మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

3నుంచి తొమ్మిదేళ్ల చిన్నారుల చదువు కోసం ‘నిపుణ్ భారత్’!


మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ చేతులమీదుగా వర్చువల్ పద్ధతిలో పథకం ఆవిష్కరణ

Posted On: 05 JUL 2021 4:17PM by PIB Hyderabad

దేశంలోని బాలలందరికీ  అవగాహన, ప్రావీణ్యంతో కూడిన అధ్యయనం, ప్రాథమిక గణితశాస్త్ర జ్ఞానం అందించే ధ్యేయంతో చేపట్టిన నిపుణ్ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఈ రోజు ‘నిశాంక్’ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. పిల్లలంతా 3వ తరగతి ముగించుకునే సరికి ప్రాథమిక అక్షరాస్యత, కనీస గణిత జ్ఞానం తప్పనిసరిగా అలవడేలా చూసేందుకు, 2026-27వ సంవత్సరానికల్లా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నిపుణ్ భారత్ పేరిట జాతీయ స్థాయి కార్యక్రమాన్ని రూపొందించారు. కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే, పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి అనితా కర్వాల్, కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖల అధికారులు, విధాన నిర్ణయకర్తలు, వివిధ సంస్థల అధిపతులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక లఘుచిత్రాన్ని, నిపుణ్ భారత్ పథకం గీతాన్ని, పథకం మార్గదర్శక సూత్రాలను కూడా ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిపుణ్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాభ్యాసం ప్రారంభించే తొలి సంవత్సరాల్లో పిల్లలతో పూర్తి స్థాయి అనుసంధానం కల్పించే అంశంపై ఈ కార్యక్రమంలో దృష్టిని కేంద్రీకరిస్తారు. దీనికి తోడు ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలను పెంపొందించడం, విద్యార్థుల ఉపాధ్యాయుల మధ్య ఉన్నతమైన, నాణ్యమైన, విభిన్నమైన వనరులను, అధ్యయన సామగ్రిని అభివృద్ధి చేయడం, అధ్యయనానికి సంబంధించి ప్రతి చిన్నారీ సాధించిన ఫలితాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వంటి అంశాలకు కూడా నిపుణ్ భారత్ కార్యక్రమం ప్రాధాన్యం ఇస్తుంది.

https://ci5.googleusercontent.com/proxy/VMWvdXzNwcfxzuTE4LoaaiNFl4fuMSWO3o3Yu6UJEcGaNU4GFs7ao6Dfzyf9qF0TnTrabvNLnVe2JWOSAffeL_6nnkG961il6aK4v68zKHocwHKCICggf0TQ9g=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VFHU.jpg

  నిపుణ్ భారత్ కార్యక్రమం ఆవిష్కరణ సందర్భంగా కేంద్రమంత్రి పోఖ్రియాల్ మాట్లాడుతూ, మూడునుంచి తొమ్మిదేళ్ల మధ్యవయస్సున్న చిన్నారుల విద్యా అవసరాలను ఈ పథకం నెరవేరుస్తుందన్నారు. మౌలిక భాష అధ్యయనంతో పాటుగా విద్యా ప్రావీణ్యాన్ని, గణిత శాస్త్ర నైపుణ్యాలను అలవర్చడం వంటి అంశాలపై ఉపాధ్యాయులు తమ దృష్టిని కేంద్రీకరించాలన్నారు. తద్వారా, చిన్నారులు భవిష్యత్తులో మంచి చదువరులుగా, రచయితలుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. చిన్నారులకు పునాది స్థాయిలోనే ఆనందదాయక అధ్యయన అనుభవాన్ని అందించేందుకు నిపుణ్ భారత్  వీలు కల్పిస్తుందన్నారు. పిల్లలకు పరిపూర్ణమైన, సమగ్రమైన, ఆనందదాయకమైన అనుభవాన్ని ఈ పథకం అందిస్తున్నారు.

