాగే నాణ్యతలో కూడా పోటీ పెరగాలి. ఇది మొదటి అంశం.
- ఇక రెండో అంశం కేంద్ర, రాష్ర్టాల మధ్య రవాణా, లాజిస్టిక్స్ సమస్యలు తొలగిపోవాలి, ఇందుకు ప్రైవేటు రంగ భాగస్వాముల నిరంతర కృషి అవసరం.
- మూడోది ప్రభుత్వం, ఎగుమతిదారులు భుజం భుజం కలిపి నడవాలి.
- ఇక చివరిది, నాలుగో అంశం భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ను విస్తరించాలి.
ఈ నాలుగూ సాధించగలిగినప్పుడు మాత్రమే ప్రపంచం కోసం భారత్ లో తయారీ లక్ష్యం భారత్ చేరగలుగుతుందన్నారు.
వ్యాపార ప్రపంచం అవసరాలు అవగాహన చేసుకుని ఇప్పుడు కేంద్రంలోన, రాష్ర్టాల్లోని ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. ఎంఎస్ఎంఇలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవలను వివరిస్తూ ఆత్మనిర్భర్ అభియాన్ కింద చట్టపరమైన అంశాల్లో ఎన్నో సడలింపులు ఇచ్చామని, రూ.3 లక్షల కోట్ల విలువ గల ఎగుమతి రుణ హామీ పథకం ప్రకటించామని తెలిపారు. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం మన తయారీ రంగం పరిధిని మాత్రమే కాదు, ప్రపంచ శ్రేణి నాణ్యత, సమర్థతలను కూడా పెంచుతుందని ప్రధానమంత్రి చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లో ఒక కొత్త వాతావరణాన్ని ఇది అభివృద్ధి చేస్తుందన్నారు. తయారీ, ఎగుమతి రంగాల్లో కొత్త ప్రపంచ చాంపియన్లు ఆవిర్భవిస్తారని తెలిపారు. ఈ ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం దేశంలో మొబైల్ తయారీ రంగాన్ని ఎలా పటిష్ఠం చేసింది వివరించారు. మొబైల్ తయారీ పరిశ్రమలో దాని ప్రభావం మన అనుభవంలోకి వచ్చిందంటూ 7 సంవత్సరాల క్రితం మనం 800 కోట్ల డాలర్ల విలువ గల మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకునే వారమని, ఇప్పుడది 200 కోట్ల డాలర్లకు దిగివచ్చిందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే 7 సంవత్సరాల క్రితం భారతదేశం 30 కోట్ల డాలర్ల విలువ గల మొబైల్ ఫోన్లు మాత్రమే ఎగుమతి చేసేదని, ఇప్పుడు ఎగుమతులు 300 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు.
ఇటు కేంద్రంలోను, అటు రాష్ర్టాల్లోను అధికారంలో ఉన్నప్రభుత్వాలు దేశంలో లాజిస్టిక్ సమయం, వ్యయాలను తగ్గించే ప్రయత్నంలో ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఇందుకు అనుగుణంగా బహుళ నమూనా అనుసంధానత పెంచే కృషి ప్రతీ స్థాయిలోనూ వేగంగా జరుగుతున్నదని ఆయన చెప్పారు.