   చిన్నారులందరికీ పునాది స్థాయిలోనే పరిపూర్ణమైన అక్షరాస్యత, కనీస గణిత నైపుణ్యం అలవర్చే ప్రక్రియను సత్వర జాతీయ కార్యక్రమంగా చేపట్టవలసిన అవసరాన్ని 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం నొక్కి చెప్పిందని కేంద్రమంత్రి ప్రస్తావించారు. జాతీయ విద్యావిధానం సూచనలకు అనుగుణంగా, నిపుణ్ భారత్ పథకం కింద తగిన మార్గదర్శక సూత్రాలను కేంద్ర విద్యాశాఖ రూపొందించిందన్నారు. వివిధ భాగస్వామ్య వర్గాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ మార్గదర్శక సూత్రాలను రూపొందించినట్టు మంత్రి పోఖ్రియాల్ చెప్పారు. ప్రారంభ స్థాయిలో అక్షరాస్యత, కనీస గణిత నైపుణ్యంతోపాటుగా, జాతీయ, రాష్ట్ర, జిల్లా, బ్లాక్, పాఠశాల స్థాయిలో అమలుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన అంశాలను కూడా నిపుణ్ భారత్ పథకంలో పొందుపరిచినట్టు మంత్రి చెప్పారు. ఈ పథకం కింద వివిధ కార్యక్రమాల అమలుకోసం 2021-22వ సంవత్సరానికి గాను, సర్వశిక్షా విభాగం ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 2,688.18 మొత్తం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు.  

   కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి ధోత్రే మాట్లాడుతూ,..దృఢమైన జాతి నిర్మాణానికి నాణ్యమైన విద్య గట్టి పునాది వంటిదని, ప్రావీణ్యంతో కూడిన విద్య, కనీస గణిత నైపుణ్యం ప్రాథమిక స్థాయిలోనే కల్పించడం అందులో భాగమేనని అన్నారు. రానున్న రోజుల్లో మన పాఠశాల విద్యా వ్యవస్థ దృక్పథాన్నే ఈ పథకం పూర్తిగా మార్చివేస్తుందని, 21వ శతాబ్దపు భారతదేశాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందని ధోత్రే అభిప్రాయపడ్డారు. మన విద్యార్థులు ఉన్నత తరగతుల్లో మంచి పురోగతి సాధించడానికే కాక, ప్రపంచ స్థాయి పోటీ ఎదుర్కొనేలా నిపుణ్ భారత్ దోహదపడుతుందని అన్నారు.

 నిపుణ్ భారత్ కార్యక్రమం కింద చిన్నారులు ప్రాథమిక అక్షరాస్యత, కనీస గణిత ప్రావీణ్యం సాధించడం కోసం లక్ష్య సూచీలను నిర్దేశించారు. ఈ పథకం కింద 3వ తరగతి ముగించే సరికి పూర్తి స్థాయి ఫలితాలు సాధించాలన్నది ప్రధాన ధ్యేయమైనప్పటికీ, తల్లిదండ్రులకు, ప్రజా సంఘాలకు, వలంటీర్లు తదితరులకు కార్యక్రమంపై తగిన అవగాహన కల్పించేందుకు బాలవాటిక స్థాయి నుంచి 3వ తరగతి వరకూ విడివిడిగా  లక్ష్యాలను నిర్దేశించారు. జాతీయ విద్యా, పరిశోధనా శిక్షణా మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి.), అంతర్జాతీయ పరిశోధనలు, పరిశీలన, పరిశోధనా సంస్థ (ఒ.ఆర్.ఎఫ్.) అధ్యయనాల ప్రాతిపదికగా ఈ లక్ష్యాలను రూపొందించారు. ఉదాహరణకు,..ఒక చిన్నారి తన రెండవ తరగతి ముగిసే సరికి నిమిషానికి 45నుంచి 60 పదాలు చదవగలగాలి. అలాగే 3వ తరగతి ముగించే సరికి నిమిషానికి కనీసం 60 పదాలను దోషరహితంగా చదవగలగాలి. అదీ వారు సమగ్రమైన అవగాహనతో, స్పష్టతతో తెలుసుకోగలగాలి.

  నిపుణ్ భారత్ పథకం విజయం సాధించడం ఉపాధ్యాయులపైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. అంటే, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉండి తీరుతుంది. ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత, కనీస గణిత ప్రావీణ్యం లక్ష్యంగా నిశ్తా కార్యక్రమం కింద ఒక ప్రత్యేక ప్యాకేజీకి ఎన్.సి.ఇ.ఆర్.టి. రూపకల్పన చేస్తోంది. ఈ కార్యక్రమం కింద పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిల్లోని 25లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ ఏడాది శిక్షణ ఇవ్వనున్నారు.
 

నిపుణ్ భారత్ పథకం లక్ష్యాలను, ధ్యేయాలను అమలు చేయడం ద్వారా ఈ కింది ఫలితాలను సాధించాలని నిర్దేశించుకున్నారు.:

  • పునాది స్థాయిలోనే నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వల్ల, చిన్నారులను వారివారి తరగతుల్లోనే కొనసాగించడానికి వీలవుతుంది. చదువును అర్థంతరంగా మానేసి వారి సంఖ్య తగ్గుతుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయినుంచి ఉన్నత పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల శాతం కూడా మెరుగుపడుతుంది.
  • క్రియాశీలక కార్యకలాపాల ప్రాతిపదికన అధ్యయనం, అధ్యయనానికి తగిన వాతావరణం కారణంగా విద్యలో నాణ్యత మెరుగుపడుతుంది.
  • వినూత్నమైన విద్యా బోధనా పద్ధతులు,.. ఆటబొమ్మల సాయంతో బోధన, ప్రయోగాత్మక పద్ధతిలో అధ్యయనం వంటివి తరగతి గతిలో చేపడతారు. దీనితో చదువుకోవడం అనేది పిల్లలకు ఆనందదాయకంగా మారుతుంది.
  • లోతైన పద్ధతిలో ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమం చేపట్టడం ద్వారా ఉపాధ్యాయుల్లో పాఠ్యాంశాలపై మరింత సాధికారత పెరుగుతుంది. దీనితో సరైన బోధనా విధానాలను అమలుచేసే విషయంలో ఉపాధ్యాయులకు స్వతంత్ర ప్రతిపత్తి పెరుగుతుంది.  
  • విద్యార్థి బహుముఖ అభివృద్ధిపై పరిపూర్ణ స్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తారు. శారీరక అభివృద్ధి, సామాజిక భావోద్వేగాలు, అక్షరాస్యత, కనీస గణిత ప్రావీణ్యం, జీవన నైపుణ్యాలు తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు. పరస్పర సంబంధం ఉన్న, పరస్పర ఆధారితమైన ఈ అంశాలను ప్రోగ్రెస్ కార్డులో కూడా పొందుపరుస్తారు.
  • క్లిష్టతరమైన అధ్యయన ప్రయాణంలో పిల్లలు ముందుకు సాగడం వారిపై నిర్మాణాత్మక ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో జీవితంలో వారు మంచి ఫలితాలు సాధించేందుకు, మెరుగైన ఉద్యోగ సాధనకు దోహదపడుతుంది.
  • ప్రతి చిన్నారీ (విద్యార్థీ) ప్రారంభ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉన్నందున, సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలకు నోచుకోని వర్గాలకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా వారికి సమాన ప్రాతిపదికన, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది.

  విద్యార్థులను, వారి పాఠశాలలను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, ప్రజా సంఘాలను అన్ని విధాలా ప్రోత్సహించే ధ్యేయంతో నిపుణ్ భారత్ పథకాన్ని రూపొందించారు.  మన చిన్నారుల అసలు సిసలైన సత్తాను నిరూపించేందుకు, దేశాన్ని కొత్త కీర్తి శిఖరాలకు చేర్చేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుంది.

 

నిపుణ్ భారత్ పథకంపై వివరణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2021/jul/doc20217531.pdf

 

నిపుణ్ భారత్ పథకం మార్గదర్శక సూత్రాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి:

https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/NIPUN_BHARAT_GUIDELINES_EN.pdf



(Release ID: 1732929) Visitor Counter : 276