ప్రస్తుత మహమ్మారి ప్రభావం తగ్గించేందుకు నిరంతరాయంగా కృషి జరుగుతోందని ప్రధానమంత్రి తెలిపారు. వైరస్ ఇన్ఫెక్షన్లు అదుపులోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతున్నదని చెప్పారు. దేశ ప్రజలు, పరిశ్రమ సమస్యలు పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త సవాళ్లను దీటుగా అవగాహన చేసుకుంటూ మన పరిశ్రమలు, వ్యాపారాలు కూడా నవ్యపథంలో పయనిస్తున్నట్టు చెప్పారు. మెడికల్ ఎమర్జెన్సీని అధిగమించేందుకు పరిశ్రమ ఎంతో సహాయపడడంతో పాటు వృద్ధి పునరుజ్జీవంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. అందువల్లనే ఈ రోజున ఔషధాలు, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఎగుమతులు పెరిగాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ రికవరీలోనే కాకుండా అధిక వృద్ధిరేటు సాధనలో కూడా ఎన్నో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఎగుమతులకు అధిక లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు ఇది మంచి సమయమని ప్రధానమంత్రి అన్నారు. దీన్ని సాధించేందుకు ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ తగు చర్యలు చేపడుతున్నదని తెలిపారు. ఈ దిశగానే ప్రభుత్వం ఎగుమతిదారులను ప్రోత్సహించేందుకు ప్రకటించిన రూ.88,000 కోట్ల విలువ గల బీమా కవరేజి పథకం వారికి ఉత్తేజం కలిగిస్తుందని ఆయన అన్నారు. అలాగే మన ఎగుమతి ప్రోత్సాహకాల పథకం హేతుబద్ధీకరిస్తూ ఎగుమతులు డబ్ల్యుటిఓ ప్రమాణాలకు దీటుగా ఉండేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇది కూడా వారిలో ఉత్సాహం నింపే ఒక చర్య అన్నారు.
వ్యాపార నిర్వహణలో స్థిరత్వం ఏర్పడాల్సిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. పాత తేదీ నుంచి పన్నుల విధింపు విధానానికి స్వస్తి పలకాలన్న ప్రభుత్వ నిర్ణయం విధానాల పట్ల తమ కట్టుబాటుకు, నిలకడ వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు. అలాగే భారతదేశం ఇన్వెస్టర్లకు ద్వారాలు తెరిచి ఉంచిందని, నిర్ణయాత్మక వైఖరి గల భారత ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని సంకేతం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఎగుమతి లక్ష్యాల సాధన, సంస్కరణల అమలు, పెట్టుబడుల ఆకర్షణ, వ్యాపార సరళీకరణ, చివరి గమ్యం వరకు మౌలిక వసతుల అభివృద్ధిలో రాష్ర్టాలు కీలకపాత్ర పోషించాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఎగుమతులు, పెట్టుబడులు పెంచే ప్రయత్నంలో భాగంగా నియంత్రణాపరమైన భారం తగ్గించేందుకు రాష్ర్టాలతో కలిసి కేంద్రప్రభుత్వం సన్నిహితంగా కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ర్టాలను ఎగుమతి కేంద్రాలుగా తీర్చి దిద్దడానికి వాటి మధ్య ఆరోగ్యకరమైనపోటీని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ జిల్లాకు ఒక ఉత్పత్తి విధానంపై దృష్టి కేంద్రీకరించేలా రాష్ర్ర్టాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.
సవివరమైన, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ద్వారా మాత్రమే మనం ఆశావహమైన ఎగుమతుల లక్ష్యాన్ని మనం చేరగలుగుతామని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుత ఎగుమతులను పెంచడంతో పాటు కొత్త మార్కెట్లు అందుబాటులోకి తేవాలని, కొత్త ఉత్పత్తులకు కొత్త గమ్యాలు కనుగొనాలని ఆయన ఎగుమతివర్గాలను కోరారు. ప్రస్తుతం మన ఎగుమతుల్లో సగం నాలుగు గమ్యాలకు మాత్రమే వెళ్తున్నాయన్నారు. మన ఎగుమతుల్లో 60 శాతం వాటా ఇంజనీరింగ్ వస్తువులు, వజ్రాభరణాలు, పెట్రోలియం, రసాయన ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ దేనని ప్రధానమంత్రి తెలిపారు. ఎగుమతులకు కొత్త గమ్యాలు కనుగొనడం, కొత్త ఉత్పత్తులు ప్రపంచం ముందుకు తీసుకెళ్లడం అవసరమని నొక్కి చెప్పారు. గనులు, బొగ్గు, రక్షణ, రైల్వే రంగాలను కూడా తెరవడంతో ఇప్పుడు ఎగుమతులు పెంచే చక్కని అవకాశం మన ఎంటర్ ప్రెన్యూర్లకు లభించిందన్నారు.
ఏ దేశంలో మీరు పని చేస్తుంటే ఆ దేశం అవసరాలేమిటో మీరు బాగా అర్ధం చేసుకుంటారని రాయబారులు, విదేశాంగ శాఖ అధికారులనుద్దేశించి ప్రధానమంత్రి అన్నారు. మన దేశానికి చెందిన వాణిజ్య, పరిశ్రమలకు ఆయా దేశాలతో వారధులు నిర్మించాలని కోరారు. వివిధ దేశాల్లోని భారతీయ గృహాలు భారత తయారీ రంగం శక్తికి ప్రతినిధులుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. మన ఎగుమతిదారులు, రాయబార కార్యాలయాల మధ్య నిరంతర సమాచారానికి అవసరమైన వ్యవస్థను అందుబాటులో ఉంచాలని ఆయన వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరారు.
ఎగుమతుల రంగం నుంచి మన దేశం గరిష్ఠ ప్రయోజనం పొందాలంటే దేశంలో అంతర్గతంగా ఎలాంటి అంతరాయాలు లేని, అత్యున్నత నాణ్యత గల సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. ఇందుకోసం మనం కొత్త బంధాలు, కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మన ఎంఎస్ఎంఇలు, రైతులు, మత్స్యకారులతో భాగస్వామ్యాలు పటిష్ఠం చేసుకోవాలని, మన స్టార్టప్ లను ప్రోత్సహించి మద్దతు ఇవ్వాలని ఎగుమతిదారులకు విజ్ఞప్తి చేశారు.
నాణ్యత, విశ్వసనీయతకు కొత్త గుర్తింపు తీసుకురావాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. ప్రపంచంలోని ప్రతీ మారుమూల ప్రాంతానికి భారతదేశానికి చెందిన అత్యున్నత విలువ ఆధారిత ఉత్పత్తులకు సహజసిద్ధమైన డిమాండును కల్పించాల్సిన బాధ్యత మనదేనని ఆయన అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహాయసహకారాలందిస్తుందని పారిశ్రామిక రంగం, ఎగుమతిదారులకు ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఆత్మనిర్భర్ భారత్, సుసంపన్న భారత్ సంకల్పం నెరవేర్చేందుకు కృషి చేయాలని పారిశ్రామిక రంగానికి పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమం ప్రత్యేక స్వభావం గురించి కేంద్ర విదేశాంగ మంత్రి శ్రీ ఎస్.జైశంకర్ వివరించారు. ఈ సమావేశం ప్రధాన ధ్యేయం దేశీయం ప్రపంచానికి చేరడం గనుక నిర్దేశిత దేశాల్లో మన ఉత్పత్తులకు డిమాండు కల్పించేందుకు భారత రాయబార కార్యాలయాలు అంతర్జాతీయంగా స్థానికం కావాలని ఆయన సూచించారు. ప్రపంచ వాతావరణం మనకి అనుకూలంగా ఉన్నదని, మన ఎగుమతులు విస్తరించడంలో భాగంగా ఇతర దేశాల అవసరాలను గౌరవిస్తూ ఈ తులనాత్మక, పోటీ సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలని కేంద్ర వాణిజ్య మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ సూచించారు.
భారత ఎగుమతులు విస్తరించేందుకు అవసరమైన సూచనలు, తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం భారత రాయబార కార్యాలయాల ప్రతినిధులు అందించారు. రంగాల ఆధారంగా వాణిజ్య లక్ష్యాలు నిర్దేశించడం; ఉత్పత్తుల విలువ జోడింపు, నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించడం; సరఫరాల వ్యవస్థను వివిధీకరించబ్; సరఫరాల్లో విశ్వసనీయత పెంచడంతో పాటు అనుసంధానత పెంచడం వంటి అంశాలపై వారు మాట్లాడారు. కొత్త మార్కెట్లు కనుగొనడంతో పాటు ఆయా ప్రాంతాలకు అవసరమైన ప్రత్యేక ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అలాగే మనకు ప్రస్తుతం బలం ఉన్న ప్రాంతాలు, ఉత్పత్తుల పోటీ సామర్థ్యం పెంచేందుకు కృషి చేయాలని వారు సూచించారు.
***
(Release ID: 1743678)
Visitor Counter : 301
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam